మంగళవారం 14 జూలై 2020
Sunday - Jun 28, 2020 , 01:32:40

చిన్న తెర

చిన్న తెర

తప్పదు మరి!

కరోనా విజృంభిస్తున్న తరుణంలో షూటింగ్స్‌ నిర్వహించడం ఇబ్బందే అయినా, తప్పని పరిస్థితి నెలకొన్నదని చెబుతున్నారు టీవీ యాంకర్లు ప్రదీప్‌ మాచిరాజు, రష్మీ గౌతమ్‌. ‘టీవీ చానళ్లు తీసే ప్రోగ్రామ్స్‌, సీరియల్స్‌పై ఎంతోమంది సిబ్బంది, కార్మికులు ఆధారపడి ఉన్నారు. వారందరి కోసం, ఇబ్బంది అయినా సరే షూటింగ్స్‌లో పాల్గొంటున్నాం. సెట్స్‌లో ఎవరికీ కొవిడ్‌-19 రాకుండా ఉండాలని, షూటింగ్‌ నిత్యం కొనసాగాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు. ప్రస్తుతానికి ప్రదీప్‌ ‘ఢీ’ అల్టీమేట్‌ డ్యాన్స్‌ షోలో, రష్మీ గౌతమ్‌ ‘జబర్దస్త్‌' సెట్స్‌లో బిజీగా ఉన్నారు. 

అర్థంచేసుకోరూ..

కరోనా కారణంగా టీవీ సీరియళ్ల నిర్మాతలకు షూటింగ్‌ ఖర్చులు పెరిగాయి. శానిటైజర్లు, మాస్కులు, గ్లౌజులు, పీపీఈ కిట్లు, క్యాటరింగ్‌ తదితర వ్యయాలతో రోజుకు కనీసంగా రూ.20వేల అదనపు భారం పడుతున్నది. ఈ బరువు తగ్గించుకునేందుకు టీవీ చానళ్లు సహకరించాలని నిర్మాతలు అభ్యర్థిస్తున్నారు. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో ఇతర రాష్ర్టాలనుంచి వచ్చే నటీనటులు మరో ఐదు నెలలపాటు హైదరాబాద్‌లోనే నివాసం ఉండాలని కోరుతున్నారు. కుదరకపోతే, ఆయా పాత్రలకు స్థానికులనే తీసుకునే ఆలోచనలో ఉన్నారు కొందరు నిర్మాతలు. 

అనుకోకుండా యాక్టర్‌నయ్యా

‘అనుకోకుండానే యాక్టర్‌నయ్యా.. మూడేండ్ల లోనే ఈ కెరీర్‌ను ముగించేద్దామనుకున్నా.. ఏడేండ్లుగా నటిస్తూనే ఉన్నా..’ అంటున్నది బుల్లితెర నటి అన్షురెడ్డి అలియాస్‌ అనూషరెడ్డి. అన్షురెడ్డి అంటే ఎక్కువగా తెలియకపోవచ్చు.. కానీ, ఇద్దరమ్మాయిలు సీరియల్‌లో స్నేహ, కథలో రాజకుమారి సీరియల్‌లో పావని ..అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. అన్షురెడ్డిది  సిద్దిపేట జిల్లా. తను ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషలలో 10 సీరియళ్లలో నటించింది. 

డిప్లొమా చేస్తున్న సమయంలోనే తను, తన సోదరి అమూల్య కలిసి ఓ టీవీ షోలో ఆడిషన్స్‌కు వెళ్లారు. ఇద్దరూ సెలెక్ట్‌ అయ్యారు. 2013 నుంచి నటించడం మొదలు పెట్టిన వీరిద్దరూ, మూడేండ్లలో నటనకు పుల్‌స్టాప్‌ పెడదామనుకున్నారట. కానీ, ప్రేక్షకుల ఆదరణతో ఏడేండ్లుగా ఇక్కడే పాతుకుపోయామని అంటున్నది అన్షు. భార్యామణి అనే సీరియల్‌లో అవకాశం వచ్చినప్పుడు వాళ్ల అన్నయ్య వద్దని వారించాడట. వాళ్ల అమ్మ సర్దిచెప్పడంతో ఓకే అన్నాడట. అందుకే ‘అమ్మే మా మెయిన్‌ పిల్లర్‌, తనే మా ధైర్యం’ అని అంటున్నది. బ్లైండ్‌ క్యారెక్టర్‌ చేయడం ఎంతో ఇష్టం, దాని కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెబుతున్నది. తన నటనను అభినందిస్తూ అభిమానులు సోషల్‌ మీడియా ద్వారా మెసేజ్‌లు చేస్తుంటారనీ; వారి ఆదరణ, అభినందనలు తనలో కొత్త ఊపును తెస్తాయని సంతోషంగా చెబుతున్నది. ఇండస్ట్రీలోకి రావాలంటే ప్రతిభతోపాటు కొంత అదృష్టం కూడా ఉండాలని, తనకు రెండూ కలిసి రావడంతోనే బ్యాక్‌ టు బ్యాక్‌ సీరియల్స్‌లో నటించే అవకాశం వస్తున్నదని సంబురపడుతున్నది. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. చాలా మంది ప్రతిభగల నటులు తెలుగు రాష్ర్టాల్లోనే దొరుకుతారన్నది అన్షు నిశ్చితాభిప్రాయం. నిజమే కదా! 

విచిత్రంగా ఉంది

పీపీఈ కిట్లలో ఆర్టిస్టులను, సిబ్బందిని చూడటం విచిత్రంగా ఉందంటున్నారు నటి రేణూ దేశాయి. లాక్‌డౌన్‌ అనంతరం సినిమా, టీవీ షూటింగ్‌లు మొదలవడంతో ప్రమోషనల్‌ వీడియోలలో ఆమె పాల్గొంటున్నారు. “కొవిడ్‌-19 కారణంగా సెట్‌లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. 20 మందితో మాత్రమే షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఆ కొద్దిమంది కూడా మొత్తం పీపీఈ కిట్లు వేసుకొని ఉంటున్నారు. ఒక డాక్టర్‌, ఇద్దరు నర్సులతో కూడిన వైద్యబృందం మూడు గంటలకు ఒకసారి ప్రతి ఒక్కరి టెంపరేచర్‌ చెక్‌ చేస్తున్నారు. ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేస్తున్నారు. కేవలం ఆరు గంటల్లోనే షూటింగ్‌ ముగించుకొని కర్ఫ్యూ సమయానికల్లా ఇంటికి చేరుకుంటున్నాం” అంటున్నారు ఆమె.


logo