శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jun 21, 2020 , 00:16:43

లింగమ్మ..చెన్నూరి సుదర్శన్

 లింగమ్మ..చెన్నూరి సుదర్శన్

‘అమ్మా..  లింగమ్మచ్చింది. బొత్త సూయించుతాందే’.. అని లాసిగ కేకేసిండు రవి. 

‘వత్తాన.. ఆగుమనురా..’ వంటింట్లకెల్లి వాకిట్ల నిలబడ్డ లింగమ్మకు  ఇనచ్చేటట్టు అన్నది సుమతమ్మ.

లింగమ్మకు ఆకలైతాంటే ఎలుకలురికే తన బొత్త మీద ఎడ్మ చెయ్యితోటి సిన్నంగా కొట్టుకుంట సూయించుతది. కుడిచేతుల సత్తుగిన్నెను అటూ, ఇటూ  ఊపుతాంటది. అది ఊగే తీరు.. ఆమె ఆకలి పోరుకు మారు పేరు. అంతేగాని ఎప్పుడూ ‘నాకింత బువ్వ కావాలని’ నోరు తెర్సి అడుగది. సత్తు గిన్నెకున్న సొట్లు, ఆమె బతుకు గతుకుల పాట్లన్నట్టు దీనంగ సూత్తాంటై. దూపైనా మాట లేదు ముచ్చట లేదు.. సైగలే. ఎవ్వలైనా, ఎప్పుడైనా నీ పేరేందని అడిగితే మాత్రం.. ‘లింగమ్మ’ అన్కుంట నోరంత తెర్ర బెట్టి ఇకిలిత్తది. ఇంకేమడిగినా పిచ్చి సూపులే సూత్తాంటది. నోట్లెకెల్లి దారప్పోగుల్లెక్క సొల్లు కార్తాంటది. తుడ్సుకోవాలన్న ధ్యాస ఉండది. దువ్వెన మొకమెరగని  ఎంటికెలు, సబ్బు రుచి సూడని బట్టలే ఆమె మని మాణిక్యాలు. 

లింగమ్మ పెద్దగా.. ఈడు మీద పడ్డదేంకాదు. ఈ సందుల్నే యాడికెల్లి వచ్చిందో! ఎట్లచ్చిందో! తెల్వది. ఆ ఒక్క వాడల్నే.. ఒక్కొక్క పూట ఒక్కొక్కల ఇంటి ముందల అడుక్కుంట.. వాల్ల కడ్ప ముందల్నే తింటది. అదే గిన్నెల మంచి నీల్లు పోయంగనే తాగి మిగిలిన నీల్లను అటూ, ఇటూ లోపి పారబోత్తది. 

తినంగనే వాడ మొదట్ల ఉన్న పెద్ద చింతచెట్టు కిందికి పోతది. సింకి సాప, చిరుగుల బొంత  చెట్టు తొర్రల కెల్లి బైటికి తీసి పర్సుకొని, కాల్లు కడ్పులకు ముడ్సుకొని, పొయ్యిల పిల్లి పన్నట్టు పంటది. మల్ల ఆకలైనప్పుడే లేత్తది. 

సుమతమ్మ  డేగిసల ఉడుకుడుకు బువ్వ, కటోరల పొగలెల్లే పప్పుచారు తెచ్చింది. లింగమ్మ మొకం జరంత వాడిపోయి ఉండుడు సూసి గబ్బగబ్బ వడ్డిచ్చి, మంచి నీల్లు తెత్తనని ఇంట్లకుర్కింది. లింగమ్మ ఆత్రంగ  బువ్వల చెయ్యి పెట్టి, చెయ్యి సుర్రుమనంగనే.. ఊదుకుంట, ఊదుకుంట కల్పుకున్నది.  బుక్క నోట్లె పెట్టుకోంగనే భళ్ళున కక్కింది. 

అప్పుడే జగ్గుల నీళ్ళు తెచ్చి నిలబడ్డ  సుమతమ్మ బీర్పోయింది.

‘అరేయ్‌ రవీ’.. అని పిల్సింది. ఆమె కంట్లల్ల కలవరపాటు  కనబడేటాల్లకు ఒక్క అంగల సుమతమ్మ  ముందల వాలిండు రవి. వాకిట్ల లింగమ్మ కక్కుకున్నది సూసి డక్కు తిన్నడు.

