మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 00:54:40

అందమైన.. ఆటవిడుపు

అందమైన.. ఆటవిడుపు

సినిమాకు నృత్యం  అందమైన ఆటవిడుపు. వీక్షకుల్ని హుషారెత్తించి,  ఉర్రూతలూగించే  సాధనం. అందుకే చిత్రసీమలో కొరియోగ్రఫీ ముఖ్యభూమిక పోషిస్తున్నది. ‘పురుషాధిక్యం రాజ్యం చేసిన నృత్య దర్శకత్వంలో ప్రస్తుతం మహిళలు కూడా  రాణిస్తున్నారు. అంకితభావంతో శ్రమిస్తే మంచి పేరు సంపాదించుకోవచ్చు’ అని అంటున్నది కొరియోగ్రాఫర్‌ అనీ. ‘జ్యోతిలక్ష్మి’, ‘మహానటి’, ‘పైసా వసూల్‌' చిత్రాల ద్వారా చక్కటి గుర్తింపును తెచ్చుకుందామె. చిత్రసీమలో మహిళా నృత్యదర్శకుల ప్రయాణం, సవాళ్ల గురించి అనీ ‘బతుకమ్మ’తో పంచుకున్న మనోభావాలివి..

చిన్నతనం నుంచే నాకు డ్యాన్స్‌ అంటే ఏదో తెలియని మక్కువ ఏర్పడింది. ఐదారేండ్ల వయసులో స్టేజి షోలు చేశాను. పద్నాలుగేండ్ల వయసులో హైదరాబాద్‌లోని భద్రుకా కాలేజీ ఫ్రెషర్స్‌ పార్టీ కోసం డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ నిర్వహించాను. అలా చిన్న వయసులోనే కెరీర్‌ మొదలు పెట్టాను. 2004లో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌' సినిమాలో ‘నా పేరు కాంచనమాల..’ పాటకు అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా నృత్యరీతుల్ని సమకూర్చాను. అలా చిత్రసీమలో నా ప్రయాణం ఆరంభమైంది. సహాయ నృత్యదర్శకురాలిగా 450 సినిమాలకుపైగా పనిచేశాను. అనంతరం ‘జ్యోతిలక్ష్మి’ సినిమా టైటిల్‌ సాంగ్‌ ద్వారా కొరియోగ్రాఫర్‌గా జర్నీ స్టార్ట్‌ అయింది. ఇప్పటి వరకు 50కిపైగా పాటలకు కొరియోగ్రఫీ అందించాను.

పరిశ్రమలో మార్పులొస్తున్నాయి

వాస్తవానికి సినీరంగంలో మహిళా నృత్యదర్శకుల ప్రాబల్యం చాలా తక్కువ.  ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయి. మహిళలు కొరియోగ్రఫీని వృత్తిగా ఎంచుకుంటున్నారు. మాంటేజ్‌, పెండ్లిపాటలు, కుటుంబ  వాతావరణంలో చిత్రీకరించే న్యత్యాలు మాత్రమే లేడీ కొరియోగ్రాఫర్స్‌ బాగా చేస్తారు.. హీరోల ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌,  లార్జ్‌ కాన్వాస్‌లో తెరకెక్కించే పాటలకు న్యాయం చేయలేరనే అపోహ పరిశ్రమలో ఉంది. మహిళా నృత్యదర్శకుల్ని ఓ జోనర్‌ పాటలకే పరిమితం చేయడం భావ్యం కాదు. ఆ ఆలోచనా ధోరణిలో మార్పురావాలని కోరుకుంటున్నా. ‘పైసా వసూల్‌' సినిమాలో నేను బాలకృష్ణగారి పరిచయ గీతానికి నృత్యాన్ని సమకూర్చాను. దానికి మంచిపేరొచ్చింది.


పెద్దసినిమాలు అంత ఈజీ కాదు..

