మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jul 11, 2020 , 22:41:56

బాంబులు

బాంబులు

మల్ల తెల్లారి అందరం లేశినంక మొకాలు కడుక్కున్నంక పాలు పొయ్యరు, చాయ పొయ్యరు. మెల్లెగ మా గోపాల్‌ మామ నా తానికి ఒచ్చి చిన్నగ సంగతి చెప్పిండు. ఏం చెయ్యాల్నో చెప్పిండు. అందరు పోరల నడ్మ నేనే పెద్దోన్నయితి. ఆరోతరగతికొచ్చిన. నాకు సమజయింది.

  • బాంబులు

సరీగ దసరా పండ్గకు ఆరం దినాల ముంగల్నే అందరం పిల్లలం అమ్మమ్మోల్లూరుకి ఒచ్చినం. అయిదుగురు అత్తలు, చిన్నమ్మ, అమ్మక్క ఆల్లందరి పిల్లలతోటి ఊర్లల్లకెళ్ళి, పట్నంకెళ్ళి అందరొచ్చిండ్రు. ఒగ చిన్న సైజు కోల్లఫారం లెక్కనే తయారయ్యింది అందరం జమైనంక. తక్వ మందా మొత్తం లెక్కవెడితే పద్దెనిమిది మంది తేలిండ్రు. ఆటలూ, పాటలూ, గిచ్చుల్లూ, జగుడాలూ ఎన్నేషాలేశినా మమ్ముల పట్టిచ్చుకొనేటోడే లేడు. ఆడికి రెండుమూడు సార్లు ఇల్లు వీకి పందిరేశిన సోయి గూడ లేదు మా అత్తలకు, అమ్మలకు. యాలకింత ఒండి ముంగల పడేశి ఆల్ల ముచ్చట్లల్ల ఆల్లుంటున్నరు. మేమంటే పెద్దగయ్యినం. సంటి పిల్లల తల్లులు గూడ అంతే.

      ఇస్కూల్లకు పొయ్యేటప్పుడు అన్ని టైం తీర్గ నడుస్తయ్యి. టయానికి తినుడు, టయానికి ఆడుడు, టయానికి పండుడు, టయానికి దొడ్డికి పోవుడు. ఊల్లెకడుగువెట్టినంక మేము తిన్నమా అనేదే సూస్తరు గని, దొడ్డికి పోయినమా అనే సోయిగూడ లేకుండ ఒగటే ఎగురుడు దుంకుడు. ఇగ ఒచ్చిన రెండు రోజులకు షురూ అయ్యింది ఆళ్ళ గోస.  పెద్దోల్లందరు ఒక్క తాన గూసోని జోలి పెట్టుకుంటుండంగ యాడ్నో ఒక బాంబు పడ్తది. సప్పుడు చెయ్యని బాంబు. అందరు ఒక్కసారి అదుర్కోని బాంబెవరేసిండ్రా అని ముక్కులు మూస్కోని దిక్కులు సూశిండ్రు. బాంబేసినోనికి కూడ బాంబేసిన సోయి లేకుండ ఆటలల్ల మునిగున్నరు. 

      ఆడికెళ్ళి మొదలయ్యింది పెద్దోళ్ళ పంచాది. ప్రతి పదినిమిషాలకు ఒగరు బాంబేస్తరు. మామూలు బాంబయితే ఎట్లనో అట్ల తట్టుకుంటుండే, ఇవేమో సప్పుడు రాని బాంబులాయే. హైడ్రోజన్‌ బాంబులు. మా గోపాల్మామ అంటనే ఉన్నడు, ‘గీ పోరలందర్నీ గా బార్డర్లకి తోల్కవొయ్యి బాంబులేపిస్తే పాకిస్తానోడు దెబ్బకే తోక పీక్తడు,’ అని.  అసలు బాంబులేస్తున్నది పిల్లలంటాని తెల్సుకోనీకెనే ఒక పూట వట్టింది. అప్పటివరకు ఇల్లంత బాంబులదాడికి గబ్బులేశిపొయ్యింది. నిలవడితే బాంబు, కూసుంటే బాంబు. తింటప్పుడు బాంబు, ఆఖరికి స్తానం చేస్తప్పుడు గూడ బాంబులే. ఇదంత ఒక ఎత్తు, రాతటికి ఒకెత్తు.

      ఏడెనిమిది గాకముందే తిని బంకుల్లేశిన జంబుకాన మీద ఈడికెల్లి ఆడిదాంక పిల్లలమంత పండుకున్నంక మెల్లెగ పెద్దోళ్ళు జేరేటోళ్ళు మా పక్కలకు. పగలేసే బాంబులతోటే ఇల్లంత మోత మోగిపోతే, ఇగ రాతటీలు పడే బాంబులకు లెక్కనే లేదు. ఆ నాతిరి పెద్దోల్లకు నిద్ర కరువై ఆకిట్ల బర్లు ఆవులు కట్టేసిన కొట్టం పక్కపోంటి ఈత సాపలేసుకోని పండుకున్నరు.

