శనివారం 04 జూలై 2020
Sunday - Jun 28, 2020 , 00:28:44

మనసంతా వాళ్లే!

మనసంతా వాళ్లే!

ఇద్దరు.. మానసిక వికలాంగ కవల సోదరులు. లేవలేరు.. కూర్చోలేరు. తల్లి ఉన్నప్పుడు.. వాళ్లను చూసుకునేది. ఇప్పుడెవరికి పట్టింపు ఉంటది? కానీ.. ‘నేను దత్తతతీసుకుంటా’ అని చేరదీశాడొక యువకుడు. వీళ్లిద్దరినే కాదు.. అలాంటివాళ్లనెందరినో దత్తత తీసుకొని బిడ్డల్లా చూసుకుంటున్నాడు. మానసిక వికలాంగులైన పిల్లలను చేరదీస్తున్ననిఖార్సయిన సోషల్‌ యాక్టివిస్ట్‌ సంతోష్‌ నాగెల్లి లైఫ్‌ జర్నీ ఈ వారం. 

మాది వరంగల్‌. డిగ్రీ వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో చేశాను. అప్పుడు నేనొక స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ లీడర్‌ని. విద్యార్థుల సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా. నాతో ఎప్పుడూ ఓ పదిమంది ఉండేవాళ్లు. ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికే వస్తుండేవారు. అలా సమస్యలు పరిష్కరించడం నాకు బాధ్యతగా ఏర్పడింది. 

క్రమంగా నాలో ఒక సోషల్‌ యాక్టివిస్ట్‌ బయటికొచ్చాడు. మామూలుగా స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ లీడర్స్‌ అంటే గ్రూపులు మెయింటెన్‌ చేయడం.. వీసీని నిలదీయడం.. ఇలాంటి పనులే ఉంటాయి. ఇలాంటివి చేస్తేనే క్యాంపస్‌లో మనకంటూ ఓ గుర్తింపు ఉంటుంది. కానీ.. నేను చాలా తక్కువ సమయంలోనే ఆ వాతావరణంలోంచి బయటకు వచ్చాను. 

ఒకసారి..  ‘అంధుల ఆశ్రమం’ నిర్వాహకులు నన్ను కలిశారు. ‘సార్‌.. మేం అంధ విద్యార్థుల కోసం సేవ చేస్తున్నాం. వాళ్లకు మీలాంటి వాళ్ల సహకారం కావాలి. ఎంతో కొంత విరాళం ఇస్తే వాళ్ల జీవితాలు బాగుపడతాయి’ అన్నారు. 

వాస్తవానికి నాకు అప్పటివరకు ఈ ఆశ్రమాల గురించి వేరే అభిప్రాయం ఉండె. కానీ ఒకసారి అక్కడికి వెళ్లి చూశాను. బాధనిపించింది. పాపం ఆ పిల్లలు చేసిన పాపమేంటి అనిపించింది. కన్నవాళ్లు సైతం పట్టించుకోకపోతే వీళ్లు చేరదీసి పోషిస్తుండటం గొప్పగా అనిపించింది. నావంతు సాయంగా ఏదైనా చేయాలి అనిపించింది. అట్లా అంధ పిల్లల కోసం రెగ్యులర్‌గా విరాళాలు ఇస్తుండేవాడిని. లీడర్‌ అంటే సమస్యలపై పోరాడటం కాదు.. ఏ దిక్కూ లేనివారికి ఓ దిక్కు చూపించడమూ లీడర్‌ లక్షణమే అనుకున్నాను. 

కొత్త జీవితం

చదువు పూర్తయింది. ఉద్యోగంవైపు వెళ్లాలి అనిపించింది. మా బావ వాళ్లు అమెరికాలో ఉంటారు. అటువైపు వెళ్లడానికి కూడా అవకాశాలున్నాయి. కానీ.. ఇంతేనా? నా ఒక్కడి గురించి ఆలోచించడమేనా? అనిపించింది. ఒకరోజు న్యూస్‌పేపర్‌ చదువుతుంటే ‘బిడ్డ మానసిక వైకల్యం చూసి తట్టుకోలేక తల్లి ఆత్మహత్య’ అనే వార్త చదివాను. మనసు చలించిపోయింది. ఏంటీ పరిస్థితి? మానసిక వైకల్యం ఉంటే బాగుచేయించాలిగానీ ఆత్మహత్య చేసుకుంటారా అనిపించింది. 

