సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Jun 07, 2020 , 00:13:43

చెడ్డీ దోస్తులు

చెడ్డీ దోస్తులు

‘ఎహె...గిట్ల కాదురా బై, మనమంత ఏడ్నన్న కల్వాలె’ మూర్తిగాడు.‘మా ఇంటికి రాండ్రి, ముద్దుగ జోలివెట్టుకుంట తిందాం’ నేను.‘ఇంట్లకాడ ఒద్దురా, బయట కలుద్దాం,’ మధుగాడు.‘ఔరా! బయట డిన్నర్‌ సోంచాయించుర్రి’ నాగరాజుగాడు.‘సాలె, తుంలోగా కీంచ్కే ఖాతే, వెజిటేరియన్‌ కు జాయింగే’ ధీరేందర్‌ సింగ్‌.‘బార్ల కూకుందాం, రెండు పనులైనట్టుంటది’ మత్తుగ చెప్పిండు బీకె గాడు, చానొద్దులకు కల్పిండు అందర్కి కాన్ఫరెన్స్‌ కాల్‌ మా ఇస్కూలు దోస్తులందర్కి.మేమంత కోఠి సుల్తాన్‌ బజార్ల, బడీచౌడిల ఉన్న కేంబ్రిడ్జి ఇస్కూల్ల సదూకున్నం. అందరం ఏడ్నేన్నో సెటిలైనం. చెట్టుకొకరు పుట్టకొకరు తీర్గ దేశాలు వట్టుకొని ఒగడు, నౌక్రీల కొరకు రాష్ర్టాలు వట్టుకొని ఒక్కొక్కతాన ఒక్కొక్కడు మొత్తం చిల్లెం పల్లం అయినం.
గిట్లనే బుద్దిపుట్టిన్నాడు అందర్ని ఒక్కతాన కల్పనీకె కాన్ఫరెన్స్‌ ల అందరం కల్సి మూన్నాలుగు నెల్లకోసారి ఉన్నవి లేనివి ముచ్చట్లు చెప్పుకొని మురుస్తం. అందరం ఎవనింట్లనన్న దావత్‌లల్ల గూడ కల్సుడు తక్వ. ఒగడొస్తె ఒగనికి తీరదు. ఒస్తమంటరు, ఏందో కుత్కెలమీదికి ఒచ్చిందంటరు. తప్పువట్టనీకె కాదు గని ఇయ్యాల్రేపటి జమానల ఎత్మినాంగ కూసోని బుక్కెడు తినే పుర్సత్‌ గూడ లేదు ఎవ్వనికి.రామారావుగాడు, రఘుగాడు, మూర్తిగాడు వేరేవేరే బ్యాంకిలల్ల పెద్ద కొల్వులనే ఉన్నరు.  నాకు లచ్మన్రావుగానికి ప్రైవేటుల నౌఖ్రి.బీకెగాడు ఏంజేస్తడో ఎవ్వనికి చెప్పడు. ఇదర్కమాల్‌ ఉదర్‌, ఉదర్కా మాల్‌ ఇదర్‌ గిట్ల ఏందన్న చేస్తడేమో? మధుగాడు, ముకేశ్‌ గాడు, సంగీత్‌ గాడు, చేతన్‌ గాడు బిజినెస్లల్ల ఉన్నరు, ధీరేందర్‌ సింగ్‌ గాడు వకీలు. నవనీత్‌ గాడు కన్స్‌ట్రక్షన్‌, నాగరాజ్గాడు పాన్‌ డబ్బ, ముర్లి డి.ఆర్‌.డి.వో.ల సీనియర్‌ సైంటిస్టు. గీడొక్కడే ఐ.ఐ.టి ల ఎం.టెక్‌ ఏరో స్పేస్‌ చేసి, గిప్పుడు పూనెల పనిచేస్తున్నడు.మొన్ననే ఏందో పనిమీదంటాని హైద్రాబాద్ల దిగిండు ముర్లి. అట్ల ముర్లి ఒచ్చిండంటాని అందర్ని కలిపి ఫోన్‌ల మాట్లాడిచ్చిండు నాగరాజ్గాడు,  మా నాగరాజ్‌ గాడంటే అందరికి ఇంకింతెక్వ పానం. ఎందుకో తెల్వది గని ఆడంటే అందరు పానమెల్లగొట్టుకుంటరు. ఆడు గాకుండ ఇంకెవలిద్దరు యాడగల్సినా ముందు నాగరాజ్గాడు ఎట్లున్నడని అడిగినంకనే ఇంకో ముచ్చట ఎల్లదీస్తరు.