లేడీ కొరియోగ్రాఫర్స్‌కు పరిశ్రమలో కొన్ని పరిమితులుంటాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమా అవకాశాల్ని సొంతం చేసుకునే విషయంలో మగవాళ్లు ముందుంటారు. హీరోలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉండటం, వారి అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షించడం మహిళా నృత్యదర్శకులకు అంత సాధ్యం కాదు.  ఆఫీసుల దగ్గరకు వెళ్లి వెయిట్‌ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో లేడీ కొరియోగ్రాఫర్స్‌ బాగా స్ట్రగుల్‌ అవుతుంటారు. నేను కూడా పెద్దహీరోలతో పనిచేస్తున్నాను. అయితే వాళ్లతో ఇంట్రడక్షన్‌తోపాటు పవర్‌ప్యాక్డ్‌ పాటల్ని చేయాలనే అభిలాష ఉంది.

ముందే రిహార్సల్స్‌ చేస్తాం

సెట్స్‌లోకి వెళ్లే రెండు రోజుల ముందే నృత్యాలకు రిహార్సల్స్‌ చేస్తాం. కొన్నిసార్లు మాత్రం పాట షూట్‌ సందర్భంలోనే కొత్త ఐడియాస్‌ వస్తుంటాయి. హీరోలు కూడా కాస్త క్లిష్టమైన డ్యాన్స్‌ను రిహార్సల్స్‌లో ప్రాక్టీస్‌ చేసిన తర్వాతే సెట్స్‌ మీద పర్‌ఫార్మ్‌ చేస్తారు. ప్రస్తుతం నృత్యం శైలి విషయంలో సిగ్నేచర్‌ స్టెప్స్‌కు ప్రతీ సినిమాలో ప్రాముఖ్యం ఏర్పడింది. ఎందుకంటే మొత్తం పాటలోని నృత్యభంగిమల్ని ప్రేక్షకులు గుర్తుంచుకోరు. సిగ్నేచర్‌ మూవ్‌మెంట్‌ మాత్రమే బలమైన ముద్రను వేస్తుంది. ఈ మధ్యన ‘బుట్టబొమ్మ..’ పాటను తీసుకుంటే అందులోని సిగ్నేచర్‌ డ్యాన్స్‌ విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్స్‌ సిగ్నేచర్‌ స్టెప్స్‌పై  దృష్టి పెడుతున్నారు.సంప్రదాయ నృత్యంలో ప్రవేశం

కొరియోగ్రాఫర్స్‌కు నృత్యానికి సంబంధించిన విభిన్న శైలులను చేసి చూపించగలిగే నేర్పు ఉండాలి. ఏదో ఒక ైస్టెల్‌కే పరిమితమైపోతే పరిశ్రమలో రాణించలేరు. ఇక సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి వంటి వాటిలో తప్పనిసరిగా ప్రవేశం ఉండాలన్న నియమం ఏమీ లేదు. ఇప్పుడు పూర్తిస్థాయి భరతనాట్యాన్ని చేసి చూపించగల నాయికలు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ సినిమా కథాంశం నృత్య నేపథ్యంలో ఉంటే అందులో సెమీక్లాసికల్‌ నృత్యాల్ని కంపోజ్‌ చేస్తాం. నేను సల్సా, లాటిన్‌ అమెరికా డ్యాన్స్‌లు నేర్చుకున్నాను. అయితే ఆ ైస్టెల్స్‌ను సినిమాల్లో ఎప్పుడో కానీ ఉపయోగించం. సంప్రదాయ నృత్యం కథక్‌లో నాకు ప్రవేశం ఉంది. క్లాసికల్‌ డ్యాన్స్‌ తెలిసి ఉంటే మంచిదే కానీ...కేవలం వాటివల్లే పేరురాదు. ఇప్పుడున్న అగ్రశ్రేణి కొరియోగ్రాఫర్స్‌లో చాలామంది సంప్రదాయ నృత్యాల్లో ఏ మాత్రం ప్రవేశం లేకపోయినా సక్సెస్‌ అవుతున్నారు. ఓ పాటకు డ్యాన్స్‌ కంపోజింగ్‌ విషయంలో సంగీతమే ప్రేరణనిస్తుంది. పాట బీట్‌కు అనుగుణంగా, హీరోల బాడీలాంగ్వేజ్‌ను గమనించి స్టెప్స్‌ను రూపొందిస్తాం. సినీ రంగంలో నృత్యదర్శకులకు వృత్తిపరంగా సృజనాత్మక స్వేచ్ఛ ఉంది. డైరెక్టర్‌ మొదలుకొని ఆర్ట్‌ డైరెక్టర్‌ వరకు అందరూ మా అభిప్రాయాల్ని గౌరవిస్తారు. పాటకు సంబంధించిన సెట్‌ నిర్మాణంలో కొరియోగ్రాఫర్స్‌ సూచనల్ని పాటిస్తారు. సాంగ్‌ థీమ్‌, డ్సాన్స్‌ మూవ్‌మెంట్స్‌కు అనుగుణంగా సెట్‌డిజైన్‌ చేయాలి. ఈ విషయంలో డైరెక్టర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌,  కొరియోగ్రాఫర్‌ కలిసి నిర్ణయం తీసుకుంటారు. డ్యాన్స్‌ కంపోజింగ్‌లో మాత్ర పూర్తిగా కొరియోగ్రాఫర్‌కే స్వేచ్ఛ ఉంటుంది. ఈ విషయంలో మేం అదృష్టవంతులమే!

