శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:42:50

వర్క్‌ ఫ్రమ్‌ పొలమ్‌!

వర్క్‌ ఫ్రమ్‌ పొలమ్‌!

పాలేకర్‌ చెప్పిన జీవామృతంతో ఎరువుల అవసరం లేకుండా మామిడిపండ్ల దిగుబడి సాధించాడు. నీటిని పొదుపుగా వాడుకోవడం ఎలాగో తెలుసుకున్నాడు. దాంతో విద్యుత్తు కూడా ఆదా అవుతున్నది.

స్నేహితుడి కోసం తన వ్యాపార సామ్రాజ్యాన్ని పల్లెలోని రచ్చబండ దగ్గరికి తెస్తాడు ఓ సినిమాలో కథానాయకుడు. రసాయనాలు లేని తిండి కోసం తన వ్యాపార కార్యాలయాన్ని మామిడితోటలోకి తెచ్చాడు ఈ యువకుడు. మొన్నటివరకూ ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ అధినేతగా, ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కాంట్రాక్టరుగా కాంక్రీట్‌ జంగిల్లో చిక్కుకుపోయాడు రాజేశ్వర్‌రెడ్డి.  ప్రకృతి ఇచ్చిన ప్రేరణతో... సేంద్రియ సేద్యాన్ని ప్రవృత్తిగా మార్చుకున్నాడు.  

యువతకు టైమ్‌ పాస్‌ అంటే స్నేహితులూ, పార్టీలూ, పబ్బులూ. లాక్‌డౌన్‌ వల్ల ఇవన్నీ బంద్‌. దీంతో టీవీలకు, ఓటీటీ సినిమాలకూ అతుక్కుపోయారు. రాజేశ్వర్‌ రెడ్డి మాత్రం తన మామిడితోటతో ప్రేమలో పడ్డాడు. ఇది కూడా చాలా గమ్మత్తుగా జరిగింది. ఆఫీసుల్లేవు కాబట్టి, ఇంట్లో నుంచే వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టాలి. కానీ, ఇంటిని ఆఫీసులా మార్చేస్తే కుటుంబ సభ్యులకూ ఇబ్బందే. ముఖ్యంగా తన పద్దెనిమిది నెలల పాపాయికి. హాయిగా నిద్రపోతున్న ఆ చిట్టితల్లి తండ్రి ఫోన్‌కాల్స్‌తో ఉలిక్కిపడి లేచేది. గుక్కపెట్టి ఏడ్చేది. అందుకే,  చెట్ల నీడన పనులు చక్కబెట్టుకోవచ్చని మామిడితోటకు వెళ్లాడు. అంతే.. ఇక అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. మామిడితోట కట్టిపడేసింది. సిద్దిపేట నుంచి 8 నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మున్రాయి గ్రామం. అక్కడే రాజేశ్వర్‌ రెడ్డికి 30 ఎకరాల భూమి ఉంది. అందులో పదెకరాలు మామిడితోట. మిగిలిన భూమిలో రసాయనాలు లేకుండా వరి, పొద్దుతిరుగుడు పండిస్తున్నాడు. 

ప్రకృతి పిలిచింది

ఆసక్తి మనిషి సహజ లక్షణం. ఆ ఆసక్తే మామిడితోటపై అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. దిగుబడి ఎందుకు తక్కువొస్తున్నది.. పండు చిన్నగా ఎందుకు ఉంటున్నది... దీనికి పరిష్కారం ఏమిటన్న ఆలోచన నుంచి తనే వ్యవసాయం ఎందుకు చేయకూడదు అన్న పాయింటు దగ్గర ఆగిపోయింది. లాక్‌డౌన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే వ్యవసాయం వైపు వెళ్లడం మంచిదనిపించింది. అలా అని, చేస్తున్న వ్యాపారాల్నీ ఆపలేడు. అందుకే తోటలోనే ఒక మేనేజర్‌, కొందరు సిబ్బందితో ఆఫీసు పెట్టుకున్నారు. అక్కడే వండించుకోవడం, తినడం. అందరూ వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తే తాను వర్క్‌ ఫ్రం పొలమ్‌ చేశాడు. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది తనకు. ప్రభుత్వ నీటిపారుదల, భవన నిర్మాణ కాంట్రాక్టులు కూడా చేస్తుంటాడు రాజేశ్వర్‌. చేగుంట, గౌరారం దగ్గర కాలువ పనులు; పాములపర్తి, ఉద్ధండపూర్‌ రిజర్వాయర్‌ పనులు రాజేశ్వర్‌ ఆధ్వర్యంలోనే జరిగాయి. ఇసుక కాంట్రాక్టులు కూడా ఉన్నాయి. రాజేశ్వర్‌ రెడ్డి తండ్రి వంగా నాగిరెడ్డి సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు.  యూట్యూబే టీచర్‌

