మంగళవారం 07 జూలై 2020
Sunday - May 31, 2020 , 11:18:30

బీడు భూములను పావనం చేస్తున్న కృష్ణా, గోదావరి జలాలు

బీడు భూములను పావనం చేస్తున్న కృష్ణా, గోదావరి జలాలు

ఆరేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలన రైతు ముఖంలో చిరునవ్వు తెచ్చింది. సమైక్య పాలనలో శ్మశానాలను తలపించిన పడావు భూములు.. ఇప్పుడు... పుట్ల కొద్దీ ధాన్యపు సిరులతో కళకళలాడుతున్నాయి. ఏడాది పొడవునా దిగువకు పరవళ్లు తొక్కే కృష్ణా, గోదావరిజలాలు సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల మంత్రంతో బీడు భూములను పావనం చేస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం అల్లాడిన నేల నిండు వేసవిలోనూ మత్తడి దుంకుతున్నట్లు జలకళలాడుతున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రాజెక్టుల ద్వారా 70 లక్షల ఆయకట్టుకు పుష్కలమైన సాగునీరు అందుతున్నది. మరో 15.71 లక్షల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రం కేవలం ఆరు సంవత్సరాల్లోనే 85.71 లక్షల ఎకరాలకు జీవం పోసింది. 

-గుండాల కృష్ణ 

ఆ నాలుగు ప్రాజెక్టులు: 

 తెలంగాణ ఏర్పడిన తర్వాత కోయిల్‌సాగర్‌, అలీసాగర్‌, గుత్ప, భక్త రామదాసు, సింగూరు ప్రాజెక్టు కాల్వల వంటి భారీ ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రభుత్వం రాలివాగు, గొల్లవాగు, మత్తడివాగు, గడ్డెన్న-సుద్దవాగు, చౌటుపల్లి హన్మంతరావు, కిన్నెరసాని వంటి మధ్యతరహా ప్రాజెక్టుల్ని కూడా పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వం గత ఆరేండ్లలో ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిసారించింది. వీటిని పూర్తి చేసినట్లయితే వెంటనే సాగునీరు అందించే అవకాశమున్నందున ప్రాధాన్యతా క్రమంలో వీటికి నిధులు కేటాయిస్తూ సాగు విస్తీర్ణాన్ని పెంచింది. ఒక్క 2019-20 ఆర్థిక సంవత్సరంలోనే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించిన నిధుల్లో 83 శాతం కేవలం ఆన్‌గోయింగ్‌ ప్రాజెక్టులపైనే ఖర్చు చేసింది. 

పునర్జీవనంతో అద్భుతం :

 సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌ మరో అద్భుతం... ఎస్సారెస్పీ పునర్జీవన పథకం. రోజుకు ఒక టీఎంసీని తరలించేందుకుగాను డిజైన్‌ చేసిన ఈ పథకం అతి తక్కువ ఖర్చుతో... అందునా కేవలం 48 ఎకరాల భూసేకరణతోనే రూపొందించడం గొప్ప విషయం. 122 కిలోమీటర్ల వరద కాల్వను మూడు రిజర్వాయర్లుగా మార్చి ఏడాది పొడవునా టీఎంసీన్నర నిల్వ జలాలతో ఆ ప్రాంత రూపురేఖలే మారిపోయాయి. 

కాళేశ్వర శకం: 

ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా రికార్డు సాధించిన కాళేశ్వరం ప్రాజెక్టును గత ఏడాది 21న సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. దీంతో రాష్ట్ర సాగునీటి, వ్యవసాయ ముఖచిత్రమే మారిపోయి కాళేశ్వర శకం ఆరంభమైంది. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బరాజ్‌లో ఒడిసిపట్టే జలాల్ని రోజుకు రెండు టీఎంసీల చొప్పున తొమ్మిది దశల్లో ఎత్తిపోసి... తాజాగా పదో అడుగుతో గోదావరి బేసిన్‌లోనే అత్యంత ఎత్తయిన (సముద్ర మట్టానికి 618 మీటర్లు) ప్రదేశంలో నిర్మించిన కొండ పోచమ్మ జలాశయంలో పోసేందుకు రంగం సిద్ధమైంది. 


దేశానికే ఆదర్శంగా మిషన్‌ కాకతీయ: 

నాలుగు విడతల మిషన్‌ కాకతీయ కింద 27,584 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేపట్టగా... 21,601 చెరువులు పూర్వ వైభవాన్ని సంతరించుకొని 15.06 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధించింది. 25.31 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పూడిక మట్టిని తొలగించడంతో అదనంగా 8.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం పెరిగింది. 

రుణమాఫీతో ఉపశమనం: 

2014 ఎన్నికల్లో హామీ మేరకు ప్రతి రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు రుణాన్ని మాఫీని అమలు చేయగా... 35.29 లక్షల మంది రైతులు రూ.16,124 కోట్ల మేర లబ్ధి పొందారు. 2019 ఎన్నికల్లోనూ ఇచ్చిన హామీ మేరకు సుమారు 43 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరేలా దాదాపు రూ.17-21వేల కోట్ల మొత్తాన్ని మాఫీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది రూ.6వేల కోట్లు కేటాయించగా... రూ.25వేల వరకు రుణాలున్న వారికి ఒకేదఫా మాఫీ చేసేందుకు రూ.1210 కోట్లను కూడా విడుదల చేశారు. 

రైతుబీమా: 

రైతు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఇన్సూరెన్స్‌ వచ్చేలా గుంట భూమి ఉన్న రైతుకు సైతం రైతుబీమాను అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఈ ఏడాదికి కూడా ప్రభుత్వం సుమారు రూ.1100 కోట్లను ప్రీమియంగా చెల్లించింది. 

ఎవరూ సాహసించని రైతుబంధు...

దేశంలోగానీ ఏ రాష్ట్రంలోగానీ కనీసం ఆలోచనలోకి కూడా రాని రైతుబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ దిగ్విజయంగా అమలు చేసి రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. 2018 యాసంగిలో ఎకరానికి రూ.4వేల చొప్పున రెండు పంటలకు ఎకరాకు రూ.8వేలతో మొదలైన రైతుబంధు ఇప్పుడు ఎకరాకు రూ.5వేల చొప్పున ఎకరాకు రూ.పదివేలు ఇస్తున్నారు. ప్రతి సీజన్‌లోనూ టంచన్‌గా అమలవుతున్న ఈ పథకంలో భాగంగా 2020-21 వర్షాకాలం పంటలకుగాను ఇప్పటికే రూ.7వేల కోట్లను కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. 


logo