గంత పాయరం ఆడంటే.ఇగ మా దోస్తులల్ల అందరం మంచిగనే ఉన్నా గని, ముర్లి అంటే జరంతెక్వ ఇజ్జత్‌ ఇస్తరు. మొన్నటిదాంక యుద్ధ ట్యాంకులు తయారు చేసుట్ల మాహిర్‌ ఉండే. ఇగ ఆని హుషారు తనం జూసి ఆనికి ప్రమోషన్‌ గూడ ఇచ్చిండ్రు. గిప్పుడు గవ్వేందో, రాకిట్లో, మిస్సయిల్స్‌ల్లో ఏంటివో తయారుచేసుట్ల ఉన్నడు. నెలకోపాలి డిల్లీల పెద్ద పెద్దోల్లతోటి మీటింగ్లు వెట్టుకోని కలుస్తడంట. మన దేశాన్నే కాలరెగరేసేటట్టు చేస్తున్న మా దోస్తు అంటే మల్ల మేం భీ కాలరెగరేస్తం, తప్పేమున్నది.గసోంటి ముర్లి దొర్కుడే కష్టం. ఎన్నో ఏండ్లకు దొర్కిండని అందరం పదుర్కోని మల్లొచ్చే రెండో శనివారం లక్డీకపూల్‌ కాడ పొద్దుమీకి ఒక హోటల్ల కలుద్దామని ఒట్టువెట్టుకున్నం.రెండో శనివారం రానే వచ్చె. పొద్దుమీకింతల ఏడు గొట్టంగ అందరం లక్డికాపూల్‌ ల ఉన్న పెద్ద హోటల్ల జమైనం. మల్ల ఎప్పటోలెనే సగం మంది డుమ్మా కొట్టిండ్రు.నేను, మూర్తిగాడు, బీకేగాడు, ముర్లి, నాగరాజ్గాడు, ధీరేందర్గాడు, మధుగాడు ఒచ్చిండ్రు. బీకేగాడు గులుగుతనే ఉన్నడు, జరంత పోసుకుందామని. నేనే ఒద్దన్న. పోసుకుంటె మాట్లాడుడు ఉండది, ఒర్లుడే ఉంటదని. అందరు అదే కరెస్ట్‌ అన్నరు. ముద్దుగ, కూసోని పుర్సత్గ సిన్నప్పటివన్ని మల్ల మల్ల యాజ్జేసుకోని జోలి వెట్టుకుంట, కడుపునిండ నగుకుంట, చార్జింగ్‌ అయిపోయిన ఫోనుల చార్జింగ్‌ పెట్టుకున్నట్లు, గీ చెడ్డీ దోస్తులతోటి కలిసి  మల్ల ఇంకిన్ని దినాలు బర్పూర్గ బతకనీకె చార్జింగ్‌ చేసుకోనీకె ఒగ పెద్ద టేబుల్‌ సుదరాయించుకొని కూసున్నం గా హోటల్ల.

