శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jun 14, 2020 , 00:25:52

రెండోసారి.. మల్లాది వెంకట కృష్ణమూర్తి

రెండోసారి.. మల్లాది వెంకట కృష్ణమూర్తి

జాన్‌ మొహాన్ని వెదుకుతున్నట్లుగా ఇమిగ్రేషన్‌ ఆఫీసర్‌ పరిశీలనగా చూశాడు. తర్వాత జాన్‌ ఇచ్చిన టూరిస్ట్‌ కార్డ్‌లోని ‘జాన్‌ హార్పర్‌' అనే పేరుని చూశాడు. అతను కౌంటర్‌ ముందునించి నడిచి వెళ్ళేప్పుడు కూడా ఇమిగ్రేషన్‌ ఆఫీసర్‌ అతనివంకే చూడసాగాడు.జాన్‌ కస్టమ్స్‌లోని తన సూట్‌కేస్‌ తీసుకుని సెయింట్‌ జోసెఫ్స్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రధాన భాగంలోకి రాగానే పోస్ట్‌బాక్స్‌లో రెండు ఉత్తరాలని పోస్ట్‌ చేశాడు. తర్వాత టాక్సీ తీసుకుని అంతకు మునుపు తన భార్య నార్మాతో వచ్చినప్పుడు బస చేసిన మేన్షన్‌ ఎటాయిల్‌ అనే హోటల్‌కి చేరుకున్నాడు. దాని యజమాని మేక్స్‌ అతనితో కరచాలనం చేస్తూ మర్యాదగా చెప్పాడు.

“మీరు అసలు కొద్దిగా కూడా మారనే లేదు జాన్‌. నార్మా ఎలా ఉన్నారు?”

“నేను ఇక్కడికి వచ్చినట్లు ఆమెకి తెలీదు మేక్స్‌.”

మేక్స్‌ సూట్‌కేస్‌ అందుకుని మెట్లెక్కి గదివైపు దారి తీసాడు. గతంలో దాన్ని అతను ‘హనీమూన్‌ సూట్‌' అని జోక్‌గా చెప్పడం జాన్‌కి గుర్తొచ్చింది. అది ఆ హోటల్లోని మంచి గది. బాల్కనీలోంచి ‘పార్క్‌ డి ఇండిపెండెన్స్‌ స్క్వేర్‌'లో మెరిసే తెల్లటి ఏలిస్‌ నేషనల్‌ కనిపిస్తుంది. 

“అది చూస్తూంటే మీకు గత స్మృతులు గుర్తుకు వస్తున్నాయా?” మేక్స్‌ నవ్వుతూ అడిగాడు.

“జ్ఞాపకాలు వస్తున్నాయి కాని మంచివి కావు” జాన్‌ నెమ్మదిగా వెనక్కి తిరిగి చెప్పాడు.

మేక్స్‌ ఆశ్చర్యంగా చూశాడు.

“మీకు ఎప్పుడూ నేను ఎమిలీ నెరెటా రాజకీయ ప్రగతి గురించి ఉత్తరాలు రాయమని ఎందుకు అడిగే వాడినో తట్టలేదా?” జాన్‌ ప్రశ్నించాడు.

“మీకు అతని కెరీర్‌లో ఆసక్తి ఉందని చెప్పారు” మేక్స్‌ జవాబు చెప్పాడు.

“నాకు ఎందుకు ఆసక్తి ఉందో మీరు ఊహించలేరా? మీరు మీ మిత్రులని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగరని నాకు తెలుసు. పేలస్‌ గార్డ్‌ నా భార్యని అరెస్ట్‌ చేసి హెడ్‌క్వార్టర్స్‌కి తీసుకెళ్ళిన రాత్రి మీకు గుర్తుందా?”

