మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 01:14:41

కట్‌ చేస్తే..

కట్‌ చేస్తే..

అందమైన పదాలను పేర్చినంత మాత్రాన అద్భుతమైన కవితాసృష్టి జరగదు. పదబంధాల్ని అర్థవంతంగా అల్లుకొని.. హృదయాన్ని మీటే భావాల పోహళింపుతో  కూర్చినప్పుడే అపురూపమైన కవిత జనిస్తుంది. సినిమా ఎడిటర్‌ పని అలాంటిదే. కెమెరా రీల్‌లో బంధింపబడిన దర్శకుడి స్వప్నశకలాల్ని ఏరికూర్చి వాటికి అందమైన రూపుదిద్ది ఆత్మసౌరభంతో తెరపై ఆవిష్కరిస్తుంటారు ఎడిటర్లు. ‘సినిమాకు కెమెరా, ఎడిటింగ్‌ రెండు కళ్లలాంటివి. దర్శకుడి సృజనాత్మకతను ఉన్న తీకరించడంలో ఎడిటర్‌ ప్రధాన భూమిక పోషిస్తారు’ అని అంటున్నారు ఛోటా కె ప్రసాద్‌. డీజే (దువ్వాడ జగన్నాథమ్‌), ఎక్కడికి పోతావు చిన్నవాడా, చి.ల.సౌ,  గద్దలకొండ గణేష్‌ చిత్రాల ద్వారా ప్రతిభావంతుడైన ఎడిటర్‌గా పేరుతెచ్చుకున్నారాయన. సినీ నిర్మాణంలో ఎడిటర్‌ పాత్ర గురించి ‘బతుకమ్మ’తో ఆయన పంచుకున్న ముచ్చట్లివి.

తూర్పుగోదావరి జిల్లాలోని దుళ్ళ మా స్వగ్రామం. నాన్న గాంధీ వ్యవసాయం చేసేవారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కె నాయుడు నాకు బాబాయ్‌ అవుతారు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తి ఉంది. డిగ్రీ పూర్తయిన తర్వాత చోటా కె నాయుడుగారి ప్రోత్సాహంతో హైదరాబాద్‌కు వచ్చాను. తొలుత ఆనంద్‌ సినీ సర్వీస్‌లో కెమెరా అసిస్టెంట్‌గా చేరాను.  ఆ తర్వాత ఎడిటింగ్‌ వైపు మళ్లాను. గౌతంరాజుగారి వద్ద ఎనిమిదేళ్లు శిష్యరికం చేశాను. ‘అదుర్స్‌' మొదలుకొని ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' వరకు ఆయన దగ్గరే పనిచేశా. ‘టైగర్‌' చిత్రం ద్వారా ఎడిటర్‌గా నా ప్రయాణాన్ని ప్రారంభించాను.

దర్శకుడి విజన్‌ను ఉన్నతీకరిస్తాడు

ఫిల్మ్‌ మేకింగ్‌ సమయంలో డబ్భుశైతం రఫ్‌ అవుట్‌పుట్‌ను ఎడిటింగ్‌ టేబుల్‌  ముందుంచితే దానికి ఎడిటర్‌ వందశాతం పర్‌ఫెక్షన్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తాడు. చిత్రీకరణ పూర్తయిన తర్వాత దర్శకుడి తాలూకు విజన్‌ను మరింత ఉన్నతీకరిస్తూ, సన్నివేశానికి ఓ అర్థవంతమైన రూపుతీసుకొచ్చే బాధ్యత ఎడిటర్‌ చేతుల్లోనే ఉంటుంది. అయితే స్క్రిప్ట్‌లో రాసుకున్న సన్నివేశాల్ని దర్శకుడు అనుకున్న రీతిలో దృశ్యమానం చేస్తేనే ఎడిటర్‌ వాటిని అందంగా పేర్చగలడు. ఒకవేళ పేపర్‌ మీదున్న ఉద్వేగాల్ని దర్శకుడు అనుకున్నరీతిలో తెరమీదకు తీసుకురాలేకపోతే ఎడిటర్‌ స్థానంలో దేవుడు ఉన్నా  సినిమాను రక్షించలేడు.

దర్శకుడి ఆలోచనల్ని గౌరవించాలి

సినిమా విషయంలో ఎడిటర్‌ అందించే సృజనాత్మక సలహాలను చాలా మంది దర్శకులు పాజిటివ్‌ కోణంలోనే స్వీకరిస్తారు. అయితే ఆ మార్పులు దర్శకుడి ఐడియాలజీని తప్పుదోవ పట్టించేవిగా ఉండకూడదు. దర్శకుడు ఒక సన్నివేశాన్ని ఏ దృష్టితో షూట్‌ చేశాడు? ఆ సీన్‌ ప్రేక్షకులకు ఎంత వరకు చేరువయ్యే అవకాశం ఉంది? దానికి ఏమైనా మార్పులు అవసరమా? ఇలాంటి విషయాల్ని ఎడిటర్‌ విశ్లేషించి దర్శకుడితో పంచుకుంటారు. ఒక సన్నివేశం నిడివి, కొనసాగింపు (కంటిన్యూటీ) ప్రేక్షకుడి వీక్షాణానుభూతిని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. కాబట్టి అలాంటి సాంకేతికాంశాల్లో ఎడిటర్‌ ఆలోచనల్ని దర్శకులు తప్పకుండా గౌరవిస్తారు.  అలా చేసినప్పుడే కోరుకున్న  అవుట్‌పుట్‌ లభిస్తుంది. దర్శకుడి ప్రతిభా సామర్థ్యాలు తెరపై ఆవిష్కృతమవుతాయి.

