మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Jun 06, 2020 , 22:33:49

వాస్తు

వాస్తు

మా ఇంటికి తూర్పు - దక్షిణం రోడ్డు ఉంది. ఇంటి చుట్టూ ఖాళీ ఉంది. ఆ రెండు సైడ్లు వరండాలు వేయవచ్చా? వి.రంగారెడ్డి, గుండాల, యదాద్రి జిల్లా

తెలంగాణ పల్లెల్లో ఇండ్ల ముందు పందిర్లు ఎక్కువగా కనబడుతుంటాయి. సాధారణంగా మన దేశమే ఉష్ణ మండలం కాబట్టి పందిర్లు, వరండాలు అవసరం అవుతాయి. వ్యవసాయ కుటుంబాలవారు ఇంటిముందు వరండాలు తప్పనిసరి అనుకుంటారు. తూర్పు- దక్షిణం రోడ్డు కలిగిన మీ గృహానికి రెండు వైపులా వసారాలు వేయరాదు. మీది ఆగ్నేయం బ్లాకు. ఆ విధంగా కాకుండా దక్షిణం రోడ్డును ప్రధానంగా చేసుకొని దక్షిణం దిశకు వరండా వేసుకోండి. అలాగే ఉత్తరం దిశలో కూడా వరండా వేయండి. మీ గృహం చుట్టూ ఖాళీ స్థలం ఎలాగూ ఎక్కువగానే ఉందని అంటున్నారు కాబటి,్ట తూర్పును వదిలి ఉత్తర దక్షిణాలు వేయండి. ఉత్తరం వరండా ఇంటి కప్పుపై నుండి కాకుండా కప్పు కింది నుండి వేయండి. దక్షిణం వరండా ఇంటి కప్పు ఎత్తు నుండి వేయండి. అలాగే దక్షిణం ఫ్లోరింగ్‌ ఇంటి ఫ్లోరింగ్‌ కన్నా తక్కువ ఎత్తు ఉంటూనే ఉత్తరం వరండా కన్నా ఎత్తు ఉండేలా జాగ్రత్త పడండి.

మా అన్నదమ్ముల మధ్య భూ పంచాయితీ ఉంది.  అది ఎలా పోతుంది. మా గృహంలో ఏ మార్పులు చేయాలి? -యెగమాటి వెంకటరెడ్డి, షాద్‌నగర్‌

మీ అన్నదమ్ములందరి ఇండ్లలో తప్పక వాస్తుదోషాలు ఉంటాయి. బహుశా మీరు ఒకే ఇంటిని పంచుకొని ఉంటారు. అప్పుడు రెండు ఇండ్లు దోష పూరితమై మీకు మానసికంగా వైరుధ్యాలు ఏర్పడి ఉంటాయి. ఒకవేళ వేరువేరుగా మీమీ గృహాలు ఉన్నా, తప్పక వాటిలో ఆగ్నేయం నీళ్ల సంపు బోరు వేసి ఉంటారు. వాయవ్యం మెట్ల కింద టాయిలెట్‌ ఇంటిని అంటుకొని వేసినా, ఆగ్నేయంలో గొయ్యి ఏర్పాటు చేసుకున్నా దగ్గరి బంధువుల మధ్య వైరుధ్యాలు వస్తాయి. ఆ దోషాలను సవరించుకోండి. మీరు ఒకే ఇంటిని పంచుకొని ఉంటే ఎవరో ఒక్కరే ఆ గృహాన్ని తీసుకోండి. ఇల్లు ఒళ్లు రెండూ సక్రమంగా ఉంటే మనుషులు భౌతికమైన బాధలు పొందరు. ఇక్కడ ఒళ్లు అంటే మనస్సు. ఆలోచనల్లో స్వార్థం పెచ్చుమీరినప్పుడు అయిన వాళ్లు కూడా దూరం అవుతారు. ఇంటితో పాటు మీ మనసును కూడా సానుకూల పరుచుకోండి. తప్పక మీ అనుబంధం చక్కబడుతుంది.

