సోమవారం 03 ఆగస్టు 2020
Sunday - Jul 04, 2020 , 23:26:57

నేనున్నాననే..పేదల డాక్టర్‌!

నేనున్నాననే..పేదల డాక్టర్‌!

సమస్య చెప్పుకుంటేనే డాక్టర్‌ వైద్యం చేయగలడు. కానీ, రోగి మూగ.. చెవిటి అయితే? చికిత్సతో పాటు.. ఓదార్పూ ఆశిస్తాడు. ఆ ఓదార్పునూ.. ధైర్యాన్నీ ఇస్తూ చెవి.. ముక్కు.. గొంతు సమస్యలున్న రోగులకు భరోసా ఇస్తున్నారు డాక్టర్‌ రవిశంకర్‌ ప్రజాపతి. చదువుకోవడానికి కూడా అవకాశం లేని కుటుంబంలో పుట్టి.. ఇప్పుడు పేదల డాక్టర్‌ అనిపించుకుంటున్న రవిశంకర్‌‘లైఫ్‌జర్నీ’ ఈవారం.. 

మాది ఇప్పటి వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కొత్తూరు గ్రామం. దిగువ మధ్యతరగతి కుటుంబం. చదువుకోవాలి అనిగానీ.. చదువుకుంటే ఉన్నతంగా ఎదగొచ్చు అనిగానీ ఎవరూ చెప్పలేదు. అసలు చదువు గురించి ఆలోచించే స్థోమత కూడా లేదు. ఇంటికి పెద్దవాణ్ని కావడం వల్ల అందరికంటే ఎక్కువ బాధ్యత నామీద ఉంది. బాధ్యత అంటే ఏదో ఒక పనిచేసి కుటుంబాన్ని పోషించడం అన్నట్టు. కానీ నాకేమో చదువుకోవాలని ఉండేది. నన్ను అందరూ తేడాగా చూసేవాళ్లు. ‘సదువు సదువు అంటడు. ఏం సదువో ఏమో. మనకెందుకు ఈ సదువులు.. సన్మానాలు. ఏదన్న పైసలొచ్చే పన్జేస్కొని నిమ్మళంగా ఉండక’ అనేవాళ్లు మావోళ్లు. అంటే 1%శాతం కూడా చదువువైపు వెళ్లు అని ప్రోత్సహించిన సంఘటనలు లేవు. ‘అసలు నన్ను ఎందుకు చదువుకోవద్దు అంటున్నారు? వీళ్లు అన్నందుకైనా నేను చదివి తీరుతా’ అని శ్రద్ధగా ఉండేవాడిని. నా మొండితనమో.. లేక ధైర్యమో మొత్తానికి నా మానాన నన్ను వదిలేశారు. ‘సదువుతవో.. సన్నాసులల్ల పోతవో నీ ఇష్టం ఇగ’ అని నా జోలికి రాలేదు. ఊర్లో కూడా మంచి చదువరి అనే పేరు సంపాదించాను. ఆ పేరు చెడిపోవద్దనే భయం ఏర్పడింది. 

డాక్టర్‌ దగ్గరికి వెళ్లి.. ట్రీట్‌మెంట్లు తీసుకున్న మేజర్‌ సంఘటనలు నా చిన్నప్పుడు లేవు. ఒక రకంగా అంత స్థోమత లేదని చెప్పొచ్చు. మేమొక్కరమే కాదు. చాలామంది పరిస్థితి ఇదే. అప్పుడు కడుపులో నొప్పి కలిగినా అలాగే భరించేవారు కానీ హాస్పిటల్‌కు వెళ్లేవాళ్లు కాదు. ఏదైనా పాము కాటేస్తే కూడా మంత్రాలను నమ్ముకొని ప్రాణాల మీదికి తెచ్చుకునేవాళ్లు కానీ డాక్టర్‌ దగ్గరకు పోయేవాళ్లు కాదు. ఇదేంటి అనిపించేది నాకు. అలా.. జ్వరమొస్తేనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లే స్థోమత లేని నాకు డాక్టర్‌ కావాలనే ఆశ ఏర్పడింది. అది క్రమంగా నా లక్ష్యంగా మారింది. 