మా ఐడియాను గౌరవించారు

‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాకు నేను సహాయకుడిగా పనిచేశాను. గౌతంరాజు ఎడిటర్‌. ఆ సినిమాకు పవన్‌కల్యాణ్‌ స్క్రీప్‌ప్లే అందించారు. ఒకరోజు ముఖేష్‌రుషి సినిమా షూట్‌ ముగించుకొని రాత్రి 7.30 ముంబై బయలుదేరాల్సి ఉంది. 6 గంటల ప్రాంతంలో పవన్‌కల్యాణ్‌ ఎడిటింగ్‌ రూమ్‌కు వచ్చారు. ఆ సినిమా ఇంటర్వెల్‌  సీన్‌ విషయంలో ఎడిటర్‌ గౌతంరాజు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ముఖేష్‌రుషి మీద మరో సీన్‌ తీసి కథలోకి వెళితే బాగుంటుందన్నది గౌతంరాజు ఆలోచన. ఇదే విషయాన్ని పవన్‌కల్యాణ్‌తో చెప్పారాయన. ‘అవును మీరన్నది నిజమే. అక్కడ ఓ సీన్‌పడితే బాగుంటుంది. ఎందుకు మిస్సయ్యాం’ అంటూ దర్శకుడు బాబీకి ఫోన్‌ చేశారు. పవన్‌కల్యాణ్‌ సూచన మేరకు ముఖేష్‌రుషి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. మరుసటి రోజు అనుకున్న సీన్‌ను షూట్‌ చేసిన తర్వాత తిరిగి వెళ్లిపోయారు. అలా ఎడిటర్‌ సూచనల్ని హీరోలు, దర్శకులు గౌరవించిన ఘటనల్ని నేను చాలా చూశాను.

సృజనాత్మకత అవసరం

కేవలం సాంకేతిక అంశాల్లో పట్టుసాధిస్తే ఎడిటర్‌ ప్రతిభ రాణించదు. సినిమాకు సంబంధించిన కథ, కథనంతో పాటు సృజనాత్మక విషయాలపై కూడా మంచి అవగాహన ఉండితీరాలి. ఎడిటర్‌ పనితనాన్ని ఓ వంటతో పోల్చితే... అందుకు అవసరమైన సరుకుల్ని మొత్తం దర్శకుడు తీసుకొచ్చి ఎడిటర్‌కు అందిస్తాడు. వాటిని సమపాళ్లలో రంగరించి రుచికరమైన వంటకాన్ని తయారుచేయడం ఎడిటర్‌ చేతిలో ఉంటుంది. అయితే దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా ఫ్లేవర్స్‌ మిళితం చేస్తూ ఆయన కోరుకున్న రుచిని అందించడమే ఎడిటర్‌కు పెద్ద సవాలుగా నిలుస్తుంది. ఓ ఫైట్‌ సీన్‌లో పంచ్‌ పడ్డప్పుడు ప్రతినాయకుడి రియాక్షన్‌ను ఎంతవరకు చూపించాలి? తీవ్రస్వరంతో అరిచినప్పుడు ఆ సీన్‌లోని ఇంటెన్సిటీని ఎంతవరకు తెరపై చూపించాలి? ఎక్కడ కట్‌ చేయాలి? ఇలాంటి అంశాలన్నీ క్రియేటివ్‌ పరిధిలోకి వస్తాయి. కాబట్టి  ఎడిటర్‌ సృజనశీలిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. యావరేజ్‌గా ఉండే సన్నివేశాన్ని కూడా ఎక్స్‌ట్రార్డినరీగా చూపించే పనితనం ఎడిటర్‌కు ఉంటుంది. దర్శకుడి విజన్‌ను సినిమాటోగ్రాఫర్‌ ఆవిష్కరిస్తే.. దానిని తెరపై తీసుకొచ్చే బాధ్యత మొత్తం ఎడిటర్‌ చేతుల్లోనే ఉంటుంది.

