శనివారం 04 జూలై 2020
Sunday - Jun 21, 2020 , 01:19:16

సత్య కాంతి!

సత్య కాంతి!

చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన అతడిని చీకట్లోకి నెట్టేసింది. అందులోంచి బయటపడటానికి కాంతిపుంజమై దూసుకుని రావాలనుకున్నాడు. చీకట్లను చీల్చి, రైతులకు అండగా నిలబడుతున్నాడు. తక్కువ ధరకే షాక్‌ప్రూఫ్‌ డివైజ్‌ని అందచేసి, ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి ఒక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాడు. అతని పేరు.. సత్య ఇల్లా,  గ్రామీణ రైతుల ఇండ్లకు కాంతికిరణం.2003.. సత్యకు ఆరేండ్ల వయసు. హైదరాబాద్‌లో నివాసం. 

సంక్రాంతి సెలవులు కావడంతో పతంగులు తెచ్చుకున్నాడు. మాంజాలు కట్టి కాటా వేయడానికి ఫ్రెండ్స్‌తో పోటీ పడ్డాడు. అంతలోనే ఏదో అరుపు. అందరూ గుమిగూడి ఉన్నారు. ఐస్‌క్రీమ్‌ పంచిపెడుతున్నారేమోనని ఆ చిన్న సత్య కిందికి  పరుగెత్తాడు. వెళ్లి చూస్తే అక్కడ తన ఫ్రెండ్‌ శవమై కనిపించాడు. పతంగుల కోసం వెళ్లి కరెంట్‌షాక్‌కు గురయ్యాడు. ఇలా సత్య ఫ్రెండ్‌ ఒక్కడే కాదు.. నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో ప్రకారం, గత ఏడాది  కరెంట్‌ షాక్‌తో 450 మరణాలు సంభవించాయి. లెక్కలకు అందనివి లెక్కలేనన్ని.  విద్యుత్‌ షాక్‌తో అనేక పక్షులు, జంతువులు  మృత్యువాత పడ్డాయి.  ఆ సంఘటన సత్యను కరెంటు గురించి ఆలోచించేలా చేసింది.  పెద్దయ్యాక ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ చదువాలన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. 

ఎందుకిలా..?

ఇంటర్‌ తర్వాత, భారత్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో చేరాడు. మూడేండ్లు ఎలా గడిచాయో అర్థం కాలేదు. నాలుగో సంవత్సరంలో డాక్టర్‌ హఫీజ్‌ బాషా అనే మెంటర్‌ దొరికాడు. ఆయన జపాన్‌లో పీహెచ్‌డీ చేశారు. వీళ్లకి హై ఓల్టేజ్‌ ఇంజినీరింగ్‌ గురించి పాఠాలు చెప్పడానికి వచ్చాడు. పనిలో పనిగా జీవిత పాఠాలూ నేర్పించాడు. ఆయన దిశానిర్దేశకత్వంలో రిసెర్చ్‌ మొదలు పెట్టాడు సత్య. ‘అసలు ఎలక్ట్రికల్‌ షాక్‌లు ఎందుకు జరుగుతాయి? ఎక్కువగా రైతులే ఈ ప్రమాదాలకు ఎందుకు గురవుతున్నారు?’ అని ఆలోచించాడు. అంతేకాకుండా తెలంగాణలో ఇలాంటి మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నదని గుర్తించాడు. వాళ్లు వాడే పంపు మోటర్‌ సెట్లలోనే సమస్యకు మూలాలు ఉన్నాయని అర్థమైంది. ఆన్‌-ఆఫ్‌ సిస్టమ్‌ సరిగా లేకపోవం,  నిర్వహణ లోపం తదితర కారణాలతో కరెంట్‌ షాక్‌లు ఎక్కువగా అవుతున్నాయనే విషయం తెలుసుకున్నాడు. కానీ, దీనికి కచ్చితమైన పరిష్కారం మాత్రం కనుక్కోలేకపోయాడు. కాంతి వైపు పయనం 

2018లో కాంతారి అనే ఒక ప్రోగ్రాం సత్య జీవితాన్ని మలుపుతిప్పింది. ఇంటర్నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ ఎంట్రప్రెన్యూర్స్‌ గురించి ఓ ప్రొఫెసర్‌ ద్వారా తెలుసుకొని అప్లయి చేశాడు. వివిధ దేశాల నుంచి పలు ప్రాజెక్టుల కోసం ఎంపికైన 25 మందిలో సత్యకూడా ఉన్నాడు. త్రివేండ్రంలో 8 నెలలపాటు ట్రైనింగ్‌ ఇచ్చారు. దీంతో టెక్నికల్‌గా తాను ఏం చేయాలనే దాని మీద పూర్తి అవగాహన పెంచుకున్నాడు. ఇతరుల ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకొని ‘కాంతి’ అనే సోషల్‌ ఆర్గనైజేషన్‌కి శ్రీకారం చుట్టాడు. రైతుల జీవితానికి ఇది ఒక కాంతి కిరణంలా ఉండాలన్న లక్ష్యంతో పని మొదలు పెట్టాడు. ‘ఇల్లా ఎంటర్‌ప్రైజెస్‌'ను స్థాపించి, ఇండస్ట్రీలో ఉండే త్రీఫేజ్‌ స్టార్టర్‌ లాంటిది తయారు చేశాడు. దీనిద్వారా రైతులకు అతి తక్కువ ధరలో షాక్‌ప్రూఫ్‌ డివైజ్‌ను అందచేస్తున్నాడు. ఆలేరు సమీపంలోని ఒక గ్రామం నుంచి ఈ పనిని ప్రారంభించాడు. దీంతో పాటు.. మరికొందరు తనలా తయారవడానికి ఒక మెంటర్‌లా కూడా పనిచేస్తున్నాడు. ఇంకా, ‘నీతి అయోగ్‌ అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌'లో ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేస్తూ ఔత్సాహికులకు బాసటగా నిలుస్తున్నాడు సత్య. 

బాధ్యతని పెంచాయి.. 

 స్నేహితుడి మరణం నన్ను ఒక పరికరం రూపొందించేలా చేసింది. నా ప్రయోగానికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ మన రాష్ట్రంలో ఇంకా తెలియదు. తెలంగాణలో నా పరికరం గురించి వివరించే పనిలో ఉన్నా. 2019లో కామన్‌వెల్త్‌ దేశాల నుంచి ‘యూత్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ ఫర్‌ ఎక్సలెన్సీ డెవలప్‌మెంట్‌ వర్క్‌' అవార్డు అందుకున్నా. ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ స్టార్టప్‌'గా మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నా. ఈ రెండు గుర్తింపులూ నా బాధ్యతను మరింత పెంచాయి. ప్రస్తుతం ఒక ఇండస్ట్రీలా కాకుండా ఆర్డర్స్‌ వచ్చినప్పుడు మాత్రమే వీటిని రూపొందిస్తున్నా. నాతోపాటు నలుగురైదుగురు ఇంజినీర్లు కూడా పనిచేస్తున్నారు. నాగర్‌ కర్నూల్‌ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ ర్డెడి గారు పర్సనల్‌ ఇంట్రెస్ట్‌తో కొన్ని గ్రామాలకు మా స్టార్టర్లు తీసుకున్నారు. - సత్య ఇల్లా


logo