మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 06, 2020 , 23:41:07

ప్యార్‌సే.. ప్యాలాలముద్ద!

ప్యార్‌సే.. ప్యాలాలముద్ద!

 • బొంగు ప్యాలాలు.. బొరుగులు.. మరమరాలు.. ముర్ముర్లు.. మురీలు.. ఏ పేరుతో పిలిచినా, తలుచుకోగానే నోరూరడం మాత్రం ఖాయం. నేరుగా కూడా తినేయవచ్చు. కాకపోతే, వీటితో  తెలంగాణలో రుచికరమైన లడ్డూలు చేస్తారు. వాటినే ముద్దుగా ‘ప్యాలాల ముద్దలు’ అంటారు.

  ముందు వడ్లను ఉడకబెట్టి నీరు తీసేస్తారు. ఎండబెట్టి పొట్టు తీస్తారు. ఒక గిన్నెలో ఇసుక పోసి, బాగా కాలిన తర్వాత.. దంచిన బియ్యాన్ని త్వరత్వరగా వేయిస్తారు. ఆ తర్వాత, జల్లెడ పట్టి ఇసుకను తీసేస్తే వచ్చేవే.. బొరుగులు.
  ఒకప్పుడు ఏ పుణ్యక్షేత్రానికి పోయినా, బొంగు ప్యాలాలే ఎక్కువగా కనిపించేవి. ప్రసాదంగా పంచి పెట్టి, ఇంకా మిగిలితే లడ్డూలు చేసేవారు.
  బొరుగుల ధర తక్కువే. బెల్లం కూడా పెద్ద ఖరీదైంది కాదు. చేసుకోవడమూ సులభమే. పైగా, బలవర్ధకమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ఇదో తీయని మార్గం.
  బొంగు ప్యాలాలను పొడి చేసి కూడా లడ్డూలు చుట్టేస్తారు కొన్ని ప్రాంతాల్లో.  తెలంగాణలో ప్యాలాల ముద్దగా పేరుగాంచితే.. ఆంధ్రాల మరమరాల లడ్డూ అని పిలుస్తారు. మహారాష్ట్రలో కూడా వీటిని చేసుకుంటారు.
  కాలక్రమేణా ఈ చిరుతిండి మార్కెట్‌ సరుకుగా మారిపోయింది. ప్యాలాల లడ్డూలను షాపుల్లో కూడా అమ్ముతున్నారు. కాకపోతే అవి మరీ గట్టిగా ఉంటాయి. తెలంగాణలో చేసే ముద్దలు మెత్తగా వెన్న ముద్దల్లా ఉంటాయి.
  గట్టి పాకం కడితే, ముద్దలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. మామూలు పాకం అయితే , రెండు మూడు రోజులకు మించి ఉండవు
  ఈ ముద్దలను పేదవారి లడ్డూలని కూడా పిలుస్తారు. ప్యాలాలతో ఉప్మాలు, ఇతర వంటకాలు కూడా చేస్తారు. వీటిని ఎక్కువ సేపు నానబెడితే మెత్తగా అవుతాయి. కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్గాణిగా పిలుచుకునే బొరుగుల తిరుగమోత.. వేడివేడి మిర్చీబజ్జీ కాంబినేషన్‌లో... అద్భుతః
  ప్యాలాల లడ్డూను తయారు చేయడానికి బెల్లాన్ని చిక్కటి పాకం పట్టాలి. దాంట్లో ప్యాలాలను వేసి కాసేపు కలిపి దించేయాలి. కాస్త చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది.
  ప్యాలాలు.. జ్ఞాపకశక్తిని పెంపొదిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి, మధుమేహ రోగులకు మరమరాలు మంచివి.
  బెల్లంలో  క్యాలరీలు తక్కువ.  మలబద్దకం, ఎసిడిటీ సమస్యలు కూడా ఉండవు. శ్వాసకోశ సమస్యల్ని నయం చేయడంలో బెల్లం బాగా పనిచేస్తుంది.
  బెల్లంలో పొటాషియం ఎక్కువ. దీంట్లో ఉండే ఎలక్ట్రోలైట్స్‌ సమతుల్యంలో ఉంటాయి. దీనివల్ల శరీర జీవక్రియ క్రమపద్ధతిలో సాగుతుంది. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటికి వెళ్లిపోతుంది.
  బెల్లానికి ఉన్న మరో మంచి లక్షణం.. రక్తాన్ని శుద్ధి చేయడం. శరీరంలో హిమోగ్లోబిన్‌ పరిమాణాన్ని కూడా పెంచుతుంది. ఒంట్లోని యాసిడ్‌ లెవల్స్‌ని క్రమపద్ధతిలో ఉంచడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.
  కీళ్లనొప్పులు ఉన్నవారు బెల్లం తినాలని చెబుతారు. ఇందులోని  మెగ్నీషియం పేగులకు బలాన్నిస్తుంది. నేరుగా తినలేం కాబట్టి, పేలాల ఉండలైతే పేచీ ఉండదు.
  మరమరాల్లో విటమిన్‌-డి, బిలతో పాటు క్యాల్షియం, ఐరన్‌ శాతం  ఎక్కువే. ఇవి పిల్లల ఎదుగుదలలో ఉపయోగపడతాయి.


logo