సోమవారం 03 ఆగస్టు 2020
Sunday - Jul 04, 2020 , 23:34:20

జాతీయస్థాయిలో కేసీఆర్‌ బయోపిక్‌ తీయాలి

 జాతీయస్థాయిలో కేసీఆర్‌ బయోపిక్‌ తీయాలి

ప్రతిష్ఠాత్మక మద్రాస్‌ ఐఐటీ నుంచి గోల్డ్‌మెడలిస్ట్‌.. ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పెద్ద కొలువులు.. ఏ బాదరబందీలేని జీవితం.. ఎవరైనా ఇంతకుమించి ఏం కోరుకుంటారు? కానీ, మధుర శ్రీధర్‌రెడ్డి మాత్రం అంతటితో ఆగిపోలేదు. విజయం తాలూకు హద్దుల్ని చెరిపివేయాలనుకున్నారు. హృదయం చెప్పిన మాట విన్నారు. కంఫర్ట్‌జోన్‌ నుంచి బయటకొచ్చి తన కలల సాఫల్యానికి చిత్రసీమను వేదికగా ఎంచుకొన్నారు. తొలుత ‘మధుర’ పేరుతో ఆడియో రంగంలో అడుగుపెట్టి సక్సెస్‌ అయ్యారు. ఆ తర్వాత దర్శకుడిగా, నిర్మాతగా విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సినీ నిర్మాణ వ్యవహారాలతో బిజీగా ఉన్నారాయన. ‘బతుకమ్మ’ పలకరించినప్పుడు శ్రీధర్‌రెడ్డిని చెప్పిన సంగతులివి..

నేను పుట్టిపెరిగిందంతా వరంగల్‌లోనే.  అక్కడి ఆర్‌ఈసీలో బీటెక్‌ పూర్తిచేశాను. అనంతరం మద్రాస్‌ ఐఐటీలో ఎం.ఎస్‌ చేసి గోల్డ్‌మెడల్‌ సాధించాను. టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌ మహేంద్ర వంటి ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో వివిధ హోదాల్లో ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తించాను. సినీరంగం మీదున్న మక్కువతో ‘మధుర ఆడియో’ స్థాపించి పరిశ్రమలోకి ప్రవేశించాను. స్నేహగీతం, ఇట్స్‌ మై లవ్‌స్టోరీ, బ్యాక్‌బెంచ్‌ స్టూడెంట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించాను. మాయ, లేడీస్‌ అండ్‌ జెంటిల్మన్‌,  ఒక మనసు, ఫ్యాషన్‌ డిజైనర్‌ సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌, దొరసాని చిత్రాల్ని నిర్మించాను. ప్రస్తుతం ‘లవ్‌ లైఫ్‌ పకోడి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను.

కథలో ఇంపాక్ట్‌ ఉండాలి

సినిమా కోసం ఔత్సాహిక దర్శకులు ఎవరైనా నన్ను సంప్రదించినప్పుడు మొదట స్క్రిప్ట్‌ మొత్తం వింటాను. ఆ కథలో ప్రేక్షకులు సహానుభూతిచెందే అంశాలు, తమవెంట తీసుకుపోయే భావోద్వేగాలు ఏమైనా ఉన్నాయా అని విశ్లేషిస్తా. థియేటర్‌ వదలి బయటకు వెళ్లే ప్రేక్షకుడిని సినిమా ఎంతవరకు ప్రభావితం చేస్తుందని ఆలోచిస్తాను. ఆ తర్వాత నటీనటుల్ని, సాంకేతిక నిపుణుల్ని సమన్వయం చేసుకుంటూ టీమ్‌ మొత్తాన్ని నడిపించే నేర్పు దర్శకుడికి ఉందోలేదో తెలుసుకుంటా. నేను గతంలో మూడు చిత్రాలకు దర్శకత్వం వహించాను కాబట్టి, ప్రతిభావంతుడైన డైరెక్టర్‌కు ఎలాంటి క్వాలిటీస్‌ ఉండాలనే విషయంలో మంచి అవగాహన ఉంది.

