శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Jun 28, 2020 , 00:08:40

వాస్తు

వాస్తు

అడవిలో సింహం, పులి తదితర జంతువులు ఆనందంగా ఉంటలేవా? అవి శాస్ర్తాలు పాటిస్తాయా? మనకెందుకు? -గౌరెల్లి వీరేషం, శంషాబాద్‌

మంచిప్రశ్న.. నిజమే.. మనుషుల కన్నా జంతువులు ఎంతో బలమైనవి కూడా. అంతేకాదు మనిషి గొప్పతనాన్ని చెప్పడానికి కూడా అతడు సింహబలుడు, టైగర్‌ అని కూడా సంబోధిస్తుంటారు. అడవిదాక ఎందుకు మన పెంపుడు జంతువులు ఆవులు, గేదెలు, దున్నపోతులు గొప్పవి కావామరి. మనిషిని ఎందుకు సృష్టించిందో ఈ నేచర్‌... దానికి బుద్ధి లేక కాదు ఈ పుడమిపైన బుద్ధిజీవి మనిషి ఒక్కడే అని.  మనిషి పుట్టుకతో జంతువుగానే మెదులుతుంటాడు. ‘గృహ శిక్షణ’తో మనిషిగా మారతాడు. చిత్రం ఏమిటంటే ఆవుదూడ పుట్టిన తరువాత ఇరవై నిమిషాలలోనే లేచి నిలబడుతుంది. మనిషికి ఏళ్లు పడుతుంది. కోతిపిల్ల తల్లికడుపు నుండి బయటకు వస్తూ తన చేతులతో తల్లి కాళ్లు పట్టుకొని తన ప్రయత్నంలో మరింత వేగంగా సులభంగా తల్లికి సహకరించి బయటపడుతుంది. ఇది మహామేధావి మనిషి చేయడు కదా. అలాగని కోతినే గొప్పది అందామా? తన కడుపులో పుట్టిన ఎద్దుతో ఆవు సంగమిస్తుంది.  అలాగని ఆవు గొప్పది కాదా.. మంచి పాలుఇవ్వదా? సమస్య ‘జంతు - మనిషి’ ఆకారాలలో లేదు ఆలోచనల్లో ఉంది. జంతువు ఆకర్షణీయంగా ఉన్నవైపు వెళుతుంది. మనిషి అపూర్వం వైపు మహోన్నత లక్ష్యం వైపు వెళ్లగలడు. అంటే మార్పును స్వీకరించే లక్షణం మనిషి మెదడుకు ఉంది. జంతువులకు లేదు. మనిషి అనుకుంటే తన చైన్‌ స్మోకింగ్‌ వదులుకోగలడు. పులి తన నెత్తుటి వాసన నుంచి ఇడ్లీ సాంబార్‌ తినడానికి జీవితకాలం కష్టపడినా మారలేదు. మనిషికి మెచ్యూరిటీ మంచి గృహంలో, ప్రకృతి ఒడిలో వస్తుంది. అది రానంత వరకు మనిషికి - జంతువుకి తేడా లేదు. అడవిలో జంతువులు తమ జీవన విధానంలో ఆనందంగా ఉన్నాయి. మనిషి వాటి ఆరోగ్యానికి కూడా వైద్యాన్ని హాస్పిటల్స్‌ని తయారు చేశాడు. తినడం, నిద్రపోవడం, సంభోగించడం జంతువులకు తెలిసిన జీవితం. వాటితో పాటు త్యాగం చేయడం. విచక్షణతో ఉండటం తదనుగుణంగా మార్పును పొందడం జ్ఞానంతో జీవించడం మనిషి గొప్పతనం. శాంతి, తృప్తి- జ్ఞానం. ఇవి మనిషికి అందివ్వటానికే శాస్ర్తాలు వచ్చాయి. కారణం పుట్టుకతో మనిషి జంతువుగానే ఉండే అవకాశం ‘పాలు’ ఎక్కువ కాబట్టి. మనిషి మార్పుకు శిక్షణాలయం వాస్తు శాస్త్ర గృహం.