“గుర్తుంది. ప్రెసిడెంట్‌ కాన్వాయ్‌ వెళ్తున్నప్పుడు తన కారుని ఆపనందుకు మీ ఆవిడని అరెస్ట్‌ చేశారని గుర్తుంది. మనం ఆమె కోసం గంటలు తరబడి వెదికి చివరికి ఈ గదికి తిరిగి వచ్చాక ఏడుస్తూ కనిపించడం గుర్తుంది. తను అప్‌సెట్‌ అయ్యానని, తనకేం హాని జరగలేదని కూడా నార్మా చెప్పింది.”

“అది నిజం కాదు. అది నాకు కొన్ని వారాల తర్వాత తెలిసింది. ఆమెని బలాత్కరించారు.”

“ఓ మై గాడ్‌!” మేక్స్‌ వెంటనే బాధగా చెప్పాడు.

“అది ఎమిలీ నెరెటా పని. అప్పుడు పేలస్‌ గార్డ్‌ చీఫ్‌. ఇప్పుడు మీ ప్రెసిడెంట్‌.”

“మీరు తిరిగి రావడానికి కారణం ఇదేనా?” మేక్స్‌ భయంగా అడిగాడు.

“అతన్ని చంపడం ఒక్కటే సరిపోదు. ఈ దేశంలో మనుషులు ఎప్పుడూ హింసాత్మకంగా మరణిస్తూనే ఉంటారు. నెరెటా ప్రెసిడెంట్‌ అవాలనే కాంక్షతో ఉన్నాడని మీరు కొన్ని ఉత్తరాల్లో రాశారు. మంచిది అనుకున్నాను. మరో ఉత్తరంలో సెయింట్‌ జోసెఫ్‌ నగరంలోని అంతా కోరుకునే ఒకామెని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడని కూడా మీరు రాశారు. అదీ మంచిదే అనుకున్నాను. ఆమెని పెళ్ళి చేసుకుని కొడుకునో, కూతుర్నో కన్నాక అతను మరణించే సమయం వచ్చినప్పుడు బ్రహ్మచారిగా కన్నా అతను కోల్పోయేది చాలా ఉంటుంది.”

“నిజమే. ఇప్పుడు భార్య, కొడుకు, రిపబ్లిక్‌ అధ్యక్ష పదవులని అతను తన మరణంతో కోల్పోతాడు. మీకు పిచ్చెక్కింది మిత్రమా. మీరు అతని సమీపానికే వెళ్ళలేరు. ఈ దేశంలో అధ్యక్షుడికి శత్రువులు ఎక్కువ కాబట్టి, అతన్ని సదా కాపాడే వాళ్ళు కూడా ఎక్కువే.”

“నేను అవన్నీ ఆలోచించే వచ్చాను.”

“మీరు ఎవరో ఎవరైనా గుర్తుపడితే? ఉదాహరణకి ఒకరు వెళ్ళి ఆయనతో ‘ఆ అమెరికన్‌ భర్త మళ్ళీ వచ్చాడు’ అని చెప్తే? అలా చెప్పేవాళ్ళు ఇక్కడ ఎక్కువ. ఈ దేశానికి తక్కువమంది అమెరికన్స్‌ వస్తారు. తరచూ జరిగే రాజకీయ సంక్షోభాలు పర్యాటక పరిశ్రమని నాశనం చేశాయి.”

జాన్‌ నవ్వి కఠినంగా చెప్పాడు.

“నేను అతని దగ్గరకి వెళ్తాను మేక్స్‌. నేను రెండు ఉత్తరాలు ఇంట్లోనే రాసి విమానాశ్రయంలో వాటిని పోస్ట్‌ చేశాను. గతంలో నార్మా ఇక్కడ సావనీర్‌గా కొన్న స్టాంపులని ఉపయోగించాను. అవి నన్ను రక్షించడమేకాక నన్ను పేలెస్‌లోకి అనుమతించి నెరెటాని ముఖాముఖీ కలిసేలా సాయం చేస్తాయి.”

“అది అసాధ్యం... ఐనా ఎలా?” మేక్స్‌ 

ప్రశ్నించాడు.

