సోమవారం 06 జూలై 2020
Sunday - Jun 28, 2020 , 01:44:26

సామాజిక భక్తి ఉద్యమం వార్కరీ

సామాజిక భక్తి ఉద్యమం వార్కరీ

ఆషాఢం.. ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మాసం. అనేక ప్రాంతాల్లో సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకలుగా నిలిచే పండుగలకూ ఉత్సవాలకూ కీలకమైన నెల. తెలంగాణలో బోనాల పండుగ, ఒడిషాలో పూరీ జగన్నాథుని రథయాత్ర అలాంటివే!  ఆ కోవకు చెందిన వేడుకే .. ‘వార్కరీ’. మహారాష్ట్రలో కుల వివక్షకు వ్యతిరేకంగా మొదలైన భక్తి ఉద్యమం.. వార్కరీ యాత్రలతో విజయతీరాలకు చేరింది. వారీ అంటే యాత్ర. కారీ అంటే యాత్రికులు. కాలినడకన ప్రయాణిస్తూ భక్తి పరమార్థాన్ని పదిమందికీ పంచడమే ‘వార్కరీ’. 

విఠలుడి ఆవిర్భావం 

ప్రస్తుతం పండరీపురంలో కనిపించే విఠల రఖుమాయి దేవాలయ నిర్మాణానికి చారిత్రక పురుషుడైన పుండలీకుడే ఆద్యుడని ఆధారాలు చెబుతున్నాయి. మరాఠీ, కన్నడ సాహిత్యాలలోనూ పుండలీకుడి ప్రస్తావనలున్నాయి. పుండలీకుడు కృష్ణ భక్తుడు. వృద్ధులైన తల్లిదండ్రుల సేవలో తరించాడు. అతడి సేవకు మెచ్చిన కృష్ణుడు, పుండలీకుడి ఇంటికి వెళ్లి ‘ఏం వరం కావాలో కోరుకో’ అన్నాడు. పుండలీకుడు మాత్రం ‘నేను ఇప్పుడు తల్లిదండ్రుల సేవలో ఉన్నాను. పూర్తయ్యాకే బయటకు వస్తాను. అప్పటి దాకా ఈ ఇటుక మీద నిలబడి వేచి ఉండు’ అంటూ ఒక ఇటుకను బయటికి విసిరాడు. దీంతో, శ్రీకృష్ణుడు రెండు చేతులనూ నడుము మీద పెట్టుకొని, పుండలీకుడు వచ్చేవరకు ఇటుకపైనే నిలబడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వచ్చిన పుండలీకుడు.. అలా ఇటుక మీద నిలబడిన రూపంలోనే భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని కృష్ణుడిని కోరుకున్నాడు. దీంతో శ్రీకృష్ణుడే విఠలుడిగా, విఠోబాగా ఆ రూపంలోనే పండరిలో వెలిశాడు. అంతకు ముందు నుంచే అమ్మదేవతగా వెలసిల్లిన రఖుమాయి, సాంస్కృతిక సమ్మేళనం తర్వాత విఠోబా భార్యగా భక్తులతో పూజలందుకుంటున్నది. అందుకే పండరిలో విఠోబాకు, రఖుమాయికి వేర్వేరు ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ రెండు రకాల ఆరాధనా పద్ధతులు కనిపిస్తాయి. ఒకటి మందిరం లోపల నిర్వహించే బ్రాహ్మణీయ పూజలు, మరొకటి విస్తృత ప్రజానీకం భక్తి భావనతో చేసుకునే గ్రామీణ ఆరాధన. ఇందులో రెండోది.. శూద్ర కులాల నుంచి ఉద్భవించి, సంత్‌ల ద్వారా స్థిరపడ్డ వార్కరీ సంప్రదాయం. 

హారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో భీమానది ఒడ్డున వెలిసిన ప్రసిద్ధ యాత్రాస్థలం పండరీపురం. ఇది విఠలుడి కేంద్రస్థానం. విష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణుడి అంశగా విఠలుడిని కొలుస్తారు భక్తులు. మహారాష్ట్రతో పాటు.. కర్ణాటక, గోవా, తెలంగాణలకూ విఠలుడి ఆరాధన వ్యాప్తిచెందింది. అందుకే విఠల్‌, పండరిలాంటి పేర్లు తెలంగాణ సమాజంలో విస్తారంగా వినిపిస్తాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో విఠలుడి ఆరాధన ఎక్కువ. పాండురంగస్వామి ఆలయాలూ కనిపిస్తాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లోని విఠలేశ్వరాలయం సుప్రసిద్ధం.  

కుల వివక్షకు వ్యతిరేకంగా..

