ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jul 12, 2020 , 02:12:07

బుల్లితెర కాదిది.. ‘బిగ్‌' తెర!

బుల్లితెర కాదిది.. ‘బిగ్‌' తెర!

కరోనా నేపథ్యంలో చాలాకాలం సీరియల్స్‌ ఆగిపోయాయి..మళ్లీ బుల్లితెరపై తమ అభిమాన తారలను చూసి..ఆనందించే వీక్షకుల సంఖ్య పెరిగిపోయిందనే చెప్పాలి.తెలుగులో కొత్తకొత్త వెబ్‌ సిరీస్‌లు రావడానికి..ఇంకాస్త ఊపు అందుకోవడానికి సమయం పట్టవచ్చు. అంతవరకుపాత వాటికే ఆదరణ ఉంటుందనడంలో సందేహం లేదు..అలాగే బుల్లితెర గురించి కామెంట్స్‌.. యాంకర్ల ఫొటోలు..కొత్త జోడీల గురించి ప్రత్యేక కథనాలు..

వెన్నెల కిశోర్‌ కామెంట్‌!

వంటలక్క అనగానే కార్తీకదీపం సీరియల్‌ గుర్తుకొస్తుంది. ఆ సీరియల్‌కి దేశ, విదేశాల్లో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదేమో! అలాంటి సీరియల్‌ గురించి  హాస్యనటుడు వెన్నెల కిశోర్‌ ఒక కామెంట్‌ పెట్టాడు. అదేంటంటే.. ‘ఎందుకమ్మా అంత మంచి డాక్టర్‌ బాబుకి ఇంత మంచి వంటలక్క అంటే కోపం’. దీన్ని బట్టి ఆయన కూడా కార్తీకదీపం  ఫాలోవర్‌ అని అందరికీ అర్థమైపోయింది. అయితే మనం కామెంట్స్‌ కింద గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ అనే ఆప్షన్‌ కూడా ఒకటి వస్తుంది సోషల్‌ మీడియాలో. మనం పెద్దగా పట్టించుకోం.. కానీ ఒకసారి తెలుగులో కామెంట్‌ పెట్టాక దాన్ని ట్రాన్స్‌లేట్‌ చేస్తే వింతగా అనిపిస్తుంది. ఇదిగో వెన్నెల కిశోర్‌ పెట్టిన కామెంట్‌లాగే!. ఇంతకీ ఏమని వచ్చిందంటే..   This is why Babu is such a good cook. ఇప్పుడు దీన్ని తెలుగులో అనువదిస్తే ‘డాక్టర్‌ బాబు అందుకే మంచి వంటవాడు’ అని అర్థం వస్తుంది. ఈ కామెంట్‌ను పట్టుకొని, స్క్రీన్‌షాట్‌ పెట్టి నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు జనాలు.

హీటెక్కిస్తున్న ఫొటోలు

బుల్లితెర, వెండితెర.. ఇలా అన్నిట్లోనూ ఫేమస్‌ ఈ ముద్దుగుమ్మ. వెబ్‌లోనూ మంచి నటిగా పేరు తెచ్చుకుంది. యాంకర్‌గా ఎప్పుడూ ఫుల్‌ జోష్‌గా ఉండే ఆ అమ్మాయే వర్షిణి సౌందరాజన్‌. ఢీతో పాటు, మరెన్నో షోలతో అలరించే ఈ నటి ఇప్పుడు హీట్‌ పుట్టించే ఫొటో షూట్‌ చేసింది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నది. అందరూ ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. త్వరలోనే వెండితెర మీద కూడా హీట్‌ పుట్టిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఏదో ఒకరోజు వెండితెరను ఏలడం ఖాయమని కామెంట్లూ పెడుతున్నారు.  లక్షల్లో లైకులు రావడంతో ఆమె ఫాలోయింగ్‌ ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

కాలేజీ హంగామా

తెలుగు సినిమా చరిత్రలో హ్యాపీడేస్‌ సినిమా ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. వెబ్‌ సిరీస్‌లో ద గ్రిల్‌ కూడా అలాంటిదే! ఫ్యామిలీ, ఫ్యాక్షన్‌, ఫన్‌ కంటెంట్‌తో ఇప్పటివరకు తెలుగులో అనేక వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. కానీ మొదటిసారి ఎక్కువ శాతం కాలేజీ బ్యాక్‌డ్రాప్‌తో అన్ని ఎమోషన్ల మేళవింపుతో వచ్చిందీ సిరీస్‌. సింగిల్‌ పేరెంట్‌ కష్టాలు, ప్రేమ.. ఇలా ఈ సిరీస్‌ కథ నడుస్తుంది.  గోల్కొండ హైస్కూల్లో బాలనటుడిగా, పేపర్‌బాయ్‌లో హీరోగా వచ్చిన సంతోష్‌ శోభన్‌ నటించాడు. సంవత్సరం క్రితం వచ్చిన ఈ వెబ్‌సిరీస్‌కు ఈ లాక్‌డౌన్‌ కాలం మరింత వ్యూవర్స్‌ను పెంచిందనే చెప్పాలి. ‘ఇలాంటి వెబ్‌ సిరీస్‌లు మరిన్ని రావాలి’ అంటూ చాలామంది కామెంట్‌ చేస్తుండడం విశేషం. టాప్‌ డైరెక్టర్లు కూడా సిరీస్‌లపై దృష్టి పెడుతున్నారు. ఇలాంటి కంటెంట్‌తో వస్తే కచ్చితంగా వాటికి ఆదరణ ఉంటుంది.

త్వరలో పెండ్లి బాజాలు

స్టార్‌ మాలో వచ్చే వదినమ్మ సీరియల్‌ ఫాలోవర్స్‌కు సిరి గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఆమె అసలు పేరు ప్రియాంకా నాయుడు. అభిషేకం, అక్కాచెల్లెళ్లు సీరియల్‌ హీరో మధుబాబు కూడా చాలా ఫేమస్‌. ఆ కన్నడ అమ్మాయికి, ఈ తెలుగు అబ్బాయికి జోడీ కుదిరింది. పది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. మంచి ఫ్రెండ్స్‌గా మొదలయిన ప్రయాణం ఇప్పుడు పెద్దల అంగీకారంతో పెండ్లి పీటల వరకు రావడం ఎంతో సంతోషంగా ఉందని.. ఆ ఇద్దరే కాదు, వాళ్లని అభిమానించే ప్రేక్షకులూ అభిప్రాయపడుతున్నారు. కాకపోతే పెండ్లి ఎప్పుడు అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఈ మధ్య వదినమ్మ సీరియల్‌ షూటింగ్‌ను ప్రియాంక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో కూడా వ్యూస్‌ పంట పండిస్తున్నది.


logo