గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 02:53:24

బాల్కనీ కింద అరుగు వేసి దానికి రెయిలింగ్‌ పెట్టొచ్చా?

బాల్కనీ కింద అరుగు వేసి దానికి రెయిలింగ్‌ పెట్టొచ్చా?

ఇంటికి అరుగులు వేయడం తప్పుకాదు. తూర్పు వైపు ఉత్తరం వైపు కూడా వేసుకోవచ్చు. దానికి పైనవచ్చే బాల్కనీ అంత వెడల్పు వేసుకోవచ్చు. లేదా లోపలికి అంటే తూర్పు బాల్కనీ ఏడు ఫీట్లు వస్తే దాని కింద నాలుగు ఫీట్ల అరుగులు కూడా వేయవచ్చు. దానికి రెయిలింగ్‌ గురించి అడిగారు. అంటే తూర్పు భాగాన్ని వరండాలా వాడుకోవాలని అనుకుంటున్నారు. అప్పుడు కింద వేసే అరుగు వెడల్పుగానే తీసుకోండి. దానికి రెయిలింగ్‌ రెండు ఫీట్లకన్నా తక్కువ ఎత్తు కాకుండా తీసుకోండి. ఆ రెయిలింగ్‌కు తూర్పు ఈశాన్యం ద్వారానికి ఎదురుగా ఓపెన్‌ పెట్టుకోండి. ఇంటికి ఉత్తరం అరుగు వేసినా, ఇంటిచుట్టూ వేసినా ఇంటి గర్భం లెవెల్‌కన్నా తక్కువ ఎత్తుగానే వేయండి. శుభంగా, చక్కగా ఉంటుంది.

ఓపెన్‌ కిచెన్‌లో షెల్ఫ్‌లు ఎలా పెట్టుకోవాలి? ఉత్తరం తూర్పు గోడలకు వేయవచ్చా?

నిజానికి ఇంట్లో కిచెన్‌ ఓపెన్‌గా వేయాలంటే షెల్ఫ్‌లను తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఆగ్నేయంలో కిచెన్‌ వచ్చినప్పుడు ఆ కిచెన్‌కు పడమర గోడ రాకుండానే ఉంటుంది. అప్పుడు దక్షిణం గోడను షెల్ఫ్‌లతో నింపాలి. లేదా కిచెన్‌ పడమర గోడను కింద నుండి మూడు ఫీట్ల ఎత్తు వరకు పెంచి, దానికి లోపలనుండి షెల్ఫ్‌లు వేసుకోవాలి. ఆ మూడుఫీట్ల ఎత్తుమీద చక్కటి మార్బుల్‌ బండ వేసుకుంటే అది టిఫిన్‌ టేబుల్‌గా పనికి వస్తుంది. షెల్ఫ్‌లు సరిపోవడం లేదని ఉత్తరం గోడని వాడకూడదు. దానిని అలా ప్లేన్‌గానే వదిలివేయండి. తూర్పు గోడవైపు కూడా షెల్ఫ్‌లు వేసుకోవద్దు. అలాకాక పడమర గోడను.. రెండు చివరల రెండు ఫీట్లు కట్టి మధ్యలో వదిలి ఆ రెండు కంతలకు కిచెన్‌లోపలి వైపు షెల్ఫ్‌లు వేసుకోవచ్చు. దీనివల్ల ఇబ్బంది ఉండదు.

హాల్లో డైనింగ్‌ వాష్‌ ఎక్కడ పెట్టాలి?

ఇంటి గదుల విభజనలో డైనింగ్‌ భాగాన్ని ముందు.. చక్కగా దానికి సరిపడే స్థలాన్ని, దక్షిణం మధ్యలో లేదా తూర్పు మధ్యలో స్థిరం చేయాలి. మీరు డైనింగ్‌ హాలు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పలేదు. ఇంటి దక్షిణ భాగంలో మధ్య డైనింగ్‌ ఉంటే దక్షిణం ఉచ్ఛంలో.. అంటే కిచెన్‌ గోడ దక్షిణం గోడ మూలలో దక్షిణంలోని డైనింగ్‌ ఆగ్నేయంలో డైనింగ్‌ వాష్‌ బేసిన్‌ పెట్టుకోవచ్చు. దాని నీరు పైపు దక్షిణం వైపు నుండి పోతుంది. లేదా డైనింగ్‌ ఇంటి తూర్పు హాలులో ఏర్పాటు చేసి ఉంటే కిచెన్‌ ఉత్తరం గోడలో డైనింగ్‌ వాష్‌బేసిన్‌ పెట్టుకోవచ్చు. అలాగే తూర్పు బాల్కనీలో బయటి భాగంలో దూరంగా కూడా ఆగ్నేయంలో పెట్టవచ్చు.


logo