శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 22:41:18

బొర్రలు= కడుపులు

బొర్రలు= కడుపులు

ఇంకా కాకుర్తాలు సదువ బడికి గూడ పోని పోరల్ని వట్టుకొని మనిషి బొమ్మ దించమంటే, ముందొక చిన్న సున్న గీశి, దానికింద ఇంకో పెద్ద సున్న గీశి, చేతుల తీర్గ, కాళ్ళ తీర్గ రెండు గీతలు గీసి గిదే మనిషి బొమ్మ అని పండ్లికిలిస్తరు సూడుండ్రి, సరీగ గట్లనే ఉంటడు మా బీకేగాడు.

ఆని మొత్తం పేరు బీకే శ్రీనివాస్‌ గని ఇస్కూల్ల ఉన్నప్పటి సంది ఆన్ని బీకేగాడంటాని పిల్సుడు మాకు అల్వాటు.

భూమికి జానెడంటే నిజంగ జానెడే ఉంటడు. ఉంటె గింటే మీద ఇంకో బెత్తెడు ఉంటుండొచ్చుగని అంతకంటే ఒక్క ఇంచిగూడ ఎక్వుండడు.

ఆని నడ్సుడు సూస్తే బాతును సూశినట్లే. అచ్చం అట్లనే నడుస్తడు. రెండు పుల్లలమీద పెద్ద కుండ బయలెల్లినట్లే ఉంటడు. జర పనుంది కలువుమంటే గీడ సుందరయ్య చమన్‌ కాడ ఆని కోసం నిలవడ్డ. అగొస్తలేడు, ఇగొస్తలేడు. నిలవడి నిలవడి యాష్టకొస్తున్నది. ఇప్పటికే రెండు చాయలయినయి. కాలేజికి పొయ్యే దినాలల్ల నేను మూర్తిగాడు, మధుగాడు, బీకేగాడు అందరం గల్సి బిర్యాని తిననీకె పొయ్యి, నెత్తికొక సికెన్‌ బిర్యానీ తిని మల్ల దిక్కులు సూస్తుంటిమి. జేబులల్ల  పైసలెన్నున్నయో పదుర్కోని మల్ల అందరికి బిర్యానీలు చెప్పేటోళ్ళం. అప్పుడు వొయసు అసోంటిది. తిన్నది తిన్నట్లు ఆవిరైపోతుండేటిది. మొగోళ్ళకు ముప్పైఅయిదేండ్లదాంక కోడెగిత్తల్లెక్క పని చేసుడట్లనే ఉంటది, తినేదట్లనే ఉంటది. కొండమీద ఆ కొన దాంక ఎక్కినంక ఆడనే ఉండుడు ఎవ్వలితోని కాదు. మల్ల కిందికి బాట పట్టుడు తప్పది. రాన్రాను తిండి తక్వయితది, పని తక్వయితది. కష్టం చేసేటోడు తిన్న తిండి హరాయించుకుంటడు. గీ పట్నంల ఒంటికివోనీకె గూడ బండి కావాలంటరు. ఇవుతలి గల్లీల కెళ్ళి అవుతలి గల్లీలకు పోనీకె కూడ మనకు బండ్లు గావాలే.  పెయ్యి అల్వొద్దు, చెమట చుక్క జారొద్దు. ఏ కష్టం చెయ్యనోడు ఎప్పటోలె తింటే బొర్రలు పెర్గకుంటే ఇంకేం పెర్గుతయి.

జర వొయసు ముదురుతుంటే అద్రగానం ఏదివడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఏడంటే ఆడ తింటే గిట్లనే పెరుగుతయ్యి బొర్రలు.

మల్ల అల్వాట్లు గూడ అట్లనే మోతాదయినయ్యి. నిచ్చె పీక్క దినుడు లోపుక తాగుడాయే. గిట్లకాదు గిట్లని ఎవ్వనికి చెప్పేటట్లుగూడ లేదు ఇయ్యాల్రేపు. ‘మీ అయ్యది గిట్ల తింటున్నమా?’ అని మల్ల మన మీదికే మోపయితరు. సొమ్ములు నాయిగావు, కడుపులు నాయిగావు గని సూస్త సూస్త ఇడ్సిపెట్టబుద్ది గాక ఇట్ల ఎత్తిపోసుకునుడు.

మూర్తిగాడు, మధుగాడు, బీకేగాడు ముగ్గురు దోస్తుగాళ్ళు అట్లనే తయారయ్యిండ్రు. ఏడ పోటీ పడకున్నా కడుపుల కాడ పోటీ వెట్టుకున్నట్లే పెంచుతున్నరు. అందరు సరి సమానంగ పెంచిండ్రు. ఒగనిది తీసేసేటట్లు లేదు, ఒగనిది పెట్టేటట్లు లేదు.

నేను ఈళ్ళననుడు గూడ కరెక్ట్‌ కాదు. ముప్పై అయిదేండ్లు దాటిన ఒక్క మొగోనికి గూడ బొర్ర లేకుండ కన్లవడ్తదేమో సూతమంటే పట్ట పగలు, మిట్ట మధ్యాన్నం, ఎర్రటి ఎండల దివిటీలు పట్టుకోని దేవులాడినా దొర్కరు గీ పట్నంల. ఈళ్ళు దినే తిండిల తప్పుందా, తాగుట్ల తప్పుందా అంటే తాగుట్లనే ఉన్నదనిపిస్తున్నది. 