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో వెల్లివిరిసిన భక్తి ఉద్యమంతో విఠోభా సంప్రదాయం వ్యాప్తి చెందింది. పన్నెండు, పదమూడు శతాబ్దాల్లో దక్కన్‌ ప్రాంతంలో ఈ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. బ్రాహ్మణత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఎందరో సంత్‌లు గళమెత్తారు. ఉత్తర భారతంలో కబీర్‌, గురునానక్‌, తులసీదాస్‌, రవిదాస్‌; దక్షిణాన బసవుడు, వేమన, పోతులూరి వీరబ్రహ్మం అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. వీరంతా తమ సాహిత్యంతో సమాజాన్ని అపారంగా ప్రభావితం చేశారు. అయితే మహారాష్ట్రలో వెల్లువెత్తిన భక్తి ఉద్యమం పూర్తిగా భిన్నమైంది. ఇది విఠలుడి ఆరాధన చుట్టూ తిరుగుతూ, సమాజంలో అట్టడుగు వర్గాలను తట్టిలేపింది. అదే వార్కరీగా ప్రఖ్యాతిగాంచింది. వార్కరీలు అంటే పాదచారులైన భక్తులు. ఏటా ఆషాఢ మాసంలో కాలినడకన విఠోభా కీర్తనలు పాడుకుంటూ పండరీపురానికి చేరుకునే భక్త జనాన్నే వార్కరీలని పిలుస్తారు. పన్నెండు, పదమూడో శతాబ్దాల్లో ప్రారంభమైన ఈ వార్కరీ సంప్రదాయం, మహారాష్ట్రలో ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో సంత్‌ జ్ఞానేశ్వర్‌, సంత్‌ నామ్‌దేవ్‌, సంత్‌ ఏకనాథ్‌, సంత్‌ తుకారాం, సమర్థ రామదాస్‌ తదితరులు ముఖ్యులు. వీరిలో సంత్‌ జ్ఞానేశ్వర్‌ మినహా, తక్కిన వారంతా శూద్రులే. తదనంతరం కూడా అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన సంత్‌లు వార్కరీ ఉద్యమానికి నాయకత్వం వహించారు. 

ఆరాధన 

విఠలుడి ఆరాధన వేదకాలం నాటికే ఉన్నదని చరిత్రకారుడు ఆర్సీ దేరే నిర్ధారించారు. స్థిర వ్యావసాయిక గ్రామాలు ఏర్పడని గణ సమాజాల్లో మాతృస్వామ్యం అమలులో ఉండేది. అక్కడ స్థానిక అమ్మ దేవతలే పూజలు అందుకునేవారు. వింధ్యా పర్వతాలను దాటుకొని ఆర్యుల వ్యావసాయిక సమాజాలు దక్కన్‌ ప్రాంతాలకు వ్యాపించిన తర్వాత.. మాతృస్వామ్యం క్రమంగా పితృస్వామ్య వ్యవస్థగా మారింది. ఆహార సేకరణదశ నుంచి వ్యవసాయ సమాజాలుగా, ఆ సమూహాలు రూపాంతరం చెందాయి. ఈ క్రమంలోనే సాంస్కృతిక సమ్మేళనం జరిగినట్టు డీడీ కోశాంబి సహా అనేక మంది చరిత్రకారులు, పరిశోధకులు భావిస్తున్నారు. మహారాష్ట్రలో ఈ సాంస్కృతిక సమ్మేళనంపై కోశాంబి తన అధ్యయనంలో విస్తృతంగా ఉటంకించారు. ప్రాచీన గణ సమాజాలలో అమ్మ దేవతగా ఉన్న రఖుమాయి, అనంతర కాలంలో విఠలుడి భార్యగా మారి, పండరీపురంలో కొలువుదీరినట్టు ఆయన నిర్ధారించారు. పండరీపురం పూర్వనామం పండరగ కాబట్టి పండరిలో కొలువుదీరిన విఠలుడిని పాండురంగడు, పండరీనాథుడు (పండరీపురానికి యాజమాని) అని కూడా ప్రేమగా పిలుస్తారు. 

