బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:58:52

ఈ కోటు.. వైరస్‌ నిరోధకం!

ఈ కోటు.. వైరస్‌ నిరోధకం!

మన శరీరం ఎంత ఎండను తట్టుకోగలదు? ఎంత చలిలో మనం మామూలుగా ఉండగలం? వైరస్‌లు.. బాక్టీరియాలు దాడి చేస్తే మన పరిస్థితి ఏమిటి? తలుచుకుంటేనే భయమేస్తుంది. కానీ ఇకపై అలాంటి భయాలు అక్కర్లేదంటున్నాడు హైదరాబాద్‌ యువకుడు సాయితేజ పెద్దినేని. మైనస్‌ 200 డిగ్రీల నుంచి ప్లస్‌1000 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తట్టుకునే ఓ కోటును రూపొందించాడు అతను.

అగ్ని పర్వతారోహకుడు

సాయితేజ అగ్నిపర్వతారోహకుడు. సాహసాలు చేయడమంటే అతడికి ఇష్టం. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని ఈ రంగాన్ని ఎంచుకున్నాడు. ఎగిసిపడే లావాలతో సహవాసం చేస్తూ బద్దలయ్యే అగ్నిపర్వతాన్ని సైతం తాకే సాహసాలెన్నో చేశాడు. విస్ఫోటనాలున్నా  అగ్ని పర్వతాలను అధిరోహిస్తూ ‘వాల్కనో మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా గుర్తింపు పొందాడు. అయితే అత్యంత ప్రమాదకరమైన బాలీలోని అగుంగ్‌ అగ్ని పర్వతాన్ని అధిరోహిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. కోలుకున్న తర్వాత ఈ కోటును తయారుచేశాడు. తీవ్రమైన చలిని,  వేడినీ తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. 

కరోనా వైరస్‌ మనల్ని ఎంతగా భయపెడుతున్నది? అది మన దగ్గరకు రాకుండా అడ్డుకునేందుకు ఏదైనా మార్గం ఉంటే బాగుండు అనిపిస్తున్నదా? అయితే సాయితేజ రూపొందించిన కోటును వేసుకుంటే చాలు. వచ్చినా బతకవు. ఎముకలు కొరికే మంచులో.. కణకణమండే అగ్ని కీలల్లో కూడా ఇది రక్షణగా పనిచేస్తుందట. 

అత్యల్ప.. అత్యధిక ఉష్ణోగ్రతల్లో

ఓ డిఫెన్స్‌ టెక్‌ స్టార్టప్‌ను నిర్వహించే సాయితేజ పెద్దినేని అత్యల్ప.. అత్యధిక ఉష్ణోగ్రతల పరిస్థితులకు అనువైన దుస్తులను తయారు చేయాలని సంకల్పించాడు. ఎన్నో ప్రయోగాలు చేసి అన్ని రకాల వాతావరణాల్ని తట్టుకునే అపెరల్‌ను రూపొందించారు.  దుస్తులైనా, వస్తువులైనా సాధారణంగా 100 నుంచి 150 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద కాలిపోతాయి. కానీ సాయితేజ తయారుచేసిన అత్యల్ప.. అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా ఎలాంటి మార్పులకు లోను కాదు. 

వైరస్‌ బతకదు 

సాయితేజ మొదట ఒక నమూనా కోటును రూపొందించాడు. తీవ్ర ఉష్ణోగ్రతలు.. వైరస్‌లు.. బాక్టీరియాల నుంచి మనుషుల్ని రక్షించాలనే లక్ష్యంతో ఒక ఇంజినీర్‌ టీమ్‌ ఏర్పరచుకున్నాడు. -200 నుంచి +1000 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వరకు అడ్డుకునే సాంకేతిక దుస్తులపై కృషి చేశాడు. 2019లో విజయవంతంగా దానికో రూపం ఇచ్చాడు. అప్పటి నుంచి బహుళ ప్రొటోటైప్‌లను పరీక్షిస్తూ ఉన్నాడు. రెండు మూడు వారాల్లో మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సాంకేతికత వల్ల  బయట ఉన్న ఉష్ణోగ్రత లోపలికి రాదు. బయట 1000 డిగ్రీలు ఉన్నా సరే, లోపల 3-4 డిగ్రీల మేర మాత్రమే పెరుగుతుంది. వ్యాధికారక వైరస్‌ను బాక్టీరియాను ఆదిలోనే నాశనం చేయడం ద్వారావైరస్‌లు, బాక్టీరియాల బెడద లేకుండా బతకేయవచ్చు.


logo