ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:24:17

మీ దగ్గర..‘చెక్‌లిస్ట్‌' ఉందా?

మీ దగ్గర..‘చెక్‌లిస్ట్‌' ఉందా?

కాలేజీకి వెళ్లే తొందరలో ఓ విద్యార్థి ముఖ్యమైన రికార్డులు ఇంట్లోనే మరచిపోతాడు. సకాలంలో ఆఫీసుకు చేరుకోవాలన్న ఆత్రుతలో ఓ ఉద్యోగి టిఫిన్‌బాక్స్‌ సర్దుకోకుండానే బయల్దేరతాడు.  రేపటి పనుల గురించి ఆలోచిస్తూ ఓ గృహిణి పప్పులో ఉప్పు వేయకుండానే వడ్డించేసింది. ఇలాంటి  సమస్యలకు చెక్‌లిస్ట్‌ పద్ధతిలో పరిష్కారం ఉందని చెబుతారు ‘చెక్‌లిస్ట్‌ మేనిఫెస్టో’ రచయిత అతుల్‌ గైక్వాండే. ఈ పుస్తకం న్యూయార్క్‌ టైమ్స్‌ బెస్ట్‌ సెల్లర్‌.

ఒక అధ్యయనం ప్రకారం... చెక్‌లిస్ట్‌తో ఓ వందమందిని, చెక్‌లిస్ట్‌ లేకుండా మరో వందమందిని ఓ మాల్‌లో షాపింగ్‌కు పంపారు. అందరికీ మూడు గంటల సమయం ఇచ్చారు. ఆ తర్వాత, ఒక చోటికి రమ్మన్నారు. చెక్‌లిస్ట్‌తో వెళ్లినవాళ్లు ఐదు నుంచి ఆరువేల రూపాయల మధ్యలో బిల్లు చేస్తే, చెక్‌లిస్ట్‌ లేనివాళ్లు పదివేలకుపైనే ఖర్చుపెట్టారు. చెక్‌లిస్ట్‌ చేతిలో ఉన్నవాళ్లు గంట ముందుగానే కొనాల్సినవన్నీ కొనేసి బయటికి వచ్చేశారు. చెక్‌లిస్ట్‌ ఓ లక్ష్మణరేఖ. ప్రతి కౌంటర్‌ దగ్గరా... మనం అత్యవసరం కాని ఏ వస్తువునో చూసి మనసు పారేసుకున్న ప్రతిసారీ ‘ఇది మన జాబితాలో లేదు. మన బడ్జెట్‌కు సరిపోదు’ అని గుర్తుచేస్తూనే ఉంటుంది.
షాపింగ్‌ అయితే ‘కొనాల్సిన వస్తువుల జాబితా’, ఆఫీసు పని అయితే ‘పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల చిట్టా’, ప్రయాణం అయితే ‘తీసుకువెళ్లాల్సిన వస్తువుల వివరాలు’.. దేనికైనా సరే ఓ చెక్‌లిస్ట్‌ ఉండాలి. దీనివల్ల మన సహజ  బలహీనత అయిన మతిమరుపును అధిగమించవచ్చు.
చిన్నచిన్న కారణాలతోనే చాలాసార్లు పెద్దపెద్ద కష్టాలు వస్తాయి. ఆపరేషన్‌ థియేటర్‌లో సర్జరీ తర్వాత కాటన్‌ను తొలగించడం చిన్నపనే. కానీ, రోగి పొట్టలోనే వదిలేస్తే పెద్ద ప్రమాదం! డాక్టర్లు చెక్‌లిస్ట్‌తో ఈ తరహా అజాగ్రత్తల్ని పరిహరించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా సర్జరీల తర్వాత సంభవించే మరణాల్లో సగానికి సగం... వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నవే. చెక్‌లిస్ట్‌తో కనీసం సగం చావుల్ని ఆపవచ్చని అంటారు రచయిత. కొన్నిసార్లు చెక్‌లిస్ట్‌ ఉన్నా ఏదో ఓ పొరపాటు దొర్లిపోవచ్చు. అలాంటప్పుడు, ఆ వైఫల్యం వల్ల మనం నేర్చుకున్న పాఠాల్ని జోడించి మరో కొత్త చెక్‌లిస్ట్‌ తయారు చేయవచ్చు. నిన్నటి వరకూ కిరాణా చిట్టాలో ఉప్మారవ్వ అని మాత్రమే రాసుకునేవాళ్లం... (శ్రీమతి తీవ్ర హెచ్చరిక తర్వాత) ‘దొడ్డు రవ్వ  మాత్రమే’ అని సరిచేసుకుంటాం. వృత్తి ఉద్యోగాల్లో చెక్‌లిస్ట్‌ వల్ల మరింత స్పష్టత వస్తుంది. దీంతో మెదడు ఇంకాస్త వేగంగా, సృజనాత్మకంగా పనిచేస్తుంది. కొత్త ఆవిష్కరణలకు ఆస్కారం ఉంటుంది. చెక్‌లిస్ట్‌లు రెండు రకాలు. మొదటిరకం.. ఫలానా పని చేయమని చెబుతుంది. రెండోరకం.. ఫలానా పని చేసినట్టు నిర్ధారించమని అడుగుతుంది. అవసరాన్ని బట్టి మనం దేన్నయినా ఎంచుకోవచ్చు.

మొదటి రకం:
ఆఫీసుకు వెళ్తున్నప్పుడు పాస్‌పోర్ట్‌ తీసుకుని వెళ్లాలి.
దారిలో పెట్రోల్‌ కొట్టించుకోవాలి.
 ఏటీఎంలో డబ్బు డ్రా చేసుకోవాలి.

రెండో రకం:
 పాస్‌పోర్టు బ్యాగులో పెట్టుకున్నాను.
 పెట్రోలు కొట్టించుకున్నాను.పదివేలు డ్రా చేసుకున్నాను. (ఫలానా పని పూర్తయినట్టు గుర్తుగా టిక్‌ పెట్టుకుంటాం)
షరా: చెక్‌లిస్ట్‌ ఏ సమస్యకూ పరిష్కారం కాదు. కానీ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారాన్ని వెతుక్కోడానికి ఉపయోగపడుతుంది. చేపల వలతో కడుపు నింపుకోలేం. కానీ, కడుపు నింపుకోడానికి అవసరమైన చేపల్ని పట్టుకోగలం. ఇది కూడా అంతే!


logo