బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:52:47

ఒగ్గుకథ ఉస్తాద్‌!

ఒగ్గుకథ ఉస్తాద్‌!

ఊహ తెలియని పసితనంలో  పాలకేడ్వలేదు.. తిండికేడ్వలేదు. కానీ.. ఒగ్గుకథ కోసం ఏడ్చాడు. తపించి.. తండ్లాడి.. చుక్కా సత్తయ్య కళా వారసుడిగా ఎదిగాడు. ప్రతిష్ఠాత్మక ఉస్తాద్‌ బిస్మిల్లాఖాన్‌ అవార్డు పొంది..  వేలమంది ఒగ్గు కళాకారుల్ని తయారుచేసిన మాణిక్యాపురం కళా ఆణిముత్యం ఒగ్గు రవి లైఫ్‌ జర్నీ ఈ వారం. 

నాకప్పుడు ఐదేండ్లు. ఊళ్లో ఒక్కటే రేడియో ఉండేది. ఒగ్గుకథ కళా సామ్రాట్‌ అయిన మా తాత చుక్కా సత్తయ్య చెప్పిన ఒక్కో ఒగ్గు కథ ఒక్కోవారం రేడియోలో వస్తుండేది. చిన్నప్పటి నుంచి అవే వింటూ.. ఊళ్లో ఆయన ప్రదర్శనలే చూస్తూ పెరిగాను. మా ఊరు జనగామ జిల్లా లింగాల ఘనపూర్‌ మండలం మాణిక్యాపురం. అక్కడ ఆయనకి పెద్ద బృందమే ఉండేది. ఎంతోమందికి తాత ఒగ్గుకథను.. విన్యాసాలను నేర్పిస్తుండగా మేం గోడమీద కూర్చొని చూసేవాళ్లం. పిల్లల్ని అటువైపు కూడా రానిచ్చేవాళ్లు కాదు. ఆ ప్రదర్శనల్ని చూసిన పిల్లలమంతా కుండలకు ప్లాస్టిక్‌ కవర్లు కట్టి.. వాటినే ఒగ్గు డోళ్లుగా భావించి సొప్ప బెండ్లతో డిల్లెం బల్లెం మోతలు మోగించేవాళ్లం. ఇలా ఐదేండ్ల వయసున్నప్పటి నుంచే డోలు కొట్టడం నేర్చుకున్నా. 

చుక్కా సత్తయ్య తాత ఎక్కువగా హైదరాబాద్‌.. సికింద్రాబాద్‌.. వరంగల్‌.. ఖమ్మం వంటి పట్టణాలలో మాత్రమే కథ చెప్పేది. ఊరికి వచ్చినప్పుడు మా కాకలకు విన్యాసాల్లో తర్ఫీదు ఇచ్చేవాడు. కుమారస్వామి కాకకు నేను డోలు కొడతానని తెలుసు. ‘మస్తు కొడ్తున్నవ్‌రా.. ఎట్ల నేర్సుకున్నవ్‌' అంటుండేవాడు. ఒకసారి సత్తయ్య తాత ఖమ్మంలో పెద్ద ప్రదర్శన ఉందని బృందం కోసం ఊరికి వచ్చాడు. రెండు మూడు రోజులు రిహార్సల్స్‌ చేయించాడు. అప్పుడే ‘ఎవరన్నా పిలగాండ్లుంటే బాగుండు’ అనేసరికి కుమారస్వామి కాక తాతకు నా పేరు చెప్పిండు. ‘ఐతాదోయ్‌ నీతోని’ అని తాత అంటే.. ‘ఐతది తాతా’ అని సమాధానమిచ్చినా. ‘ఏది డోలుగొట్టి సూపియ్యొకసారి’ అని తాత అనగానే భుజానికి డోలు వేసుకొని డిల్లెం బల్లెం అంటూ దద్దరిల్లేట్లు కొడితే.. ఫిదా అయ్యిండు తాత. ‘ఖమ్మం వచ్చేటప్పుడు రవిగాడ్ని తీసుకురాండ్రి’ అని చెప్పి వెళ్లిపోయిండు. 

