మంగళవారం 14 జూలై 2020
Sunday - Jun 28, 2020 , 01:17:11

రాయల్‌గా.. రైడింగ్‌ గేర్‌! బైక్‌ భామల కోసం ప్రత్యేకం

రాయల్‌గా.. రైడింగ్‌ గేర్‌! బైక్‌ భామల కోసం ప్రత్యేకం

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై మరింత రాయల్‌గా సవారీ చేయడం అందరికీ ఇష్టమే. యువత అమితంగా ఇష్టపడే ఈ బైక్‌లంటే.. అతివలకూ  ప్రేమే. ప్రత్యేకంగా రూపొందించిన లెదర్‌ జాకెట్లు.. చేతి గ్లౌజులు, హెల్మెట్‌ పెట్టుకొని జామ్‌.. జామ్‌.. అంటూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌పై దూసుకెళ్తుంటే.. ఆ మజానే వేరు. మహిళలు కూడా ‘రాయల్‌'గా రైడింగ్‌ చేస్తున్నా.. వీరికోసం ప్రత్యేక‘రైడింగ్‌ గేర్‌' లేకపోవడం ఓ లోటే. ఇప్పుడు ఆ లోటును తీరుస్తున్నది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ. ‘బండి’ మైసమ్మల కోసం ‘ఉమెన్స్‌ వేర్‌'ను రూపొందిస్తున్నది. 

లేడీస్‌ స్పెషల్‌

మగవారికి ఏమాత్రం తీసిపోకుండా మహిళా రైడర్లు బైక్‌లపై దూసుకెళ్తున్నారు. మహిళా రైడర్ల క్లబ్బులను ఏర్పాటు చేసుకొని, వీకెండ్స్‌లో బైక్‌ యాత్రలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ వాహనాలపై రాయల్‌గా తిరిగేస్తున్నారు. అయితే.. తమకంటూ ప్రత్యేకంగా వాహక దుస్తులు, ఉపకరణాలు లేకపోవడంతో కాస్తంత ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో లేడీ రైడర్స్‌ కోసం ప్రత్యేక దుస్తులను రూపొందించేందుకు ముందుకు వచ్చింది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌. భారతదేశంలోని మహిళా రైడర్స్‌ కోసం జాకెట్స్‌, ట్రౌజర్స్‌, గ్లౌజులు, హెల్మెట్స్‌, టీషర్ట్స్‌, షర్ట్స్‌, జీన్స్‌తో కూడిన ప్రత్యేక రైడింగ్‌ గేర్‌ను తయారు చేస్తున్నది. రూ.700 నుంచి రూ.14000 దాకా వివిధ ఉపకరణాలను విక్రయిస్తున్నది. దేశంలోని విభిన్న వాతావరణాలను తట్టుకునేలా, మోటార్‌ సైకిల్‌ నడిపే మహిళల కోసం వీటిని అందిస్తున్నట్లు సంస్థ బిజినెస్‌ హెడ్‌ పునీత్‌ సూద్‌ వెల్లడించారు. లెదర్‌, కాటన్‌ వేరియంట్లలో ఈ దుస్తులు లభిస్తున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా విక్రయాలు ప్రారంభించారు. ప్రస్తుతానికి ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కతా, బెంగళూరులో లభిస్తున్నాయి. ‘ఇది లేడీ బైకర్స్‌ విజయం’ అంటారు బంజారాహిల్స్‌కు చెందిన అస్మిత. 

రైడ్‌కు రెడీ అవ్వండిలా..

  • బైక్‌పై లాంగ్‌ డ్రైవ్‌ చేయడమంటే ఇప్పటి యువతకు ఎంతో క్రేజ్‌. సరదాగా వెళ్తున్నా.. టూర్‌కు వెళ్తున్నా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. 
  • వెళ్తున్నది లాంగ్‌ డ్రైవ్‌ కనుక ఏ హెల్మెట్‌ పడితే ఆ హెల్మెట్‌ కొనకుండా నాణ్యమైనది కొనుగోలు చేయాలి. ఫుల్‌ హెల్మెట్‌ ధరించడం వల్ల దుమ్ము, దూళి పడకుండా ఉంటుంది.
  • బైకింగ్‌ జాకెట్‌, ప్యాంట్‌, నీ క్యాప్‌, రైడింగ్‌ షూ తప్పకుండా వేసుకోవాలి. 
  • రైడింగ్‌కు ఒక రోజు ముందుగానే బైక్‌ను సర్వీస్‌ చేయించాలి. దీంతో సాంకేతిక సమస్యలు తలెత్తవు.
  • ప్రయాణం మధ్యలో క్లచ్‌ప్లేట్లు, ఎయిర్‌ ఫిల్టర్లు, స్పార్క్‌ ప్లగ్స్‌, క్లచ్‌, యాక్సిలరేటర్‌, బైక్‌ కేబుల్‌, టైర్స్‌తోపాటు పెట్రోల్‌ లెవల్‌ను కచ్చితంగా గమనించాలి. 
  • వాహనానికి సంబంధించిన ఇన్సూరెన్స్‌, రిజిస్ట్రేషన్‌ ధ్రువీకరణ పత్రాలతోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ వెంట తీసుకువెళ్లండి.logo