వార్కరీ ఉద్యమ సారథులు

పుండలీకుడు కన్నడిగుడు. 12వ శతాబ్దంలో హోయసాల రాజ్య పాలకుడైన విష్ణువర్ధనుడిని ఒప్పించి పండరీపురంలో విఠోబా దేవాలయాన్ని నిర్మించాడు. విజయనగర సామ్రాజ్య రాజధాని అయిన హంపిలోనూ విఠలేశ్వరాలయం ఉన్నది. అయితే, విఠోబా కేంద్రస్థానం మాత్రం పండరీపురమే. ఈ పుండలీకుడు వార్కరీ భక్తి ఉద్యమానికి మూలపురుషుడన్న అభిప్రాయం ఉన్నా, సంత్‌ జ్ఞానేశ్వరుడే ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోయాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఆయనే వార్కరీ సంప్రదాయానికి పునాది వేశాడని నమ్ముతారు. ఆ పరమభక్తుడు 22 ఏండ్ల చిన్న వయసులోనే తనువు చాలించాడు. తన సమకాలికుడైన సంత్‌ నాందేవ్‌తో కలిసి ఊరూరా తిరుగుతూ వార్కరీని విస్తరించాడు. సంత్‌ నాందేవ్‌ దర్జీల ఇంట పుట్టి సంత్‌గా మారాడు. విఠోబాను కీర్తిస్తూ, విఠోబాపట్ల ప్రేమను వ్యక్తీకరిస్తూ మరాఠీలో వేలాది కీర్తనలు (అభంగాలు) రాశాడు. వాటికి శాస్త్రీయ సంగీత బాణీలు కట్టి, ప్రజల్లోకి తీసుకెళ్లాడు. కులమతాలకు అతీతంగా విఠోభా సంప్రదాయంలో జన బాహుళ్యాన్ని భాగస్వాములను చేయడానికి నాందేవ్‌ కీర్తనలు దోహదం చేశాయి. ఎంతోమంది దళితులూ, మహిళలూ పెద్ద సంఖ్యలో వార్కరీ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత దక్కన్‌లోని అనేక ప్రాంతాలు ముస్లిం రాజుల ఏలుబడిలోకి వచ్చాయి. అయితే, తమ పాలనను సుస్థిరం చేసుకునేందుకు తురుష్క పాలకులు కూడా విస్తృత ప్రజాదరణ పొందిన వార్కరీని ప్రోత్సహించక తప్పలేదు. పదహారో శతాబ్దం నాటికి సంత్‌ ఏక్‌నాథ్‌ సారథ్యంలో వార్కరీ ఉద్యమం దక్కన్‌ ప్రాంతంలో తారస్థాయికి చేరింది. మహారాష్ట్రలో శివాజీ పరిపాలనలో సంత్‌ తుకారాం (పండ్లు సేకరించి అమ్ముకునే కులం) వార్కరీ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేశాడు. విఠోబా దృష్టిలో మనుషులందరూ ఒక్కటేనన్న సమానత్వ భావనను చాటుతూ సుమారు ఐదు వేల కీర్తనలు (అభంగాలు) రాశాడు. వీరితోపాటు సంత్‌ నాందేవ్‌ ఇంట్లో పనిమనిషిగా ఉన్న జానాబాయి, తుకారాం సమకాలినురాలైన బహిణాబాయి, సేనా మహారాజ్‌(మంగలి), నరహరి(అవుసలి), గోరాబా(కుమ్మరి), సవట(తంబలి), చోఖామేల(మహార్‌), భానూదాస్‌ మహారాజ్‌, షేఖ్‌ మహమ్మద్‌ (ముస్లిం) కూడా విఠోబా మీద కీర్తనలు రాసీ, పాడీ భక్తి ఉద్యమ వ్యాప్తికి దోహదం చేశారు. కర్ణాటకలోనూ హరిదాసులు విఠల తత్వాన్ని ప్రచారం చేశారు. పదిహేనో శతాబ్దంలో కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి వ్యాకరణం రాసిన పురందరదాసు హరిదాస పరంపరకు చెందినవారే. ఆయన ‘పురంధర విఠల’ మకుటంతో కన్నడ భాషలో వేలాది కీర్తనలు రాసి, కర్ణాటక సంగీత శైలిలో బాణీలు కట్టారు.  

పాండురంగ విఠలా..

శ్రీకృష్ణుడే విఠలుడిగా వెలిశాడని భక్తుల విశ్వాసం. వార్కరీ సంప్రదాయం ప్రకారం విఠల అనే పదం విఠ్‌ (ఇటుక), ఠల (నిలిచి ఉన్న) అనే రెండు పదాల కలయిక. విఠలుడు అంటే ఇటుకపైన నిల్చున్నవాడని అర్థం. విఠలుడి రూపం  కృష్ణుడికి భిన్నంగా ఉంటుంది. నెత్తిన నెమలి పింఛం, చేతిలో వేణువు ఇక్కడ కనిపించవు. నడుముపై చేతులు పెట్టుకొని నిల్చున్న బాలుడిగా స్వామి దర్శనమిస్తాడు. 

కదిలింది పండరికి పల్లకీ..

