శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:38:50

గుండెనిండా..నాగార్జున కొండ!

గుండెనిండా..నాగార్జున కొండ!

తెలంగాణ నటరాజు.. నటరాజ రామకృష్ణ! కాకతీయుల  యుద్ధనృత్యం.. పేరిణీ శివతాండవాన్ని వెలుగులోనికి తెచ్చారు. పాటలీపుత్రమ్ము కోటకొమ్మల మీద తెలంగాణ జెండా ఎగరేసిన శాతవాహనుల కాలం నాటి కళాత్మకతను పరిచయం చేస్తూ ‘పసిడి మువ్వలు  పారాణి’ అనే పుస్తకం రాశారు. ఆ రచనకు ప్రేరణ నాగార్జునకొండ! పుస్తకానికి ముందుమాటలో మనసులోని మాటను హృద్యంగా వ్యక్తం చేశారు. నేడు, నటరాజ రామకృష్ణ జయంతి. 

నాగార్జునాచార్యుని తపస్సు ఫలించిన పుణ్యభూమి, ప్రపంచం నాల్గు చెరగుల నుండి బౌద్ధ భిక్షులు వచ్చి బుద్ధదేవుని బోధనలనభ్యసించి తమ పాదధూళిచే పవిత్రపరచిన యాత్రా స్థలం. శాతవాహనుల, ఇక్షాకుల పాలనలో సంస్కృతీ వికాసానికి ఆలవాలమైన విజయపురి ఇక్కడ వుండేది- నేడు ఆ నదీగర్భంలో మరుగుపడిందని భవిష్య చరిత్రకారులు రాస్తారు. ఆ ప్రదేశాలన్నింటినీ కన్నులారా చూడాలనే సంకల్పంతో నేడు అక్కడికి వెళ్లాను.విజయపురి - నేడు నాటి అంతఃపురాలు లేవు. మందిరాలు లేవు. కాని ఆనాటి వైభవాన్ని తెలిపే శిథిలాలు కొన్ని మిగిలాయి. ఆ శిథిలాల్లోనే అంతవైభవం ఉట్టిపడుతుంటే ఆ కాలంలో ఆ పట్టణం ఎంత వైభవోపేతంగా ఉన్నదో! అప్పటి కళాకారులు అదృష్టవంతులు. సంస్కృతీ వికాసాన్ని కన్నులారా చూడగలిగారు. అంతేకాదు, ధర్మ ప్రచారంలో భాగస్వాములయ్యారు.సంధ్యావేళ - సూర్యుడు మెల్లగా, చల్లగా పశ్చిమాన కుంగుతున్నాడు. పసిడి వన్నెలో మెరిసిపోతున్న ఆకాశం కృష్ణాజలాల్లో ప్రతిబింబించింది. నీలివన్నె నీరు పచ్చగా పసుపువన్నెలోకి మారిపోయాయి. అప్పుడు నాకు ఒక ప్రాచీన దృశ్యం కండ్లకు తట్టింది. విజయపురి వైభవోపేతంగా ఉన్న కాలంలో మహారాణులు తమ శరీరాలకు పసుపునలదుకొని కృష్ణలో జల క్రీడ జరుపగా ఆ జలాలు పసుపు వన్నె దాల్చినట్లు తోచింది. అంతలో మరికొంత చీకటయింది. ఆకాశం కుంకుమ ఆరబోసినట్లు ఎరుపెక్కింది. సూర్యుడు పూర్తిగా కుంగుతున్నాడు. నక్షత్ర కన్యలు మిలమిల మెరిసిపోతూ, నీటిలో ప్రకాశిస్తూ తెనుగు తల్లులు నదీమ తల్లిని పూజించడానికి వదిలిన దీపజ్యోతుల్లా భ్రమగొల్పినవి.