అప్పటికే 15మంది సభ్యులు అయ్యారు. అవకాశం లేదు. కానీ తాత ఏమంటడో ఏమో అని నన్ను.. నాతోపాటు ఇంకో పిలగాడ్ని సెలెక్ట్‌ చేసి ఖమ్మం తీసుకెళ్లిండ్రు. అది 2010. ఖమ్మంలో ఒగ్గుకథ. వందలాది మంది చూస్తున్నారు. తాత తన గంభీరమైన గొంతుతో ‘శరణు శరణు మాయమ్మా రాణీ శాంభావీ రాణీ’ అని కథ స్టార్ట్‌ చేశాడు. నాకెప్పుడు అవకాశం వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఇంతలో అవకాశం వచ్చింది. మైమరిచిపోయి పూనకం వచ్చినట్లే లయబద్ధంగా.. తాత చెప్పే కథకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కలిసి డోలు వాయించాను. అందరిలో చిన్నవాడిని.. డోలుతో జజ్జనకరి జనారే మోతలు మోగిస్తుండటంతో తాత మల్లొకసారి ఫిదా అయ్యాడు. ఇక అప్పటి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా నన్ను వెంటేసుకొని వెళ్లేవాడు. ఢిల్లీ.. బెంగళూరు.. కోల్‌కతా.. మైసూర్‌.. హర్యానాలలో పెద్ద పెద్ద ప్రదర్శనల్లో నన్ను భాగస్వామిని చేశాడు. మా నాన్న రాజకీయాల్లో తిరిగేవాడు. మంచి పేరుండేది. వాళ్లూ వీళ్లూ.. ‘ఏందే.. నువ్వేమో అన్ని పెద్ద పెద్ద పోకడలు పోతవ్‌. మీ రవిగాడ్నేమో ఒగ్గుకథ చెప్పనీకె పంపిస్తవ్‌. మంచిగా చదివించి ప్రయోజకుడిని చేస్తే కాదా’ అనేవారు. దాంతో నాన్న నాపై ఒత్తిడి తీసుకొచ్చేవాడు.

 ‘ఇంజినీరింగ్‌ చదవాలి’ అని రోజూ మొత్తుకునేవాడు. కానీ నా ఆలోచనంతా ఒగ్గుకథపై.. తాత చుక్కా సత్తయ్యపైనే ఉండేది. ‘ఏందే.. పోరగాళ్లను చదువు దిక్కు పంపి ఇద్దె బుద్దులు నేర్పక ఒగ్గుకథ అని నీయెంట తిప్పుకుంటవ్‌?’ అని తాతను కూడా అన్నడు మా నాన్న. దీంతో తాత.. ‘వద్దురా రాకురా.. మీ నాయిన మొత్తుకుంటాండు.. చదువంట చదువుకోపోరా’ అన్నా కూడా నేను వినకుండా ఆయన వెంటపడి పోయాను. సాధారణ డిగ్రీయే చదివాను. నాన్నతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేశా. మూడేండ్లు మాట్లాడలేదు. కళకు సంబంధించిన కోర్సులు ఉంటాయని తెలుసుకొని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఏ థియేటర్‌ ఆర్ట్స్‌ చేశాను. ఇట్లయితే వినేటట్టు లేడనుకొని పెండ్లి చేశారు. వాళ్లనుకున్నట్లు నేను పెండ్లయినంక ఒగ్గుకథ మానుకోలేదు. అత్తగారింటి నుంచి కూడా మాటొచ్చింది. ఇన్ని సమస్యలు ఉన్నాగానీ నేను థియేటర్‌ ఆర్ట్స్‌లో ఎంఫిల్‌.. పీహెచ్‌డీ చేశాను. కొద్దిరోజులకు బండిపై నుంచి కిందపడి తాత కాలు విరిగింది. లేవలేని పరిస్థితి. ఆయనకేమో పెద్ద పెద్ద పరిచయాలు. ఇమేజ్‌ ఒక రేంజ్‌లో ఉండేది. దక్షిణభారత దేశమంతటా చుక్కా సత్తయ్య అంటే తెలియని కళాకారులు లేరు. అలాంటిది ఒక్కసారిగా ఆయన ప్రదర్శనలు ఆగిపోయాయి. మాకేమో ఏమీ తెలియదు. ఏం చేయాలో తెలియక.. గణపతి ఉత్సవాలు.. ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చేసి నాతో పాటు వచ్చిన వాళ్లకు ఇబ్బంది లేకుండా చూసుకున్నా. కానీ ఎన్ని రోజులు ఇలా? తాత ఊకే రవీంద్రభారతి పోయేది కదా? ఎందుకుండొచ్చు? అక్కడేమైనా సోర్స్‌ దొరుకుతుందేమో అని ఒకసారి వెళ్లి రమణాచారిగారిని కలిసి పరిచయం చేసుకున్నా. ‘ఏమొచ్చు నీకు?’ అని సార్‌ అంటే.. అప్పటికప్పుడు ఒగ్గుకథ వినిపించి మెప్పించాను. తిరుపతిలో జరుగుతున్న తెలుగు మహాసభల్లో ప్రదర్శనకు అవకాశం కల్పించారు సార్‌. అదే నా మొదటి ప్రదర్శన. 

