సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Jun 28, 2020 , 00:40:18

అతడే ఒక సైన్యం

అతడే ఒక సైన్యం

వినోదం దివ్యౌషధం. సర్వరోగనివారిణి. హృదయవీణను మీటి మోముపై నవ్వుల సరాగాల్ని పలికిస్తుంది. నిత్య వ్యవహారాలతో నిస్తేజితులైన మనుషుల్ని పునరుత్తేజితుల్ని చేస్తుంది. సమకాలీన తెలుగు సినీక్షేత్రంలో వినోదాల సేద్యంతో నవ్వుల పంటల్ని పండిస్తున్న దర్శకకర్షకుడు మారుతి. నాటి తరంలో జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ, యస్వీ కృష్ణారెడ్డి వంటి దిగ్దర్శకులు ఆరోగ్యకరమైన హాస్యానికి, అందమైన కుటుంబ అనుబంధాలకు చిరునామాగా నిలిచారు. నేడు అదే పంథాలో కొనసాగుతూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు మారుతి. ‘కొత్త జంట’ ‘భలే భలే మగాడివోయ్‌' ‘మహానుభావుడు’ ‘ప్రతిరోజు పండగే’ వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారాయన. లాక్‌డౌన్‌ అనంతరం చిత్రసీమలో నెలకొన్న పరిణామాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి మారుతి ‘బతుకమ్మ’తో పంచుకున్న మనోభావాలివి..

లాక్‌డౌన్‌ వల్ల నెలకొన్న పరిస్థితులు సినీరంగాన్ని గణనీయంగా ప్రభావితం చేయబోతున్నాయి.  నాలుగైదు నెలల పాటు ప్రజావ్యవస్థ మొత్తం స్తంభించిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఇలాంటి రోజుల కూడా ఉంటాయనే ఓ చేదు నిజాన్ని కరోనా మహమ్మారి మనందరికి తెలియజేసింది. ఇప్పుడున్న అనిశ్చితి దృష్ట్యా  ప్రజలు ఖర్చు పెట్టే విషయంలో ఆచితూచి ఆలోచిస్తున్నారు. సామాజిక అంతరాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పొదుపుపాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించడం అంత సులభం కాదు. అద్భుతమైన కంటెంట్‌ ఉండి..తప్పకుండా చూడాలి అనుకునే పెద్ద సినిమాల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. ఎలాగూ చిన్న చిత్రాలు ఓటీటీ వేదికల్ని ఎంచుకుంటున్నాయి కాబట్టి వాటి గురించి ఆలోచించరు. కరోనా నేపథ్యంలో ప్రజల ప్రయారిటీస్‌ మారిపోయాయి. తొలుత తమ ప్రాథమిక అవసరాలు తీరేదెలా అని ఆలోచిస్తున్నారు. సినిమా, వినోదరంగాన్ని చివరి ప్రాధాన్యతాంశంగా చూస్తున్నారు. ప్రస్తుతం చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌, టీవీలకు అలవాటు పడిపోయారు కాబట్టి ఎక్స్‌ట్రార్డినరీ కంటెంట్‌ ఉంటే తప్ప వాళ్లను థియేటర్లకు రప్పించలేం.  ఓటీటీ ద్వారా హోమ్‌థియేటర్‌లో కుటుంబంతో కలిసి చూస్తే కొంతవరకు థియేటర్‌ అనుభవాన్ని పొందగలం. ఒక్కరమే ఒంటరిగా సినిమా చూస్తే అంత ఎమోషనల్‌గా అనిపించదు. నా దృష్టిలో ఓటీటీ అన్నది కొందరికి మాత్రమే ఓ ఆప్షన్‌లా ఉపయోగపడుతుంది. అంతేకాని థియేటర్‌ను ఎప్పుడూ డామినేట్‌ చేయలేదని భావిస్తున్నా.

మల్టీటాస్కింగ్‌ ఇష్టం..