...నేను ఈ వూహల్లో విహరిస్తూనే ఉన్నాను. అంతలో దూరం నుండి మధురమైన అందెల సవ్వడి వినిపించింది. కొంత సమయానికి ఆ నాదం నన్ను సమీపించింది. నా పక్క నుండే సోపానాల నొక్కటొక్కటే దిగి కృష్ణాజలాలను సమీపించింది. అటు పక్కకు చూశాను. పదహారు సంవత్సరాల యౌవనం. ముంగురులు ముఖంపై పడేట్లు నున్నగా దువ్వి అనేక రకాల ఆభరణాలతో అలంకరించుకొన్నది. మోచేతుల వరకూ దంతపు గాజులు, మెడలో వెండి గొలుసులు, కాళ్లకు గలగలలాడే యిత్తడి అందెలు, అద్దాలు కుట్టిన రంగుల లంగాను మోకాళ్లు దిగేట్లుగా కట్టింది. బిగించికట్టిన రవికలో నుండి యౌవనం తొంగిచూస్తున్నది. చిన్ని కడవ పట్టుకొని నీళ్లకై కృష్ణకు వచ్చింది. కుండను కడిగి నీరు నింపుకొన్నది. నేను ఆ వైపే చూస్తున్నాను. నన్ను జూసి ఒకసారి సన్నగా నవ్వింది. అంతే అక్కడ నుంచి మరల అందెలు మధురంగా పలికిస్తూ తిరిగివెళుతున్నది. అలసట తీర్చుకోవడానికి కాబోలు తనలో తాను సన్నగా పాడుకొంటూ నడుస్తున్నది. చీకటి పడింది. ఆ చీకట్లో ఆమె కలిసిపోయింది.

ఆ దృశ్యం చూస్తూవుంటే నాకు విజయపురి వైభవోపేతంగా ఉన్నప్పుడు, సంధ్యావేళ పూజకు దేవనర్తకీమణులు స్వర్ణ కలశాలతో స్వామిని  అర్చించటానికి కృష్ణాజలాలను కొనిపొయ్యే ఘట్టలు తలపులోకి వచ్చాయి. నిర్మానుష్యంగా, నిర్జీవంగా ఉన్న ఆ ప్రదేశంవైపు చూశాను. ఆకాశాన్ని అంటుతున్న కోటలు, ఆలయాలు, ఆరామాలు, సంధ్యాహోమంలో దేవతల గురించి చేస్తున్న స్తోత్రాలు, బుద్ధదేవుని అమరసూక్తులు గానంచేస్తున్న కాషాయాంబరులు, రుద్రుని సంధ్యానాట్యాలతో ఆరాధిస్తున్న నర్తకీజనం, రాజులు, రాణులు, కవిపండిత గాయకులతో ఆ ప్రాంతమంతా కళకళలాడుతున్నట్లు తోచింది. ఆ నృత్యగానాలు వింటూ ఎప్పుడు మైమరచానో తెలియదు. ఉదయం సూర్యుని వెచ్చని కిరణాలు మేల్కొల్పాయి. ఆ దివ్యానుభూతికి అక్షరరూప మివ్వాలనుకున్నాను. తెలుగువారి సంస్కృతీ వికాసాన్ని తెలిపే ఆ సంకల్పమే..‘పసిడిమువ్వలు - పారాణి’గా నేటికీ ఈ రూపంలో ఫలించింది.శరత్కాలం రోజు. నాగార్జున శిల్పాలు చూడ్డానికి వెళ్లాను. సుమారు రెండువేల సంవత్సరాల కిందట దేశవిదేశాలలో బౌద్ధమత కీర్తిని చాటిన పవిత్ర ప్రదేశం నాగార్జున కొండ. ఇక కొన్ని సంవత్సరాల్లో కృష్ణ వేణమ్మ శాశ్వతంగా తన గర్భంలో దాచుకుంటుంది. ప్రాచీన వైభవాన్ని తెల్పే ఆ కట్టడాలు, ఆ స్తూపాలు, బౌద్ధ విశ్వవిద్యాలయం మననుండి శాశ్వతంగా మరుగుపడిపోతాయి.