కష్టం ఇష్టంగా చేస్తాం..

ప్రతి ఒక్కరూ  తమలోని కలల్ని నెరవేర్చుకోవాలనే తపనతోనే పరిశ్రమలోకి వస్తారు. కాబట్టి, ఇక్కడ కష్టం అనే మాటకు అర్థం లేదు. పనిలో పర్‌ఫెక్షన్‌ కనబరుస్తూ అంకితభావంతో పనిచేస్తే మంచి ఫలితాల్ని సాధించొచ్చు. ఇప్పటివరకు చాలా సినిమాలకు పనిచేశాను. అయినా ది బెస్ట్‌ డ్యాన్స్‌ నంబర్‌ చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఇక పెద్ద సెటప్‌లో ఐటెమ్‌సాంగ్‌ చేయాలన్నది కూడా నా డ్రీమ్‌. ఇప్పుడు ప్రత్యేక గీతాలకు మేల్‌ కొరియోగ్రాఫర్స్‌నే ఎక్కువగా తీసుకుంటున్నారు. మహిళలు కూడా మగవాళ్లకు దీటుగా ఐటెమ్‌నంబర్స్‌కు డ్యాన్స్‌ కంపోజ్‌ చేయగలరనే  నమ్మకం నాకు ఉంది.

గమ్యాన్ని చేరుకోవాలంటే..

సినీ రంగంలో రాణించాలంటే ప్రతిభతోపాటు కాస్త అదృష్టం కలిసి రావాలి. ప్రస్తుతం ఎంతో మంది కొరియోగ్రాఫర్స్‌ వస్తున్నారు కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కావడం లేదు. అయితే ఇండస్ట్రీలో పోటీతత్వం ఎక్కువ. హార్డ్‌వర్క్‌ని నమ్ముకొని ఓపిగ్గా ఎదురుచూస్తే తప్పకుండా కోరుకున్న గమ్యాన్ని చేరుతాం. ప్రస్తుతం పూరిజగన్నాథ్‌ నిర్మిస్తున్న ‘రొమాంటిక్‌'లో నాలుగు పాటలకు నృత్యరీతుల్ని సమకూర్చాను. చాలా బాగా వచ్చాయి.     ‘లవ్‌స్టోరీ’ చిత్రంలో నాగచైతన్య, సాయిపల్లవిపై ఓ పాట రెండు రోజులు షూట్‌ చేశాం. లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ‘అజ్ఞాతవాసి’ ‘జ్యోతిలక్ష్మి’ ‘మహానటి’ సినిమాలు  నాకు వ్యక్తిగతంగా పేరుతో పాటు గొప్ప సంతృప్తినిచ్చాయి.-కళాధర్‌ రావు


logo