‘బాబూ! ఆంబులెన్సుకు ఫోన్‌ సెయ్యిరా’ తత్తర పడుకుంట ఏగిర పెట్టింది. రవి సెల్‌ ఫోను కోసరం ఇంట్లకుర్కిండు. 

లింగమ్మ మల్లోపాలి నీల్లకు నీల్లు కక్కేటాల్లకు సట్న  ఆమె రెండు చెవులు  మూసి పట్టుకున్నది సుమతమ్మ. 

‘పప్పుచార్ల ఏమన్నా కలిసెనా..!’ అని దిమాకులకు  రాంగనే సుమతమ్మ కడ్పుల బెగడు సొచ్చింది. జగ్గుల నీల్ల తోని  లింగమ్మ మొకం, నోరు కడిగింది. సాయబాన్లకుర్కి మూలకున్న సాప, మెత్త తీస్కచ్చింది. అరుగు మీద సాప పర్సింది. లింగమ్మను నిమ్మలంగ పండుకోబెట్టి, నెత్తికింద మెత్తబెట్టింది. లింగమ్మ నీర్సంగ కండ్లు మూసుకున్నది. ఆమె నొసలు మీద చెయ్యి పెట్టిన  సుమతమ్మ మన్సుల ఆడతనపు అనుమానం మొదలైంది.

‘ఏమయ్యిందమ్మా’.. ఫోను సేసి, బైటకచ్చి బయం బయంగనే అడిగబట్టిండు  రవి.   

‘ఏమోరా..! నోట్లె ముద్ద పెట్టుకోంగనే కక్కింది. నాకు బుగులైతాంది’

‘బుగులెందుకమ్మా.. బువ్వల ఏమన్న కల్సిందనా.. కావాలంటే నేను తిని సూత్త సూడు అన్కుంట లింగమ్మకు పెట్టంగ మిగిలిన బువ్వల పప్పుచారు పోసుకో బోయిండు.

‘వద్దుర కొడుకా.. నీ బాంచెనూ’.. అన్కుంట రవి చేతిల కెల్లి లటుక్కున కాటోరను గుంజుకున్నది సుమతమ్మ. ఆమె గుండె గుభేలుమన్నది. 

రవి లేక, లేక పుట్టిన కొడుకాయె.. డిగ్రీ సేత్తాండు. వానెన్కాల మల్ల సుమతమ్మ కడుపు పండలేదు. పంచపానాలన్నీ వాని మీదనే పెట్టుకున్నది.

‘అంబులెన్సు రానియ్యిరా.. లింగమ్మను దవాఖాన్లకు తీస్కపోయి పరీచ్చలు సేసినంకనే.. అందాక ఏయీ ముట్టద్దు’ అన్కుంట డేగిసె, కటోర ఇంట్లకు తీస్కపోతాంటే అంబులెన్సు వత్తాన్న సప్పుడైంది. దబ్బ, దబ్బ  ఇంట్ల అన్ని సదిరి వచ్చింది.

‘గీ పిచ్చిదాని కోసరమా!’ ఫోన్‌ సేసింది అని కారడ్డంగ మాట్లాడబట్టిండు డైవరు సాబ్‌.

కనుగుడ్లు ఎల్లబెట్టి  కోపంగ ఒక సూపు సూసింది సుమతమ్మ.

‘పిచ్చిదని అనొద్దు. ఆమె మన్సుకు రోగం తాకింది. అంతమాత్రాన ఆమె మనిషి కాదా? ఆమెకు వైదుగం వద్దా?’ అని సుమతమ్మ  అడిగేటాల్లకు వాని కుత్కెలు దగ్గర పడ్డై. 

‘మా నాయ్న  పోలీసు. ఎక్కువ తక్కువ మాట్లాడినవనుకో.. ఈ వీడియను వాట్సాప్‌ ల పెడ్త’ అని బెదిరిచ్చిండు రవి. ఎంతైనా ఉడుకు రకుతం కదా..! మల్ల పోటువలు, వీడియలు తీసుడంటే ఖాయసెక్కువ.

‘పంతులమ్మ తోని ఎప్పుడు గిదే గోస’ అని మన్సుల గులుక్కుంట, ఇంక తప్పదన్నట్టు సరే పోదామని.. ఇషార సేసిండు డైవరు సాబ్‌.

సుమతమ్మ లింగమ్మ రెక్క పట్టుకుని అంబులెన్సు ఎక్కిచ్చి పండుకో పెట్టి పక్కకు కూకున్నది. 