నేను దర్శకత్వం వహించే సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే, మాటల్ని నేనే రాసుకుంటా. ఇలా మల్టీటాస్కింగ్‌ ఎప్పుడూ కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే సినిమా తాలూకు ప్రతి క్రియేటివ్‌ వర్క్‌ను నేను ఇష్టపడతా. ప్రస్తుతం చాలా మంది దర్శకులు తమ సినిమాలకు సొంతంగా సంభాషణల్ని రాసుకుంటున్నారు. కొందరు బయటి రచయితల్ని ఎంచుకుంటున్నారు. దర్శకుడు, మాటల రచయిత సృజనాత్మకపరంగా ఒకే ప్లేన్‌లో ఆలోచించగలిగి..ఇద్దరి భావాల మధ్య సయోధ్య కుదిరితే చక్కటి సంభాషణలు పుడతాయి. అలా పరస్పరం అర్థం చేసుకునే దర్శకరచయితలు అరుదుగా ఉంటారు. దిగ్దర్శకుడు  ఇ.వి.వి.సత్యనారాయణ  వద్ద అనేక మంది రచయితలు పనిచేసేవారు. ఇ.వి.వి.గారు ఓ వెర్షన్‌ రాసుకొని..మిగతా రచయితల వెర్షన్స్‌ను కూడా తీసుకునేవారు. అన్నింటిని క్రోడీకరించడంతో మంచి అవుట్‌పుట్‌ వచ్చేది. దీంతో సమయం కూడా ఆదా అయ్యేది. ప్రస్తుతం అగ్ర దర్శకుడు సుకుమార్‌గారు రచయితల్ని బాగా ఎంకరేజ్‌ చేస్తున్నారు. ఆయన రైటింగ్‌ క్రెడిట్స్‌ను చాలా మందికి ఇస్తారు. కథ, పాత్ర చిత్రణ, డైలాగ్స్‌ రైటింగ్‌ విషయంలో ఎంతో మథనం జరిగిన తర్వాతే నేను సినిమా తీయడానికి సిద్ధమవుతాను. ఆ కారణంగానే  సొంతంగా సంభాషణల్ని రాసుకోవడానికి ఇష్టపడతాను.

మంచి కంటెంట్‌ కోసమే..

ప్రస్తుతం చాలా మంది దర్శకులు కథా రచన మొదలుకొని సినిమా పూర్తిచేయడానికి సంవత్సరానికిపైగా సమయం తీసుకుంటున్నారు. అందుక్కారణం కంటెంట్‌ క్వాలిటీ విషయంలో రాజీపడకపోవడమే. మణిరత్నం వంటి దర్శకులు ఓ సినిమా కోసం చాలా సమయం వెచ్చించేవారు. ముఖ్యంగా స్క్రిప్ట్‌రూపకల్పనకే ఎక్కువ టైమ్‌ పట్టేది. ఇప్పుడు సినిమాలకు బడ్జెట్‌ బాగా పెరిగిపోయింది. నటీనటులకు, సాంకేతిక నిపుణులకు బాధ్యతలు కూడా ఎక్కువయ్యాయి. అదీగాక ఓ సినిమా ఫలితం మీద దర్శకుడు, హీరో కెరీర్‌ కూడా ఆధారపడి ఉంటుంది. గతంలో దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ వంటి అగ్ర దర్శకులు వరుసగా సినిమాలు తీసేవారు. జయాపజయాలతో సంబంధం లేకుండా వారికి అవకాశాలు వస్తుండేవి. ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు. పేరున్న దర్శకులు కూడా వరుసగా రెండు ఫ్లాప్స్‌ ఇస్తే మరో సినిమా అవకాశం కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఔత్సాహిక దర్శకులు కొత్త ఆలోచనలతో ముందుకొస్తున్నారు. నిర్మాతలకు డైరెక్షన్‌ పరంగా ఆప్షన్స్‌ ఎక్కువయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రతి దర్శకుడు కంటెంట్‌ విషయంలో కాంప్రమైజ్‌ కావడం లేదు. 

వెబ్‌సిరీస్‌లో అడ్వాంటేజ్‌ అదే..

సినిమా కథను రెండున్నర గంటల నిడివిలో అర్థవంతంగా చెప్పగలగాలి. అదే వెబ్‌సిరీస్‌ అయితే నిడివి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. లాంగ్‌స్టోరీస్‌కు వెబ్‌సిరీస్‌ చక్కటి వేదికగా ఉపయోగపడుతుంది. అయితే సృజనాత్మకంగా రెండు మాధ్యమాల్లో పెద్దగా తేడాలు కనిపించవు. స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం వెబ్‌సిరీస్‌కు, ఫీచర్‌ఫిల్మ్‌కు కొన్ని భేదాలుంటాయి. వెబ్‌సిరీస్‌లో కథను ఎంత ఆసక్తికరంగా మొదలుపెట్టాం...ముగింపులో ఎలాంటి ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేయగలిగాం అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. అదే సినిమా అయితే.. కథా ఎత్తుగడ, సంఘర్షణ, ఎమోషన్స్‌ అన్నింటిని రెండున్నర గంటల నిడివిలో ప్రేక్షకుల దృష్టి మరలిపోకుండా ఆవిష్కరించగలగాలి.  అయితే ఏ వేదికైనా దర్శకుల అవగాహన, క్రియేటివ్‌ టాలెంట్‌ మీదనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి.

