సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Jun 28, 2020 , 01:07:21

‘ధనం.. దాసినోనికి, లెక్క.. రాసినోనికి తెలుస్తది’

‘ధనం.. దాసినోనికి, లెక్క.. రాసినోనికి తెలుస్తది’

ఎవరు ఏ పనిచేశారో.. చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొంతమంది ఆ పనిని గమనించినా, వారికి దాని గురించి పూర్తిగా తెలియకపోవచ్చు. అందుకే ‘ధనం.. దాసినోనికే తెలుస్తది  లెక్క.. రాసినోనికే తెలుస్తది’ అంటారు. పూర్వం డబ్బుల్ని కుండల్లో, పాతరల్లో దాచేవారు. ఇప్పుడు బ్యాంకుల్లో డిపాజిట్లు చేస్తున్నారు. ఇంకా కొంతమంది స్విస్‌ బ్యాంకులో దాస్తున్నారు. ఏమైనప్పటికీ, డబ్బు దాచినవాడికి తప్ప ఇతరులకు సాధారణంగా తెలిసే అవకాశం లేదు. లెక్క కూడా అంతే! రాసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. నిరక్షరాస్యులే ఎక్కువగా ఉన్న దేశంలో లెక్కలు ఎవరికి తెలుస్తాయి? లెక్కలు అనగానే వ్యాపారులు గుర్తుకొస్తారు, వాళ్ళు వస్తువుల్ని ఉద్దెరకు ఇచ్చేటప్పుడు రాసే లెక్కలు ఇతరులకు తెలిసే వీలేలేదు.

మన సామెత.. ఆవునూరుకు ఆడిపిల్లను ఇయ్యద్దు..

ఎలాంటి వసతులూ లేని ఇండ్లలోని అబ్బాయిలకు ఆడపిల్లలను ఇచ్చి పెండ్లి చేసి పంపొద్దనీ, ఎవుసం సరిగా లేని ఊళ్లకు ఆవులను అమ్మొద్దనీ చెప్పే క్రమంలో.. ‘ఆవునూరుకు ఆడిపిల్లను ఇయ్యద్దు - మల్లారెడ్డిపేటకు ఎద్దును అమ్మద్దు’ అనే సామెతను వాడతారు. ఇది అచ్చంగా కరీంనగర్‌ సామెత. ఆవునూరుకు ఎందుకు ఆడపిల్లను ఇవ్వద్దన్నారు? అంటే మానేరు ఒడ్డున ఆవునూరు ఉంది. అక్కడ నది విశాలంగా ఉంటుంది. లోతుగా పారుతుంది. ఇప్పుడంటే మానేరుపైన వంతెన వచ్చింది కానీ, అప్పట్లో అది లేదు. కాబట్టి బిడ్డను ఆవునూరు పిల్లవాడికి ఇస్తే, ఆ అమ్మాయి ఆపదకూ సంపదకూ అందుబాటులో ఉండదు. ఇక ఎద్దును మల్లారెడ్డిపేటకు ఎందుకు అమ్మకూడదు అంటే.. ఆ ఊరి పొలాలన్నీ రాళ్లమయం. దున్నుతుంటే ఎద్దు కాళ్లకు అడుగడుగునా తగిలి గాయాలవుతాయి. తెలంగాణ పల్లెల్లో బిడ్డపై, ఎవుసానికి అక్కరకొచ్చే గొడ్డుపై ఒకే రకమైన ప్రేమను చూపుతారు. ఇలాంటి సామెతలు ప్రాంతాన్నిబట్టి.. పలు విధాలుగా చెబుతుంటారు. వాటి సారాంశం మాత్రం ఒక్కటే.

గండు మొకపోడా..

తెలుగులోని రేనుపండ్లను తెలంగాణలో నేరిపండ్లు/నేరేడిపండ్లు అంటారు. కొందరు రేగుపండ్లనీ, రేనుపండ్లనీ పిలవడం కద్దు. పెద్దగా ఉన్న పండ్లను గంగరేనుపండ్లని వ్యవహరిస్తారు. ఈ సమాసంలోని ‘గంగ’ అంటే అర్థం పెద్ద అని. ‘గండ్ర’ అంటే కూడా ‘పెద్దది’ అని అర్థం. గండ్రచీమలు మామూలు చీమలకన్నా పెద్దగా ఉంటాయి. తెలంగాణలో ఇవి 

‘గండుచీమలు’గా వ్యవహారంలోకి వచ్చాయి. గండ్ర గొడ్డలిలోని గండ్రకు పెద్ద అనే అర్థం. అయితే ఈ పదం తెలంగాణ వాడుకలో లేదు. కానీ ‘గండు మొకం’ లాంటి సమాసాల్లో గండ్ర కనిపిస్తున్నది. గండుపిల్లి కూడా ఇలాంటిదే! 

గావు కేక విన్నారా?

‘గావు’... మాటను దేవతలకు బలిచ్చే సందర్భాల్లో వాడుతుంటారు. పోతురాజులు తమ దంతాలతో మేకపోతుల్నీ, గొర్రెపోతుల్నీ కొరికి గావు పడతారు. ‘గావు’ అంటే బలి అని అర్థం. ‘గొప్ప చింబోతు కదుపుల గూర్చి నీకు, గావు వెట్టింతు జుమ్మి యో గంగనమ్మ’ అని నీలాసుందరి పరిణయ గ్రంథం తేటగీతి పంక్తుల్ని అందిస్తుంది. గావుపట్టు అంటే చంపు, నాశనం చేయు... అనే అర్థాలున్నాయి. ఒక విధంగా ‘చావు’ (మరణం) పదమే ‘గావు’. కొన్నిచోట్ల గావుకేక పెట్టింది బిడ్డ అంటారు. ఇది చావు కేకకు సమానార్థం.


logo