డిజిటల్‌తో క్వాలిటీ పెరిగింది

ఫిల్మ్‌కెమెరాతో షూట్‌ చేసినప్పుడు ఒక్క సీన్‌ కోసం రెండు షాట్స్‌ తీసేవాళ్లం. ఇప్పుడు డిజిటల్‌ కావడం వల్ల నాలుగు షాట్స్‌ ఎక్కువగా తీసి పెట్టుకుంటున్నాం. దీనివల్ల ఎడిటింగ్‌ కోసం మరింత టైమ్‌ తీసుకుంటుంది. అయినప్పటికీ క్వాలిటీ పరంగా సినిమా ఉత్తమంగా ఉంటుంది. ఎడిటింగ్‌ విషయంలో ఎంత ఎక్కువ మెటీరియల్‌ ఉంటే అంత బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. తక్కువ సీన్స్‌ తీసుకొచ్చి వాటి నుంచి  ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకోవడం కష్టమైపోతుంది.  డిజిటల్‌ వల్ల సినిమాపరంగా సృజనాత్మక పరిధులు మరింత విస్తరించాయని భావించవొచ్చు.

ఓపిక చాలా అవసరం

ఎడిటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే ఔత్సాహికులకు ఓపిక చాలా అవసరం. రెండు నిమిషాల సీన్‌ కోసం కొందరు దర్శకులు ఐదు నిమిషాల అవుట్‌పుట్‌ ఇస్తారు. మరికొందరు యాభై నిమిషాల అవుట్‌పుట్‌ ఇస్తారు. అలాంటి సందర్భాల్లో ఏమాత్రం భయపడకుండా ఓపిక చేసుకొని పనిలో లీనమైపోవాలి. ఏ చిన్న అసహనం తలెత్తినా అది వర్క్‌క్వాలిటీ మీద ప్రభావం చూపిస్తుంది. దర్శకుడు ఎంత మెటీరియల్‌ ఇచ్చినా సరే మనల్ని నమ్మి బాధ్యతను అప్పగించాడనుకొని వందశాతం న్యాయం చేయడానికి ప్రయత్నించాలి. సినిమా పరిశ్రమలో నమ్మకాల్ని కోల్పోకుండా కెరీర్‌ను కొనసాగించడం చాలా అవసరం. ఎమోషనల్‌ డ్రామా కలబోసిన సినిమాల్ని ఎడిట్‌ చేయడంలో ఎక్కువ సవాళ్లు ఎదురవుతాయి. సీన్‌లో భావోద్వేగాల్ని అర్థం చేసుకొని వాటితో సహానుభూతిచెంది పనిచేయాల్సి ఉంటుంది. సీన్‌లోని ఉద్వేగంతో ప్రేక్షకులు డిస్‌కనెక్ట్‌ కాకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎడిటింగ్‌లో గణనీయమైన మార్పులొస్తున్నాయి. సాధారణ నియమాల్ని బ్రేక్‌ చేస్తూ ‘నో రూల్స్‌' అనే ధోరణి పెరిగింది.  ఎడిటింగ్‌ ైస్టెల్‌ కూడా మారింది. అంతకుముందు ఓ షాట్‌ కట్‌ చేయాలంటే  స్మూత్‌గా అవుతుందో లేదో అనే టెన్షన్‌ ఉండేది. ఇప్పుడు ఏతరహా కట్‌ అయినా ఎంత ఇంపాక్ట్‌తో చేస్తున్నామన్నదే ప్రధానమైంది. తెలుగు పరిశ్రమ కూడా మార్పుల్ని త్వరగా అడాప్ట్‌ చేసుకుంటున్నది. 

రెండు నిమిషాల్లో భావాన్ని చెప్పాలి

సినిమాల టీజర్‌, ట్రైలర్‌ కట్‌ విషయంలో ఎడిటర్‌ కొత్త రకమైన సవాళ్లను ఎదుర్కొంటాడు. తొలుత సినిమా కథను మొత్తం అర్థం చేసుకోవాలి. రెండున్నర గంటల సినిమాలోని భావాన్ని రెండు నిమిషాల్లో ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నామా అని ఆలోచించుకోవాలి. యాక్షన్‌ సినిమా ట్రైలర్‌  కట్‌ చేసినప్పుడు  ప్రేక్షకులకు అది లవ్‌స్టోరీలా అనిపిస్తే ఎడిటర్‌ ఫెయిలయినట్లే అనుకోవాలి. కాబట్టి ట్రైలర్స్‌ విషయంలో మంచి ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేయడమన్నది ఎడిటర్‌కు సవాలుగా నిలుస్తుంది. ‘ఎక్కడకు పోతావు చిన్నవాడ’ ‘డీజే’ సినిమాలు వృత్తిపరంగా నాకు ఎంతో సంతృప్తినిచ్చాయి. ‘డీజే’ సినిమా విషయంలో అల్లు అర్జున్‌ ఫోన్‌ చేసి అందులోని ‘సీటీమార్‌...’ పాట  గురించి మాట్లాడారు. ‘బ్రదర్‌ ఆ సాంగ్‌లో మీ పనితనం హాలీవుడ్‌ రేంజ్‌లో అనిపించింది’ అని మెచ్చుకున్నారు. ఆయన మాటలు విని గాల్లో తేలిపోయాను. మనం చేసిన పనికి అప్రిసియేషన్‌ లభిస్తే అంతకుమించిన సంతృప్తి ఎక్కడా దొరకదు.

-కళాధర్‌ రావు


logo