మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 00:33:52

మా.. మా.. మాస్క్‌!

మా.. మా.. మాస్క్‌!

కరోనా మహమ్మారి పుణ్యమా అని  మూతికి,  ముక్కుకి నిత్యం మాస్క్‌ తగిలించాల్సి వస్తున్నది. ఇంతకుముందైతే డాక్టర్లే వీటిని ధరించేవారు..  కానీ, ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి అయిపోయాయి.  అన్నింట్లోనూ కొత్తదనాన్ని వెతికే ఫ్యాషన్‌ డిజైనర్లు మాస్క్‌ల మీదా పడ్డారు. సర్జికల్‌,  ఎన్‌ 95 మాస్క్‌లకు దీటుగా.. సురక్షితంగా, అందంగా  తీర్చిదిద్దుతున్నారు.. 

ఫంకీతో ఫన్నీగా.. 

మాస్క్‌లోనూ ఫన్నీగా ఉండాలనుకొనే వారు పెరిగిపోయారు. ముఖ్యంగా పిల్లలు వీటిని ఎక్కువగా ఇష్టపడుతారు. పిల్లి, కుక్క, ఇతర జంతువుల బొమ్మలతోనూ మాస్క్‌లను రూపొందిస్తున్నారు. మరికొందరు క్రియేటివ్‌గా ఆలోచించి మామూలు మాస్క్‌ల మీదనే బొమ్మలు గీసి మురిసిపోతున్నారు. జంతువుల బొమ్మలతో వచ్చిన మాస్క్‌లు, స్కార్ఫ్‌లు మూతి చుట్టూ ముడుచుకుపోతున్నాయి. ఇవేకాకుండా ముక్కు సగం నుంచి దవడ వరకు ఫొటో తీసి, దాన్ని మాస్క్‌ మీద ప్రింట్‌ చేసే విధానమూ ఆకర్షిస్తున్నది. 

ప్రత్యేకంగా.. 

మాటలు రానివారికోసం కూడా కొన్ని ప్రత్యేక మాస్క్‌లు తయారుచేస్తున్నారు. కేవలం పెదాలు, చేతుల కదలికలతో వారు తాము చెప్పదలుచుకున్నది ఎదుటివారికి చేరవేస్తారు. కాబట్టి నోటి వరకు ట్రాన్స్‌పరెంట్‌గా ఉంచి, మిగతాది ఫ్యాబ్రిక్‌తో కవర్‌ అయ్యేలా ఈ మాస్క్‌లు ఉంటాయి. ఇక ఇవి కాకుండా టోపీలతోపాటు షీట్‌లా వచ్చేవి కూడా సందడి చేస్తున్నాయి. ఎండలో వెళ్లినప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు ఈ టోపీ మాస్క్‌ మిమ్మల్ని రక్షిస్తుందన్నమాట. గాలిని శుభ్రపరిచి మరీ అందించే మాస్క్‌ గాడ్జెట్‌లు.. ముఖాన్ని మొత్తం కవర్‌ చేసే ట్రాన్స్‌పరెంట్‌ మాస్క్‌లు.. ఇలా రోజుకో కొత్తరకం వస్తున్నాయి. ఇవికాకుండా మాస్క్‌లపై మరిన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. చూద్దాం..  మాస్క్‌ ఎన్ని వింత పోకడలు పోతుందో!ట్రెండీగా.. 

మాస్క్‌+స్కార్ఫ్‌ = మార్ఫ్‌ అని కొత్త నిర్వచనం చెబుతున్నారు ఫ్యాషనిస్టులు. పైన మాస్క్‌లా, కావాలనుకుంటే లోపలకి మలిచి స్కార్ఫ్‌లా కూడా వాడుకునేలా ఇవి రూపుదిద్దుకుంటున్నాయి. కళ్ల వరకు ఓపెన్‌గా ఉండి, తల మొత్తం కవర్‌ అయ్యేలా స్కార్ఫ్‌ కమ్‌ మాస్క్‌లూ దొరుకుతున్నాయి. వీటి ధర కూడా మూడొందల రూపాయల వరకూ ఉండటంతో చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. మ్యాచింగ్‌ మాస్క్‌..

ఒకప్పుడు ఒక చీర కట్టాం.. ఒక డ్రెస్‌ వేశాం.. దానికి తగ్గట్టుగా నగలు, ఇతర మేకప్‌ ఉండాలని అనుకొనేవారు. ఇప్పుడు మ్యాచింగ్‌ మాస్క్‌ కూడా కావాలనుకుంటున్నారు. పెండ్లికూతురు కట్టే చీర దగ్గర నుంచి రోజువారీ వేసుకునే బట్టలదాకా ప్రతి డ్రెస్‌కీ మ్యాచ్‌ అయ్యేలా మాస్క్‌లను వెతుకుతున్నారంటే అతిశయోక్తి కాదేమో! సేఫ్టీతో పాటు ష్యాషనబుల్‌గా ఉండాలనుకునేవారి సంఖ్య పెరుగుతుండటంతో ఫ్యాషన్‌ డిజైనర్లు రంగంలోకి దిగారు. కరోనా  మాస్క్‌లనూ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. logo