మంగళవారం 14 జూలై 2020
Sunday - Jun 28, 2020 , 01:26:42

అనంతశక్తి.. ప్లాసిబో!

అనంతశక్తి.. ప్లాసిబో!

ప్లాసిబో అంటే... లాటిన్‌ భాషలో ‘నీ బాధల్ని మరిపిస్తాను’ అని అర్థం. ‘ప్లాసిబో ఎఫెక్ట్‌' అన్న మాటకూ కొంత చరిత్ర ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓ సైనికుడు తీవ్రంగా గాయపడ్డాడు. డాక్టర్లు తక్షణం శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. తీరా చూస్తే, మత్తుమందు అందుబాటులో లేదు.  మత్తు ఇవ్వకపోతే రోగి నొప్పిని తట్టుకోలేడు. అలా అని ఆపరేషన్‌ వాయిదా వేస్తే ఇంకా ప్రమాదం. మరెలా? ప్రధాన వైద్యుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ‘సిస్టర్‌, మత్తుమందు సిద్ధం చేయండి. డోసేజీ కొంచెం పెంచండి. రోగికి నొప్పి అనేదే తెలియకూడదు’ అని కొంచెం గట్టిగానే  చెప్పాడు, పక్కనే ఉన్న క్షతగాత్రుడికి కూడా వినిపించేలా! వెంటనే నర్సు ఇంజక్షన్‌ ఇచ్చింది. ఆపరేషన్‌ మొదలైంది. రెండు గంటల్లో విజయవంతంగా పూర్తయింది. రోగికి నొప్పి తెలియనే లేదు. కానీ, అతనికి ఇచ్చింది.. ఉప్పునీళ్లు! ఇదే ప్లాసిబో ఎఫెక్ట్‌ అంటే. దీన్ని జీవితానికీ అన్వయించింది జోయ్‌ డిస్పెంజా రచన.. ‘యు ఆర్‌ ఎ ప్లాసిబో’.

నమ్మకమే ఆయుధం

ఆలోచనలు శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. చీకట్లో తాడును చూసి, పాముగా పొరబడినా సరే. పామును చూసినప్పుడు శరీరంలో ఎలాంటి రసాయన క్రియలు జరుగుతాయో అవన్నీ తాడును చూసినప్పుడూ జరుగుతాయి. ఇదంతా విజువలైజేషన్‌ ప్రభావం. మెదడుకు ఏది నిజమో, ఏది భ్రమో తెలియదు. మన విజువలైజేషన్‌ మీదే ఆధారపడుతుంది.  తాడును చూసి పాము అనుకోవడం నెగెటివ్‌ విజువలైజేషన్‌. అక్కడ నిజంగానే పాము ఉన్నా సరే, దాన్నో తాడుగా భావించి, ధైర్యంగా ముందుకు వెళ్లగలిగితే అది పాజిటివ్‌ విజువలైజేషన్‌! ఇక్కడ పాము అవరోధాలకు ప్రతీక. ప్లాసిబో ఎఫెక్ట్‌ను విజయానికి సోపానంగా మలుచుకోవాలంటే, మన మీద మనకు నమ్మకం ఉండాలి. అనంతమైన ఆశావాదం అవసరం.  తాయెత్తు మహిమలూ ఓ మెస్తరు ప్లాసిబోలే! 

హార్వర్డ్‌ సైకాలజిస్టులు ఓ వందమంది వయోధికులను ఓ చోటికి తీసుకొచ్చి.. ఇంకో వారం రోజులు మీరు ఇక్కడే ఉంటారు. మళ్లీ ఇంటికి వెళ్లే వరకూ మీ వయసు డబ్భు కాదు, ముప్ఫై! అలానే ఆలోచించండి. అలానే ప్రవర్తించండి - అని చెప్పారు. ఏడు రోజుల తర్వాత వైద్య పరీక్షలు చేస్తే.. ఆ వయోధికుల శరీర వ్యవస్థలో గణనీయమైన మార్పు కనిపించింది. మునుపటితో పోలిస్తే ఆరోగ్యంగా ఉన్నారు. ఇది కూడా ప్లాసిబో ఎఫెక్ట్‌ కిందికే వస్తుంది.    

ఫేక్‌న్యూస్‌ కావచ్చు, మీడియాలో వచ్చే నెగెటివ్‌ కథనాలు కావచ్చు, స్నేహితులో బంధువులో చేసే నిరాశాపూరిత వ్యాఖ్యానాలు కావచ్చు - అవన్నీ మన మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఆ మధ్య ‘నగర ప్రాంతాల్లోని విద్యార్థులతో పోలిస్తే, గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబడి ఉంటారు’ అంటూ ఓ సర్వే నివేదిక పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. ఓ వందమంది గ్రామీణ విద్యార్థులకు ఆ కథనాన్ని వినిపించి, ఆ తర్వాత, ఇంగ్లిష్‌ గ్రామర్‌లో ఓ పరీక్ష పెట్టారు. అందరికీ అత్తెసరు మార్కులే వచ్చాయి. నిజానికి ఆ బాలలు చాలా తెలివైనవాళ్లు. ఇక్కడ అక్షరాలు నెగెటివ్‌ ప్లాసిబో శక్తిలా పనిచేశాయి. 

గురువులు బోధించవచ్చు. వ్యక్తిత్వ వికాస నిపుణులు స్ఫూర్తిని నింపవచ్చు. ఆత్మీయులు భరోసా ఇవ్వవచ్చు. అంతిమంగా,  మనసు చెప్పిన మాటనే మనం వింటాం. మన జీవితానికి సంబంధించినంత వరకూ మనల్ని మించిన వికాస గురువు మరొకరు లేరు. భగవద్గీత కూడా ఇదే మాట చెబుతుంది..‘ఆత్మైవ హి ఆత్మనో బంధుః’! ఆ మనసు మరింత బలపడటానికి మనం పుచ్చుకునే ఊహాజనిత  టానిక్‌ .. ప్లాసిబో ఎఫెక్ట్‌.    

తాజావార్తలు


logo