ఇంతకుముందు వరకు మామిడి పండ్ల గురించి ఎప్పుడు, ఎక్కడ, ఎటువంటి సమాచారం ఉన్నా తీసి భద్రపరచుకునేవాడు. వాటిని అధ్యయనం చేయడానికి లాక్‌డౌన్‌ సమయం ఉపయోగపడింది. అంతేకాదు, తను వ్యవసాయ పరిజ్ఞానం పెంచుకోవడానికి యూట్యూబే దోహదపడిందంటాడు రాజేశ్వర్‌ రెడ్డి. యూట్యూబ్‌లో వివిధ పద్ధతుల ద్వారా ఆర్గానిక్‌ పంటల్ని ఎలా పండించవచ్చో తెలుసుకున్నాడు. కొత్త టెక్నాలజీతో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యమైన పంటలు తీయవచ్చని తెలుసుకున్నాడు. పాలేకర్‌ టెక్నిక్‌, చింతల వెంకటరెడ్డి మట్టి ద్రావణ పద్ధతుల పట్ల ఆకర్షితుడయ్యాడు. 

నీటి ఆదా టెక్నిక్‌..

నీటి ఆదా కోసం రాజేశ్వర్‌రెడ్డి అమలు చేసిన సంపు టెక్నిక్‌ మంచి ఫలితాలనిచ్చింది. అందుబాటులో ఉన్న అన్ని బోర్‌ల నుంచీ నీళ్లు వచ్చి 6 లక్షల లీటర్ల సామర్థ్యం ఉన్న సంపులోకి చేరుతాయి. బావిలో పెట్టినట్టుగా ఈ సంపులోనూ మోటారు బిగించారు. దీని ద్వారా వచ్చే నీరు పొలం మొత్తం సరఫరా అవుతుంది. అంటే నీరంతా ఒక చోట చేరి, అక్కడి నుంచి సమానంగా సరఫరా అవుతుందన్నమాట. ఇలా కాకుండా నేరుగా బోర్‌ల ద్వారానే నీటిని పంపిస్తే ఒక బోర్‌ నుంచి తక్కువ, ఇంకో బోర్‌ నుంచి ఎక్కువ నీళ్లు రావొచ్చు. ఫలితంగా ఒకే తోటకి కొంతమేర ఎక్కువ నీరు, మరికొంత మేర తక్కువ నీరు పారుతుంది. ‘సంపు టెక్నిక్‌ ద్వారా ఒక రెండు గంటలు మోటర్‌ ఆన్‌ చేస్తే అన్ని చెట్లకి నీళ్లన్నీ ఒకేసారి సమానంగా వెళ్తాయి. ఎంత నీరు ఇస్తున్నామనే లెక్క కూడా ఉంటుంది. ఉదాహరణకు 600 చెట్లకు ఒక్కోదానికి 200 లీటర్లు పోసినా లక్షా 20 వేల లీటర్ల నీరు సరిపోతుంది. విద్యుత్తు కూడా ఆదా అవుతుంది’ అంటాడు రాజేశ్వర్‌. ‘బిజినెస్‌ పరంగా చాలా సంతృప్తిగా ఉన్నా. రైతుల కోసం ఏమైనా చేయాలని ఉంది. సమాజానికి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఉంది’ ఇదీ ఆ యువరైతు రేపటి ప్రణాళిక.


logo