“నేను మూడేండ్లుగా ఈ పథకాన్ని రచిస్తున్నాను. ఆ ఉత్తరాలు బట్వాడా అయ్యేదాకా నేను ఆగాలి. అంటే, రేపటిదాకా. ఆ తర్వాత అంతా సులువని మీరే గ్రహిస్తారు. నేను టూరిస్ట్‌ కార్డ్‌లో మారు పేరుని ఉపయోగించాను. చాలా కాలమైంది. మనిద్దరం కలిసి తాగుదాం” జాన్‌ చెప్పాడు.

మేక్స్‌ అతని గదిలోని బాల్కనీలోకి వెళ్ళి ఆ స్క్వేర్‌లో అవతలి వైపున్న ఏలిస్‌ నేషనల్‌ భవంతి వంక భయంగా చూసాడు. తర్వాత వెనక్కి తిరిగి చెప్పాడు.

“మీరు మారు పేరుని ఉపయోగించానన్నారు. చూడండి.”

జాన్‌ బాల్కనీలోకి వచ్చి చూశాడు.

“ఆ మాన్యుమెంట్‌ దగ్గరున్న యూనిఫాంలోని ముగ్గురు గార్డ్‌లు లాన్‌మీద హోటల్‌కి నడిచి వస్తున్నారు” మేక్స్‌ గుసగుసగా చెప్పాడు.

“హోటల్‌కేనని మీకు ఎలా తెలుసు?” జాన్‌ ప్రశ్నించాడు.

“ఇటువైపు వస్తే హోటల్‌కే. విమానాశ్రయంలో మిమ్మల్ని ఎవరో గుర్తుపట్టి ఉంటారు” మేక్స్‌ అతని చేతిని పట్టుకుని లాగుతూ చెప్పాడు.

“మీరు చెప్తే గుర్తొస్తున్నది. ఓ ఇమిగ్రేషన్‌ అధికారి నా వంక పరిశీలనగా చూసాడు. సన్నగా, పొడుగ్గా, పళ్ళు సరిగ్గా లేని ఆ వ్యక్తి ఆట్టే నల్లగా లేడు.”

“ఓ! వచ్చేవారిలోని ఒకడు పేలస్‌ గార్డ్‌ కెప్టెన్‌ బెలియర్డ్‌.”

“నేను అతనికి తెలుసా?”

“తెలుసా? ఆ రాత్రి మీ భార్యని గురించి మీరు అడిగింది ఇతన్నే. ఆమె హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నా తనకేమి తెలియదని అబద్ధం ఆడాడు. ఇప్పుడు అతను ఇమిగ్రేషన్‌ ఆఫీస్‌లో ప్రెసిడెంట్‌కి కళ్ళు, చెవులు. ప్రెసిడెంట్‌కి ప్రమాదం కలిగిస్తారని అనుమానించే వారిమీద ఓ కన్నేసి ఉంచుతాడు.”

“ఐతే, వెంటనే నా సూట్‌కేస్‌ దాచెయ్‌ మేక్స్‌. నేను వెనక తోటలోంచి వెళ్ళిపోతాను” జాన్‌ పాలిపోయిన మొహంతో చెప్పాడు.

“ఎక్కడికి వెళ్తారు?”

అతని దగ్గర జవాబు లేదు.

“పగలంతా సరే. రాత్రి ఎక్కడ తలదాచుకుంటారు? సెయింట్‌ జోసెఫ్‌ చాలా పెద్ద నగరం. ఇక్కడ లక్ష మంది నివసిస్తున్నారు. వందలమంది పోలీసులు, నెరెటా ప్రైవేట్‌ రౌడీలు కాపలా కాస్తుంటారు. విదేశీ మొహం వారికి అనుమానాస్పదంగా కనిపిస్తుంది. సరే. ఓ పని చేయండి...”

మేక్స్‌ ఓ పాడుబడ్డ ఇంటి ఎడ్రస్‌ చెప్పి జాన్‌ని అక్కడ దాక్కోమని చెప్పాడు.