దవాఖాన్ల సుమతమ్మ  దోస్తు రజియా డాకుటరమ్మ ఎదురైంది. రజియా, తను నెలా, నెలా ‘మేరీ మాత’ అనాదాస్రంల కల్సుకుంటరు. అనాదలకు తను పండ్లు పంచిపెడితే.. రజియా పరీచ్చలు సేసుకుంట మందులిత్తది. గట్ల ఇద్దరికీ  జిగ్రీ దోస్తానీ కుదిరింది.

రజియాకు విసయం పూసగుచ్చినట్టు సెప్పింది సుమతమ్మ. బయపడకని దైర్నం సెప్పి లింగమ్మను పరీచ్చలు సేసే  కమ్రలకు తీస్క పోయింది. సుమతమ్మ  బిక్కు, బిక్కు మనుకుంట గోడ పొంటి కుర్సీల కూకున్నది.

గంట తరువాత రజియా వచ్చి ‘బువ్వల ఇసం లేదు సుమతమ్మా’.. అనంగానే.. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్సుకున్నది సుమతమ్మ. ‘లింగమ్మకు గంజినీల్లు ఇముడ్త లేవు. గందుకే  కక్కుకున్నది. లింగమ్మకిప్పుడు మూడోనెల’ అని సల్లంగ సెప్పింది.  సుమతమ్మ అప్సోసైంది. తన అనుమానం నిజమైంది.

‘ఈ జాన్వర్లకు (పశువులకు) ఆడది కనబడితే సాలు. వావి వరుసలు మర్సి  ఆడోల్ల  జిందగీలు  కాలరాత్తాండ్లు’ అన్నది రజియా ఈసడిచ్చుకుంట.   

‘లింగమ్మ హాలత్‌ సూసైనా ఆ రాచ్చసునికి పాపమనిపియ్య లేదంటే వాడెంత  కసాయోడో..! తెల్తాంది. వాన్ని, ఊరి బొడ్రాయి దగ్గర  ఉప్పు పాతరెయ్యాలె’ అన్నది  రజియా ఎన్కాల వచ్చిన నరుసమ్మ. 

సుమతమ్మ మన్సుల తర్వాత జరుగాల్సిన పనులన్నీ సీన్మ రీల్ల లెక్క తిర్గబట్టినై. 

‘రజియా..! లింగమ్మను అనాదాస్రంల షరీకు చేత్త’ అన్నది సుమతమ్మ. రజియా ఆమె పైస్లాను మెచ్చుకున్నది. తన వంతు సాయం అందిత్తనని సేతిల సెయ్యేసి సెప్పింది.

లింగమ్మను తీస్కోని ఆటోల సక్కంగ అనాదాస్రమానికి పోయింది సుమతమ్మ. రజియా ఫోను సేసినట్టున్నది. ఆశ్రమాన్ని నడిపే నాన్సీ,  లింగమ్మకు కావాల్సిన ఏర్పాట్లన్నీ ముందే సేసి పెట్టింది. రిజిస్టర్ల లింగమ్మ పేరెక్కిచ్చి పైసలు కొన్ని కట్టిచ్చుకున్నది. 

సుమతమ్మ సర్కారు  బల్లె పంతులమ్మ. నిత్తె బడికి పోంగ, రాంగ లింగమ్మ బాగోగులు సూసుడు, కొత్త, కొత్త బట్టలు కొని పట్టుక పోవుడు.. పండ్లు తినిపిచ్చి వచ్చుడు  పనిగ పెట్టుకున్నది. రజియా డాకుటరమ్మ వారానికోపాలి లింగమ్మను పరీచ్చలు సేసుకుంట మందులిచ్చేది. నాన్సీ లింగమ్మను కన్న బిడ్డ లెక్క అర్సుకునేది. 

సూత్తాంటె, సూత్తాంటెనే ఆరునెలలు గడ్సినై. బడికి ఎండాకాలం తాతిల్లు.. రవికి డిగ్రీ తొల్త యాడాది పరీచ్చలై ఇంటి కాడనే ఉండేటాల్లకు నాన్సీ ఎక్కువ లింగమ్మ దగ్గర్నే ఉండి పొద్దుగూకంగ ఇంటికి రాబట్టింది సుమతమ్మ. 

అవ్వాల తెల్లారగట్ల ఫోను మోగింది. దాని కోసమే ఎదురి సూత్తానట్టు సుమతమ్మ  దిగ్గున లేసి ఫోనెత్తింది. 