ఏటా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పండరీపుర క్షేత్రంలో వార్కరీ వేడుకను కన్నుల పండువగా నిర్వహిస్తారు. అటు జ్ఞానేశ్వర్‌ మహారాజ్‌ సమాధి క్షేత్రమైన అళంది నుంచి.. ఇటు భక్త తుకారాం సమాధి ఉన్న దేహునుంచి భక్తుల పాదయాత్రలు ప్రారంభమవుతాయి. ఈ రెండు క్షేత్రాలనుంచి పండరీపురం దాకా.. దాదాపు 250 కిలోమీటర్ల మేర నిర్వహించే పాదయాత్రే ‘వార్కరీ యాత్ర’గా సుప్రసిద్ధమైంది. యాత్ర సందర్భంగా అళంది నుంచి జ్ఞానేశ్వర్‌ పాదుకలను, దేహు నుంచి తుకారాం పాదుకలను పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళ్తారు. 21 రోజులపాటు నిర్వహించే ఈ యాత్రలు, తొలి ఏకాదశి ముందు రోజున పండరీపురం చేరుకుంటాయి. ఈ యాత్రలో పాల్గొనే భక్తులు కఠోర నియమాలను పాటిస్తారు. మద్య మాంసాలకు దూరంగా ఉంటారు. మెడలో తులసీమాలను ధరిస్తారు. బ్రహ్మచర్యం పాటిస్తారు. పాదరక్షలు లేకుండా యాత్ర సాగిస్తారు. ప్రతి భక్తుడినీ పాండురంగడిగా భావిస్తారు. కులంతో, ప్రాంతంతో సంబంధం లేకుండా కలిసిమెలిసి యాత్ర సాగిస్తారు. సంత్‌ మహరాజ్‌లు రాసిన భజనలు, పాటలు పాడుకుంటూ ముందుకు సాగుతారు. 

విశ్వవ్యాప్తమైన కీర్తి

సంత్‌ల అభంగాలన్నీ శాస్త్రీయ సంగీత స్వరాలను ఆధారం చేసుకున్నవే కాబట్టి, ఇప్పటికీ మరాఠా సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. హిందుస్తానీ సంగీత పరంపర మహారాష్ట్రలో అవిచ్ఛిన్నంగా కొనసాగడానికి వార్కరీ భక్తి సంప్రదాయమే దోహదం చేసిందని సామల సదాశివ మాస్టారు ‘స్వరలయలు’ పుస్తకంలో రాశారు. మరాఠీ భక్త కవుల కీర్తనలు, భజనలను లతామంగేష్కర్‌, ఆశా భోంస్లే, సుమన్‌ కళ్యాణ్‌ పురిలాంటి ప్రముఖ గాయకులు ఆలపించారు. భారతరత్న పండిత్‌ భీంసేన్‌ జోషి తన సుమధుర గంభీరగాత్రంతో సంత్‌ కవుల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. మహారాష్ట్రలో జ్యోతిరావ్‌ ఫూలే, అంబేడ్కర్‌ నడిపించిన కుల నిర్మూలనా ఉద్యమాలకు సంత్‌ కవుల వార్కరీ భక్తి సంప్రదాయమే బీజాలు వేసిందని సామాజిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆషాఢమాసం సందర్భంగా ప్రజల మధ్య సమానత్వాన్ని కోరుతూ, కులవివక్షను, అంటరానితనాన్ని నిరసిస్తూ భక్తి ఉద్యమాన్ని నడిపించిన సంత్‌ కవులను మనసారా స్మరించుకుందాం. 

సంత్‌ ఏక్‌నాథ్‌ 

ఇతనూ అట్టడుగు మూలాల నుంచి వచ్చినవాడే. సంత్‌ ఏక్‌నాథ్‌ (క్రీ.శ 1533-1599) మరాఠీ సాహిత్యానికి గొప్ప కానుకలు అందించాడు. అగ్రకుల పండితుల వ్యతిరేకతనూ, వివక్షనూ తట్టుకుని, వార్కరీ ఉద్యమాన్ని ముందుకు నడిపించాడు. భాగవతంలోని పదకొండో స్కందానికి రాసిన వ్యాఖ్యానం సుప్రసిద్ధం. రుక్మిణీ స్వయంవరం, భావార్థ రామాయణం తదితర గ్రంథాలను మరాఠీలోకి అనువదించాడు. వందలాది విఠోబా అభంగాలను రచించాడు. ‘మాజ్హే మాహిరే పండరీ’ అనే అభంగ్‌ ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. ఈయన రాసిన అభంగాలను పండిత్‌ భీంసేన్‌ జోషీ, సుధీర్‌ ఫడ్కే, కిశోరి ఆమోన్‌ కర్‌, వసంతరావు దేశ్‌పాండే లాంటి హిందుస్తానీ గాయకులు పాడారు. అలా, సంత్‌ ఏక్‌నాథ్‌ను నేటి తరానికీ పరిచయం చేశారు. 