పార్ట్‌నర్‌షిప్‌ మేలు చేస్తుంది

ప్రస్తుతం నిర్మాణ సంస్థలు ఉమ్మడి  భాగస్వామ్యంలో సినిమాలు తీసే ట్రెండ్‌ ఎక్కువైంది. దీనివల్ల ఒకరి బలాల్ని మరొకరు పంచుకొని క్వాలిటీ ప్రొడక్ట్‌ను తీసుకొచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. నేను సురేష్‌ ప్రొడక్షన్స్‌ సహకారంతో ‘దొరసాని’ సినిమా చేశాను. నిర్మాత సురేష్‌బాబు సినిమా కథల్ని బాగా జడ్జ్‌ చేస్తారు. థియేట్రికల్‌ రిలీజ్‌పై ఆయనకు మంచిపట్టుంది. ఆయన భాగస్వామ్యం వల్ల ఆ సినిమా విషయంలో అనుకున్న ఫలితాల్ని సాధించాం. పార్ట్‌నర్‌షిప్‌లో సినిమాలు చేయడం వల్ల అనేక లాభాలుంటాయి.  సినిమా నిర్మాణంలోని లోపాల్ని నిర్మాతలకంటే బయట వ్యక్తులే ఎక్కువగా కనిపెడతారు.  పార్ట్‌నర్‌షిప్‌ వల్ల నిర్మాణపరమైన లోపాల్ని పరస్పరం తెలుసుకునే అవకాశం ఉంటుంది. సినిమా నిర్మాణం విషయంలో కంబైన్డ్‌ ప్రొడక్షన్‌ ఎప్పుడైనా  సత్ఫలితాలనిస్తుంది.

రెగ్యులర్‌ ఫిల్మ్‌మేకర్స్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కోసం వెబ్‌సిరీస్‌లు తీయడం వల్ల పెద్దగా లాభాలు పొందలేరు. వెబ్‌సిరీస్‌లో నిర్మాతలకు 30శాతం లాభం ఉంటుంది. పైగా కంటెంట్‌ మీద ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీరైట్స్‌, కాపీరైట్‌ ఏమీ ఉండవు. వాళ్లు ఇచ్చిన బడ్జెట్‌లో సిరీస్‌ తీసి ఇవ్వాలి. కంటెంట్‌ విషయంలో సర్వహక్కులు వారికే ఉంటాయి. అలా కాకుండా సొంతంగా వెబ్‌సిరీస్‌లు చేసుకొని అమ్మేసుకుంటే లాభాలు బాగుంటాయి. కంటెంట్‌పరమైన అన్ని హక్కులు మనకే ఉంటాయి.

 క్రియేటివ్‌ ఫీల్డ్‌లో సక్సెస్‌ తక్కువే..

ప్రపంచవ్యాప్తంగా ఏ సృజనాత్మక రంగాన్ని తీసుకున్నా సక్సెస్‌ ఇరవైశాతాన్ని మించదు. అందుకు సినిమారంగం మినహాయింపు కాదు. ఓ చిత్రకారుడు వంద పెయింటింగ్స్‌ వేస్తే అందులో ఇరవై మాత్రమే వీక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. సినిమాలు కూడా అలాంటివే. ఇప్పుడున్న ప్రతి క్రియేటివ్‌ ఫీల్డ్‌లో విజయాలు అలానే ఉన్నాయి. దీనిని యూనివర్సల్‌ ట్రెండ్‌గా చెప్పొచ్చు. అయితే సినీరంగంపై ఏమాత్రం అవగాహన లేకుండా డబ్బులున్నాయి కదా అని ఇన్వెస్ట్‌ చేస్తే ఎక్కువగా ఎదురుదెబ్బలు తగలడానికే ఆస్కారం ఉంటుంది. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తే సేఫ్‌గా ఉంటామని ఏ నిర్మాత అనుకోడు. అక్కడ కూడా రిస్క్‌ ఉంటుంది. ఇమేజ్‌ ఉన్న హీరోలతో సినిమాల విషయంలో ఫైనాన్స్‌, రిలీజ్‌, ప్రమోషన్‌ చాలా సులభంగా జరిగిపోవడం అడ్వాంటేజ్‌లా అనిపిస్తుంది. పెద్ద హీరోలతో సినిమాలు తీసి చేతులు కాల్చుకున్న నిర్మాతలు పరిశ్రమలో ఎందరో ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే కచ్చితమైన ప్లానింగ్‌, ఎగ్జిక్యూషన్‌ ఉంటే చక్కటి కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాల్ని తీయొచ్చు. నేను గత పన్నెండేళ్లుగా దర్శకుడిగా, నిర్మాతగా పరిశ్రమలో కొనసాగుతున్నానంటే ప్రతి విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడమే కారణం.

భవిష్యత్తు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌దే

గత రెండేళ్లుగా చిన్న సినిమాల్ని థియేటర్‌లో చూడటం చాలా వరకు తగ్గిపోయింది. థియేట్రికల్‌ రిలీజ్‌ ఓ వృథా ప్రయాసలా మారింది. సినిమా కోసం రెండుకోట్లు ఖర్చుపెడితే...పబ్లిసిటీ కోసం మరో కోటి రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో చిన్న సినిమాలకు ఓటీటీ వేదికలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఓటీటీలో మంచిరేటు వస్తే అదృష్టమనుకోవచ్చు. అలాకాకుండా ‘పే ఫర్‌ వ్యూ’ పద్ధతితో వెళ్తే సినిమా సత్తాను బట్టి డబ్బులొస్తాయి. చివరగా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలు ఎప్పుడైనా రేసులో నిలుస్తాయి. ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉంటుంది. ఇంట్లో కూర్చుని ఓటీటీ వేదికల్లో సినిమాలు చూసే విధానానికి ప్రేక్షకులు క్రమంగా అలవాటుపడుతున్నారు. భవిష్యత్తులో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ మరింత ఆదరణ పొందుతాయని భావిస్తున్నా.


