శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 00:25:52

ఎస్‌ ఫర్‌ సోప్‌... సుస్మిత

ఎస్‌ ఫర్‌ సోప్‌... సుస్మిత

పికాసో చేతిలో పిన్నీసు కూడా కళాఖండంగా మారిపోతుందట. వింతేముంది! మెదడులో కళ తొలుస్తుంటే... సబ్బుబిళ్లను కూడా షోకేసు బొమ్మలా రూపొందించవచ్చు. సుస్మిత జక్కులను చూస్తే ఆ మాట నిజమనిపిస్తుంది. డోనట్స్‌... పుచ్చకాయ ముక్కలు... ఐస్‌క్రీమ్‌... పువ్వులు... ఒకటేమిటి, ఆమె చేతిలో తయారయ్యే సబ్బులు ఏ రూపాన్నయినా సంతరించుకుంటాయి. ‘ద సోప్‌ టబ్‌ కో’ పేరుతో తక్కువ రసాయనాలతో... హ్యాండ్‌మేడ్‌ సబ్బులను  తయారుచేస్తున్నది సుస్మిత. ఆ సబ్బుల కథ ఏమిటో, వాటితో తన ప్రేమ ఎలా మొదలైందో ఆమె మాటల్లోనే...

నేను హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసేదాన్ని. ఓసారి ఎక్కడో సబ్బుల తయారీ వర్క్‌షాప్‌ ఉందని ఆన్‌లైన్‌లో మెసేజ్‌ కనిపించింది. కాలక్షేపం అవుతుంది కదా అని వెళ్లాను. రెండుమూడు గంటల ఆ వర్క్‌షాప్‌ నన్ను, నా ఆలోచనలను మార్చేసింది. అక్కడి నుంచి ముడిసరుకు తీసుకొచ్చి ఇంట్లో ఖాళీ దొరికినప్పుడు సబ్బులు తయారుచేయడం మొదలుపెట్టా. నాది చాలా సెన్సిటివ్‌ స్కిన్‌. అందుకని ముందు నా మీదే ప్రయోగాలు చేయడం ప్రారంభించా. ఇప్పటికీ నేను కొత్తగా రూపొందించే సబ్బులను నా మీదా, నా ఫ్రెండ్స్‌ మీదే ప్రయోగం చేస్తుంటా. ఎసెన్షియల్‌ ఆయిల్స్‌, ఇతర ముడిసరుకులు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్‌ చేసుకుంటా. మొదట రోజ్‌ మౌల్డ్‌తో సబ్బుల తయారీ మొదలుపెట్టా. వాటి ఫొటోలను నా ఫ్రెండ్స్‌, కొలీగ్స్‌కి షేర్‌ చేశాను. అవి వాళ్లకు నచ్చి తమ కోసం సబ్బులు చేసి ఇమ్మని అడిగేవాళ్లు. అలా అందరూ అడిగేసరికి మరిన్ని ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నా. 

ఆన్‌లైన్‌ సర్వీస్‌.. 

నాకు కాస్త క్రియేటివిటీ ఎక్కువే! ఇంట్లో వాళ్లు కూడా నా సృజన ఇంటికే పరిమితం కాకూడదనుకున్నారు. అందుకే నన్ను చాలా ప్రోత్సహించారు. నా సబ్బులను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టమని పట్టుబట్టారు. అలా ‘సోప్‌ టబ్‌' పేరుతో ఓ ఫేస్‌బుక్‌ పేజీ తెరిచాను. ఎవరైనా నచ్చితే, ఆర్డర్‌ చేస్తారు కదా అని మొదలుపెట్టా. మెల్లమెల్లగా ఆర్డర్‌లు ఆరంభమయ్యాయి. కొందరు రిటర్న్‌ గిఫ్ట్‌ల కోసం ఆర్డర్‌ ఇచ్చారు. కొందరు తమకు ఎలాంటి సబ్బులు కావాలో చెప్పి మరీ కస్టమైజ్డ్‌గా చేయించుకున్నారు. నా దగ్గర దాదాపు 25 అచ్చులు ఉన్నాయి.ఏదన్నా థీమ్‌ జోడించడం వల్ల అవి మరింత ఆకర్షణీయంగా మారతాయి.  సబ్బులు తెగనచ్చేసినా కొందరు వీటిని వాడకుండా, భద్రంగా దాచుకుంటున్నారని ఫీడ్‌ బ్యాక్‌ వచ్చింది. మిగతా సబ్బుల కంటే ప్రత్యేకంగా ఉండటం వల్లే... వాటికి అంత ఆదరణ లభిస్తున్నది.


సబ్బు భళా.. 

చర్మ సంబంధ వ్యాధులు ఉన్నవారు సమస్య పరిష్కారానికి కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. కాకపోతే నేను గమనించినంతలో, ఏ స్కిన్‌కి ఎలాంటి సబ్బు బాగుంటుందో చెప్పగలను. ఓసారి ప్రయత్నించండి.

పొడి చర్మానికి : మేక పాలతో చేసిన సబ్బు, షీ బటర్‌ సోప్‌, అలోవెరా సోప్‌.

మొటిమలు : చార్‌కోల్‌ సోప్‌. 

సమ్మర్‌ స్పెషల్‌ : పెప్పర్‌మింట్‌, ఆరెంజ్‌ సబ్బులు.

జిడ్డు చర్మానికి : బొప్పాయి, నిమ్మ సబ్బులు. 

పొలుసుల చర్మానికి: ఓట్స్‌ సోప్‌ వాడుకోవచ్చు.  

మరిన్ని వివరాలకు..ఇన్‌ స్టా the_soaptub_co, ఫేస్‌బుక్‌లో The soaptub co పేజీ చూడొచ్చు. logo