‘సుమతమ్మా.. లింగమ్మకు పురిటి నొప్పులత్తానై. దావఖాన్లకు తీస్కపోతానం’ అని సెప్పి ఫోను పెట్టేసింది నాన్సీ.

‘గింత పొద్దుగాల ఎవరిదే ఫోను’.. అని కైక్కుమన్నడు  పెనిమిటి పెంటయ్య.

అనాదాస్రమం నుండి  నాన్సీ సేసింది. అర్జంటుగ రమ్మంటాంది. పొయ్యత్త’ అన్కుంట లేసి సుమతమ్మ ఆగమాగంగ తయారై బయలెల్లింది.

సుమతమ్మ ఆటో రిచ్చ  దిగి దవాఖాన్ల  అడుగు పెట్టేటాల్లకు నాన్సీ  ఏడ్పు మొకం తోటి ఎదురైంది.  

‘లింగమ్మకు  కాన్పు కట్టమైతాందట.. బిడ్డ అడ్డం తిరిగిందట.. ఆప్రేషన్‌ చెయ్యాలట.  నీ కోసరమే సూత్తానం’ అనంగానే సుమతమ్మ  డంగు తిన్నది. 

ఇంతల నరుసమ్మ వచ్చి రిజిస్టర్ల సుమతమ్మ దస్తకత్‌ తీసుకొని పోయింది.

గంట గడ్సింది. గండం గడవక పాయేనని సుమతమ్మ మిడ్కబట్టింది. దమ్ము పట్టుమన్నట్టు చెయ్యి తోటి సైగ  సెయ్య సాగింది నాన్సీ.

మల్లో గంటకు రజియా డాకుటరమ్మ మొకం న్యాలకేసుకొని వచ్చుడు సూసి సుమతమ్మ పానం ధస్సుమన్నది. 

‘సారీ సుమతమ్మా.. శాన కోషీష్‌ సేసిన. పుట్టిన పిల్ల బాగానే ఉన్నది కాని పెద్ద పానాన్ని కాపాడ లేక పోయిన’ అన్నది రజియా.. బాధనంతా దిగ మింగుకుంట. ఆమె కండ్లల్ల  సన్నని కన్నీల్ల పొర..

సుమతమ్మ,  నాన్సీ భుజంమ్మీద  వాలిపోయింది. ఆమె కండ్లు  కన్నీల్ల పటువలైనై. రజియ, సుమతమ్మ ఈపు మీద సెయ్యేసి  నిమురుకుంట.. ‘సుమతమ్మా.. ఇంక  జరగాల్సిన పని సూడు’ అన్నది.  తోడెం సేపటికి గుండె దిటవు సేసుకొని తేరుకున్నది  సుమతమ్మ.

‘లింగమ్మను  మా అస్రం తరఫున దానం చేపిత్త. బిడ్డ ‘మదర్‌ థెరీసా’ పిల్లల అనాదాస్రమంల పెరుగుతది. నువ్వేం ఫికరు సెయ్యకు’ అన్నది  నాన్సీ.  సుమతమ్మ వద్దన్నట్టు చెయ్యి అడ్డంగా ఊపింది. 

పాపను నేను పెంచుకుంట. లింగమ్మ తల గొరివి నా కొడుకు రవి  తోని  పెట్టిత్త అన్నది. ఆమె అముర్తపు వాక్కులు  విని రజియ మన్సుల ‘అల్లా’కు మొక్కుకున్నది.  

లింగమ్మ ఎవలు  కన్న బిడ్డనో..! ఒక సల్లని తల్లి సేతుల మీదుగ దానమవుడు.. ఆ జీసెస్‌ మీ కుటుంబాన్ని సల్లంగ సూత్తడు అన్కుంట నాన్సీ దీవెనె లిచ్చింది. ముగ్గురు  కలిసి విసారంగ సంటి బిడ్డ దగ్గరికి పోయిండ్లు. లింగమ్మ కుడి సెయ్యి పక్కనే  తన కన్న బిడ్డ పండుకున్న  ఉయ్యాల ఊచ పట్టుకుని ఊపుతానట్టు కనబడ్తాంది. ఉయ్యాల్ల పసికూన నిద్రమత్తుల తల్లి దగ్గర సనుబాలు తాగుతానట్టు పెదువులు సప్పరిత్తాంది. అది సూత్తాంటే ఎంతటి రాతి గుండ్లైనా కరుగక మానై.

