సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 23:12:31

ఔరా..! త్రీడీ కట్టడాలు

ఔరా..! త్రీడీ కట్టడాలు

కొత్త టెక్నాలజీ వచ్చాక తాపీమేస్త్రీని పక్కనపెట్టి త్రీడీ ప్రింటర్లతో ఇండ్లు కట్టుకునే స్థాయికి చేరుకున్నాం. ఈ మూడు కట్టడాలే ఇందుకు నిదర్శనం.

మొదటి వాణిజ్య భవనం

ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలకు కేరాఫ్‌ దుబాయ్‌. ఇక్కడే త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మితమైన మొదటి వాణిజ్య భవనం ఉంది. ఫ్యూచర్‌ అకాడమీ కార్యాలయంలోని 2,600 చదరపు అడుగులున్న ఈ నిర్మాణం ఓ ఇంధ్రభవనం. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదించింది. ఇది 20 అడుగుల ఎత్తు, 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఈ భవనాన్ని త్రీడీ ప్రింటర్‌ ప్రాథమికంగా  ముద్రించడానికి పదిహేడు రోజులు పట్టింది. ఇంటీరియర్‌ డిజైన్‌ను పూర్తిచేయడానికి మరో మూడు నెలలు. దీనిని ప్రత్యేక సిమెంట్‌ మిశ్రమాన్ని ఉపయోగించి నిర్మించారు. కేవలం 50% శ్రామికులతోనే పూర్తిచేశారు. 

మొదటి ఇల్లు 


ఇది త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మితమైన మొదటి ఇల్లు. ఫ్రాన్స్‌లోని నాంటెస్‌లోని ఓ కుటుంబం 2018లో నిర్మించి, గృహప్రవేశం కూడా చేసింది. మొదటి 3డీ ప్రింటెడ్‌ హౌస్‌  హోదా కోసం చాలా మంది పోటీ పడ్డారు. ఈ కుటుంబానికి మాత్రమే ఆ అవకాశం దక్కింది. ఇందులో నాలుగు పడకగదులు ఉన్నాయి. 1,022 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడానికి 54 గంటల సమయం పట్టింది. కిటికీలు, తలుపులు, పైకప్పును జోడించడానికి కాంట్రాక్టర్లకు మరో నాలుగు నెలలు అవసరం అయ్యాయి. ఇన్సులేటర్‌ పాలియురేథేన్‌, సిమెంటు ఉపయోగించి 20% తక్కువ ఖర్చుతో దీన్ని నిర్మించారు.

మొదటి వంతెన 


ఇది మొదటి 3డీ ప్రింటెడ్‌ వంతెన. స్పెయిర్‌ రాజధాని మాడ్రిడ్‌లో ఆల్కోబెండాస్‌లోని కాస్టిల్లా-లా మంచా పార్క్‌లో నిర్మించారు. ఓ చిన్న కాలువకు అడ్డంగా పాదచారుల కోసం నిర్మితమైన వంతెన ఇది. 2016 డిసెంబర్‌ 14న అందుబాటులోకి వచ్చింది. మైక్రో రీ ఇన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీటులో దీన్ని నిర్మించారు. 39 అడుగుల పొడవు, 5.7 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. త్రీడీ టెక్నాలజీ కొత్తగా అందుబాటులోకి వచ్చినప్పుడే దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. ఏడాదిన్నరకు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.


logo