గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:31:16

ఇస్మార్ట్‌... తోటలు!

ఇస్మార్ట్‌... తోటలు!

భారత్‌ వ్యవసాయ ఆధారిత దేశం. రైతు నాగలి పట్టకపోతే అల్లాడిపోతాం. పెరటి తోట పెంచుకోవడం కూడా మన సంప్రదాయంలో ఉంది. కానీ అపార్ట్‌మెంట్‌లలో అంత స్థలం ఉండదు. మొక్కలు పెంచాలన్నా, వాటికి నీళ్లు పెట్టాలన్నా  సమయం కూడా దొరకదు. ఎవరి ప్రమేయమూ లేకుండా ఆ మొక్కలే పెరిగి  కూరగాయలను, ఆకుకూరలను ఇస్తే.. ఎంత బాగుంటుంది?  మీలాంటి వాళ్ల కోసమే ఈ సరికొత్త గార్డెన్‌ గ్యాడ్జెట్‌లు పుట్టుకొచ్చాయి.  

తొమ్మిది రకాలుగా.. 

క్లిక్‌ అండ్‌ గ్రో అనే స్మార్ట్‌ గార్డెన్‌ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. దీనికి సూర్యరశ్మి, నీరు అవసరం ఉండదు. దానంతట అదే.. నీటితడి పెట్టుకొని మొక్కలను ఎదిగేలా చేస్తుంది. పైగా పైన ఉన్న లైట్లు మొక్కకు కావాల్సిన సూర్యరశ్మిని కూడా అందిస్తాయి. ఒకేసారి తొమ్మిది మొక్కలను దీంట్లో పెంచవచ్చు. 2012లో చిన్న కంపెనీగా మొదలైంది. ఆ తర్వాత అంచెలంచెలుగా విస్తరించుకుంటూ వచ్చారు. దీంట్లో పెంచేందుకు ప్యాడ్స్‌ కూడా దొరుకుతాయి. అంటే, విత్తనాల అవసరం ఉండదన్నమాట. మూడు ప్యాడ్స్‌ ధర రూ. 899. తొట్టిలా ఉండే పాత్రలో స్లాట్స్‌ ఉంటాయి. వాటిలో ఈ ప్యాడ్స్‌ని పెట్టాల్సి ఉంటుంది. ఇందులో ఉండే సెన్సర్‌లు మొక్క మంచిచెడులు చూసుకుంటాయి. క్లిక్‌ అండ్‌ గ్రో వెబ్‌సైట్‌లో ఈ డివైజ్‌ వివిధ సైజుల్లో దొరుకుతుంది. ధర రూ. 6,355 నుంచి 14,999 వరకు ఉంటుంది. వివరాలకు growsmartgreens.com క్లిక్‌ చేయండి. 

అన్నీ తానై.. 

మన ఇంటి వెనుక కొద్దిగా స్థలం ఉంది. దాంట్లో ఏవైనా పంటలు వేయాలన్నా మొక్కలు నాటి, నీరు పెట్టడం కష్టమైన పనే. కానీ ఒక చిన్న ప్రోగ్రామింగ్‌తో అన్ని పనులూ తానే చూసుకుంటుందీ ఫామ్‌బోట్‌. తక్కువ మెయింటెనెన్స్‌తో మంచిమంచి పంటలను ఇంట్లోనే పండించుకోవచ్చు. ఈ రోబోను ఒకసారి ఫిట్‌ చేసి ప్రోగ్రామ్‌ చేస్తే చాలు. అదే గుంతలు తవ్వుతుంది. మొక్కలు నాటుతుంది. సమయానికి నీరు పోస్తుంది. పంట వస్తే మనల్ని కోసుకోమని హెచ్చరిస్తుంది. ఇన్ని పనులు చేస్తున్నది కాబట్టే దీని ధర కాస్త ఎక్కువ. సుమారు 1.50 లక్షలుగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం farm.bot. ను సంప్రదించవచ్చు.

మట్టి లేకుండా.. 

మొక్క పెరగాలంటే మట్టి తప్పనిసరి అని అనుకుంటాం. కానీ మట్టి అవసరమే లేకుండా పెరిగేలా చేస్తుందీ కుండీ. ‘వీ’ అనే సంస్థ ఈ స్మార్ట్‌ ప్లాంటర్‌ని కనిపెట్టింది. హైడ్రోఫోనిక్స్‌తో ఈ కుండీ పనిచేస్తుంది. లైట్ల వెలుతురులో ఈ మొక్కలు పెరుగుతాయి. మన కూలర్‌లో కనిపించే నీటి ఇండికేటర్‌లా ఈ స్మార్ట్‌ కుండీలో  ఓ ప్రత్యేక సౌకర్యం ఉంది. నీరు తక్కువ అయినప్పుడు అది మనల్ని హెచ్చరిస్తుంటుంది. ఒకే సెక్షన్‌లో వివిధ రకాల మొక్కలను పెంచుకోవచ్చు. డెకరేషన్‌కి సంబంధించిన మొక్కలు, ఔషధ మొక్కలను కలగలిపి సులువుగా పెంచుకునే విధంగా ఈ స్మార్ట్‌ ప్లాంటర్‌ను డిజైన్‌ చేశారు. ధర రూ. 4,400. వివరాలకు wehydroponics.com చూడండి. 


logo