మా ఇంటికి ఎదురుగా ఓ ఎంబీబీఎస్‌ డాక్టర్‌ ఉండేవారు. ప్రతిరోజూ తెల్లకోటు వేసుకొని స్కూటర్‌ మీద వెళుతుంటే ఆయనెందుకో అందరికంటే భిన్నంగా అనిపించేవారు. అలా ఆయన్ను చూసి కూడా డాక్టర్‌ అవ్వాలనే ఆశ రెట్టింపు అయ్యింది.  

ఇంటర్‌ తర్వాత ఏం చేయాలి? 

ఇంటర్‌ అయితే అయిపోయింది. ఏం చేయాలనే డైలమా మొదలైంది. డాక్టర్‌ కావాలంటే ఏం చేయాలి? అనేది మాత్రం అంతగా తెలియదు. ఎవరైనా చెప్తేనే కదా తెలిసేది? కానీ అలాంటి ఓ అవకాశం లేదు. వాళ్లను అడిగీ.. వీళ్లను అడిగీ మొత్తానికి మెడికల్‌ ఎంట్రెన్స్‌ రాయాలని తెలుసుకున్నా. ఎంట్రెన్స్‌లో మంచి ర్యాంక్‌ వచ్చింది. ఎంబీబీఎస్‌లో సీటు కూడా వచ్చింది. మా వాళ్లకు నామీద నమ్మకం ఏర్పడింది. ఏదో ఎలాగైనా బతక గలుగుతాడు.. నలుగురు మెచ్చుకునే స్థాయికి వస్తాడు అనుకునేవాళ్లు. కష్టపడటం అంటే ఏంటో చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు కూడా నమ్మకం ఏర్పడింది. 

వరంగల్‌లోని కాకతీయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ చదివాను. ఆ తర్వాత పెండ్లి అయింది. అప్పటిదాకా నేను ఒక్కడినే. కెరీర్‌ కోసమే అయినా ఎవ్వరూ చేయని సాహసాలు.. ఎక్స్‌పెరిమెంట్స్‌ చేశాను. ఇంట్లో వాళ్లు వద్దని వారించినా నాకు ఇష్టమైన పని చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు నాతో పాటు భార్య కూడా ఉంటుంది కదా? ఏం చేయాలి అని ఆలోచించి హైదరాబాద్‌కు వచ్చేశాను. మలక్‌పేట యశోదలో కొంతకాలం డ్యూటీ డాక్టర్‌గా పనిచేశా. తర్వాత ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. కరీంనగర్‌.. వరంగల్‌.. మెదక్‌  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దాదాపు 7 సంవత్సరాలు మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేశా. 

గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నప్పుడు పేదల జీవితాలను దగ్గరనుంచి చూశాను. కొందరికి చెవులు వినిపించవు. కొందరికి మాటలు రావు. ఇలా రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడేవాళ్లను ఎంతో మందిని చూశాను. పాపం వాళ్లను అలా చూస్తుంటే ఏదో తెలియని బాధ కలిగేది. ‘నేనే గనుక ఈఎన్‌టీ డాక్టర్‌ అయితే ఇలాంటి వాళ్ల సమస్యలు పరిష్కరిస్తా’ అనిపించేది. 

డ్యూటీ తర్వాత సేవ


అవకాశం కోసం ఎదురుచూశా. అనుకున్నట్లుగానే ఇన్‌ సర్వీస్‌ నోటిఫికేషన్‌ వచ్చింది. డాక్టర్‌ వృత్తి అనేది నిరంతరం కొత్త విషయాల గురించి అధ్యయనం చేసేది. ఆధునిక వైద్య విధానాలు తెలుసుకుంటేనే డాక్టర్‌గా న్యాయం చేయగలం. కాబట్టి నేను ప్రతీ రోజూ ఏదో చదివే వాడిని. కొత్త విషయాలు తెలుసుకునేవాడిని. వృత్తిలో బిజీగా ఉన్నా చదువు అనేది దూరం కాలేదు కాబట్టి పట్టుదలతో ప్రిపేర్‌ అయ్యాను. ఇప్పుడు కోఠి ఈఎన్‌టీ హాస్పిటల్‌లో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. అన్ని స్పెషలిస్ట్‌ల్లాగనే ఈఎన్‌టీ కూడా ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్‌. ఒక రకంగా ఇదొక ఆసక్తికరమైన విభాగం. 

