గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jun 28, 2020 , 00:15:46

ఎల్సా నుంచీ నేర్చుకుందాం!

ఎల్సా నుంచీ నేర్చుకుందాం!

హాయ్‌ పిల్లలూ!  అక్క, చెల్లి, తమ్ముడితో మీరు పోట్లాడుకుంటారు కదా? అప్పుడు అమ్మ  ‘నువ్వు అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయొద్దు, ఇది చేయొద్దు’ అని చెప్తూ ఉంటుంది. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్లు కూడా, అలానే మనకు మంచిని నేర్పిస్తాయి. వాటిలో ఫ్రోజెన్‌-2లో ‘ఎల్సా’ క్యారెక్టర్‌ ఒకటి. 

ఎల్సా... ధైర్యవంతురాలు, నిండైన ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి. ‘ఎక్కడ భయం ఉంటుందో, అక్కడ నమ్మకం ఉండదు‘ అని నమ్ముతుంది. ఆమె ఫాంటసీ గర్ల్‌. ఓ రాజ్యానికి రాణి. ఎల్సా రాణి అయినప్పటికీ తన మిత్రుల పట్ల ఎంతో ప్రేమగా ఉంటుంది. తన చెల్లెలు ‘ఆనా’. ఈ అక్కా- చెల్లెళ్ల మధ్య ప్రేమ, నమ్మకం  అపారంగా ఉంటాయి. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత ఎల్సాకు, చెల్లి ఆనా ‘ఇంకో అమ్మ’ అవుతుంది. ‘ఈ భూమి మీద ఏది విడిపోయినా... మనం మాత్రం విడిపోం’ అని ఎల్సా తన గారాల చెల్లితో అంటుంది. అంతకు మించి ఎల్సాను ఎప్పుడూ ఒంటరిగా ఉండనివ్వదు ఆనా.  తనకు ఉన్న అతీంద్రియ శక్తులన్నీ ప్రజలకోసమే తప్ప,  మిగతా  అవసరాలకు కాదు అని ఎల్సా నమ్ముతుంది. ప్రజలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేకపోతే ఆ శక్తులు తనకు ఉండీ వృథా అని భావిస్తుంది.  రాజ్య సమస్య పరిష్కారం కోసం తాను చేసే ప్రయాణంలో ఎవరికీ హాని జరగొద్దని తలుస్తుంది. ఆ పరిష్కారం ఏమిటో, ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఆమెకు తెలియదు. కానీ దాన్ని కనుక్కోవడమే ఇక్కడ కీలకం.  జాగ్రత్త, ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ కలగలుపుకొని అమె విజయాన్ని సాధిస్తుంది. ఇదంతా మనల్ని ఓ అందమైన ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మనం స్వార్థంతో చేసే తప్పులు భవిష్యత్తు తరాలమీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో వివరిస్తుందీ కథ.  లాక్‌డౌన్‌ సమయంలో చాలామంది పిల్లలు చూసిన సినిమా ఇది. 


logo