సోమవారం 26 అక్టోబర్ 2020
Sunday - Jun 14, 2020 , 00:08:53

పేద మనిషి.. పెద్ద మనసు

పేద మనిషి.. పెద్ద మనసు

కరోనా... రోగానికి బీదాగొప్పా ఒకటేనని నిరూపించింది. కానీ ఆకలిని మాత్రం తీర్చలేకపోయింది. చేతివృత్తులవారు, కార్మికులు, వలస కూలీలు... అందరూ లాక్‌డౌన్‌లో ఆకలితో అలమటించిపోయారు. అడపాదడపా సాయం అందకపోలేదు. కానీ దాతలలో చాలామంది స్థితిమంతులే. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు సామాన్యులు కూడా.. కడుపు కట్టుకుని దాచుకున్న సొమ్మునే... పేదలకు ధారపోయడం ఓ మంచి పరిణామం. అలాంటి ఓ అరుదైన మనిషి కొడిచర్ల రమేశ్‌.

కొడిచర్ల రమేశ్‌.  క్షౌరవృత్తి చేసుకుంటేనే తన జీవనం సాగేది. అలాంటిది ఒక్కసారిగా లాక్‌డౌన్‌ వచ్చి పడింది. హైదరాబాద్‌లో ఇంటి అద్దె, షాప్‌ కిరాయి కట్టాలి. అదేమీ అతనికి పెద్ద కష్టంగా అనిపించలేదు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా దవాఖానలో చిక్కుకున్న వారు, వలస కార్మికుల పరిస్థితే మనసును కలచివేసింది. తనకు తోచినంతలో సాయం చేయాలనుకున్నాడు. ఎల్‌వీ ప్రసాద్‌ కంటి దవాఖాన సమీపంలో అంబలి, పుదీనా జ్యూస్‌, లెమన్‌ జ్యూస్‌ అందించాడు. ఇలా వారం రోజులు.. రోజూ 120 మంది గొంతు తడిపాడు. ఆ తర్వాత ఆ నీళ్లు వారి కడుపు నింపవని తెలుసుకున్నాడు. ఎలాగైనా వాళ్ల ఆకలిని తీర్చాలనుకున్నాడు. రోజూ ఉదయం ఇంటి వద్దే అన్నం, పప్పు, సాంబారు సిద్ధం చేసుకొని బయల్దేరేవాడు. బాటసారులకు, కూలీలకు అన్నం పెట్టేవాడు. ఇలా రోజూ 150 నుంచి 200 మందికి భోజనం వడ్డించేవాడు. క్రమంగా సేవపరిధిని విస్తరించాడు. పేదల కండ్లలో ఆనందం చూశాడు. వెజ్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ, ఉప్మా, టమాటా రైస్‌ వంటివి నాలుగు విడతల లాక్‌డౌన్‌లో సుమారు 4 వేల మందికి అందించాడు. ఇందుకోసం చాలా రోజులనుంచి పోగుచేసుకున్న  30 వేల రూపాయల్ని ఖర్చు పెట్టాడు. మరికొంత మొత్తాన్ని దాతల నుంచి సేకరించాడు. హైదరాబాద్‌లో కరోనా విధుల్లో ఉన్న పోలీసులకు నిమ్మరసం, పుదీనా జ్యూస్‌ అందించాడు.

రమేశ్‌ది రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌ మండలం. ఆకుతోటపల్లి గ్రామం. పాతికేళ్ల క్రితం పొట్టచేత్తో పట్టుకొని హైదరాబాద్‌కు వచ్చాడు. బతుకుతెరువు కోసం క్షౌరవృత్తిలో స్థిరపడ్డాడు. తన వృత్తిలో ఎదుగుతూనే పేదలకూ అనాథలకూ ఉచితంగా క్షవరం చేస్తున్నాడు. స్కూళ్లు, హాస్టళ్లలోని విద్యార్థులకు నెలలో రెండు రోజులు క్షౌరసేవ అందిస్తాడు. ఇప్పటికీ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, అంధుల పాఠశాలలు వంటి చోట్ల ఉచితంగా తన సేవలు అందిస్తున్నాడు.

కేసీఆర్‌ వీరాభిమాని

రమేశ్‌ సీఎం కేసీఆర్‌ను అమితంగా అభిమానిస్తాడు. కేసీఆర్‌ పథకాలకు ఆకర్షితుడయ్యాడు. అభిమానం చాటుకునేందుకు కేసీఆర్‌ 66వ పుట్టిన రోజు సందర్భంగా బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ సమీపంలో 666 మందికి తన సేవలు  అందించాలనుకున్నాడు. వారం రోజులలో 482 మందికి ఉచితంగా క్షవరం చేసి అభిమానాన్ని చాటుకున్నాడు. వీరిలో క్యాన్సర్‌ హాస్పిటల్‌కు వచ్చిన రోగుల బంధువులే ఎక్కువ. 

అనాథ శరణాలయాల్లో వృద్ధాశ్రమాల్లో.. ఉచితంగా క్షవరం చేసేందుకు రమేశ్‌ సిద్ధంగా ఉన్నాడు. హైదరాబాద్‌లో అతడి సేవలను పొందడానికి 9398199116లో సంప్రదించవచ్చు. 


logo