2014లో.. తెలంగాణ వచ్చింది. గోల్కొండకోటపై స్వరాష్ట్రంలో తొలి పంద్రాగస్టు వేడుకలు. మామిడి హరికృష్ణ సార్‌ని బతిమిలాడి ఒక అవకాశమైతే సంపాదించా. కానీ ఎట్లుంటదో ఏమో అనే కంగారు ఉండేది. మొత్తానికి కోటపై అమ్మవారి గుడి సమీపంలో ఒక పిరమిడ్‌ ప్రదర్శన ఇచ్చాను. ఆ వేడుకల్లో ఒగ్గుకథ కళా ప్రదర్శనే హైలైట్‌. తెల్లారి అన్ని పేపర్లలో సీఎం కేసీఆర్‌ పక్కన మా బొమ్మలే కనిపించాయి. నాపై హరికృష్ణ సార్‌కి నమ్మకం ఏర్పడి రాష్ర్టావిర్భావ వేడుకల్లో అవకాశం ఇచ్చారు. నా ప్రదర్శనల గురించి తెలుసుకొని ‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా’ వాళ్లు విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి ఆహ్వానించారు. ఒక సందర్భంలో నేనే ఆ ఇనిస్టిట్యూట్‌లో విద్యార్థిగా చేరేందుకు ప్రయత్నిస్తే కుదరలేదు. అలాంటిది అక్కడ శిక్షణ ఇవ్వడం గ్రేట్‌గా ఫీలయ్యా. 

ఇంతచేశాను కదా.. రవీంద్రభారతిలో ఒగ్గుకథ ప్రదర్శన ఇవ్వాలనేది నా కోరిక.  నా ప్రతిభ ఏంటో చూపించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నా. ఎందుకంటే కొందరు నాపై అభాండాలు వేశారు. నేను తాత పేరు చెప్పుకొని బతుకుతున్నానని దుష్ప్రచారం చేశారు. వారి ఆలోచన తప్పు అని నిరూపించాలి కదా? హరికృష్ణసార్‌ని బతిమిలాడాను. ‘అంత భారీ ఖర్చు భరించలేం’ అన్నారు. కానీ అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆపొద్దు అనుకొని ఊళ్లో మూడెకరాల పొలం అమ్మిన. భాషా, సాంస్కృతిక శాఖ సహకారంతో రవీంద్రభారతిలో ‘ధర్మాగ్రహం’ ఎల్లమ్మకథ ప్రదర్శించాను. ‘శరణు శరణు మాయమ్మా రాణీ’ అని మొదలైనప్పటి నుంచి ‘హారతివ్వాలీ మంగళారతివ్వాలీ’ అని పాడేదాకా చప్పట్లే చప్పట్లు. రాష్ట్ర నలుమూలల నుంచి 63 తుపాన్‌ బండ్లలో కళాకారులు వచ్చి వేలాది డప్పు చప్పుళ్లతో రవీంద్రభారతిని పునీతం చేశారు. నా గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో వాళ్లే మెచ్చుకొని శభాష్‌ అన్నారు. 


logo