బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 03:29:38

ఈ డెంటిస్ట్‌.. మంచి ఆర్టిస్ట్‌!

ఈ డెంటిస్ట్‌.. మంచి ఆర్టిస్ట్‌!

వృత్తి డెంటిస్ట్‌.. ప్రవృత్తి ఆర్టిస్ట్‌.. వైద్య వృత్తిని, చిత్రకళను బ్యాలెన్స్‌ చేయడం చాలా కష్టం. కానీ, హయత్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ సురేంద్రకుమార్‌ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. రెండింటికీ సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రెండు పడవల మీద ప్రయాణం కొందరికి పరాజయాన్ని పరిచయం చేసి ఉండవచ్చు కానీ .. సురేంద్ర ను మాత్రం విజయతీరాలకు చేర్చింది.

డాక్టర్‌ ఫ్రాంక్లిన్‌ హెచ్‌ నెట్టర్‌' మెడిసిన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ఈయన మనిషి కాలిగోటిలో పుట్టే జెట్టనుంచి తలలో పేనుగొరికే పుండు వరకూ శరీరాన్నంతా స్కాన్‌ చేసినట్లు ఇల్లస్ట్రేషన్స్‌, స్కెచ్‌లు గీశాడు. మానవ శరీరంలోని ప్రతి భాగాన్నీ విశదీకరించి, వివరించే నెట్టర్‌ స్కెచ్‌లు లక్షల్లో ఉన్నాయి. ప్రతి మెడిసిన్‌ విద్యార్థి నెట్టర్‌ పుస్తకాలను కచ్చితంగా చదివి తీరాల్సిందే.  

ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి నిజామాబాద్‌లోని ‘మేఘనా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డెంటల్‌ సైన్సెస్‌'లో సీటు సంపాదించాడు సురేంద్ర. అందరిలాగే మెడిసిన్‌ విద్యలో భాగంగా డాక్టర్‌ నెట్టర్‌ గీసిన పుస్తకాలను కూడా చదివాడు. లైబ్రరీలో అంతా పుస్తకాలు చదువుతుంటే.. తాను మాత్రం అందులోని బొమ్మలను తీక్షణంగా చూసేవాడు. కారణం.. అవి అతనిలో ఎంతో స్ఫూర్తిని నింపాయి. ఎంతంటే.. తానుకూడా నెట్టర్‌లా స్కెచ్‌లు వేయాలన్నంతలా. వెంటనే స్కెచ్‌లు గీయడంపై ఆరా తీశాడు. స్కెచ్‌ గీయడం, రంగులు అద్దడం, కలర్‌ కాంబినేషన్‌ యూ ట్యూబ్‌ ద్వారా తెలుసుకున్నాడు.  బీడీఎస్‌ పూర్తయిన తర్వాత.. ఇంటర్న్‌షిప్‌ చేస్తూ ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం వరకు కాలేజ్‌లో చదువుకునేవాడు. పాకెట్‌ మనీ కోసం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు క్లినిక్‌లో జాబ్‌ చేసేవాడు.  రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ ఏదో ఒక బొమ్మ గీసేవాడు. ఇలా యేడాది పాటు సాధన కొనసాగింది. 2016లో రోజుకొకటి చొప్పున 365 స్కెచ్‌లు గీశాడు. అప్పుడే పూర్తిస్థాయి ఆర్టిస్ట్‌ కావాలని నిర్ణయించుకున్నాడు. అయితే, ప్రొఫెసర్‌ సాంబశివరావు సలహాతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత డెంటిస్ట్‌ కెరీర్‌ను, ఆర్టిస్ట్‌ కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ ముందుకెళ్తున్నాడు.

ప్రముఖుల అభినందనలు: ‘థ్యాంక్యూ సురేంద్ర.. నా కోసం మంచి స్కెచ్‌ గీశావు’ అని నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఔత్సాహిక ఆర్టిస్ట్‌ను మెచ్చుకున్నారు. సినీతార అనుపమ పరమేశ్వరన్‌.. సురేంద్ర గీసిన స్కెచ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్‌ డీపీగా పెట్టుకున్నారు. రక్షాబంధన్‌ కానుకగా మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత స్కెచ్‌ వేసి ట్విటర్‌లో పోస్టు చేయగా, ఆ ఆర్ట్‌కు ముగ్దురాలైన కవిత.. ‘థ్యాంక్యూ తమ్ముడూ! హ్యాపీ 

రక్షాబంధన్‌' అంటూ రిైప్లె ఇచ్చారు. కాలేజ్‌లో ఓ ఫంక్షన్‌కు వచ్చిన సీనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రదీప్‌.. ‘నువ్వు ఇంత బాగా డ్రాయింగ్‌ వేస్తున్నావంటే డెంటిస్ట్‌గా కూడా పేషెంట్స్‌ను బాగా చూసుకోగలవు సురేంద్రా’ అని అభినందించారు. ఇవన్నీ తనకు ఎంతో బూస్ట్‌నిస్తాయని సురేంద్ర అంటున్నాడు.

తల్లిదండ్రుల కోసం డాక్టర్‌గా..

సురేంద్రకుమార్‌ వైద్యవిద్యను అభ్యసించడానికి ముఖ్యకారణం తండ్రి బాలయ్య. తల్లి నర్సమ్మ డెలివరీ సమయంలో ‘బిడ్డకు ప్రమాదం ఉంది. బతకడం కష్టమే’ అన్నారట డాక్టర్లు. అయితే ‘సురేందర్‌' అనే డాక్టర్‌ సిజేరియన్‌ చేసి రక్షించాడు. ఆయనపై కృతజ్ఞతతో బిడ్డకు సురేంద్రకుమార్‌ అని పేరు పెట్టుకున్నారు. చిన్ననాటి నుంచే తండ్రి ‘రేయ్‌! నువ్వు బాగా చదవాలి. డాక్టర్‌ కావాలి’ అని ఉత్సాహాన్ని నింపేవారు. ఇప్పుడు తల్లిదండ్రుల కోసం డాక్టర్‌గా, తనకోసం ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నాడు సురేంద్ర. ‘సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే రెండు పడవల ప్రయాణం సాధ్యమే. మల్టీ టాస్కింగ్‌ మరీ కష్టమైన పనేం కాదు’ అని సలహా ఇస్తారు ఆర్టిస్ట్‌ కమ్‌ డెంటిస్ట్‌ సురేంద్ర.

అదే నా ఆశయం 

ఫ్రాంక్లిన్‌ హెచ్‌ నెట్టర్‌లా నేను గీసిన స్కెచ్‌లతో ఓ పుస్తకం విడుదల చేయాలనేది నా లక్ష్యం. ఎప్పటికైనా ఆ కల నెరవేర్చుకుంటా. ఇందుకోసం చాలా వర్క్‌ చేస్తున్నా. ఈ రెండు రంగాలు నాకు చాలా ఇష్టం. దేన్నీ వదులుకోను. నా అభిరుచిని అర్థం చేసుకొని అన్ని వేళలా సహకారం అందించిన తల్లిదండ్రులకు,  స్నేహితులకు, ప్రత్యేకించి ప్రొ.సాంబశివరావుగారికి కృతజ్ఞతలు. కళలకు, వైద్యానికి సమన్యాయం చేస్తాను. - డాక్టర్‌ గంగినేని సురేంద్రకుమార్‌
logo