వాస్తు సంప్రదాయం అయినప్పుడు, సతీసహగమనం కూడా ఓనాడు సంప్రదాయమే. మరి ఇలాంటి వాటితో మనుషులు బాగు పడతారా? వ్యాపారం కాకపోతే... -కొలను వాసుదేవరెడ్డి, పటాన్‌చెరువు

సంప్రదాయం గొప్పదే... కానీ సంప్రదాయాలన్నీ శాస్ర్తాలు కావు.  సంప్రదాయం పేరిట అది మూర్ఖత్వానికీ, ద్వేషానికీ బాధలకూ  మూలంగా మారితే.. కాలగర్భంలో సమాధి అవుతుంది. సంప్రదాయం వేరు. శాస్త్రం వేరు. వాస్తు సంప్రదాయం లోంచి పుట్టింది కాదు. శాస్త్రం అంటేనే ప్రమాణం. మీకు సంప్రదాయానికీ, శాస్ర్తానికీ తేడా తెలిసినట్టు లేదు. వాస్తులో వాస్తవికత లేకపోతే ఇన్ని తరాలు బతకదు. మన భారతదేశంలో అలవాట్లు, సంస్కృతి అంతా వేదబద్ధంగా శాస్త్రబద్ధంగా రూపుదిద్దుకున్నవే. ప్రతి పండుగలో  ఒక సహేతుకత ప్రకృతి శాస్త్రం తొంగిచూస్తూ ఉంటుంది. గృహ శాస్త్రం ఏదో గుడ్డిగా నమ్మే విధానం కాదు. దానికి హేతుబద్ధత, వినియోగత్వం, స్థిరత్వం, విశ్వజనీనత్వం ఉన్నాయి. సముద్రాన్ని చూసి ఏముంది అంతా అలలే... అల్లకల్లోలమే అనుకుంటే ఎలా? లోతుకుపోతే కానీ దాని నిగూఢత, గాఢత శక్తి అర్థం కావు. ఎవరికీ ప్రయోజనాన్ని కూర్చనిదీ, సర్వులకూ ఆచరణ యోగ్యంకానిది శాస్త్రం అనిపించుకోదు. భూమి కొన్ని కోట్ల సంవత్సరాలుగా తన చుట్టూ, సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తున్నది. భూమిమీద అద్భుత ఋతుమార్పుల ఫలితాలను అందిస్తూ భ్రమణ స్థిరకక్షను పొంది ఉంది. అది ఏ ఇరుసును ఆధారం చేసుకొని తిరగడం లేదు కదా. తద్వారా అయస్కాంత శక్తిని భూతత్వంగా నిరూపించుకుంటూ నిలబడింది కాబట్టే, నేలమీద మానవుడు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాడు.
సతీసహగమనం పాటించమని వేదంగానీ, ఋషులుగానీ శాసనం చేయలేదు. అది నాటి ఆయా వ్యక్తుల మానసిక దౌర్బల్య నిర్ణయం. వాటిని శాస్ర్తాలతో ముడిపెట్టి అర్థం చేసుకోవడం దిక్కుమాలిన అవగాహనే అవుతుంది. జ్ఞానం అనిపించుకోదు. వాస్తు శాస్త్రం అపార మేధోమధనం నుంచి, మాన్యుడి నుండి సామాన్యుడి వరకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉద్భవించింది. ఊరపిచ్చుకలు పట్టే వలతో ఆకాశాన్ని బంధించడం కష్టం. మనకున్న జానబెత్తెడు కంప్యూటర్‌ వ్యాపార తెలివితో ప్రాచీన హైందవ ఋషుల జ్ఞానాన్ని కొలువలేము.

సుద్దాల సుధాకర్‌ తేజ
[email protected]
Cell: 7993467678


logo