      మల్ల తెల్లారి మల్ల అదే కత. నిన్న మొన్న బాంబులెయ్యనోళ్ళు గూడ ఒక్క మాటకు కట్టువ


డ్డట్లు, ఒగర్నొకరు పదుర్కున్నట్లు  ఇంకింత జోరు పెంచిండ్రు. ఇదంత తట్టుకోక అమ్మమ్మ పిడ్కె మీద నాలుగు ఇంగలాలు తీస్కొచ్చి ఆటి మీద ఇంత ఊదు సల్లి ఇల్లంత ఊదు పొగేసింది. జరంత సేపు ఇల్లంత కమ్మగ గుమగుమ లాడింది. అయిదునిమిషాలు అయిపోంగనే మల్ల ఆ మూలకెల్లి ఒగ బాంబు పడుతుండే. ఆ బాంబు పొగకు ఊదు పొగ కూడ కాన్రాకుండ పోతుండేటిది.  ఇట్లకాదని మా అమ్మక్క నాలుగు ఊదుబత్తీలు ముట్టిచ్చి ఆ అర్రలొకటి, ఈ అర్రలొకటి తలుపు సందుల్ల జెక్కి ఒచ్చింది. సరీగ అప్పుడే ఈ మూలకెళ్ళి ఒగరు ఏశిన బాంబుకు గంటసేపు ఇంట్లకు అడుగువెట్టనీకె బుగులయ్యి అందరు ఆకిట్ల యాపచెట్టుకిందికి, మిద్దెమీదికి పొయ్యి పానాలు కాపాడుకున్నరు.

      ఆ రాత్రి మేము పిల్లలమంత పండుకున్నంక పెద్దోల్లందరు ఆకిట్ల కూసోని సోంచాయించిండ్రు. అమ్మమ్మ ఉపాయం చెప్పింది. అందరు ఊపిరి పీల్చుకున్నరు. సై అంటే సై అని ఏం తెల్వనట్లు గమ్మునున్నరు. అప్పటిదాంక నిద్ర పోయినట్లు కండ్లు మూస్కోని ఉన్న నేను మా అమ్మక్క కొడుకు మల్లిగాడు అమ్మమ్మ చెప్పేది ఇని, ఏం తెల్వనట్లు మల్ల పొయ్యి పండుకున్నము.

      మల్ల తెల్లారి అందరం లేశినంక మొకాలు కడుక్కున్నంక పాలు పొయ్యరు, చాయ పొయ్యరు. మెల్లెగ మా గోపాల్‌ మామ నా తానికి ఒచ్చి చిన్నగ సంగతి చెప్పిండు. ఏం చెయ్యాల్నో చెప్పిండు. అందరు పోరల నడ్మ నేనే పెద్దోన్నయితి. ఆరోతరగతికొచ్చిన. నాకు సమజయింది.       గోపాల్‌ మామ పిల్లలందర్నీ బంకుల్ల జమజేసి మంచి ఆట ఒకటి ఆడుకుందాం అని ఆట ఎట్లాడాల్నో చెప్పిండు.

      ‘అందరు పిల్లలు వరుసగ వంటింట్లకు ఒగరి తరువాత ఒగరు, ఒక్కక్కరు పొవ్వాలే మల్ల వంటింట్లున్న అవుతలి దర్వాజలకెళ్ళి బయటికి రావాలే. వంటింట్ల ఒక బెల్లం ముక్క దాపెట్టిన, అది దొర్కవట్టుకోని అవుతలికెళ్ళి ఒచ్చేటోళ్ళు గెలిచినట్లు.’

      ‘అందరికి అర్తమయ్యిందా’ అని అడిగిండు. అందరం అర్తమయ్యిందని చెప్పిండ్రు.       వంటిల్లు ఇవుతలి దర్వాజ, అవుతలి దర్వాజ పెట్టిఉన్నది. ముంగల ఎవరు పోతరంటాని అడిగిండు గోపాల్మామ. నేను చెయ్యెత్తి, వంటింట్లకు పొయ్యిన.  లోపట అమ్మమ్మ, అయిదుగురు అత్తలు, చిన్నమ్మ, అమ్మ, అమ్మక్క అందరు కూసోనున్నరు. లోపటికి పోంగనే ఒక గంటెల ఎచ్చవెట్టిన ఆముదం తాపిచ్చిండ్రు, తాగనని జిద్దు జేసేటోళ్ళని పండవెట్టి గొంతుల పోశేటట్లే గొట్టింది ఈళ్ళని సూస్తే. అవుతలి దర్వాజలకెల్లి బయటికొచ్చేటప్పుడు అమ్మక్క ఒక బెల్లమ్ముక్క చేతిలవెట్టింది. అది నాకు కుంట బయటపడ్డ.

      నా ఎనక అందరు ఒగరి తరువాత ఒగరు ఒచ్చిండ్రు. ఆముదం తాగిన సంగతి ఎవ్వరు ఎవ్వరితోటి చెప్తలేరు. వంటింట్లకెళ్ళి బయటపడ్డోళ్ళని ఇంట్లకు పోకుండ నేను ఆడనే కావలున్న.  అందరం అయిపోయినంక ఎందుకన్న మంచిదని మా పెద్దోళ్ళు కూడ తలా గంటెడు ఆముదం తాగిండ్రు.   ఇంట్లున్న పాయిఖాన ఇంతమందికి సరిపోదని నేను మల్లిగాడు, కొండల్గాడు బాయిమొకాన పడి ఉర్కినం.


logo