గురువారం 13 ఆగస్టు 2020
Sunday - Jul 11, 2020 , 22:47:54

కళతో.. చైతన్యం

కళతో.. చైతన్యం

ఒక్క చిత్రం.. వెయ్యి భావాలను పలికిస్తుంది.. లక్ష మాటలు చెబుతుంది.. కోట్ల మందిని ఆలోచింపజేస్తుంది.. అనేకానేక అర్థాలను చూపిస్తుంది. సమాజానికి ఓ మంచి సందేశాన్ని చెప్పేందుకు పుంఖానుపుంఖాలుగా.. రాయాల్సిన అవసరం లేదు. ఒక్క చిత్రం చాలు..

  • కళతో.. చైతన్యం

తమ కళతో సమాజహితానికి పాటుపడుతున్నారు ఆర్టిస్టులు స్వాతి-విజయ్‌. ఎవరైనా తాము నేర్చుకున్న విద్యతో ఉపాధి పొంది, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనుకుంటారు. కానీ, ఈ ఇద్దరూ అలా భావించలేదు. తమ కళ ద్వారా సమాజ సేవ చేయాలని నిశ్చయించుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన స్వాతి, హైదరాబాద్‌కు చెందిన విజయ్‌..  జేఎన్‌టీయూలో  ఫైన్‌ ఆర్ట్స్‌ చదివారు. కళతో పాటు జీవితాన్నీ పంచుకున్నారు. కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. రోడ్లపైన, గోడలపైన స్ఫూర్తిదాయకమైన కొటేషన్లు, పెయింటింగ్స్‌తో సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. ఆ జంట ఎంచుకున్న కళ పేరు గ్రాఫిటీ. గోడలనే క్యాన్వాస్‌లుగా మలుచుకొని చిత్రాలు వేస్తున్నారు. స్ట్రీట్‌ ఆర్ట్స్‌లో తమదైన ముద్ర వేసుకున్నారు. మొక్కల పెంపకం, పారిశుద్ధ్యం, చదువు వల్ల ఉపయోగాలు, అక్షరాస్యత.. సమాజంతో ముడిపడిన ప్రతి అంశమూ ఇతివృత్తమే.  హైదరాబాద్‌లోని అనేక చోట్ల వీరు గీసిన కళాఖండాలు స్ఫూర్తిని రగిలిస్తున్నాయి.  

సర్కారు బడికి ఊపిరి.. 

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతబడే పరిస్థితికి చేరుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్వాతి-విజయ్‌ సర్కారు బళ్లకు పూర్వవైభవం తెచ్చేందుకు తమ కళ ద్వారా ఏదైనా చేయాలని అనుకున్నారు. అందులో భాగంగా వరంగల్‌జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలను ఎంచుకున్నారు. బడిగోడలపై తమ కళా నైపుణ్యాన్ని చూపారు. ఆ పెయింటింగ్స్‌ను చూసిన చిన్నారుల తల్లిదండ్రుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు రావడం ఆరంభించారు.  హాజరీ పెరిగింది. ఒక్క పాఠశాలకు వేసిన పెయింటింగ్స్‌కే ఇంత మంచి ఫలితం వస్తే, మిగతా చోట్ల కూడా వేస్తే.. ఇంకెంత స్పందన వస్తుందో అన్న ఆలోచన అంకురించింది. అనుకున్నదే తడవుగా, వేసవి సెలవుల్లో వివిధ ప్రభుత్వ పాఠశాలలను ఎంచుకొని పెయింటింగ్స్‌ వేయడం ప్రారంభించారు. ఆ రంగుల హంగులు చూశాక పిల్లల్లో బడికి వెళ్లాలనే ఆసక్తి మొదలైంది.  ఈ ఇద్దరూ ఇప్పటి వరకు వివిధ రాష్ర్టాల్లో జరిగిన అనేక ప్రదర్శనల్లో పాల్గొన్నారు. జపాన్‌, యుకే,  ఇటలీ, ఫ్రాన్స్‌ తదితర చోట్ల జరిగిన స్ట్రీట్‌ ఆర్ట్‌ ఫెస్టివల్స్‌లో పాల్గొని  ప్రతిభను నిరూపించుకున్నారు. తెలుగువాళ్ల సత్తా ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పారు.

40 అడుగుల పీవీ సింధు చిత్రం

ఇటీవల ఖమ్మంలోని సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో40 అడుగుల గోడ మీద స్వాతి-విజయ్‌ వేసిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నది. ఈ చిత్రాన్ని  సామాజిక మాధ్యమాల ద్వారా చూసిన  పీవీ సింధు, ఆర్టిస్టు జంటను మెచ్చుకున్నారు. కరోనా వైరస్‌ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరో వాల్‌ పెయింటింగ్‌ వేయాలని స్వాతి-విజయ్‌ నిర్ణయించారు. భారత రాజముద్ర అయిన నాలుగు సింహాలతో కొవిడ్‌ వారియర్స్‌ను తలపిస్తూ ఓ డిజిటల్‌ స్కెచ్‌ గీశారు.  త్వరలోనే ఆ చిత్రాన్ని ఖమ్మంలో వేయనున్నట్టు  చెబుతున్నారు. కళ అనేది హృదయాల్ని కదిలించే శక్తిమంతమైన మాధ్యమం. బడి పిల్లల్లో మార్పు తీసుకొచ్చినట్టే, ఖైదీలలోనూ తీసుకురావచ్చు. అవినీతిపరులనూ  సంస్కరించవచ్చు. ఆ దిశగా ఈ జంట అడుగులేయాలి!


logo