జాన్‌ వెంటనే తోటలోని గోడ ఎక్కి అవతల చిన్న సందులోకి దూకాడు. అక్కడినించి పరిగెత్తి ప్రధానవీధిలోకి వచ్చాక నడక సాగించాడు. అక్కడ చాలా చిన్న దుకాణాలు ఉన్నాయి. ఇంకో హోటల్‌ గది తీసుకుంటే? దాదాపు అన్ని హోటల్స్‌ ఖాళీగా ఉంటాయి. ‘కానీ, విదేశస్థుల బస గురించి హోటల్‌ యాజమాన్యం పేలస్‌కి రొటీన్‌గా సమాచారం పంపవచ్చు’ అనుకున్నాడు. సినిమా హాల్లో దాక్కుంటే? ఆ దేశంలో అవి సాయంత్రం దాకా తెరవరు అని గుర్తొచ్చింది. వాటికీ విదేశస్థులు పెద్దగా రారు. అతను చిన్న సందులోకి మళ్ళి అందులోంచి ముందుకి వెళ్ళాడు.

దుకాణాల్లోని వస్తువుల వంక ఆసక్తిగా చూస్తే పర్యాటకుడని తెలుస్తుందని తల వంచుకుని, జేబులో చేతులు ఉంచుకుని స్థానికుడిలా నడవసాగాడు. గాడిదలమీద రైతులు వెళ్తున్నారు. నగ్నంగా ఉన్న పిల్లలు అరుస్తూ ఆడుకుంటున్నారు. పోలీస్‌ యూనిఫాం కనపడ్డప్పుడల్లా ఇంకో సందులోకో, తలుపు చాటుకో వెళ్ళి దాక్కుంటున్నాడు. దూరంగా ఖాకీ రంగు యూనిఫాంలోని ఇద్దరి పక్కన ఓ కారు ఆగడం, వాళ్ళు సెల్యూట్‌ చేసి కారులోని అధికారికి ఏదో చెప్పడం చూసాడు. తన గురించి వేట ఆరంభమైందని జాన్‌ భావించాడు.

జాన్‌ ఓ చర్చిలోకి వెళ్ళాడు. అది ఖాళీగా ఉంది. రంగుటద్దాల కిటికీలోంచి లోపలకి సూర్యరశ్మి రంగుల్లో నేలమీద పడుతున్నది.

‘పరమాత్మా! నేను అలసిపోయాను. ఇంకా ఓ రాత్రంతా గడవాలి’ ఆల్టర్‌ ముందు నిలబడి ప్రార్థించాడు.

కాసేపటికి ఎవరో ఆర్గాన్‌ వాయించడం విన్నాడు. చర్చి తలుపులు తెరచుకోవడంతో భక్తులు లోపలకి రాసాగారు. అక్కడనించి పక్క తలుపులోంచి మళ్ళీ పారిపోయాడు. ఆ పెద్ద నగరంలో చాలా వీధులు ఉన్నాయి. ఓసారి నడిచిన వీధిలోకి మళ్ళీ వెళ్ళకుండా ముందుకి సాగాడు. దూరంగా కొండల వెనక సూర్యుడు అస్తమిస్తున్నాడు.

“ఆగు. నిన్నే. కదలకు.” అకస్మాత్తుగా వెనకనించి ఓ ఆజ్ఞ వినిపించింది.

జాన్‌ వెనక్కి తిరిగి చూడలేదు. అది తనని ఉద్దేశించిన మాటలే అని గ్రహించాక ముందు వేగంగా నడిచి తర్వాత పరిగెత్తాడు. అదృష్టవశాత్తు వెనకనించి తుపాకీ పేలిన శబ్దం వినిపించలేదు. పక్క వీధి నిర్మానుష్యంగా ఉండటంతో పరిగెత్తే అతన్ని ఎవరూ గమనించడానికి లేరు. జాన్‌కి కొద్ది దూరంలో బయట కంచర గాడిదలున్న ఇండ్లు కనిపించాయి. తను ఆ ఊరి శివార్లలోని పేద వాడకి చేరుకున్నాడని గ్రహించాడు.

