మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 01:31:40

ఫిట్‌నెస్‌ మాంత్రికుడు!

ఫిట్‌నెస్‌ మాంత్రికుడు!

కాలానికి అనుగుణంగా మారేవారు టాప్‌లోనే ఉంటారు. కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే వారు  టాప్‌లేపుతూనే ఉంటారు. లాయిడ్‌ స్టీవెన్స్‌లాగా! ఈ పేరు కొత్తగా అనిపించవచ్చు. జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యక్తిగత ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ అంటే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. 

ఆ ఫిట్‌నెస్‌ గురూజీ గురించి...

స్టీవెన్స్‌ది జింబాంబ్వే. పదేండ్లుగా లండన్‌లో ఉంటున్నాడు. ఓ కార్పొరేట్‌ కంపెనీలో మెరైన్‌ టెక్నీషియన్‌గా పనిచేసేవాడు. తోటి ఉద్యోగుల మాదిరిగానే ఫాస్ట్‌ఫుడ్‌, బేకరీఫుడ్‌.. ఇలా ఏదిపడితే అది తినేవాడు. చేతినిండా డబ్బులుండేవి. ఒంటి నిండా జబ్బులు కూడా ఉండేవి. నడిస్తే ఆయాసం. పడుకుంటే గురక. క్యాబ్‌ షేరింగ్‌లో  ఆఫీస్‌కు వెళ్లాలంటే ఇద్దరి ఛార్జీ చెల్లించాల్సి వచ్చేది. ఇవన్నీ పెద్ద సమస్యలుగా కనిపించలేదు అతనికి. కానీ ఓ రోజు అద్దం ముందు నిల్చుని తనలోకి తాను తొంగి చూసుకున్నాడు. ప్రతిబింబంలోని ఊబకాయుడు స్టీవెన్స్‌ను వెక్కిరించాడు. వయసు చిన్నది. పర్సనాలిటీ పెద్దది. పైగా అనారోగ్యం. ఈ సమస్యలు అన్నింటికీ తానే పరిష్కారం కనుక్కోవాలని అనున్నాడు. 

 లావు తగ్గడం ఎలా?

లావు తగ్గడం కోసం స్టీవెన్‌ ఎన్నో కసరత్తులు చేశాడు. యూట్యూబ్‌లో వందలకొద్దీ వీడియోలు చూశాడు. ఆక్రమంలో బాడీ బిల్డింగ్‌ డాట్‌కామ్‌లో క్రిస్‌ గెతిన్‌ వీడియోలు కంటపడ్డాయి. గెతిన్‌ దగ్గర వ్యక్తిగతంగా శిక్షణ పొందాడు. 12 వారాల అనంతరం స్టీవెన్‌ పూర్తి ఫిట్‌గా మారిపోయాడు. తన శరీరాన్ని మార్చిన ఫిట్‌నెస్‌ శిక్షణ తన జీవితాన్ని కూడా మారుస్తుందనే నమ్మకంతో మెరైన్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. తాను కూడా ఫిట్‌నెస్‌ రంగంలోనే ఉపాధి పొందాలనుకున్నాడు. ప్రొఫెషనల్‌ ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌గా మారిపోయాడు. 

సినిమాల్లోకి

కెరీర్‌ను ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే మంచి పేరు తెచ్చుకున్నాడు స్టీవెన్‌. తన దగ్గరికొచ్చే క్లయింట్లను శారీరక వ్యాయామం, డైట్‌ కలగలిపిన వర్కవుట్‌ ప్లాన్‌తో కండలవీరుల్లా మార్చేవాడు. ఊబకాయాన్ని ఊరవతలికి తరిమేవాడు. ఈ వార్త ముంబయి సినిమా పరిశ్రమకూ చేరింది. రణ్‌వీర్‌సింగ్‌ను ఫిట్‌గా మార్చమంటూ స్టీవెన్‌కు పిలుపొచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఎందరో సినీ హీరోలకు సిక్స్‌ ప్యాక్‌ లుక్‌ తీసుకొచ్చాడు  స్టీవెన్స్‌. ‘అరవింద సమేత’  కోసం ప్రత్యేకంగా ఇండియాకు  పిలిపించారు. ఆ సమయంలో కొద్దిరోజుల పాటు ఎన్టీఆర్‌తోనే ఉన్నాడు లాయిడ్‌ స్టీవెన్స్‌. విదేశాల నుంచి జిమ్‌ ఎక్విప్‌మెంట్‌ తెప్పించి ఇచ్చాడు. ఎన్టీఆర్‌ స్టీవెన్‌ల మధ్య గురుశిష్య సంబంధం కాస్తా స్నేహంగా మారింది. తాజాగా, రాజమౌళి ఆర్‌ఆర్‌ఆర్‌ నేపథ్యంలో... కొమ్రం భీమ్‌గా నటిస్తున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి మరోసారి స్టీవెన్స్‌కు కబురు వెళ్లింది.  జూనియర్‌ ఎన్టీఆర్‌ను పాత్రకు తగినట్టు తీర్చిదిద్దడంలో స్టీవెన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ఎన్టీఆర్‌ తన సరికొత్త శరీరాకృతితో ఇటీవలే సోషల్‌ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. ఆ కండలు చూసి స్టీవెన్స్‌కు జేజేలు పలుకుతున్నారు అభిమానులు.అదే అంతిమ లక్ష్యం..

స్టీవెన్స్‌కు గురువు గెతిన్‌ అంటే ఎంతో భక్తి. తనని ఆదర్శంగా తీసుకునే జీవిస్తానని చెబుతాడు.  స్టీవెన్‌ ఆహారం విషయంలో పకడ్బందీగా వ్యవహరిస్తాడు. రోజూ కొత్తగా కనిపించాలని తాపత్రయపడతాడు. ఏదైనా సాధ్యమే అనే సానుకూల దృక్పథంతో సాగిపోతుంటాడు. తన వద్ద శిక్షణ తీసుకునే వారికి స్టీవెన్‌ చెప్పే మాట ఒక్కటే.. ‘మనసులో బలంగా అనుకుంటే అది కచ్చితంగా జరిగిపోతుంది’. అంత బలంగా అనుకున్నాడు కాబట్టే కార్పొరేట్‌ సంస్థలో ఆరంకెల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. ఫిట్‌నెస్‌ గురువుగా సినీతారల అభిమానం పొందుతున్నాడు. ‘స్థూలకాయం విషయంలో అనవసరంగా ఆందోళన చెందకూడదు. అవసరానికి తగినంతే తినాలి. బరువు తగ్గేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఇంటి వద్దనే చిన్న చిన్న వర్కవుట్స్‌ చేస్తే చాలు‘ అని సలహా ఇస్తాడు లాయిడ్‌ స్టీవెన్స్‌. తను  ఆన్‌లైన్‌ క్లాసులు కూడా తీసుకుంటున్నాడు. ([email protected] outlook.com).

 కఠోర సాధన చేశాడు

సినిమాకు తగినట్టు కొత్తగా కనిపించడానికి తారక్‌ కఠోర సాధన చేస్తాడు. ట్రెయినర్‌గా నేను శిక్షణ ఇస్తానంతే. ఎన్టీఆర్‌ చాలా కష్టపడ్డాడు. డైట్‌ విషయంలోనూ నిబంధనల్ని కచ్చితంగా పాటించాడు. అనుకున్నది సాధించడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటాడని మరోసారి నిరూపించాడు. మా మధ్య స్నేహం కుదరడానికి కారణమూ అదే. 

- లాయిడ్‌ స్టీవెన్స్‌ ,ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌


logo