ఈ సబ్జెక్ట్‌పై అధ్యయనం చేశాను. మానసిక వైకల్యం కూడా మందులేని ఒక రోగం లాంటిదే అని తెలిసింది. వాళ్లలో మార్పు కల్పించాలి. కానీ.. వేరే చేసేదేమీ ఉండదు. అదొక నిరంతర ప్రక్రియ అని అర్థమైంది. ఒక్క హైదరాబాద్‌ సిటీలోనే వేలల్లో మానసిక వికలాంగులు ఏ దిక్కూ లేకుండా బతుకుతున్నారని తెలిసింది. ఈ విషయంలో ఏదైనా చేయాలి అనే ఆలోచన మొదలైంది. అలా ఏదిక్కూ లేని వయసు పైబడిన మానసిక వికలాంగులను కొందరిని దత్తత తీసుకున్నా. అంటే.. వాళ్లకు అమ్మ.. నాన్న.. అన్నీ నేనే అన్నమాట. నిజం చెప్తున్నా అప్పటిదాకా నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. హైదరాబాద్‌లో నాకంటూ ఓ షెల్టర్‌ లేదు. కానీ నేను గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే.. నా సంకల్పం పెద్దది. చేతిలో డబ్బు లేకున్నా కొత్తపేటలో ఒక అపార్ట్‌మెంట్‌ లీజ్‌కు తీసుకుని ‘మదర్‌ ఓల్డేజ్‌ హోం’ ప్రారంభించాను. 

వారికి ఏం కావాలి? ఆరోగ్యం ఎలా ఉంది? వంటి పనులు చూసుకుంటూ ఉండేవాడిని. దీనికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టాను. అది చూసినవాళ్లు మనో వైకల్యం ఉన్నవాళ్ల గురించి సమాచారం ఇవ్వడం గానీ.. లేక వాళ్లే చేర్పించడంగానీ చేసేవారు. 

భార్య అర్థం చేసుకుంది..

అప్పుడే నాకు పెండ్లయింది. నేనేం పనిచేస్తానో ముందే చెప్పాను. నా భార్య నన్ను అర్థం చేసుకుంది. అభాగ్యులకు అండగా నిలుస్తున్నందుకు నాకెంతో సహకరించింది. ఇప్పటికీ నా భార్య.. పిల్లలు వరంగల్‌లో ఉంటారు. నేను మాత్రం దత్తత తీసుకున్న ఈ మనో వైకల్యం ఉన్న పిల్లల దగ్గరే ఉంటాను. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఎర్రగడ్డ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చెక్‌ చేయించుకొస్తుంటాను. ఇప్పుడు నా దగ్గర 20 మంది ఉన్నారు. 

ఒకసారి.. మేం ఉండే పాత వసతి గృహం కూలిపోయే దశలో ఉంది. అది ఖాళీ చేసి వేరే దగ్గర లీజ్‌కు తీసుకున్నాను. అందర్నీ తీసుకొని కొత్త వసతి గృహం దగ్గరకు వచ్చాను. 

మమ్మల్ని అందరినీ చూసి ఒక లీడర్‌ వచ్చి.. ‘ఏయ్‌ ఎవరు మీరంతా? పిచ్చోళ్ల సైన్యం లెక్క ఉంది. ఇక్కడేం పని?’ అని ఆపేశాడు. ‘సార్‌.. వీళ్లంతా మెంటల్లీ డిజేబుల్డ్‌  పిల్లలు. నేనే వీళ్లను చూసుకుంటా. మా పాత వసతిగృహం కూలిపోయేట్లు ఉందని ఇక్కడ కొత్తది చూసుకున్నాం’ అన్నాను. ‘హే చల్‌.. గదంతా నడవది. ఇదేమన్నా కాలనీ అనుకుంటుండ్రా? ఎర్రగడ్డ హాస్పిటల్‌ అనుకుంటుండ్రా?’ అని పాపం.. మమ్మల్నందరినీ ఏడు గంటలపాటు రోడ్డుమీద పడేశాడు. ఆరోజు నా దుఃఖం వర్ణనాతీతం. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ఉన్నదో లేనిదో తింటూ.. సొంత పిల్లల్లా చూసుకుంటుంటే పిచ్చోళ్లారా అంటూ రోడ్డుపై నిలబెడతాడా అని బాధపడ్డాను. 