పూర్తిగా చీకటి పడింది. వీధిలైట్లు వెలగని సందుల్లోంచి నిశ్శబ్దంగా నడిచాడు. బీట్‌ కానిస్టేబుల్స్‌నించి కాక అత్యంత ప్రమాదం పోలీస్‌ కార్ల నించని అతనికి తెలుసు. ఒకటి రెండుసార్లు వెనక కారు శబ్దం విన్నాక దాక్కునేందుకు వీలున్న చోట్ల నక్కాడు. ఆ దేశంలో ప్రభుత్వానికి తప్ప ప్రజలకి కార్లుండవు.

చివరికి అతనికి ఓ ఖాళీ ఇల్లు కనిపించింది. దానికున్న పెద్ద కాంపౌండ్‌ వాల్‌, రెండు ఎర్ర గేట్లు, లోపల మోకాళ్ళదాకా పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డి చూసాక మేక్స్‌ చెప్పిన ఇల్లు అదేనని గ్రహించాడు. ఇనుప గేట్‌ ఎక్కి అవతలికి దూకి లోపలకి నడిచాడు. తలుపులు, కిటికీలు ఉండాల్సిన చోట, వాటిని పీకేయడంతో లోపలకి దార్లు కనిపించాయి. చేతుల్ని ముందుకి చాపి చీకట్లో తడుముకుంటూ లోపలకి నడిచాడు. అలసటతో నేలమీద కాసేపు విశ్రాంతి తీసుకుంటూ అనుకున్నాడు, ‘వాళ్ళు తన కోసం అన్ని చోట్లా వెతుకుతారు. తను మెలకువగా ఉండాలని’. కానీ, తెలీకుండానే అతని అలసిన దేహానికి నిద్ర పట్టేసింది.

“లే” అన్న అరుపుకి జాన్‌కి మెలకువ వచ్చింది.

ఆ గదిలోకి ఎండ పడుతున్నది. ఎదురుగా యూనిఫారంలోని ఇద్దరు పోలీసులు కనిపించారు.

“లే” మళ్ళీ చెప్పి ఒకతను దురుసుగా జాన్‌ చేతిని పట్టుకుని లాగి నించో పెట్టాడు.

ఇంకో వ్యక్తి ఫ్రెంచ్‌ భాషలో అతనితో ఏదో చెప్పి వారించాడు. తర్వాత జాన్‌తో ఇంగ్లీష్‌లో చెప్పాడు.

“మిస్టర్‌. మీరు మాతో రావాలి.”

“టైమెంతైంది?” తన చేతి గడియారం ఆగిపోవడంతో జాన్‌ అడిగాడు.

“పది పది.”

అంటే, ఈ పాటికి ఆ ఉత్తరాలు చేరి ఉంటాయి. వాళ్ళ వెంట బయటికి నడుస్తూ ప్రశ్నించాడు.

“నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?”

“పేలస్‌కి.”

కారాగారానికి కానందుకు మనసులో సంతోషించాడు. ఆ ఇంటి బయటి తోట ఎంత పెద్దదో, ఎంత చిందర వందరగా ఉందో వెలుగులో జాన్‌కి అర్థమైంది. అతన్ని నెట్టకుండా మృదువుగా ప్రవర్తిస్తూ బయట ఆగి ఉన్న పోలీస్‌ కారు దగ్గరకి తీసుకెళ్ళారు.

అక్కడికి పేలస్‌ ఎంత దగ్గరగా ఉందో తెలిసి ఆశ్చర్యపోయాడు. అది పార్క్‌ డి ఇండిపెండెన్స్‌ని దాటి మేన్షన్‌ ఇటాయిల్‌ హోటల్‌ని, విగ్రహాలని దాటి పేలస్‌ ముందున్న ప్రైవేట్‌ రోడ్డులోకి తిరిగింది. క్రితం రాత్రి తను ఆ హోటల్‌ చుట్టూ ఉన్న రోడ్లలో తిరిగాడని జాన్‌ అనుకున్నాడు. 

