బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Jun 06, 2020 , 23:51:34

అబ్బే, చుట్టరికం లేదు!

అబ్బే, చుట్టరికం లేదు!

అవనిలా అష్టకష్టాలు పడింది. చివరికి కథలో రాజకుమారిగా మెరిసింది, ఇప్పుడు భవిష్యత్తు  చెప్పే త్రినయని అయింది.. కన్నడనాట పుట్టిన అషికా గోపాల్‌  పడుకొనే! ఇంటిపేరు చూసి దీపికా పడుకొనే చుట్టాలమ్మాయి అనుకునేరు. కాదని కరాఖండిగా చెప్పేస్తుంది అషికా. 

నేను కర్ణాటకలోని ఉడుపిలో పుట్టాను. నాన్న బ్యాంకు ఉద్యోగి. ఆయనకు మూడేండ్లకోసారి బదిలీ అయ్యేది. బెంగళూరులో రెండేండ్లు, ముంబైలో మూడేండ్లు, ఉడుపిలో మరో రెండేండ్లు చదవాల్సి వచ్చింది. చివరగా బెంగళూరులో స్థిరపడిపోయాం. నేను కన్నడ అమ్మాయిని. మొదటి నుంచీ ‘చదువే ముఖ్యం.. కల్చరల్‌ యాక్టివిటీస్‌ ఆ తర్వాతే’ అని నాన్న ఎప్పుడూ చెప్పేవారు. నేను మాత్రం చదువుతో పాటు పాటలు, డ్యాన్స్‌, పెయింటింగ్స్‌లో అందరికంటే ముందుండేదాన్ని. 

ఉద్యోగాన్ని కాదని.. అక్క, నేను, తమ్ముడు.. మేం ముగ్గురం. అక్కకు పెండ్లయింది. తమ్ముడు ఇంజినీరింగ్‌. నేను కూడా ఇంజినీరింగ్‌ చేశా. ఇలా యాక్టింగ్‌ చేస్తానని  ఎప్పుడూ అనుకోలేదు. నాన్నకి నన్ను డాక్టర్‌ చదివించాలని ఉండేది.  నేను ఇంజినీరింగ్‌ నాలుగో సంవత్సరంలో ఉండగా ఒక ఆడిషన్‌ గురించి తెలిసింది. ఆ విషయం మా మేనమామ అమ్మకు చెప్పారు.  అమ్మ ‘ట్రై చేస్తావా?’ అని అడిగింది. టైమ్‌పాస్‌కి సీరియల్‌ ఆడిషన్‌కి వెళ్లాను. అనుకోకుండా ఓకే అయింది.  సీరియల్‌లో ఫ్లాష్‌బ్యాక్‌ స్టోరీలో నేను కనిపిస్తాను. వారంలో రెండు, మూడు రోజులకు మించి షూటింగ్‌ ఉండదని చెప్పారు. అలా ఆడుతూపాడుతూ సీరియల్‌ పూర్తిచేశా. ఇంజినీరింగ్‌ అయ్యాక, వేరే సీరియల్‌కు ఒప్పుకొన్నా. అప్పుడే ఐబీఎమ్‌, యాక్సెంచర్‌లలో ఇంటర్వ్యూకి అటెండ్‌ అయ్యాను. రెండింట్లోనూ సెలెక్ట్‌ అయ్యాను. మూడు నెలల్లో ఆ ఉద్యోగాల్లో జాయిన్‌ అవ్వాలి. ఈ లోపు షూటింగ్‌ పూర్తి చేసుకోవాలని డిసైడ్‌ అయ్యా. అనుకున్నట్టే, మూడు నెలల్లో పని అయిపోయింది.