సుమతమ్మ అనుకున్నట్టు లింగమ్మ దానమైంది. 

లింగమ్మ బిడ్డను ఒల్లె ఒత్తుకొని, రవిని తీస్కోని ఆటోల ఇంటికచ్చింది సుమతమ్మ. గల్మ ఈవల్నే నిలబడి రవిని ఇంట్లకు పోయి బకిట్ల నీల్లు తెమ్మన్నది. తలుపు తాలం తీసి కడ్పల అట్ల కాలు పెట్టిండో లేదో..! పిడుగు మీద పడ్డట్టు  పత్తెచ్చమైండు పెంటయ్య. గజ్జున వన్కిండు రవి. పొయ్యిల కెల్లి అప్పుడే తీసిన కొర్కాసు లెక్క ఎదురుంగ  నిలబడ్డ పెంటయ్య కండ్లు చింత నిప్పుల్లెక్క చిట, పటలాడబట్టినై.

‘అంతా మీ ఇట్టమేనా.. నేను సచ్చిన్ననుకున్నరా? అవ్వ, కొడుకులు కలిసి అనాదాస్రమాల సుట్టు తిర్కుంట మా అసోంటి దెసమంతులు దేసంల లేరని సాటింపు సేత్తాండ్లా..! మీ చేట్టలకు నేను తల్కాయె  ఎత్తుకొని తిరుగలేక పోతాన’ అని పెద్దపులి లెక్క గాండ్రిచ్చిండు.

‘నాయ్నా మమ్ముల్ని లోపల్కి రానియ్యి. తాత్పరంగ మాట్లాడుకుందాం. గిట్ల బజాట్ల ఒర్రుడేంది’ అన్కుంట రవి సొచ్చుకొని సక్కంగ ఇంటెన్కకు  పోయిండు. సుమతమ్మ వంగి, వంగి   పెంటయ్య కాల్లు మొక్కుతా అన్నట్టు సైగలు చేత్తాంటే.. చీదరించుకుంట పోయి తట్టు కుర్సిల కూలబడ్డడు.

రవి బకెట్ల నీల్లు తెచ్చి కడ్పల సగం కుమ్మరిచ్చిండు. మగ్గుల తోడెం నీల్లు తీస్కోని సుమతమ్మ, పసిబిడ్డ  పాదాలు కడిగిండు. దేవుని అర్రలకు పోయి ఎంకన్న పోటువ ముందల ఉన్న కుంకుమ, పువ్వులు  తెచ్చిండు. ఇద్దరికి బొట్లు పెట్టిండు. తొవ్వల వత్తాంటే కొనుక్కచ్చిన కొబ్బరికాయె వాల్ల సుట్టు తిప్పి న్యాలకు కొట్టిండు. సంటిదాని సేతిల ఒక పువ్వు, రూపాయి బిల్ల పెట్టి ఇంట్లకు రమ్మన్నట్టుగా పబ్బతి పట్టిండు.

ఈ తతంగమంత సూసుకుంట అగ్గి మీద గుగ్గిలమయ్యిండు పెంటయ్య.

‘అయ్యగారి గోత్రాలు అమ్మగారికే’ ఎరుక అన్నట్టు పెంటయ్య సంగతి పురంగ తెలిసిన సుమతమ్మ నోరిప్పలేదు. సెప్పే టైంల సెప్పి ఒప్పియ్యాలె అనుకున్నది.

లింగమ్మ బిడ్డను తొట్టెలేసే పనిల మునిగింది సుమతమ్మ. రవి ఇంటి  డెకొరేసన్‌ పనిల పడ్డడు. తెల్లారితే ఇరవై ఒక్క దినం పండుగ.

పెంటయ్యకు అరికాలి మంట సుర్రున మాడ కంటింది. ‘పాపం..! అయ్యా, అవ్వ లేని పొల్ల..  సాదుకుంటే పున్నెమా అనుకున్న గాని గీ పండుగలు పబ్బాలు సేసుడేంది.. పైసలు  నీల్ల లెక్క కర్సు సేసుడేంది..  తన తడాఖ సూయించంది దారికి వచ్చేటట్టు లేద’నుకున్నడు. ఆ నాత్రి ఎప్పటి లెక్కనే ఫుల్లుగ మందు కొట్టి  పెద్ద లొల్లి మోపు సేసిండు. బూతుల పురానం ఇప్పుకుంట..  సుమతమ్మ మీద సెయ్యి సేసుకున్నడు.