“ప్రెసిడెంట్‌ని దర్శించే ముందు మీరు స్నానం చేస్తారా?” వాళ్ళు మర్యాదగా ప్రశ్నించారు.

తనతో మృదువుగా ప్రవర్తించడానికి కారణం ప్రెసిడెంట్‌ తనని చూడాలనుకోవడమే అయి ఉంటుందని అనుకున్నాడు. అతని దుస్తుల్ని, బూట్లని విప్పించారు. స్నానం చేసే లోపల ‘వాటిలో ఆయుధాలు దాచాడా’ అని వెదికారు. గడ్డం గీసుకుని స్నానం చేసాక వాటిని మళ్ళీ తొడుక్కుంటూంటే, జాకెట్‌ లోపల మడిచి కుట్టిన దారాన్ని తెంపి మళ్ళీ కుట్టారని గ్రహించాడు.

పక్కనే ఇద్దరు పోలీసులు నడుస్త్తుండగా అతన్ని మెరిసే తెల్లటి కారిడార్లో నడిపించి, రిసెప్షన్‌ హాల్లోకి తీసుకెళ్ళారు. పేలస్‌ గార్డ్‌ల్లోని కల్నల్‌ రేంక్‌ అతను ఒకడు వాళ్ళని చూడగానే బల్లముందు నించి లేచి విశాలమైన పెద్ద తలుపుని తెరచి లోపలకి వెళ్ళమన్నట్లుగా సైగ చేసాడు. జాన్‌ అందులోకి వెళ్ళగానే తలుపు మళ్ళీ మూసుకుంది. కిటికీలు లేని ఏర్‌ కండిషన్డ్‌ గది అది. పెద్దగది బల్ల వెనక కూర్చున్న ఓ వ్యక్తిని చూడగానే మూడేళ్ళ కిందటి రాత్రి జరిగిన సంఘటన గుర్తొచ్చింది. రెండు గుప్పెళ్ళు బిగుసుకోగా ముందుకి అడుగు వేసాడు. తక్షణం ప్రెసిడెంట్‌ చేతిలో రివాల్వర్‌ ప్రత్యక్షమై అతనికి గురి పెట్టబడింది.

“కూర్చో” ఆజ్ఞాపించాడు.

జాన్‌ తనని తాను కంట్రోల్‌ చేసుకుని పెద్ద ఎర్రటి లెదర్‌ కుర్చీలో కూర్చుని తను ద్వేషించే ఆ వ్యక్తివంక చూసాడు. అతని వికృతమైన రూపాన్ని దినపత్రికల్లోని ఫొటోలు దాచాయి. అతను రాక్షసుడిలా చాలా లావుగా ఉన్నాడు. తన భార్య నార్మా సన్నగా సున్నితంగా ఉంటుంది. ‘అతని కబంధ హస్తాల్లో నార్మా... ’ జాన్‌ కోపంతో వణికాడు.

“నీ ఉత్తరం అందింది” నెరెటా తన బల్లమీది కవర్ని రివాల్వర్‌ బేరల్‌తో కొట్టి చెప్పాడు.

జాన్‌ మాట్లాడలేదు.

“దీన్ని నేను సరిగ్గా అర్థం చేసుకున్నానా?” నెరెటా ప్రశ్నించాడు.

“అర్థం చేసుకోలేక పోవడానికి అందులో కష్టమైందేమీ లేదు” జాన్‌ చెప్పాడు.

“ఈ ఉత్తరంలో నా భార్యకి కూడా ఓ ఉత్తరం రాసానని మీ భార్యకి ఆ రాత్రి ఏం జరిగిందో అందులో వివరించానని రాశావు. నీ భార్య నోటిమాట తప్ప ఎలాంటి సాక్ష్యం లేదని కూడా అందులో రాశావు. నువ్వు ఋజువు కోసం ప్రయత్నించినా ఇంకా దొరకలేదని కూడా రాశావు. అవునా?”

