మంగళవారం 14 జూలై 2020
Sunday - Jun 28, 2020 , 01:22:26

ఆనాటి సంఘటన

ఆనాటి సంఘటన

నల్లటి చిన్న ఎయిర్‌బ్యాగ్‌తో వున్న ఆ పొట్టి వ్యక్తి ‘ది బ్రిక్‌ లేయర్స్‌' వీధిలో కుడివైపు తిరిగి, ముందుకి నడిచి సెయింట్‌ జార్జెస్‌ చర్చ్‌ దగ్గర మళ్ళీ కుడివైపు తిరిగాడు. అటు, ఇటు చూసి తను తప్పిపోయాడని గ్రహించాడు. ఎవరో కాని అతను తనకి దారి సరిగ్గా చెప్పలేదు. లేదా, తను తప్పుగా అర్థం చేసుకుని ఉండాలి.

అతను మలుపు తిరిగిన ఆ వీధిలో నిలబడి అటు, ఇటు ఉన్న చవక ఇళ్ళని సందేహంగా చూసాడు. ఎటు వెళ్ళాలి? వెనక్కి తిరగాలా? రోడ్‌మీద మంచు, బురద అలుముకుని ఉంది. ప్రతీ వీధిస్తంభం కింద దీపం కాంతి పడుతున్నది. నల్లటి చిన్న ఎయిర్‌ బ్యాగ్‌ని ధరించిన ఆ పొట్టి వ్యక్తి కొంత ఇబ్బందికి గురవుతూ నిలబడిపోయాడు. అతనికి ఓ నిమిషం తర్వాత తన వైపు వచ్చే మనిషి కనపడ్డాడు. అతను పోలీస్‌ యూనిఫాంలో ఉన్నాడు. అతని నెత్తిమీద టోపీ భూమికి ఆరడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తున్న వీధిస్తంభం లైటుకాంతిలో మెరుస్తున్నది. ఓవర్‌ కోట్‌లోని అతను చాలా పెద్దగా కనిపిస్తున్నాడు.

ఆ చిన్న సంచీగల పొట్టి మనిషి తన దగ్గరకి వచ్చిన బీట్‌ కానిస్ట్టెబుల్‌ని కొద్దిగా సందేహిస్తూ అడిగాడు.

“ఐ బెగ్‌ పార్డన్‌ సర్‌. నేను దారి తప్పినట్లున్నాను. మహాగని రోడ్డులోకి ఎలా వెళ్ళాలో దయచేసి చెప్తారా?”

“మహాగని రోడ్‌ అన్నారా? ఇది టులిప్‌ క్రిసెంట్‌. క్రిసెంట్‌లో ఎడమవైపు ముందుకి వెళ్ళాక జేడ్‌ వీధిలోకి కుడివైపు తిరగండి. ది జాలీ ఫార్మర్స్‌ అనే పబ్‌ కనిపించగానే కుడివైపు తిరగండి. మీరు మీ గమ్యంలో ఉంటారు.” 

“మీరు టులిప్‌ క్రిసెంట్‌ అన్నారా? దీన్ని నేను గతంలో ఎక్కడో విన్నట్లున్నాను” ఆ పొట్టి మనిషి ఆలోచనగా చెప్పాడు.

“జాయెస్‌ల హత్య సందర్భంలో దీని గురించి మీరు వినుంటారు” బీట్‌ కానిస్టెబుల్‌ జవాబు చెప్పాడు.

“అవునవును. జాయెస్‌ల హత్య టులిప్‌ క్రిసెంట్లో జరిగింది. అది నా చిన్నప్పుడు అనుకుంటాను” అతను కొద్దిగా ఇబ్బందిగా చెప్పాడు.

“అవును. కానీ, అది నాకు గుర్తుంది” బీట్‌ కానిస్టెబుల్‌ చెప్పాడు.

“అది నంబర్‌ ఫోర్టీన్‌ ఇంట్లో జరిగిందని అనుకుంటాను?”

“అవును సర్‌. నంబర్‌ ఫోర్టీన్‌లో. కానీ, ఆ తర్వాత ఆ ఇంటి నంబర్‌ను థర్టీన్‌ బిగా మార్చారు. మీరు మహాగని రోడ్‌కి వెళ్ళాలంటే క్రిసెంట్‌కి ఎడమవైపు ముందుకి వెళ్ళి కుడివైపు జేడ్‌ స్ట్రీట్‌లోకి తిరగండి. ది జాలీ ఫార్మర్స్‌ బోర్డ్‌ కనపడగానే కుడివైపు తిరగండి. మీరు అక్కడ ఉంటారు.” 