డాక్టర్లకు చిరాకు ఎక్కువ అనే ప్రచారం ఉంది బయట. కానీ అందరూ అలా ఉండరు. ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఒత్తిడిలో అలా చేస్తుంటారు తప్ప.. పాపం రోగులను అంటే మాకేమొస్తుంది? నా వరకైతే నేను ఏ ఒక్క రోగిపై కోప్పడిన.. చిరాకుపడిన సందర్భాలు లేవు. ఉండవు కూడా. పైగా నేను వారికేదైనా సాయం కావాలంటే చేస్తుంటా. ఇలాంటి వాళ్ల కోసమే ‘మహాత్మా పూలే ఫౌండేషన్‌ ట్రస్ట్‌' స్థాపించాం. వృత్తి పరంగా వైద్య సేవలు అందిస్తూనే ట్రస్ట్‌ ద్వారా ఇంకెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటా. మామూలుగా ఏ ప్రభుత్వ డాక్టర్‌నూ తీసుకోండి.. ప్రైవేటుగా వేరే హాస్పిటల్‌ పెట్టుకోవడమో లేక వేరే హాస్పిటల్‌లో పార్ట్‌ టైం డాక్టర్‌గా పనిచేయడమో చూస్తుంటారు. కానీ నేను అలా కాదు. అలాంటి వ్యాపకాలేమీ పెట్టుకోకుండా ప్రజా సేవలో ఉంటున్నా. 

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో డాక్టర్ల పాత్ర ముఖ్యమైనది. ప్రభుత్వ వైద్యుల ఆఫీసు బేరర్‌గా ఉద్యమం వైపు ఎందర్నో మోటివేట్‌ చేయగలిగాను. ఎక్కడ ఏ ఆందోళన జరిగినా మా బృందం ఉండేది. వారందరినీ ఏకం చేయడంలో నేను క్రియాశీలక పాత్ర పోషించానని సగర్వంగా చెప్పుకోగలను. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లో వివిధ హోదాల్లో ఉచిత మెడికల్‌ క్యాంప్‌లు.. వైద్యుల్లో అవగాహన.. సెమినార్‌లు నిర్వహించిన అనుభవం సంపాదించా. 

నిస్సహాయ స్థితి

ఈఎన్‌టీ కోఠీ హాస్పిటల్‌లో దివ్యాంగులకు సర్టిఫికేట్లు కూడా ఇస్తారు. ఉద్యోగాల్లో వాళ్లకు ప్రత్యేకమైన కోటా ఉంటుంది కాబట్టి సర్టిఫికెట్స్‌ తప్పనిసరి. ఉద్యోగాలు వచ్చిన తర్వాత స్క్రూటినీ కోసం మా హాస్పిటల్‌కు పంపిస్తారు. అది మేమే చేస్తాం. ఒకవేళ స్క్రూటినీలో ‘నార్మల్‌' అని తేలితే ఉద్యోగం పోతుంది. 

ఒకతను ఇలాంటి సమస్యతోనే వచ్చాడు. ఆయనకు చెవుడు ఉంది. అప్పుడప్పుడే పెండ్లయిందంట. ఉద్యోగం ఉందనే కారణంతోనే ఆ సంబంధం సెట్‌ అయిందట. కానీ ఎవరో గిట్టనివారు ఆయనకు చెవులు వినిపిస్తాయని కంప్లెయింట్‌ చేస్తే.. ఎంక్వయిరీ కోసం మా దగ్గరకు పంపారు. ఆ కేస్‌ నేనే డీల్‌ చేశాను. చెక్‌ చేస్తే నిజంగానే వినికిడి సమస్య పెద్దగా లేదు. పర్సెంటేజ్‌ ఎంత వస్తే అంతే వేయాలి. ఆయనకు వచ్చిన పర్సెంటేజ్‌ ప్రకారం చూసుకుంటే ఉద్యోగం పోతుంది. పాపం ఆయన ఎంతో బాధపడ్డాడు. ‘సార్‌.. ఉద్యోగం ఉందనే కారణంతోనే పెండ్లి అయ్యింది సార్‌. ఇప్పుడు నా ఉద్యోగమే పోతే నేనేం సమాధానం చెప్పాలి? మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఏదైనా చేయండి సార్‌' అంటూ కాళ్లమీద పడబోయాడు. కానీ నేను నేనేం చేయలేను కదా? నిస్సహాయ స్థితిలో ‘సారీ’ అని చెప్పేశా. అతడు ఏడ్చుకుంటూ.. తిట్టుకుంటూ వెళ్లాడు. 