“అవును.”

“నేను దోషినని అందులో ఆరోపించావు కాబట్టి, నేను నిన్ను చంపేస్తానని నువ్వు ప్రతీ రోజు ఫోన్‌ చేస్త్తుంటావని ఆమెకి ఫోన్‌ రాకపోతే నేను నిన్ను చంపించానని, అది ఎందుకో తెలుసుకోమని కూడా రాశావు. అవునా?”

“అవును.”

“నువ్వు మేధావివి. నా భార్యకి రాసి అందులో ఏం రాసావో నాకు కాపీ పెట్టడం ద్వారా నువ్వు జీవించే ఉంటావు. రోజూ ఓ కాల్‌కి నేను నీకు స్వేచ్ఛని కూడా ఇవ్వాలి. అవునా?”

“అవును.”

“ఐతే, ఇప్పుడు ఏమిటి?”

“నేను నిన్ను చంపదలచుకున్నాను” జాన్‌ చెప్పాడు.

“నిజంగా? ఎలా?” అతను జోక్‌ విన్నట్లుగా నవ్వి అడిగాడు.

“చాలా దారులు ఉన్నాయి. నువ్వు దేశంలో తరచూ ప్రయాణిస్తూంటావు. నేను హై పవర్‌ రైఫిల్‌తో నిన్ను కాల్చి చంపవచ్చు. నెరెటా.. నేను చాలా సంవత్సరాలుగా షూటింగ్‌ని ప్రాక్టీస్‌ చేస్తున్నాను.”

“అందుకు నీకు చాలా సమయం పడుతుంది” ఆ రాక్షసుడు నవ్వి చెప్పాడు.

“నాకూ చాలా సమయం ఉంది.”

“నీ భార్య సంగతేమిటి? నీ ఉద్యోగం?”

“నా భార్యకి తనకో భర్త ఉన్నాడనే తెలీదు. ఆమె మెంటల్‌ హాస్పిటల్లో ఉంది. ఉద్యోగం నాకు ముఖ్యం కాదు.”

“అంటే, నన్ను రైఫిల్‌తో చంపుతావు. అంతేనా?”

“లేదా బాంబ్‌ దాడి. లేదా విషప్రయోగం. ఇప్పుడు నేను చాలా వాటిలో నిపుణుడ్ని.”

“నువ్వు అన్నీ ఆలోచించే ఇక్కడికి వచ్చావా?”

“అనే అనుకుంటున్నాను.”

నెరెటా పెద్దగా నవ్వి చెప్పాడు.

“నువ్వు ఎంత మూర్ఖుడివి జాన్‌. నీలో పిల్లల్లోని మూర్ఖత్వం ఉంది. నీ తెలివైన పథకం ‘నేను పెళ్ళి చేసుకున్న ఆమెని గౌరవిస్తానని, ఆ రాత్రి జరిగింది ఆమెకి నిజమని తెలీకుండా జాగ్రత్త పడతాననే’ ఊహమీద అల్లావు. నీకో విషయం చెప్పాలి. నేను ప్రెసిడెంట్‌ని కాబట్టి, నా భార్య నా గురించి ఏం అనుకున్నా నేను పట్టించుకోను. ఆమె నన్ను వదిలేస్తే వందల మంది ఆ స్థానంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ఆమెని పెండ్లి చేసుకోవడానికి ఒకటే కారణం. ఆమె అన్న ప్రమాదకరమైన రాజకీయ ప్రత్యర్థి కాబట్టి.”

జాన్‌ మాట్లాడలేదు.

“నువ్వు మా దేశానికి దొంగపేరుతో వచ్చావు. ‘జాన్‌ హేటన్‌' సెయింట్‌ జోసెఫ్‌కి రానే లేదు. ‘హార్పర్‌' అనే ఒకడు ఉన్నాడు కానీ, ప్రపంచంలో ‘జాన్‌ హార్పర్‌' అనే వ్యక్తే లేడు. కాబట్టి, అతను మాయం అవడు.”