మా ఇంటికి కాకుండా మేము కొన్న స్థలానికి వీధిపోటు ఉంది. దాని ఫలితం ఏంటో చెప్పండి? -సురేంద్రనాథ్‌, చెన్నూరు

ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఆ కొన్న స్థలం మన ఇంటికి దక్షిణంలో ఉందా, పడమరలో ఉందా అనేది.  ఇంటిని ఆనుకొని దక్షిణం ఖాళీ స్థలం కొన్నప్పుడు దానికి వచ్చే వీధిపోటు ఫలితం మన ఇంటికి ఉంటుంది. రెండు రకాలుగా మనం నష్టపోవాల్సి వస్తుంది. ఒకటి దక్షిణం ఖాళీ స్థలం కొనడం మంచిది కాదు. “దక్షిణం స్థలం ఖాళీ ఆర్థిక నష్టాలతో గృహం ఖాళీ’ అనేది సూక్తి. పైగా దానికి వీధిపోటు రావడం మరింత చేటు కలిగిస్తుంది. ఇక మన ఇంటిని ఆనుకొని కాకుండా మరోచోట స్థలం కొన్నప్పుడు దానికి వీధిపోటు ఉన్నప్పుడు ఆ స్థలంలో మనం ప్రస్తుతం నివాసం ఉండటం లేదు. కాబట్టి దాని ప్రభావం అంతగా ఉండదు. కానీ పరోక్షంగా దాని ప్రభావమూ ఉంటుంది. ఏదైనా ఆర్థికంగా లేదా ఆరోగ్యాలపరంగా ఇబ్బందులను కలిగిస్తాయి. మీరు ఆ వీధిపోటు స్థలాన్ని ఇంటిని ఆనుకొని కొన్నా మరోచోట కొన్నా ఆ స్థలాన్ని అమ్మివేయండి. ఆ స్థలంలో గృహం కట్టడం మంచిది కాదు. ఈజీగా కట్టలేరు కూడా... కాబట్టి దానిని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేయండి. ఇంటికి ఉత్తరం ఖాళీ స్థలం కొన్నా దానికి వీధిపోటు రాకూడదు.

మాకు తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యంలోనే ఖాళీ స్థలం ఉంది. మేము ఇంటి లిఫ్టు ఆ దిశలలో పెట్టొచ్చా?- కంచె కిష్టయ్య,  షాద్‌నగర్‌

ఇంటికి లిఫ్టు విషయంలో ప్రధానంగా ఆలోచించాల్సింది  అది లోపల ఉండాలా, బయట ఉండాలా అనేది. లిఫ్టు ఇంటి లోపల అయితే ఉత్తర భాగంలో, తూర్పు భాగంలో పెట్టుకోవచ్చు. అప్పుడు ఇంటి వారికీ ప్రత్యేకంగా అది ఉపయోగపడుతుంది. ఇతర కిరాయిదారులకు అది ఉపయోగపడదు. ఇంటికి బయట జనరల్‌ లిఫ్టు పెట్టుకోవాలి అంటే ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం అసలు పనికి రాదు. మీరు ఆ దిశలలో తప్ప వేరే దిక్కు అవకాశం లేదు అని అంటున్నారు. అలాంటప్పుడు ఇంటి ఆగ్నేయం త్రెంపు చేసి ఆ చోట లిఫ్టు పెట్టి తూర్పు బాల్కనీ పెంచి దానిలో నుండి పైన ఇంట్లోకి వెళ్లేవిధంగా అమర్చుకోవచ్చు. అలాగే వాయవ్యం ఇంటి భాగాన్ని కట్‌చేసి ఉత్తరం బాల్కనీ పెంచి దానిగుండా వెళ్లేలా మార్చుకోండి. మీరు అనుకున్నట్టు ఈశాన్యం దిశలలో బయట లిఫ్టు పెట్టడం మంచిదికాదు.