తెలుగు నాట: కొద్దిరోజుల్లో ఉద్యోగంలో జాయిన్‌ కావాల్సి ఉండగా, అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘నాకు రాని భాషలో చేయను’ అని కచ్చితంగా చెప్పా. స్క్రిప్ట్‌ విని డిసైడ్‌ చేసుకోమన్నారు. అలా నేను నాన్నతో కలిసి హైదరాబాద్‌కు వచ్చాను. ఒకసారి ట్రై చేద్దామనుకున్నా. షూటింగ్‌ మొదలైంది. నాకు ఇక్కడి వాతావరణం నచ్చింది. అప్పటికీ, నెల తర్వాత ఉద్యోగంలో జాయినవుతానని హోల్డ్‌ చేశా. ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ఉద్యోగం చేసుకోవచ్చని అనుకున్నా. మొదట్లో తెలుగు అర్థం కాకపోయేది. కొంత కష్టపడ్డాను. మెల్లమెల్లగా కుదురుకున్నా. రెండు సంవత్సరాల పాటు ‘కథలో రాజకుమారి’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. రెండుమూడు నెలల్లోనే తెలుగు నేర్చుకున్నా.   ఇది చేస్తున్నప్పుడే తమిళంలో ఆఫర్‌ వచ్చింది.

బ్రేక్‌ లేకుండా: ఒక సీరియల్‌ జరుగుతుండగానే మరో సీరియల్‌లో అవకాశం రావడం ఒక అదృష్టం. నా విషయంలో అదే జరిగింది. పైగా సేమ్‌ బ్యానర్‌ కాబట్టి, ఆలోచించాల్సిన పనిలేదని అనిపించింది. అలా జీ తెలుగులో త్రినయని ఆఫర్‌ వచ్చింది. నా కళ్లు పెద్దగా ఉంటాయి కాబట్టి, ఈ క్యారెక్టర్‌ నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. మొత్తం డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. రెండు రోజుల్లోనే ఈ క్యారెక్టర్‌కి ఓకే చెప్పాను. ఎందుకంటే.. కోపం, ఏడుపు, రివెంజ్‌ డ్రామా అన్ని సీరియల్స్‌లోనూ ఉంటాయి. వాటన్నిటికీ భిన్నంగా ఒక సూపర్‌ నేచురల్‌ పవర్‌తో సాగే కథ ఇది. అందుకే ఎక్కువ ఆలోచించకుండానే చేస్తానని చెప్పాను. మరో రెండు రోజుల్లో షూటింగ్‌ అన్నారు. నేనేమో కాస్త సమయం ఇచ్చి షూటింగ్‌ మొదలుపెడతారేమో అనుకున్నా. మొత్తానికి చాలెంజింగ్‌గా ఉంది. పైగా నా క్యారెక్టర్‌ని మహేష్‌బాబుగారితో పరిచయం చేయించారు. లాక్‌డౌన్‌ అయ్యాక ఈ సీరియల్‌ మరింత ఆసక్తికరంగా ఉండబోతుంది. జీ కుటుంబంలో  మెంబర్‌ అయినందుకు చాలా సంతోషపడుతున్నా.
చిన్నప్పుడూ, ఇండస్ట్రీకి వచ్చాక కూడా.. చాలామంది ‘దీపికా పడుకొనే మీకేమైనా చుట్టాలా?’ అని అడుగుతుంటారు. పడుకొనే అనేది ఊరి పేరు. అక్కడ పుట్టిన వారికి అది ఇంటి పేరుగా మారుతుందని చెబుతుంటా. దీపికకూ  మాకూ ఎలాంటి రిలేషన్‌ లేదని చెబుతుంటా. నా టెన్త్‌ సర్టిఫికెట్‌లో అషికా గోపాల్‌ అనే ఉంటుంది. అందరూ ఇలా అడుగుతున్నారని తీయించా. కానీ ఇండస్ట్రీకి వచ్చాక, పడుకొనే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఉంచేసుకున్నా.

పూర్తి భిన్నంగా..

తెలుగులో నా మొదటి డైరెక్టర్‌ విజయ్‌ కృష్ణసార్‌. నాకు యాక్టింగ్‌ నేర్పించారు. ఆయనను  గురువులా భావిస్తా. నేను సీరియల్స్‌లో సీరియస్‌గానో, ఏడుస్తూనో కనిపించా. రియల్‌ లైఫ్‌లో ఇందుకు పూర్తి భిన్నం. చాలా అల్లరి చేస్తుంటా. షాట్‌ కట్‌ అనగానే అందరూ సైలెంట్‌గా  ఉన్నా నేను మాత్రం ఏదో ఒకటి మాట్లాడాల్సిందే! ‘టేక్‌ అనగానే ఏడుస్తుంటావు. ఆ తర్వాత నవ్వుతుంటావు’ అని అందరూ  కామెంట్‌ చేస్తుంటారు.


logo