జాన్‌ ఛాతీకి నెరెటా రివాల్వర్‌ని గురి పెట్టాడు. జాన్‌ నిశ్శబ్దంగా చూస్తూండిపోయాడు.

“నాకు హింస ఇష్టం ఉండదు. అంటే, వ్యక్తిగత హింస. నా భార్య అంటే నాకు ప్రేమ అని, భయం అని నువ్వు చదివిన వార్తలు ప్రజలకి నా మీద గౌరవం కలగడానికి కావాలని విడుదల చేసినవే.”

నెరెటా కాలితో ఓ బటన్‌ని నొక్కాడు. జాన్‌ వచ్చిన తలుపు తెరచుకుని ఇందాకటి కల్నల్‌ లోపలకి వచ్చాడు.

“కల్నల్‌. నీ రివాల్వర్‌ని నా కళ్ళ ముందే ఉపయోగించు” ఆజ్ఞాపించాడు.

“తప్పకుండా ప్రెసిడెంట్‌.”

కల్నల్‌ తన హోల్‌స్టర్‌లోంచి రివాల్వర్‌ని బయటకి తీసి ముఖంలో ఎలాంటి భావం లేకుండా ముందుకి నడిచాడు. జాన్‌ లేచి నిలబడే లోగా కల్నల్‌ చెప్పాడు.

“నీ భార్య ఆర్డర్స్‌ మిస్టర్‌ నెరెటా”

చెప్పి గురి చూసి ట్రిగ్గర్‌ నొక్కగానే నెరెటా మొహంలో ఆశ్చర్యం. అతను మరోసారి ట్రిగర్‌ నొక్కాక నెరెటా తల కుర్చీలో వెనక్కి వాలిపోయింది. ఐనా, చావకుండా తన రివాల్వర్‌ని అందుకునే ప్రయత్నం చేస్తూండటంతో మరోసారి గొంతులో గుండు దిగేలా కాల్చాడు.

సన్నగా, అందంగా ఉన్న ఒకామె లోపలకి వచ్చి తలుపు మూసి టేబిల్‌ దగ్గరకి వెళ్ళి ప్రెసిడెంట్‌ మరణించాడో లేదో చూసాక కల్నల్‌తో చెప్పింది.

“మైక్రో ఫోన్‌ని తీసెయ్‌ విక్టర్‌.”

కల్నల్‌ టేబిల్‌ సొరుగు తెరచి దాంట్లోంచి ఏదో తీసుకుని జేబులో ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆమె జాన్‌వైపు తిరిగి చెప్పింది.

“ఈ దేశంలో ఇలాంటివి అవసరం. నీ ఉత్తరం చదివిన నాకు దీన్ని ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడింది. నిన్ను మా వాళ్ళు ఎయిర్‌ పోర్ట్‌లో దింపుతారు. నువ్వు ఇక్కడికి వచ్చిన సంగతే మర్చిపో.”

ఆమె స్వయంగా అతనికోసం తలుపు తెరచి గౌరవించింది.

“గంటలో మీ దేశానికి వెళ్ళే విమానం సిద్ధంగా ఉంది. ఈ సంగతి బయటకి పొక్కి మా అన్నయ్య ప్రెసిడెంట్‌ అయ్యాక ఇక అది కొంతకాలం కదలదు. కాబట్టి, ఈలోగా ఇది బయటకి రాకుండా చూస్తాను.”

“థాంక్స్‌” జాన్‌ వంగి అభివాదం చేసి చెప్పాడు.

“మీ భార్య గురించి నాకు విచారంగా ఉంది. నేను మీకు ఆ విషయంలో ఏదైనా చేయగలిగితే బావుండును అనిపిస్తున్నది” ఆమె చెప్పింది.

“ఇది ఆమె కోసమే” చెప్పి జాన్‌ వెళ్ళిపోయాడు.

(హ్యు బి కేవ్‌ కథకి స్వేచ్ఛానువాదం)  


logo