సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 23:02:23

వాస్తు

వాస్తు

మెట్లపై నుండి వచ్చే వర్షం నీళ్లను ఎటువైపు మళ్లించాలి?

-రోలన్‌ బాల్‌రెడ్డి, వికారాబాద్

ఇంటి పైనుండి వచ్చే నీటిని పైపుల ద్వారా ఇంకుడు గుంతలోకి ఎలాగైతే కలుపుకుంటామో... అలాగే మెట్లమీది నీరుకూడా ఇంటి బయటి ఆవరణ నుండి ఆ గుంతలోకి మలుపుకోవచ్చు. అయితే మెట్ల మీది నుంచీ నీళ్లు వస్తున్నాయి అంటే, మీరు మెట్లమీద హెడ్‌రూము (రేకుల కప్పు) వేయలేదన్న మాట. దానిని తప్పకవేయండి. (జారిపడతారు కదా) ఆ మెట్ల కప్పునీరు అప్పుడు మెట్ల మీద నుండి రాకుండా ఇంటి టెర్రస్‌ మీద పడి, ఈశాన్యం నుండి ఏర్పాటుచేసిన పైపు ద్వారా  నీళ్లు కిందికి చేరుతాయి. ఇంట్లోని వాడుకనీరు, వర్షం నీరు ఎట్టిపరిస్థితిలోనూ బయటకు పంపడం  మంచిదికాదు. ఇంకుడు గుంతలోకి చేర్చడం ఉత్తమం. తద్వారా ఆ నీరు బోరునీటిని పెంచుతుంది. లేదంటే,  ప్రత్యేకంగా ట్యాంకు కట్టి ఆ వర్షం నీటిని ఇతర పనులకు కూడా వాడుకోవచ్చు.

సెల్లార్‌లో ఈశాన్యం రూము ఉంది. దానిని యజమాని ఆఫీసుకోసం వాడొచ్చా?

- ఎ.ప్రేమలత, ఆలేరు

సెల్లారు భాగాన్ని వాడుతున్నప్పుడు.. సెల్లార్‌లో నైరుతి భాగం కూడా ఉంటుంది కదా.. ఆ నైరుతి భాగంలో ఒక గది వేసుకొని దానిని ఆఫీసుగా వాడుకోండి. ఈశాన్యం గది విజిటర్స్‌కి ఉపయోగించండి. కేవలం ఈశాన్యంలోనే సెల్లారు ఇచ్చి, మిగతా భాగం సెల్లారు తీయకుండా ఉన్నా.. ఆ భాగమంతా రాయి ఉన్నా.. కేవలం ఈశాన్యం తప్ప మిగతా సెల్లార్‌ భాగం మట్టితో ఉన్నప్పుడు దానిని యజమాని వాడటం మంచిది కాదు. ఇతరులు వాడుకోవచ్చు లేదా యజమాని సెక్రటరీలు, గుమస్తాలు లేదా పీఏ, పీఎస్‌లు వాడవచ్చు. లేదంటే ఇంట్లో ఉండే వర్కర్స్‌కి ఇవ్వొచ్చు. తప్పులేదు. ఇంటి యజమాని నైరుతి భాగంలో ఉంటూ ఈశాన్య భాగాన్ని వాడుకోవచ్చు.  

చిల్డ్రన్‌ బెడ్‌రూముకు రెండు ద్వారాలు పెట్టుకోవచ్చా?


-పడకంటి లక్ష్మి, రుద్రారం

ఇంట్లో సహజంగా రెండు పడకగదులు లేదా మూడు పడకగదులు ఉంటాయి. మీరు ఏమూల గదిని పిల్లలకు కేటాయించారో చెప్పలేదు. ఇంట్లోని వాయవ్యం వైపు పిల్లల నిద్రగదిగా ఏర్పాటు చేస్తే దానికి తూర్పు ఈశాన్యంలో, అలాగే దక్షిణ ఆగ్నేయంలో రెండు ద్వారాలు పెట్టవచ్చు. దక్షిణంలో మధ్య భాగంలో గదిని పిల్లలకు మీరు ఇచ్చి ఉంటే దానికి ఉత్తరం ఈశాన్యంలో లేదా పశ్చిమ వాయవ్యంలో మీ విభజనను బట్టి తూర్పు ఈశాన్యంలో కూడా ద్వారం పెట్టవచ్చు. ఒకవేళ ఆగ్నేయం గదిని పిల్లలకు ఇస్తే దానికి ఉత్తర వాయవ్యం లేదా పశ్చిమ వాయవ్యంలో ద్వారాలు పెట్టవచ్చు. అయితే ఆగ్నేయం గదికి తూర్పు ఈశాన్యం కదా అని బయటకు వెళ్లే ద్వారం పెట్టకూడదు. అలాగే వాయవ్యం పిల్లల గదికి ఉత్తర ఈశాన్యం వస్తుందని బయటకు వెళ్లేవిధంగా ద్వారం పెట్టవద్దు. చూసి నిర్ణయం తీసుకోండి.

సుద్దాల సుధాకర్‌ తేజ

[email protected]

Cell: 7993467678


logo