ఇతర క్రాఫ్ట్స్‌ మీద అవగాహన ఉండాలి

ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాని ఆప్షన్స్‌ గురించి అవగాహన ఉంటే ఆపరేటింగ్‌ ఈజీ అవుతుంది. అలాగే దర్శకులకు ఇతర విభాగాల మీద అవగాహన ఉంటే సినిమా మేకింగ్‌ సులభంగా అనిపిస్తుంది. ఇతర క్రాఫ్ట్స్‌ మీద పట్టు ఉంటే స్క్రిప్ట్‌రైటింగ్‌లోనే సినిమా ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు. మణిరత్నంగారి సినిమాలు చూస్తే కొన్ని సన్నివేశాల్లో కెమెరా సైతం భావాల్ని వ్యక్తం చేస్తుంటుంది. లైటింగ్‌, కెమెరా యాంగిల్స్‌తో సీన్‌ తాలూకు ఉద్వేగాల్ని ప్రజెంట్‌ చేస్తారాయన.  సినిమాటోగ్రఫీ మీద అవగాహన ఉంటే ఆ తరహా సీన్స్‌ను రాసుకోవచ్చు. 

స్పెషలైజేషన్‌ చాలా ముఖ్యం

దర్శకత్వాన్ని కెరీర్‌గా ఎంచుకునే ఔత్సాహికులకు తమకంటూ ఓ సొంత ప్రపంచం ఉండాలి. కామెడీ, లవ్‌, ఎమోషన్‌, యాక్షన్‌...ఇలా డిఫరెంట్‌ జోనర్స్‌లో ఏదో ఒక అంశంలో స్పెషలైజేషన్‌ సాధించాలి.  ఓ కథ చెప్పినప్పుడు దానికి మనం తప్ప మరొకరు ఏమాత్రం న్యాయం చేయలేరనే నమ్మకాన్ని కలిగించాలి. అంతటి పాషన్‌తో కథ చెప్పగలగాలి. మనకంటూ ఓ యూనిక్‌ ైస్టెల్‌ను క్రియేట్‌ చేసుకోవడం క్రియేటివ్‌ ఫీల్డ్‌లో చాలా ముఖ్యం. ఏదో ఒక సినిమాను చూసి స్ఫూర్తిపొంది కథలు రాసుకుంటే అందులో మన సృజనాత్మకత ఏమీ కనిపించదు. ఇండస్ట్రీలో రాణించాలంటే  కొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి. 

హీరో కోణంలోనే కథా రచన

ఒక సినిమా కోసం కథానాయకుల్ని ఒప్పించడానికి దర్శకులు భిన్న పంథాల్ని అనుసరిస్తారు.  నా మదిలో ఓ ఆలోచన తట్టగానే..ఆ కాన్సెప్ట్‌కు ఏ హీరో అయితే బాగుంటాడో అని ఆలోచిస్తా. అనుకున్న లైన్‌ను డెవలప్‌ చేసుకొని హీరోని కలుస్తాను. నేను చెప్పిన కథలో తాను ఇమిడిపోగలనని ఆ హీరో భావిస్తే మొత్తం స్క్రిప్ట్‌ సిద్ధం చేయమని కోరతాడు. అదీ నచ్చితే సినిమాకు రంగం సిద్ధమవుతుంది. ఒక్కోసారి కొన్ని కథలకు  ఇద్దరుముగ్గురు కథానాయకుల్ని అనుకుంటాం. అందుబాటును బట్టి వారిలో ఎవరినో ఒకరిని అప్రోచ్‌ అవుతాం. అయితే కొన్ని ప్రత్యేకమైన కథలుంటాయి. వాటికి మాత్రం ‘ఫలానా హీరో మాత్రమే న్యాయం చేయగలడు’ అని ఫిక్సైపోతాం. అలాంటి పరిస్థితుల్లో  ఆ హీరోని మెప్పించడం మినహా మరో మార్గం ఉండదు.logo