సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - May 31, 2020 , 10:55:44

సత్వర అనుమతులు.. వసతుల కల్పనతో పారిశ్రామిక పరుగులు

సత్వర అనుమతులు.. వసతుల కల్పనతో పారిశ్రామిక పరుగులు

ఒకప్పుడు నిర్లక్ష్యానికి గురైన పారిశ్రామికీకరణ తెలంగాణ ప్రాంతం సొంత రాష్ట్రంగా ఏర్పాటయ్యాక పరుగులు పెడుతున్నది. మీ రాష్ట్రంలో కరెంటు లేదు, కొత్త పరిశ్రమలు రావు, ఉన్న పరిశ్రమలు తరలిపోతాయంటూ చేసిన ప్రచారానికి ఆరు నెలల్లోనే శాశ్వత పరిష్కారం చూపించారు సీఎం కేసీఆర్‌. టీఎస్‌ఐపాస్‌, ఈవోడీబీ , పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తూ.. ఆరేండ్లలో 12వేలకు పైగా పరిశ్రమల్ని రాష్ర్టానికి రప్పించి.. వీటిద్వారా 14లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి.. రెండు లక్షల కోట్లు పెట్టుబడులు రాబట్టారు.   

-నెలకుర్తి శ్రీనివాస్‌ రెడ్డి

తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్టు అప్రూవల్‌ అండ్‌ సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టం (టీఎస్‌ఐపాస్‌) గత ఐదు సంవత్సరాల్లో దాదాపుగా 12వేల పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతి ఇవ్వాలనేదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. సీఎం కేసీఆర్‌ మదిలో నుంచి పుట్టిన ఈ ఆలోచన ప్రపంచంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రగామి సంస్థలు ఇక్కడ తమ యూనిట్లను స్థాపించాయి. 12,290 పరిశ్రమలు అనుమతులు తీసుకున్నారు. వీటి ద్వారా రూ.1,98,511 కోట్లు పెట్టుబడులు రాగా 13.97లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. వీటిలో ఇప్పటి వరకు 9236 పరిశ్రమలు తమ వాణిజ్య ఉత్పత్తులను ప్రారంభించగా వీటి ద్వారా రూ.86,867కోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయి. వీటితో 6,37,654 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. 

పారిశ్రామిక తెలంగాణ: 

పరిశ్రమలు స్థాపించడానికి ప్రధానంగా కావాల్సింది భూమి, నీరు, విద్యుత్‌, మౌలిక సదుపాయాలు, త్వరితగతిన అనుమతులు, మానవ వనరులు. పరిశ్రమల స్థాపన కోసం దాదాపుగా 1.50లక్షల ఎకరాల భూమిని కేటాయించింది ప్రభుత్వం. మిషన్‌ భగీరథలో 10 శాతం నీటిని పరిశ్రమల అవసరాల కోసం సమకూర్చారు. ఏపీఐఐసీ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 1973 నుంచి 2014 మే వరకు 41 సంవత్సరాల్లో 23,653 ఎకరాలను మాత్రమే కొనుగోలు చేయగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014 జూన్‌ 2 నుంచి తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా 5 సంవత్సరాల్లోనే 16,961ఎకరాలను కొనుగోలు చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 17,898 ఎకరాల్లో 131 పారిశ్రామిక పార్కులు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో  1,45,682 ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు పరిశ్రమల అవసరాల కోసం సిద్ధం చేశారు. 1200 ఎకరాల్లో వరంగల్‌లో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌, 500 ఎకరాల్లో దండుమల్కాపురంలో ఎమ్మెస్‌ఎంఈ పార్క్‌, దాదాపుగా 600 ఎకరాల్లో సుల్తాన్‌పూర్‌లో మెడ్‌టెక్‌ పార్క్‌, 19వేల ఎకరాల్లో ఫార్మా సిటీ, 12వేల ఎకరాల్లో జహీరాబాద్‌లో నిమ్జ్‌, సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పార్క్‌, బండమైలారం, బుగ్గపాడు ఇతర ప్రాంతాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పార్క్‌లను ఏర్పాటు చేశారు. 

ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌:  

కొత్త పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా ఇప్పటికే స్థాపించిన పరిశ్రమల్లో ఖాయిలా పడే స్థాయిలో ఉన్న, ఖాయిలా పడిన పరిశ్రమలను తెరిపించడానికి మంత్రి కే తారక రామారావు మదిలో నుంచి వచ్చిన ఆలోచనే ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లీనిక్‌. మూతపడిన, మూతపడే దశలో ఉన్న సూక్ష్మ, చిన్నతరహా సంస్థలకు పరిశ్రమలకు ఊతమివ్వడానికి, మూతపడిన పరిశ్రమలు తెరిపించడానికి పూర్తి స్థాయి అధ్యయనం చేసి, దానికి అవసరమైన సూచనలు చేస్తారు. అవసరమైతే బ్యాంకులతో చర్చించి వారికి రుణాలను రీ షెడ్యూల్‌ చేయించడం, వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చేయించడమే కాక ఆర్థిక సాయమందిస్తారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ పేపర్‌ మిల్లు, కమలాపూర్‌ రేయాన్స్‌ ఫ్యాక్టరీలను తెరిపించేందుకు బ్యాంకులు, పరిశ్రమల యాజమాన్యాలతో మంత్రి కేటీఆర్‌ మాట్లాడి వారిని ఒప్పించి తిరిగి మనుగడలోకి వచ్చే విధంగా చేశారు. 

మహిళా పార్కులు: 

పారిశ్రామికరంగంలో మహిళలు తక్కువ సంఖ్యలో ఉన్నారని గుర్తించిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వారిని పారిశ్రామికంగా ప్రోత్సహిస్తున్నది. పారిశ్రామికపార్కుల్లో మహిళలు స్థాపించే పరిశ్రమలకు టీఎస్‌ఐఐసీ ద్వారా ప్రత్యేక రాయితీలు ఇస్తున్నది. మహిళల కోసం మూడు ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌ గ్రామంలో ఫిక్కి లేడి ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) పార్క్‌కు స్థలాన్ని కేటాయించారు. నందిగామ గ్రామంలో ఎలిప్‌ సంస్థ మహిళా పారిశ్రామిక పార్క్‌, కోవై మహిళా సంస్థ ఆధ్వర్యంలో మరొక పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటు చేశారు. మహిళలకు కోసం ప్రత్యేకంగా 2018 లో వీహబ్‌ (ఉమెన్‌ ఎంటర్‌ప్రైన్యూర్‌ హబ్‌)ను ఏర్పాటు చేశారు. రూ.15కోట్ల కార్పస్‌ ఫండ్‌తో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దానిని ఏర్పాటు చేశారు. 

ఈవోడీబీలో ఆగ్రస్థానం: 

సులభతర వాణిజ్య (ఈవోడీబీ) ర్యాంకింగ్‌లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇకపై కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ (సీవోడీబీ) లపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరిశ్రమలు ఉండే దగ్గరే కార్మికుల ఇళ్లు ఉండే విధంగా సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీనిని అమలు చేయడానికి టీఎస్‌ఐపాస్‌ చట్టంలోనే ఈ విధానాన్ని పొందుపరిచారు. 

వ్యాక్సిన్ల తయారీ  

సూదిమందుకే ఇబ్బంది పడ్డ తెలంగాణ ఇవాళ ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. ప్రపంచానికి అవసరమయ్యే వాక్సిన్లలో మూడో వంతు మన దగ్గర నుంచే ఎగుమతి అవుతున్నాయి. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ కూడా హైదరాబాద్‌ నుంచే తయారవుతుందనే విశ్వాసం ప్రజల్లో ఉంది. భారతదేశంలో ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ కనుగొనడానికి ప్రయత్నిస్తుంటే ఇందులో భారత్‌ బయోటెక్‌, ఇండియన్‌ ఇమ్యూనోలాజికల్స్‌, బయోలాజికల్‌ కంపెనీలు తెలంగాణవే. 19వేల ఎకరాల్లో ఫార్మా సిటీ, మరో వైపు జీనోమ్‌ వ్యాలీ, సుల్తాన్‌పూర్‌లో మెడ్‌టెక్‌ పార్క్‌ వంటి లైఫ్‌సైన్సెస్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 
logo