ఇగ మూర్తిగాడున్నడంటే అందరికి ఏం కావాల్నో ఆడే చెప్తడు. ఇంకోన్ని చెప్పనియ్యడు. మెల్లెగ ఉండీ ఉండీ ఒకటిడుస్తడు మధుగాడు. దానికి అందరు కిందా మీద వడి అద్దగంట నవ్వుతం. ముర్లి సిన్నగ మాట్లాడుతడు. గొంతుగూడ పెద్దగ చెయ్యడు. తియ్యగ, ఎవ్వర్కి నొయ్యకుండ మాట్లాడుతడు.అందర్కీ ఏం గావాల్నో మూర్తిగాడే చెప్పిండు గని మల్ల ముర్లికి ఏం గావాల్ణొ ఆన్నడిగి చెప్పిండు. ముర్లి అంటే అందరం అంత గొప్పగ చూస్తం. మేము పోలేని జాగలకు ఆడు పొయ్యిండని, ఆన్ని నెత్తిమీద వెట్టుకోని చూస్కుంటం.ఎప్పటోలెనే నాగరాజ్‌ గాడు తక్వ మాట్లాడుతున్నడు. అడిగిందానికే చెప్తడు. అడ్డమైనదాంట్ల ఏలువెట్టి వాసనొస్తుందనడు. ఆనిపని ఆడు చేసుకుంటున్నడు.అందరం ఒగర్నొకరం బే, సాలే, బోసిడీకే అంత సుకాశి పేర్లతోనేగాకుండ ఇంకా చాన మంచివి, ముద్దొచ్చేటివి, ఇక్కడ రాయలేనసోంటి పేర్లతోనే ఎక్వ పిల్సుకుంటున్నం. ప్రేమ ఎక్వైతే అన్ని మంచి మాటలే ఒస్తయి మా అందరికి. ముద్దుకు ముం.. అన్న తప్పులేదంటరు గద, అట్లన్నమాట.ఎవర్ని ఎట్ల పిలిసినా ముర్లినైతే మంచిగ పిలుస్తం. ఆడు మా అసోంటి గలీజుగాడు కాదు అని మాకు ఒక నమ్మికం.
ముచ్చట్లల్ల వడి ఏంతిన్నమో, ఏం తాగినమో గూడ ఎర్కలే. తిన్నది తక్వ, నవ్వుడెక్వ. నవ్వీ నవ్వీ దవుడలు నొస్తున్నయి. ఇగ సాల్రా, మా తోటి అయితలేదన్నా ఎవ్వరూకోరు. ఎన్నడో మర్సిపోయినయీ, తెల్వనియీ అన్ని తిరగదోడి యాజ్జేసుకోని మల్ల మల్ల చెప్పి చెప్పి కడుపునిండ నవ్వుకొని హొటల్ల కెల్లి బయటపడేట్యాల్లకు పదకొండు గొట్టింది.
బయటికొచ్చినంక పాన్‌ డబ్బా కాడికొయ్యి దగ్గరుండి అందరికీ మంచి మీనాక్షీ పాన్‌ కట్టిపిచ్చిండు నాగరాజు. నెత్తికోటిచ్చిండు. అందరం దౌడలకు వెట్టుకున్నం.మల్ల ఆడింతసేపు మజాకులు నడుస్తున్నయి. ‘నేను బండి తీస్కోనొస్తాంటాని’ సెల్లార్లకు వొయ్యిండు ముర్లి.మా హసీ మజాక్‌ నడుస్తనే ఉన్నది. సెల్లార్లకెల్లి రూంజిగ కారు బయటికి తీసుకొచ్చి మేము నిలడ్డ తానికి తెచ్చిండు ముర్లి. ఆడనే నిలవడ్డ నాగరాజ్‌ గాని కాలిమీదికి జర్రైతే ఎక్కిపిస్తుండే కారుని.‘కండ్లల్ల ఏం పెట్టుకున్నవురా’ అని ఆ మాటకు ఇంకో గలీజు కూతగూడ కలిపిండు నాగరాజు.అందరం ఒక్కసారి గమ్మునైనము. ఎవ్వరి నోట్లకెల్లి ఒక్క మాట బయటికి రాలే. ముర్లిని మేమెవ్వరం అంత మాట అనలే ఇదివొరకటిదాంక. ఆడంటే మాకు చాన గౌరవం. మేము తెల్ల మొకాలేసినం.ఆ మాటిన్న ముర్లిగాడు సర్రున కారు పక్కకు ఆపి, ఒక్కుదుటున కిందికి దిగి నాగరాజు గాని దగ్గరికి ఉరుకొచ్చి వాన్ని గట్టిగ అబ్బలిచ్చుకున్నడు. కొంచం సేపటిదాంక నాగరాజ్‌ గాడిని అట్లనే కావలించుకొనే ముర్లిగాడన్న మాట నాకు మల్ల మల్ల యాదికొస్తనే ఉంటది.‘అరేయి సాలెగాల్లారా! ఈడురా అస్సలు దోస్తు. మీరంత నన్ను నెత్తిమీద పెట్టుకున్నమని, నన్ను దూరం దూరం ఉంచుతున్నరు, ఈ నాగరాజ్‌ గాడు నోటి నిండ నన్ను అన్న మాటలతోటి నాకు ఇంక దగ్గరయ్యిండు. మీ తోటి ఉన్నప్పుడు కూడ ఆఫీసులున్నట్లుంటే ఎట్లరా, ఈడున్నప్పుడు నేను మీ అంద రిల ఒకన్నిరా’ అని నాగరాజ్‌ గాడిని ఇడ్వనే ఇడ్వలే. గివి మర్సిపోయ్యే ముచ్చట్లా, గీళ్ళు మర్సిపోయ్యే చెడ్డీ దోస్తులా చెప్పుండ్రి.
-కొట్టం రామకృష్ణారెడ్డి ([email protected])


logo