శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Jun 14, 2020 , 00:21:25

పునః ప్రారంభం!

పునః ప్రారంభం!

లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయిన షూటింగ్‌లు మెల్లమెల్లగా  మొదలవుతున్నాయి. ఈ సమయంలో బుల్లితెరకు సంబంధించి చాలా పరిణామాలే జరుగుతున్నాయి. ఓటీటీలు కూడా తమ సత్తా ఏంటో చూపిస్తున్నాయి. వినోదం.. బుల్లితెర Vs ఓటీటీ అయిపోయింది.

ఎవరు..? వీళ్లేనా..?

బిగ్‌బాస్‌ అనే రియాలిటీ షోలో రియాలిటీ ఎంతుందో తెలియదు కానీ, పాపులారిటీ మాత్రం చాలానే ఉంది. మూడు సీజన్ల టీఆర్పీ చూస్తే ఆ విషయం అర్థమైపోతుంది. జూలై రెండో వారం నుంచి మొదలు కావాల్సిన బిగ్‌బాస్‌ని, కరోనా దెబ్బకి అసలు ఉంచాలా? లేదా? అని టీవీ యాజమాన్యం తలలు బాదుకుంటున్నదని సమాచారం. సోషల్‌ మీడియాలో మాత్రం ఆగస్టు మొదటి వారంలోనే బిగ్‌బాస్‌ మొదలవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో హోస్ట్‌గా నాగార్జున కొనసాగుతారని కొందరంటున్నారు. మహేష్‌ బాబు, చిరంజీవి పేర్లూ వినిపిస్తున్నాయి. అంతేకాదు! తరుణ్‌, నందు, రష్మీ, సుధీర్‌, అల్లరి నరేష్‌, అఖిల్‌ సార్థక్‌, మంగ్లీ... వీళ్లే ఈసారి కంటెస్టెంట్లు అంటూ ఒక లిస్ట్‌ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. కార్తీకదీపం హీరోయిన్‌ దీప కూడా బిగ్‌ బాస్‌- 4లో కనిపించబోతున్నదని సమాచారం.

ఇలా కూడా చేయొచ్చు.. 

లాక్‌డౌన్‌లో  యాంకర్లు ఒక కొత్త పంథాకి శ్రీకారం చుట్టారు. ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూ కొన్ని స్కిట్లు, ప్రోగ్రామ్‌లు చేశారు. సుమ.. శ్రీముఖి తమ యూట్యూబ్‌ చానెల్స్‌లో కొన్ని కార్యక్రమాలు నడిపించారు. రవి కాస్త భిన్నంగా.. లాక్‌డౌన్‌ టాక్స్‌ విత్‌ రవి పేరుతో ఒక ప్రోగ్రామ్‌ని జీ తెలుగు కోసం చేశాడు. ఇందులో యాంకర్లను, యాక్టర్లను ఆహ్వానించి చిన్న ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేశాడు. పాత సీరియళ్లు మళ్లీ టెలికాస్ట్‌ అవుతున్న నేపథ్యంలో ఒక ఫ్రెష్‌ ప్రోగ్రామ్‌గా వచ్చిన ఈ షో, జనాలను బాగానే ఆకట్టుకుంటున్నది. శని, ఆదివారాలు ప్రసారమయ్యే ఈ ప్రోగామ్‌లో.. సుమ, ఖుష్బూ కూడా కనిపించారు. ఈ షోకి ఎక్కువ వ్యూస్‌ దక్కాయి. ఫేక్‌.. ఫేక్‌.. 

సోషల్‌ మీడియాలో వచ్చే  రూమర్స్‌ అర్థం పర్థం లేకుండా ఉంటాయి. బాధితుల మనసులకు మరింత గాయం చేస్తుంటాయి. హీరోయిన్స్‌ మీద గాసిప్స్‌, ఫొటో మార్ఫింగ్‌లు... చాలా విధాలుగా ఉంటాయా దాడులు. ఈ పుకార్లకు ఇప్పుడు బుల్లితెర కూడా బలి అవుతున్నది. యాంకర్‌ మంజూష తెలుసు కదా! నటిగా అడుగు పెట్టి యాంకర్‌గా బిజీ అయింది. ఇప్పుడు స్టార్‌ హీరోల సినిమా ప్రమోషన్స్‌తో, ఇతర ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉంటున్నది. ఒక డేటింగ్‌ యాప్‌ నిర్వాహకులు మంజూష్‌ ఫొటో పెట్టి ‘ఇరవైమూడేండ్ల అమ్మాయి మీ కోసం ఎదురుచూస్తున్నది. వెంటనే యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి’ అంటూ అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారు. వీటిని సోషల్‌ మీడియా కూడా ప్రమోట్‌ చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. విషయం తెలుసుకున్న మంజూష... ఇవన్నీ ఫేక్‌ అంటూ పోస్ట్‌ చేసింది. ఈ విషయంలో ఆమె సీరియస్‌ అయినట్లు, పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైనట్టు ప్రచారం. ఓటీటీకి మాత్రమే.. 

సినిమాలను ఎవరైనా థియేటర్లలో రిలీజ్‌ చేయాలనే తీస్తారు. బాలీవుడ్‌లో మాత్రం ఓటీటీల కోసమే  తీయడం ఎప్పుడో మొదలైంది. ఈ పంథాలోనే తెలుగు వారు ఓటీటీకి ఒక సినిమా చేశారు. అదే రన్‌. నవదీప్‌ హీరోగా.. ఓ క్రైమ్‌ థ్రిల్లర్‌ని లక్ష్మీకాంత్‌ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కించారు. దీన్ని వెబ్‌సిరీస్‌గా అనుకొని తీశారట. అవుట్‌పుట్‌ ఇచ్చాక, ‘ఆహా’ టీమ్‌ సభ్యులు  ఫీచర్‌ ఫిల్మ్‌గా మార్చాలనుకున్నారు. దాన్ని లాక్‌డౌన్‌ కాలంలో రిలీజ్‌ చేశారు. తెలుగులో నేరుగా ఓటీటీకి సినిమా చేయడం దీనితోనే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాని క్రిష్‌ జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ మీద విడుదల చేశారు.