భరోసా కల్పిస్తూ 

ఒకసారి.. కరీంనగర్‌ నుంచి ఒకతను చెవి సమస్యతో వచ్చాడు. అతనికి ఆపరేషన్‌ చేయాలి. ఒకవైపు చెవిలో నుంచి రక్తం కారుతున్నది. మామూలుగా చెవిలో రక్తం వస్తే ఎవరికైనా భయం అనిపిస్తుంది. అతడూ.. అతనితో పాటుగా వచ్చిన వ్యక్తీ భయపడిపోతున్నారు. ఆపరేషన్‌ చేస్తామని చెప్పాం. కానీ అతనొక్కడే ఉండడు కదా? అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిదీ అవసరమే. ప్రతి ఒక్కరికీ అత్యవసర వైద్యమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫలానా డేట్‌నాడు ఆపరేషన్‌ అని చెప్పి హాస్పిటల్‌లోనే ఉండాలని చెప్పాం. వాళ్లకేమో తొందర. ఇదే సమయంలో నర్స్‌తో చిన్న గొడవ పెట్టుకున్నారు. అదీ ఇదీ అయ్యి విషయం పెద్దది అయింది. నేనే కల్పించుకొని సర్దిచెప్పాను. ‘మీ ఆరోగ్యానికి నాది భరోసా. ఎలాంటి అపాయం లేకుండా నేను ఆపరేషన్‌ చేసి క్షేమంగా ఇంటికి పంపిస్తాను. మూడు నెలల్లో నీ చెవి సాధారణ స్థితికి వస్తుంది. నాది గ్యారంటీ. నీ చెవి బాగైతే స్వీటు తీసుకొనిరా.. లేకుంటే కట్టె పట్టుకొనిరా’ అని భుజం మీద చెయ్యేసి ధైర్యం ఇచ్చేసరికి శాంతించారు. 

తర్వాత ఆపరేషన్‌ జరిగింది. అలాంటివాళ్లు ఎందరో వస్తుంటారు పోతుంటారు. దాదాపు అందరికీ ఇదే రీతిలో భరోసా కల్పిస్తుంటాం. కానీ.. మూణ్నెళ్ల తర్వాత అతను నిజంగానే వచ్చాడు. అదీ స్వీట్‌ బాక్స్‌తో. వాస్తవానికి నాకు ఈ సంఘటన గుర్తుకే లేదు. ఆయనే గుర్తుచేసి చెప్పాడు. ఇలా ప్రైవేటు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోలేని వాళ్లు ఆనందపడితే నాకూ ఆనందంగానే ఉంటుంది. వృత్తి పట్ల సంతృప్తితో ఉంటాను.  

డాక్టర్‌ రవిశంకర్‌.. చిన్నప్పటి నుంచీ సామాజికాంశాల పట్ల అవగాహన కలిగి ఉన్నారు. అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకోవాలని పరితపించేవారు. అందుకే ప్రభుత్వ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేస్తూ అనేకమంది పార్ట్‌టైం క్లినిక్స్‌ పెట్టుకున్నా.. ఇతను మాత్రం సామాజిక కార్యక్రమాలకే పరిమితమై పేదల డాక్టర్‌ అనిపించుకుంటున్నారు. 

డాక్టర్లకు చిరాకు ఎక్కువ అనే ప్రచారం ఉంది బయట. కానీ అందరూ అలా ఉండరు. ఎవరైనా ఒకరిద్దరు ఉంటే ఒత్తిడిలో అలా చేస్తుంటారు తప్ప.. పాపం రోగులను అంటే మాకేమొస్తుంది? నా వరకైతే నేను ఏ ఒక్క రోగిపై కోప్పడిన.. చిరాకుపడిన సందర్భాలు లేవు. ఉండవు కూడా. పైగా నేను వారికేదైనా సాయం కావాలంటే చేస్తుంటా. 


logo