మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jul 04, 2020 , 22:36:25

కరకరలాడే కారబిళ్లలు!

కరకరలాడే కారబిళ్లలు!

తెలంగాణలో టిఫిన్లు చేయడం తక్కువ. కానీ, పొద్దున్నే పొలం పనులకు వెళ్లేప్పుడో.. సాయంత్రం చాయ్‌ తాగుతున్నప్పుడో.. పంటి కింద అప్పాలు ఉండాల్సిందే! కొన్ని ప్రాంతాల్లో అయితే, ఏ పండుగ వచ్చినా.. అప్పాల కరకరలు వినిపించాల్సిందే! అలాంటి ఓ ప్రత్యేకమైన పిండివంటకమే కారబిళ్లలు..

 • తెలంగాణ కారబిళ్లలను.. ఇతర ప్రాంతాల్లో.. చెక్కలు, పప్పు బిళ్లలు, కారం అప్పాలు, గారెలు అని పిలుస్తారు.
 • మన ప్రాంతంలో.. సంక్రాంతి, దసరాలకు సకినాలతో పాటు ఇవీ చేయాల్సిందే. మిగతా పండుగలకి కూడా అప్పాల మోత వినిపిస్తుంది. 
 • ...వీటి తయారీ ఓ కళ. శనగపప్పును అరగంట పాటు నానబెట్టాలి. పల్లీలను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. వీటిని బియ్యంపిండిలో వేయాలి. ఇందులో నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, నువ్వులు, కారం, కొన్ని నీళ్లు పోసి కొద్దికొద్ది పిండిని తడుపుకోవాలి. వీటిని ఉండలు చేసుకొని సన్నగా బిళ్లల్లా ఒత్తుకోవాలి. ఆతర్వాత, కాగిన నూనెలో రంగు మారే వరకు కాల్చుకోవాలి.
 • కర్ణాటకలో నిప్పట్టు అనే వంటకాన్ని ఇంచుమించు కారబిళ్లల మాదిరిగానే చేస్తారు.
 • శనగపప్పులోని ఆల్ఫా లినోలెనిక్‌ యాసిడ్‌, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. 
 • చాయ్‌తో పాటు రెండు అప్పాలు తింటే చాలు, కడుపు నిండుగా ఉంటుంది. అందుకే నిల్వ ఉండేలా ఒకేసారి కిలోలకొద్దీ చేసుకుంటారు.
 • అధిక రక్తపోటును నువ్వులు అదుపు చేస్తాయి. రక్తంలోని చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తాయి.
 • ఒకప్పుడు ఇన్ని రవాణా సౌకర్యాలు ఉండకపోయేవి. కాలినడకన సుదూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు, తినడానికి కచ్చితంగా కారబిళ్లలు తీసుకెళ్లేవారు. 
 • ఎవరైనా ఆత్మీయులు చనిపోయినప్పుడు, ఇంట్లో కొంత కాలం వంటలు చేసుకోవడం తక్కువే. అందుకే దగ్గరి చుట్టాలు కడుపు చల్ల చేయడం కోసం దినాల తర్వాత కారబిళ్లలను ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది.
 • కొందరు కారానికి బదులు పచ్చిమిర్చీ వేస్తారు. అయితే అవి తక్కువ కాలం నిల్వ ఉంటాయి. మరికొందరు లవంగాలు, దాల్చిన మసాలాలు కుమ్మరించి కూడా చేస్తుంటారు. 
 • అజీర్తిని  తొలగించే గుణం నువ్వులకు ఉంది. నువ్వుల్లోని జింక్‌ చర్మకాంతిని పెంచుతుంది. వీటిలోని మెగ్నీషియం, క్యాల్షియం మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తాయి. ప్రశాంత నిద్రకు దోహదం చేసే స్వభావం నువ్వులకు ఉంది.
 • జీర్ణశక్తిని పెంచడంలో కరివేపాకు బాగా సహాయపడుతుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మూత్ర సంబంధ సమస్యలను దూరం చేస్తాయి. కరివేపాకు రక్త నాళాల్లో గ్లూకోజ్‌ను కంట్రోల్‌ చేస్తుంది.logo