వెళ్తే మళ్లీ పాత బిల్డింగ్‌లోకి వెళ్లాలి. ఓనర్‌ని అడిగితే.. ‘చూడు తమ్ముడూ.. ఒకవేళ అది కూలిపోతే ఎవరి బాధ్యత?’ అన్నాడు. ఆయనను ఒప్పించి.. భారమంతా దేవుడిపైన వేసి గుండె ధైర్యంతో వాళ్లను ఆ ఒక్కరోజు అదే బిల్డింగ్‌లోకి తీసుకెళ్లాను. ఆ రాత్రంతా నిద్రపట్టలేదు. చిన్న చప్పుడు వస్తే చాలు.. బిల్డింగ్‌ కూలుతుందా? అనిపించేది. పాపం వాళ్లలో ఎవరికీ ఈ విషయం తెలియదు. అంతమంది ప్రాణాలు నా ఒక్కని అరచేతిలో పెట్టుకొని మొత్తానికి ఆ రాత్రి గడిపాం. తెల్లారింది.. మళ్లీ ఇంకో బిల్డింగ్‌ కోసం వెతుకులాట ప్రారంభించాను. మంచి బిల్డింగ్‌ దొరికింది. కానీ నెలకు రూ.50 వేలు అడిగారు. ‘సార్‌.. ఇదేదో లాభాపేక్ష కోసం చేస్తున్నది కాదు. మానసిక వికలాంగులు కూడా మనుషులే అని ఉచితంగా చేస్తున్న సర్వీస్‌. నాకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? యాభైవేలు అంటే ఎక్కడ తెచ్చి ఇవ్వగలను? అని నా బాధ ఆయనతో చెప్పుకున్నాను. ఆయన చలించిపోయారు. ఆయనకూ మానసిక సమస్య ఉన్న కొడుకు ఉన్నాడు. ఆ కష్టమేందో తెలిసిన వ్యక్తిగా మాపై దయదలిచి చాలా తక్కువకే ఇచ్చారు. రెంట్‌ చెల్లించడంలో ఆలస్యం అయినా.. ఒక నెల ఆటూ ఇటూ అయినా ఏమీ అనరు. 

అలా అన్నీ నేను చేస్తున్న సర్వీస్‌ను దృష్టిలో ఉంచుకునే దాతలు ముందుకొస్తున్నారు. ఇప్పటికైతే ఒక చక్కని కుటుంబంలా.. వాళ్లను నేను అర్థం చేసుకుంటూ.. నన్ను వాళ్లు అర్థం చేసుకుంటూ బాధల్ని మరుస్తూ ఆనందంగా గడుపుతున్నాం. 

నేను లేనప్పుడు వీళ్ల బాగోగులు చూసుకునేందుకు.. రోజూ వాళ్లకు సపర్యలు చేసేవాళ్లూ ఉన్నారు. వాళ్లలో ఒకరి పిల్లలు కూడా మానసిక సమస్య ఉన్నవాళ్లే. కాబట్టి వాళ్ల సమస్య ఏంటో.. వాళ్లను ఎలా డీల్‌ చేయాలనే విషయంలో ఏ సమస్యా రాదు. 

పేపర్లో చూసి..

ఇక.. ఇటీవల ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నా. ‘దివ్యాంగ కవలలకు ఎంత కష్టమొచ్చె’ అనే వార్త పేపర్లో చూసి బాధనిపించింది. సిద్దిపేట జిల్లా పుల్లూరుకు చెందిన శ్రీనాథ్‌.. రాము అనే 17 యేండ్లున్న పిల్లలు వాళ్లు. పుట్టుకతో మనో వైకల్యం ఉంది. నిరుపేద కుటుంబం. ఇన్నిరోజులు వాళ్లమ్మ జ్యోతి వారి ఆలనాపాలనా చూసుకునేవారు. అనారోగ్యంతో ఇటీవలే ఆమె మరణించారు. ఆ పిల్లల తోడ ఒక చెల్లె ఉంది. డిగ్రీ చదువుతుంది. పాపం.. ‘ఉన్నొక అమ్మాయైనా నిమ్మళంగా ఉంటే బాగుండు’ అని ఎవరికైనా అనిపిస్తుంది కదా? సరిగ్గా అదే సమయానికి ఈఎన్‌టీ హాస్పిటల్‌ డాక్టర్‌ రవిశంకర్‌ సార్‌ నాకు కాల్‌ చేశారు. ‘ఇద్దరు మెంటల్లీ డిజేబుల్డ్‌ ట్విన్స్‌ ఉన్నారు. మీ దగ్గర అవకాశం ఉంటుందా?’ అన్నారు. ఉంటుందని చెప్పాను. వెంటనే వారిని నేను దత్తత తీసుకున్నా. ‘ఇక్కడి నుంచి వీళ్లు నా బిడ్డలు’ అని భరోసా ఇచ్చాను. చాలా చక్కగా ఉంటున్నారు. ఇలా ప్రతి నిత్యం వారి బాధలు, సంతోషాల మధ్య నా లైఫ్‌ జర్నీ ఎర్రగడ్డ నుంచి కొత్తపేటకు చక్కర్లు కొడుతూ సాగుతున్నది. ఎవరినైనా  ఆశ్రమంలో చేర్పించాలన్నా.. సహాయం చేయాలనుకున్నా  +919550727066 నంబరులో  సంప్రదించవచ్చు.  logo