ఆ పొట్టి వ్యక్తి అటువైపు నడిచాడు. అతన్ని బీట్‌ కానిస్టెబుల్‌ అనుసరించాడు.

అప్పుడప్పుడు ఆ కానిస్టెబుల్‌ తన చేతిలోని టార్చ్‌ లైట్‌ని తలుపుల మీదకి ప్రసరించసాగాడు. ఓచోట ఓ తలుపుకున్న తాళాన్ని లాగి చూసాడు.

“మీరు ఈ చుట్టుపక్కలే ఉంటారా?” బీట్‌ కానిస్టెబుల్‌ అడిగాడు.

“లేదు. నేను ఆస్ట్రేలియాలో ఉంటాను. సిడ్నీకి సమీప గ్రామంలో. మహాగని రోడ్‌కి వెళ్ళి నేను ఇంతకు మునుపు ఎన్నడూ చూడని ఓ దూరపు బంధువుని కలవాలి.”

వాళ్ళ బూటుముద్రలు మంచుబురదలో పడుతున్నాయి. ఇద్దరూ కొద్ది దూరం మౌనంగా నడిచాక ఆ  కానిస్టెబుల్‌ ఓ తలుపు మీదకి టార్చ్‌లైట్‌ని ప్రసరిస్తూ ఆగిపోయాడు. ఆ పొట్టి వ్యక్తి ఆ తలుపుమీద థర్టీన్‌ బి అనే ఇత్తడి అంకె అతికించి ఉండటం చూసాడు. గ్లవ్స్‌ తొడుక్కున్న చేతిని ఆ తలుపువైపు చూపిస్తూ బీట్‌ కానిస్టెబుల్‌ చెప్పాడు.

“ఇదే ఆ ఇల్లు. మీకు గుర్తుంటే అది భలే కేస్‌ సర్‌.”

“ఓ ముసలావిడని, ముసలాయన్ని ఈ ఇంట్లో హత్య చేసారని చదివిన గుర్తు. ఎవరు చంపారో కనుక్కోలేక పోయారనుకుంటాను?”

“అవును.”

“అంటే, ఆ హంతకుడు ఇంకా బయటే తిరుగుతున్నాడన్న మాట” పొట్టి వ్యక్తి అడిగాడు.

బీట్‌ కానిస్టెబుల్‌ గొంతు సర్దుకుని చెప్పాడు.

“అవును. పోలీసులు అతన్ని పట్టుకుని కోర్ట్‌లో హాజరు పరచలేదు. ఇది నా బీట్‌ కాబట్టి ఆ కేస్‌ గురించి నాకు బాగా తెలుసు. నా బీట్‌లోని ఇళ్ళల్లో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడం నా బాధ్యత కదా సర్‌?” 

“కానీ, అది ఇరవై ఏండ్ల క్రితం మాట కదా?”

“అవును. ఇరవై ఒక్కేండ్ల క్రితం అది జరిగింది. కానీ, వృత్తిపరమైన ఆసక్తితో దాన్ని గుర్తుంచుకున్నాను. నేను సాధారణ పోలీస్‌ కానిస్టెబుల్‌ని. నంబర్‌ ఫోర్టీన్‌ అదే థర్టీన్‌ బి తలుపు బయట అప్పుడది ఫోర్టీన్‌ దాని ముందు నించి అనేక రాత్రులు నడిచి వెళ్ళాను. మీకా కేసు వివరాలు తెలుసా?”

ఆ పొట్టి మనిషి కొద్దిగా భీతిగా నిర్మానుష్యంగా ఉన్న క్రిసెంట్‌ని ఓసారి చూసి ఓ కాలుమీది బరువుని ఇంకో కాలు మీదకి మార్చి చెప్పాడు.

“ఓ ముసలావిడని, ఆవిడ అన్నని డబ్బుకోసం చంపారని చదివాను. హంతకుడి ఆచూకీ తెలుసుకోలేక పోయారు. నాకు అంతవరకే తెలుసు. మనం కదులుదామా?”

ఆ బీట్‌ కానిస్టెబుల్‌ ఆ ఇంటి తలుపు వంక చూసి, చిన్నగా నిట్టూర్చి కొనసాగించాడు.

“ఇటీవల మిస్టర్‌ స్పూన్‌ సండే స్పెషల్‌లో ‘పరిష్కరించబడని హత్యా రహస్యాలు’ అనే వ్యాసంలో దీని గురించి చక్కగా రాసాడు. మిస్‌ జాయెస్‌, ఆవిడ అన్న మిస్టర్‌ జాయెస్‌ నంబర్‌ ఫోర్టీన్‌లో ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరికీ మంచి ఆదాయం ఉండేది. మీరా వ్యాసం చదివారా?”