తెలంగాణ సినిమాకు  మంచి రోజులు కథాంశాల

పరంగా సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ తెలంగాణ యాస, భాషాసంప్రదాయాల్ని ఆవిష్కరించే సినిమాలు మరిన్ని రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ లక్ష్యంతోనే నేను ‘దొరసాని’ సినిమా చేశాను. ‘దాసి’ తర్వాత అదే కోవలో నాటి తెలంగాణ జీవనాన్ని, సామాజిక అంతరాల్ని మానవీయ కోణంలో చర్చించిన సినిమా ‘దొరసాని’ అని చాలా మంది ప్రశంసించారు. తెలంగాణ సినిమా అభ్యున్నతి కోసం నాదైన కృషి చేయాలనే సంకల్పం ఉంది. ఆ బాధ్యతలు అప్పగిస్తే స్వచ్ఛందంగా  లక్ష్యసాధనకు శ్రమిస్తాను. కార్పొరేట్‌ స్థాయి ప్లానింగ్‌తో క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా తెలంగాణ పరిశ్రమను ప్రపంచవేదిక మీద నిలిపే ప్రయత్నం చేయాలన్నది నా అభిలాష. తెలంగాణ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడాలన్నది నా ప్రగాఢమైన కోరిక. 

తెలంగాణ ప్రజలు గర్వించేలా 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ బయోపిక్‌ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. పూర్తిస్థాయిలో స్క్రిప్ట్‌ కూడా సిద్ధంగా ఉంది. కేసీఆర్‌ జాతీయస్థాయిలో పాపులారిటీ ఉన్న నాయకుడు. ఆయన జీవితకథా చిత్రాన్ని జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా తెరకెక్కించాలన్నది నా ఆశయం. అందుకు భారీ బడ్జెట్‌ అవసరమవుతుంది. 20కోట్లకు పైగా వెచ్చిస్తేనే అనుకున్న రీతిలో సినిమాను తీసుకురాగలం. బడ్జెట్‌పరమైన సమస్యల వల్లే కేసీఆర్‌గారి బయోపిక్‌ను  తాత్కాలికంగా పక్కనపెట్టాను. పరిస్థితులన్నీ కలిసొస్తే తెలంగాణ ప్రజలు గర్వించేలా ఆ మహానేత జీవితకథను తెరకెక్కిస్తా.

పక్కా ప్లానింగ్‌ ఉండాలి


చిన్నా, పెద్దా అనే భేదాలు లేకుండా ప్రతి సినిమా నిర్మాణంలో రిస్క్‌ ఉంటుంది. జయాపజయాల శాతం కూడా అదే రీతిలో ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించకపోవడం వల్లనే సినిమా నిర్మాణ వ్యయాలు అంచనాలు తప్పుతుంటాయి. ఏదో ఆత్మసంతృప్తి కోసం తొలుత పరిమిత బడ్జెట్‌ అంటూ లెక్కలు వేసుకుంటాం. సినిమా సెట్స్‌మీదకు వెళ్లగానే సమీకరణాలు మారిపోతుంటాయి. కొన్ని చోట్ల అదనంగా డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నటీనటుల డేట్స్‌ సర్దుబాటు కాకపోవడంతో సినిమా పనిదినాలు పెరుగుతాయి. ఇలా అనేక కారణాలతో ముందు అనుకున్న బడ్జెట్‌ లెక్క తప్పుతుంటుంది. 

మన సినిమా సొంతంగా ఎదుగుతుంది

తెలంగాణ సినిమా ఇండస్ట్రీ వికాసానికి ఇదే మంచి తరుణం. వాణిజ్య పరంగా నైజాం ఇండస్ట్రీ పొటెన్షియల్‌ చాలా పెద్దది. పరిమిత బడ్జెట్స్‌లో కొత్త ఇతివృత్తాల్ని ఎంచుకొని సినిమాలు చేస్తే  సొంతంగా ఎదుగుతుంది. తమదైన భాషా సంస్కృతుల్ని ఆవిష్కరిస్తూ బెంగాలీ, కొంకణి, తుళు వంటి పరిశ్రమలు ప్రధాన స్రవంతి సినిమాకు దీటుగా వృద్ధి చెందుతున్నాయి. 


logo