ఆ పోరిని తొట్టెల ఎట్ల ఏత్తరో సూత్త. తెల్లారేటాల్లకు తగల పెడ్త సూడుండ్లి అని  సొలుక్కుంట,  సొలుక్కుంట తన కమ్రాలకు పోయిండు. బీరువల నుండి ఇంకో ఫుల్లు బాటల్‌ తీస్కోని డాబ మీదికి ఎక్కిండు.

కన్నతల్లి మీద సెయ్యి పడేటాల్లకు రవి ఓర్సుకోలేక పోయిండు. ఒళ్ళు బగ్గుమన్నది. కోపంగ పెంటయ్య దగ్గరికి ఉరికిండు. తన సెల్‌ ఫోన్ల వీడియోను ఆన్‌ సేసి ముందలేసిండు. తదుపరి  పోటువలను సూయించిండు. వాటిని సూడంగనే పెంటయ్య తల్కాయె కెక్కిన నిస కాల్ల కాడికి ఉతారైంది. కట్టెసర్సుక పోయిండు.

రవి రకుతం సల, సల మసులబట్టింది. ముక్కుపుటాలెగురేసుకుంట..

‘ఆ టైంల నేను సీన్మ సూసి వత్తాన. జరంత ముసురు సురువైంది. మన వాడల తొవ్వ పొంటి ఉన్న చింతచెట్టు కిందికి ఉర్కచ్చేటాల్లకు లింగమ్మనెవలో కరాబు సేసుడు కనబడ్డది. భయపడుకుంట, భయపడుకుంట పోటువలు, వీడియ  తీసిన. ఇంటికచ్చి సూసి అప్సోసైన. నీ మీద రోత పుట్టింది. దొంగ సారా పట్టుకునే పోలీసువు. జనాలకి బుద్ధి సెప్పేది పోయి.. నువ్వే తాగి గిట్ల తైతక్క లాడితే ఎట్ల. తాగద్దని  అవ్వా నిత్తె నెత్తీ నోరు కొట్టుకుంట చెబ్తాంటది. మైకంల  నువ్వు ఏం సేత్తానవో.. నీకు తెల్తాందా..  ఇది నలుగురికి తెలిత్తే మన తల్కాయెలు యాడ పెట్టుకుందామో..!  సెప్పు.  

ఇంకా అమ్మకు తెల్వది. తెల్తే యాడ గుండె పగిలి పోతదో అని నా అండ్ల నేనే కుమిలి, కుమిలి సత్తాన. నేను పానం పోయినా సెప్ప గాని నువ్వే తాగిన మత్తుల మాట బైట పెడ్తవని బయమైతాంది. తాగి మాట జార్తవో..! లేకుంటే  తాగుడు బందు సేసి ఈ రగస్యం కడ్పుల దాసుకుంటావో..! నీ ఇట్టం. మన కుటుంబ మర్యాద నీ సేతుల్ల ఉన్నది. 

అమ్మ గునం నాకంటే నీకే ఎక్కువ ఎరుక. శాన ఉత్తమురాలు. ఎవల కట్టాలూ సూడ లేదు. అడిగినా, అడుగకున్నా నలుగురికి సాయం సేసే పున్నెమూర్తి.  

లింగమ్మ  తన బిడ్డను కండ్లార సూసుకోకుంటనే కాలం సేసింది. ఆమె బిడ్డను చెత్త కుప్పల పారేసుడు నాయం కాదని  అమ్మ  తన ఒల్లెకు తీసుకున్నది. నా సెల్లెలని నేను సుత  సంబురపడ్తాన. రేపు సెల్లెను తొట్టెలేత్తాంటె నువ్వు గనుక లొల్లి పెట్టినవనుకో.. మన కుటుంబం పరువే పోతది. 

నాయ్నా.. నీతోని గిట్ల మాట్లాడుడు వత్తదని నేను కలల సుత అనుకోలేదు. ఒక తండ్రి, కొడుకుతోని సెప్పించుకునే మాటలేనా ఇవి. చెట్టంత కొడుకును, దేవతసొంటి అమ్మను ఇంట్ల పెట్టుకొని సిగ్గుమాలిన పని సేసింది గాక, సెయ్యి సేసుకుంటవా?’ అంటాంటే రవి కంట్లె నీల్లు వాగుల్లెక్క కారబట్టినై. రెండు సేతులతోని  తుడ్సుకొని..  దండం పెట్టుకుంట డాబా దిగిండు రవి.