“లేదు.”

“వారి తండ్రి ఇన్సూరెన్స్‌ ఆఫీస్‌లో పని చేసేవాడు. ఆయన వాళ్ళకి చాలా డబ్బు వదిలి వెళ్ళాడు. ఆవిడ అన్న మిస్టర్‌ జాయెస్‌ పేరుకి లాయరైనా కేసులు వచ్చేవి కావు. అతను సీసాకి బాగా అలవాటు పడ్డాడని నా బీట్‌లో గ్రహించాను. అది చదివి కాదు. ఆవిడ వయసు అన్న కన్నా కొన్నేండ్లే తక్కువ. ఆవిడకి బ్యాంక్‌లంటే నమ్మకం లేక చాలా డబ్బుని ఇంట్లో దాచింది. కానీ, నన్నడిగితే అది పెద్ద పొరపాటు.”

“అవును.”

“దినపత్రికల్లో చెప్పినట్లుగా అలాంటప్పుడు అది తప్పనిసరిగా జరిగే సంఘటన. ఓ చీకటి రాత్రి ఆ హత్యలు జరిగాయి. ఆ అపరాధి నంబర్‌ ఫోర్టీన్‌ ఇంట్లోకి వెళ్ళాడు. అది అప్పటి నంబర్‌. ఆ ముసలి వాళ్ళని క్రూరంగా చంపి, ఆఖరి సెంట్‌దాకా తీసుకుని ఉడాయించాడు. ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు పౌన్ల, ఆరు షిల్లింగ్‌ల, మూడు పెన్నీలు.”

“అప్పుడు ఇక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్‌ బీట్‌ కానిస్టెబుల్‌ ఎక్కడ ఉన్నాడు?”

“ఇది ఇరవై ఒక్క ఏండ్ల క్రితం సంగతి సర్‌. అప్పటి పరిస్థితులు ఇప్పుడు లాంటివి కావు. బీట్‌ కానిస్టెబుల్‌ కదలికల్ని ఇప్పటిలా మానిటర్‌ చేసేవాళ్ళు కారు. అప్పట్లో బీట్‌లో ఉన్న కానిస్టెబుల్‌ క్రిసెంట్‌ మొత్తాన్ని కవర్‌ చేయాల్సి వచ్చేది. క్రిసెంట్‌ చాలా పెద్ద ఏరియా అని మీరు మహాగని రోడ్‌కి వెళ్ళేసరికి గ్రహిస్తారు. ఆ హంతకుడు ఆ కానిస్టెబుల్‌ కదలికల్ని గమనించి ఉంటాడు. మేం ఫలానా సమయంలో ఫలానా చోట ఉంటాం తప్ప అన్ని చోట్లా ఒకేసారి ఉండలేం కదా? ఆ హత్యలు కొన్ని నిమిషాల్లో జరిగిపోయాయి. నన్నడిగితే రెండు నిమిషాలు. ఆ అపరాధికి ఈ ఇంట్లోకి వెళ్ళేదారి ఒకటి తెలుసు. లోపలకి వెళ్ళి హత్యలు చేసి బయటకి వచ్చి తలుపు మూసి వెళ్ళిపోయాడు. ఆ హత్యల గురించి బహుశ కొన్ని రోజుల దాకా తెలిసేది కాదు కాని, అన్న మిస్టర్‌ జాయెస్‌ మరణించే ముందు తలుపుదాకా పాక్కుంటూ వచ్చి అక్కడ పోయాడు. చాలా గాయపడ్డ అతను అలా ఎలా రాగలిగాడు అన్నది ఎవరికీ తెలీదు. అతని పుర్రె పగిలింది.”

“హారిబుల్‌!”

“అవును. అవి క్రూరమైన హత్యలని చెప్పాగా. అందుకే ఇంటి నంబర్ని మార్చేసారు. ఐతే, అప్పట్లో ఇండ్ల కొరత లేదు. ఇలాంటివి జరిగిన ఇంట్లో ఉండటానికి ఎవరూ ఇష్టపడే వారు కారు. మిస్టర్‌ స్పూన్‌ దినపత్రికలో రాసినట్లు ఈరోజు దాకా అది పరిష్కరించబడని కేసుగా మిగిలిపోయింది.”

“ఆధారాలేం దొరకలేదా?” ఆ పొట్టి వ్యక్తి అడిగాడు.