సంత్‌ నాందేవ్‌  

శూద్ర కులంలో పుట్టిన సంత్‌ నాందేవ్‌, వార్కరీ భక్తి ఉద్యమానికి ఆద్యుడైన సంత్‌ జ్ఞానేశ్వర్‌ సమకాలికుడు. సంత్‌ జ్ఞానేశ్వర్‌ సమాధి పొందిన తర్వాత, ఆయన వారసత్వాన్ని సమున్నతంగా కొనసాగించాడు. వేలాది అభంగాలను ఆశువుగా పాడుతూ కులమతాలకు అతీతంగా ప్రజలను వార్కరీ ఉద్యమంవైపు ఆకర్షించాడు. ఆయన రచనల్లో భక్తి, ప్రేమ, కరుణ రసాలు పెల్లుబుకుతాయని మరాఠీ సాహిత్య విమర్శకులు విశ్లేషించారు.

సంత్‌ తుకారాం   

శూద్ర కులంలో పుట్టి సంత్‌గా మారాడు.. తుకారాం (క్రీ.శ 1577-1650). శివాజీ సమకాలికుడైన తుకారాం, ఆయన పాలనలో విఠోబా భక్తి సంప్రదాయాన్ని మహారాష్ట్రలో విస్తృతంగా వ్యాప్తి చేశాడు. విఠల భక్తితత్వాన్ని, సమానత్వ భావాన్ని, తాత్విక చింతననూ చాటుతూ ఐదువేల అభంగాలు రాశాడు. వాటికి బాణీలు కట్టి పాడాడు. శివాజీ మహారాజు పంపిన ధనాన్ని స్వీకరించకుండా, తిప్పి పంపిన మహనీయుడు. తన రెక్కల కష్టం మీదే జీవనాన్ని సాగించి ఆదర్శప్రాయుడిగా నిలిచాడు. వార్కరీ ఉద్యమంలో మణిపూస. 

సంత్‌ జ్ఞానేశ్వర్‌  

సంత్‌ జ్ఞానేశ్వర్‌ (కీ.శ 1275-96) తండ్రి విఠలపంత్‌. భార్యాబిడ్డలను వదలి సన్యాసం స్వీకరించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు తిరిగి వచ్చినా బ్రాహ్మణ సమాజం అతడిని కలుపుకోలేదు. దీంతో జ్ఞానేశ్వర్‌ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయానికి జ్ఞానేశ్వర్‌ ఎనిమిదేండ్ల బాలుడు. అగ్రవర్ణ సమాజం బహిష్కరించినా నిమ్నజాతివాడైన సంత్‌ నాందేవ్‌తో కలిసి వార్కరీ భక్తి ఉద్యమాన్ని నడిపించాడు. మరాఠీలో అనేక గ్రంథాలు రాశాడు. భగవద్గీతపై ఆయన వ్యాఖ్యానం ‘జ్ఞానేశ్వరి’గా పేరుగాంచింది. వారణాసిలో నిర్వహించిన పండితుల సభ, సంత్‌ జ్ఞానేశ్వర్‌ను సభాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకొని గౌరవించింది. కానీ, 22 ఏండ్ల చిన్న వయసులోనే సంత్‌ జ్ఞానేశ్వర్‌ తనువు చాలించారు. 

అహో.. వార్కరీ యాత్ర

వార్కరీలు ఏడాదికి రెండుసార్లు భక్తి యాత్ర చేపడుతారు. ఆషాఢమాసంలో శయన ఏకాదశికి, ఆ తర్వాత కార్తీక మాసంలో ప్రభోదిని ఏకాదశికి విఠోబా దర్శనం కోసం కాలినడకన.. సంత్‌లు రాసిన కీర్తనలు (మరాఠీలో వీటిని అభంగ్‌ వాణి, సంత్‌వాణీ అంటారు) పాడుకుంటూ, నాట్యం చేసుకుంటూ పండరికి చేరుకుంటారు. ఎంతో దీక్షగా క్రమశిక్షణతో భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. ఆషాఢమాసంలో జరిగే ఈ వేడుకలను మహారాష్ట్ర సర్కారు రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. తెలంగాణ ప్రాంతం నుంచి కూడా వేలాదిమంది  పాల్గొంటారు. ఎటుచూసినా విఠల నామం మారుమోగుతుంది. logo