లాక్‌ డౌన్‌ రోజులల్ల శానా రోజులకు ఎర్రటి ఎండల పొద్దంతా నిలబడితే దొరికిన ఫుల్‌ బాటిల్‌ పుసుక్కున జారి  కింద పడి పగిలినట్టు మొకం పెట్టిండు పెంటయ్య.

నిత్తె పొద్దుగాల విస్కీ తోని మొకం కడుక్కొని.. ముస్కరాయించుకుంట మల్ల విస్కీ  కొట్టే పెంటయ్య బతుకు బండి అయ్యాల గరం, గరం చాయె తోని సాగే టాల్లకు రవి, సుమతమ్మ తెగ సంబురపడ్డరు. 

ఇంటి సుట్టు బుడ్డ లైట్లు మినుక్కు, మినుక్కు మనుకుంట మెర్వబట్టినై.  సుట్టాలు, పక్కాల  తోటి ఇల్లు కళ, కళ లాడుతాంది. రవి సయంగ తొట్టెను పూల దండల  తోని అలంకరిచ్చిండు. సుమతమ్మ తొట్టెల తాప, తాపకు అరసెయ్యి  పెట్టి  ఒత్తుక పోకుండ మెత్తగ ఉన్నదా..! అన్నట్టు  ఒత్తి, ఒత్తి సూడబట్టింది.

సుమతమ్మ పక్కకు పీటమీద పిల్లి కూనలెక్క కూకున్నాడు పెంటయ్య.

అయ్యగారు మంత్రాలతోని ఇల్లంత దేవుని గుడిలెక్క మారిపోయింది.

పాప పేరును బియ్యంల బంగారు ఉంగరం తోని  రాయాలని అయ్యగారు అనంగనే నా చెల్లె పేరు ‘లీలావతి’ అని సాటింపు సేసిండు రవి. లింగమ్మ పేరు లోని మొదటి అచ్చరం ‘లీ’ కలుత్తదని.. మీది కెల్లి అది రవి నాయనమ్మ పేరు. ఇవ్వాల్టి సంది మా నాయ్న తన తల్లి పేరు తోని చెల్లెను పిలవాల్సి వత్తదని రవి ఆలోసన.

సుమతమ్మ సుత అదే పేరును కరారు సేసింది. పెంటయ్య తాంబాలంలోని బియ్యం మీద తన తల్లి పేరును రాయక తప్పలేదు. సుమతమ్మ పాపను ఎత్తుకొని అందరికి సూయించుకుంట.. ‘ఈ పాప దేవుడు సిన్న సూపు సూసిన లింగమ్మ బిడ్డ. ఇప్పుడు నా బిడ్డ లీలావతి.. నాపానం’ అన్నది. 

ముత్తైదువల సందుల.. లీలావతిని తొట్టెల పండబెట్టి జోలపాట పాడసాగింది సుమతమ్మ.  

చెన్నూరి సుదర్శన్‌, 94405 58748 


కథలకు ఆహ్వానం 

జీవితంలో ఎన్నో మలుపులుంటాయి. ప్రతీ మలుపు ఒక మరుపురాని యాది. దాని చుట్టూ అల్లుకొని అనేకానేక కథలు.. వ్యథలు.. ప్రకృతితో, పరిస్థితులతో పెనవేసుకున్న మానవ సంబంధాలు ఉంటాయి. ఏమో.. అవన్నీ కథా వస్తువులే కావచ్చు. మనిషి సర్వ సాధారణమైన ఊహలు.. భావనలు.. పరిశీలనలు.. జీవన వైవిధ్యాల చుట్టూ అల్లుకున్న అలాంటి కథలకు ‘బతుకమ్మ’ స్వాగతం పలుకుతున్నది. కథనంలో కొత్తదనం.. సరళత.. సంక్షిప్తత ఉండాలి. చేతిరాత అయితే ఎనిమిది పేజీలు, డీటీపీ అయితే ఆరు పేజీలకు మించకూడదు.

మీ కథలు పంపాల్సిన చిరునామా.. 

బతుకమ్మ, నమస్తే తెలంగాణ, 8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్‌-10, 

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034. ఈ-మెయిల్‌: [email protected]


logo