“ఒక్కటి కూడా. రోడ్‌ బురదగా ఉంటే పాదముద్రలు పడేవేమో కాని, సెప్టెంబర్‌ నెల్లో రాత్రి పదికి ఆ దుర్ఘటన జరిగింది. పొడి నేల. డ్యూటీ కానిస్టెబుల్‌ ఆ ఇంట్లో హత్య జరిగిందని తెలుసుకోవడానికి కారణం ఆ ఇంటి తలుపు మూసి ఉండటం.”

“మూసి ఉండటమా? లేక తెరచి ఉండటమా?”

“మూసి ఉండటమే సర్‌. ఎందుకంటే, డ్యూటీ కానిస్టెబుల్‌ ఆ ఇంటి దగ్గరకి వచ్చాక మిస్‌ జాయెస్‌ అతనికి కేక్‌ లేదా పైని కాని, సేండ్‌విచ్‌ని కాని, ఎప్పుడైనా ఓ గ్లాస్‌ ఆరెంజ్‌ జూస్‌ని ప్రతీ రాత్రి ఇస్తూండేది. ఏడేండ్లల్లో మొదటిసారి ఆ తలుపు వెనుక నిశ్శబ్దాన్ని అతను విన్నాడు. టార్చ్‌లైట్‌ వేసి ఏం జరిగిందా అని చూసాడు. తలుపు కిందనించి కారిన ఎర్రటి ద్రవాన్ని చూసాడు. తలుపు కొడితే ఎవరూ జవాబు పలకలేదు. తీయలేదు.”

“తర్వాత?”

“దాంతో ఈ కథ ముగిసింది. ఎవరూ అది ఎవరి పనో కనుక్కోలేక పోయారు. కాని, ఎంత డబ్బు పోయిందో అంచనా వేయగలిగారు. స్కాట్‌లేండ్‌ యార్డ్‌ పరిష్కరించలేని కేసుల్లో ఇదొకటిగా మిగిలిపోయింది.”

ఆ పొట్టి మనిషి కొద్దిగా ఆసక్తిగా అడిగాడు.

“తాము నేరం చేసిన చోటికి నేరస్థుడు తప్పకుండా వస్తాడని, అలా రాకుండా ఉండలేడని విన్నాను. అది నిజమా?”

“కొందరు వస్తారు. కొందరు రారు సర్‌” ఆ బీట్‌ కానిస్టెబుల్‌ చెప్పాడు.

“కాని, ఈ హంతకుడు తిరిగి వస్తాడని నాకు ఎందుకో అనిపిస్తున్నది. బహుశ అతను రాకుండా ఉండలేడు.”

“మీరు మహాగని రోడ్లో ఉంటున్నారా?”

“గుర్తొచ్చింది. నేను అక్కడికి వెళ్ళాలి. అన్నట్లు ఆ రోజు డ్యూటీలోని కానిస్టెబుల్‌కి ఏమైంది?”

“అతన్ని డిస్మిస్‌ చేసారు సర్‌. అతను వందో నంబర్‌ తలుపు ముందాగి సిగరెట్‌ తాగేవాడు. ఆ హత్య జరిగిన రాత్రి ఆ ఇంటివాళ్ళు ఎప్పటిలా తమ ఇంటి బయట పావుగంట పైనే నిలబడి రెండు సిగరెట్లు తాగిన కానిస్టెబుల్‌ని చూసారని విచారణలో తెలిసింది.” 

“దాంతో ఆ హంతకుడ్ని పట్టుకోలేకపోయారు. అవునా?”

“అవును. నేటిదాకా పట్టుకోలేక పోయారు. కాని, మీరు హంతకుడు తిరిగి రావడం గురించి అడిగారు కదా? కొందరు నిజంగా రాకుండా ఉండలేరు.”

“వేలిముద్రలు దొరకలేదా?” చిన్న సంచీగల ఆ పొట్టి వ్యక్తి కొన్ని క్షణాలాగి అడిగాడు.

“హంతకుడు గ్లవ్స్‌ ధరించా...” తన చేతి గ్లవ్స్‌వంక చూసుకుని, బీట్‌ కానిస్టెబుల్‌ చటుక్కున చెప్పడం ఆపాడు.

“పోలీస్‌ కానిస్టెబులే ఆ హంతకుడై ఉండవచ్చు.”

“అతనే హంతకుడు సర్‌.”

హఠాత్తుగా ఆ చిన్న సంచీగల పొట్టి వ్యక్తి క్రిసెంట్‌లో తనొక్కడే థర్టీన్‌ బి తలుపు ముందు నిలబడి ఉండటం గమనించాడు. రోడ్‌మీద మంచులో తన పాదముద్రలు మాత్రమే ఉండటం గమనించాడు.

(గెరాల్డ్‌ కెర్ష్‌ కథకి స్వేచ్ఛానువాదం)


logo