మంగళవారం 14 జూలై 2020
Sunday - May 31, 2020 , 11:04:04

రూ. 40 వేల కోట్లతో సంక్షేమం.. కోటి 20 లక్షల మందికి లబ్ది

రూ. 40 వేల కోట్లతో సంక్షేమం.. కోటి 20 లక్షల మందికి లబ్ది

ఉద్యమస్ఫూర్తితో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పేదలెవరూ ఆకలితో బాధ పడొద్దని.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా కేసీఆర్‌ సర్కారు ఏటా రూ.40వేల కోట్లతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నది. అన్ని వర్గాలకు చెందిన పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఆరేండ్ల పాలన కొనసాగుతున్నది. 

-వి.డి.ఎస్‌.రాజు

ప్రతి ఇంటికీ : 

ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధిలో వెనుకబడిపోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన పేదల  ఆర్థిక, సామాజికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం వినూత్నంగా అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా కోటి 20లక్షల మందికి లబ్ది చేకూరింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న లక్ష్యంతో అన్ని వర్గాల ఆర్థిక, సామాజిక, విద్యాప్రగతికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ప్రణాళికా బద్ధంగా అమలుచేయడంలో దేశంలో నంబర్‌వన్‌ స్థానంలో నిలిచింది. ఓ వైపు సంక్షేమ పథకాలను అందిస్తూ.. మరో వైపు ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక, విద్యాప్రగతిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 

ఆసరాలో అగ్రగామి:  

ఎన్నడూ లేనంతగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నులకు ఆసరాగా నిలిచింది. నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, ఎయిడ్స్‌, బోధకాలు వ్యాధిగ్రస్తులు, వృద్ధ కళాకారులకు బాసటగా నిలిచింది. దేశంలోనే తొలిసారిగా బోధకాలు బాధితులతోపాటు ఒంటరి మహిళలకు పింఛన్లను అందించి అందరికీ మార్గదర్శకంగా నిలిచింది. వీరంతా ఆత్మగౌరవంతో జీవించేలా ప్రభుత్వం ఆసరా పెన్షన్లను ప్రవేశపెట్టి భారీ ఎత్తున అమలు చేస్తున్నది.

ప్రతి వర్గానికీ : 

సంక్షేమ పథకాల ద్వారా పేద, మధ్యతరగతి వారికి లబ్ధి చేకూరేవిధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం లబ్ధిదారుల వార్షికాదాయ పరిమితిని సైతం పెంచడం విశేషం. దీంతో రాష్ట్రంలో దళిత, గిరిజన వెనుకబడిన, మైనార్టీ వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయి.  

పట్టణాభివృద్ధి

హైదరాబాద్‌ ప్రపంచంలోనే డైనమిక్‌ సిటీగా అవతరించింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే ప్రధాన కారణం. ఒకవైపు పట్టణాల్లో మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేస్తూ.. మరోవైపు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయాల్ని తీసుకుంటున్నది. అందుకే, తెలంగాణలో పెట్టుబడుల్ని పెట్టేందుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు దృష్టి సారిస్తున్నాయి.  జోన్స్‌ లాంగ్‌ లసాల్‌ (జేఎల్‌ఎల్‌) విడుదల చేసిన 2020 సిటీ మూమెంటం ఇండెక్స్‌లో భాగ్యనగరం డైనమిక్‌ సిటీగా అవతరించింది. జేఎల్‌ఎల్‌ విడుదల చేసిన సిటీ ఇండెక్స్‌లో హైదరాబాద్‌ టాప్‌ మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నది. ప్రపంచవ్యాప్తంగా 130 నగరాలు దీనికి పోటీ పడ్డాయి. 

గ్రామీణాభివృద్ధి

ఆర్థికమాంద్య పరిస్థితుల్లోనూ కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో పంచాయతీలకు రూ.8వేల కోట్ల నిధులు ఇచ్చారు. ఇక ఈ ఏడాది 2020-21లో కనీవిని ఎరగని రీతిలో రూ.23,005 కోట్లను రాష్ట్రప్రభుత్వం కేటాయించడం విశేషం. 2015లో గ్రామాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా గ్రామజ్యోతి పథకం కింద రూ.25వేల కోట్లు అదనంగా ఇచ్చింది. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం రెండోసారి కొలువుతీరాక అత్యంత ప్రాధాన్యంగా అమలు చేసిన కార్యక్రమం పల్లెప్రగతి. దీని కింది రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామాల్లో వైకుంఠ ధామాలు నిర్మించాల్సి ఉండగా ఇప్పటికి 11,508  పనులు పూర్తయ్యాయి. మరో 10,875 గ్రామాల్లో  డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తి కావొచ్చింది. గ్రామాల్లో  గుర్తించిన 7,62,066 ఖాళీ ప్రదేశాలు, 83,545 ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు శుభ్రమయ్యాయి. logo