నాకయితే గీ తాగుట్లకంటే మన అల్వాట్లల్లనే ఏందో గలత్‌ కొడుతున్నది. నాకు తెల్సిన ఏడెనిమిది మంది కడుపులున్నోల్లని ఏరిపెట్టుకోని ఆళ్ళ అల్వాట్లు యాది తెచ్చుకొని సోంచాయిస్తే జర జర సమజయినట్లు కొడ్తున్నది.

ఇయ్యాల్రేపు డైనింగు టేబుల్లు లేని ఇండ్లేడున్నయి ఈడ. అదో నిత్యావసర వస్తువైనట్లు అందరిండ్లల్ల ఉండవల్సిన వస్తువయిపోయింది. గా టేబుల్లకాడ కుర్సీలల్ల కూసోని తింటుంటే కడుపులకు ఎంత వోతుందో సోయే ఉండది. గోనె బస్తాల ఒడ్లు నింపినట్లే అనిపిస్తది నాకు. మీదికెల్లి పోసుడే గని అది నిండిందో లేదో గూడ తెల్వది. మట్టసంగ తిని లేశి సూసుకుంటే అప్పుడర్తమయితది ఎంత గనం తిన్నమా అని.

దావత్లల్ల కూడ అట్లనే పాడయ్యింది. నిలవడి తింటే ఎంత తిన్నా బాయిల పోసినట్లు లోపటికి పోతనే ఉంటది. పొట్ట నిండుడు తెల్వనే తెల్వది. గుమ్మిల ఎంత పోసినా ఇంత ఎల్తే అనిపిస్తది.

ఎనకటికి దావతులు గానీ, ఇండ్లల్ల గానీ కింద సక్లం ముక్లం ఏసుకొని కూసోని, ముంగల ఇస్తరాకుల్నో, తల్లెల్నో పెట్టింది తింటే కడుపుల ఎంత పట్టాల్నో అంతే పట్టేటిది. మన నాయినలు తాతయ్యలు ఎట్ల కూసునేటోళ్ళు? ముద్దుగ కింద   కూసోని సక్లంముక్లం పెట్టుకోని, ఎడ్మ కాలు మడిశి నిలవెట్టి, ఎడ్మ చెయ్యి ఆ కాలుసుట్టు పెట్టుకొని ఒంగవడి తింటుంటే, కాలు కడుపులకు ఒత్తుకోని తక్వ పడుతుండే, జర్ర సేపట్ల కడుపు నిండినట్లయితుండే. కక్క తింటే గారెలు చేదన్నట్లు, ఏదైనా ఎక్వయితే అనర్తమే. ఇంటికి మంచిది కాదు, ఒంటికి మంచిది కాదు. పని తక్వయినప్పుడు తిండిని గూడ తక్వ జెయ్యాలే. బత్కనీకె తినాలె గని తిననీకె బతుకొద్దు.

ఇసోంటి నీతులు ఇంట్ల చెప్తనే ఇంటలేరు ఇంక బయట చెప్తే ఇంటరా నా చాదస్తం కాకపోతే.

అగో ఆడంగ బీకేగాడు ఒస్తున్నడు దొగ్గాడుకుంట దొగ్గాడుకుంట. టైం మీద సోయి లేనోనికి ఇంక దేని మీద గూడ సోయుండదని నాకు అర్తమయ్యింది. 

మల్లొకసారి  చాయి దాగి ఒచ్చిన పని చేస్కున్నంక అదీ గిదీ జరంత సేపు జోలి వెట్టుకోని ఇగ పోదామంటాని కదిలినము. పోతున్న బీకేగాన్ని ఎనకకు పిలిసి, ‘అరేయి, బూట్లు ఏసుకున్నవు బాగనే ఉన్నది గని, మల్ల ఎడ్మ కాలుకు తెల్ల సాక్సు, కుడి కాలుకు నల్ల సాక్సు ఎందుకేసుకున్నవు, ఇదేమన్న కొత్త ఫ్యాషనా?’ అంటాని అడిగితి. ఆనికి సూసుకోనీకె కడుపడ్డమున్నది. సప్పుడు జెయ్యక జల్ది జల్ది పొయ్యిండు బీకేగాడు.

ఆయల్ల పొద్దుమూకినంక ఫోన్‌ చేసిండు.

అరేయ్‌! సాక్సులు తెల్లదో కాలుకు, నల్లదో కాలుకు అని ఎందుకట్ల చెప్పినవురా, ఇప్పుడే ఇంటికొచ్చి సూస్కున్న కరెక్టే ఉన్నయి?’ అంటాని అడిగిండు బీకేగాడు.

నాకు నవ్వాల్నో, ఏడ్వాల్నో అర్తంకాలే.

జోలి

‘అరేయి, బూట్లు ఏసుకున్నవు బాగనే ఉన్నది గని, మల్ల ఎడ్మ కాలుకు తెల్ల సాక్సు, కుడి కాలుకు నల్ల సాక్సు ఎందుకేసుకున్నవు, ఇదేమన్న కొత్త ఫ్యాషనా?’ అంటాని అడిగితి. ఆనికి సూసుకోనీకె కడుపడ్డమున్నది. సప్పుడు జెయ్యక జల్ది జల్ది పొయ్యిండు బీకేగాడు.


logo