శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - May 31, 2020 , 10:38:03

అపనమ్మకపు చీకట్లను చీల్చుతూ.. విద్యుత్ వెలుగులు

అపనమ్మకపు చీకట్లను చీల్చుతూ.. విద్యుత్ వెలుగులు

‘కటిక చీకట్లలో మగ్గిపోతారు..’ అంటూ తెలంగాణకు శాపనార్థాలు పెట్టిన.. ఒకప్పటి సమైక్య నాయకుల కండ్లు బైర్లు కమ్మేలా సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ విద్యుత్‌ రంగం వెలుగుల దిశగా ప్రయాణం మొదలెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేసిన మొదటి సమావేశం విద్యుత్‌ పైనే కావడం.. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మొట్టమొదటి జీవో.. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావును నియమించడం. ఈ రెండు అంశాలు కూడా.. అప్పట్లో తెలంగాణలో విద్యుత్‌ రంగం ఎదుర్కొంటున్న దుస్థితిని.. ఆ రంగాన్ని తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ కంకణబద్ధులైనట్టు చెప్పకనే చెబుతాయి.

-ఎక్కల్‌దేవి శ్రీనివాస్‌

ఆరు నెలల్లో.. భరోసా:

నిజానికి తెలంగాణ ఏర్పడిన జూన్‌ 2, 2014 నాడు తెలంగాణ యావత్తూ ఎటుచూసినా.. చీమ్మ చీకట్లే కనపడేవి. అప్పటి విద్యుత్‌ డిమాండ్‌లో 2700 మెగావాట్ల లోటుతో ఉన్న పరిస్థితిలో రాష్ట్ర అభివృద్ధి జరగదని గ్రహించిన సీఎం కేసీఆర్‌.. ముందుగా విద్యుత్‌ రంగానికి చికిత్స మొదలెట్టారు. 2014 నవంబర్‌లోనే గృహ, వాణిజ్య, వ్యాపార, పరిశ్రమలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ను అందివ్వడం ప్రారంభించడం వెనుక సీఎం మార్గదర్శనం.. సీఎండీ సారధ్యం.. విద్యుత్‌ ఉద్యోగుల అవిరళ కృషి ఉంది. అలాగే రాష్ట్ర అవసరాలను తీర్చేలా విద్యుత్‌ కొనుగోళ్లు.. వ్యవస్థలను పటిష్టపర్చడం.. సొంత రాష్ట్రంలోనే విద్యుత్‌ ఉత్పత్తికి నడుంకట్టడం లాంటివి అనేకం ప్రభావితం చూపాయి. దీనికితోడు.. 1000 మెగావాట్లకు చత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందం, ఉత్తరాదిని దక్షిణ భారతంతో కలిపేలా 765 డబుల్‌ సర్క్యూట్‌ లైన్‌ను త్వరితంగా పూర్తిచేసేలా చూడటం మనకు కలిసివచ్చింది. 

సమైక్య రాష్ట్రం డిమాండ్‌నూ దాటేసింది:

23 జిల్లాలు కలిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే మొదటి సారిగా.. 2014 మార్చి 23న  13,162 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదయ్యింది. అప్పట్లో అదే పెద్ద రికార్డు. 23 జిల్లాల్లో సాధించిన ఆ రికార్డును.. కేవలం పాత 10 జిల్లాలతోనే తెలంగాణ చెరిపేసింది. 28.2.2020 నాడు తెలంగాణ అంతకు మించి డిమాండ్‌తో చరిత్రను తిరగరాసింది. ఆ రోజు ఉదయం 7.52 గంటలకు 13,168 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదయ్యింది. 2019తో పోలిస్తే ఈ ఏడాది 34 శాతం అధిక డిమాండ్‌ రావడం గమనార్హం. రైతులకు 24 గంటల విద్యుత్‌ సరఫరా, ఎత్తిపోతల పథకాల నిర్వహణ, పరిశ్రమల సంఖ్య పెరగడం తదితర కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అధిక డిమాండ్‌ ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014 జూన్‌ 2 నాటికి ఎస్‌.పి.డి.సి.ఎల్‌, ఎన్‌.పి.డి.సి.ఎల్‌. పరిధిలోని తెలంగాణ ప్రాంతంలో 5,661 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్‌ నమోదైంది. తెలంగాణ వచ్చిన నాటి పరిస్థితితో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన డిమాండ్‌ 132.6 శాతం అధికం. 

వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌:

రాష్ట్రం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్‌ను అందివ్వడం మొదలుపెట్టారు.  ఇక 2018 జనవరి 1 తారీఖు అనేది వ్యవసాయ రంగంలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన సమయం. కొత్త సంవత్సరం ప్రారంభమైన క్షణం (2017 డిసెంబరు 31 అర్ధరాత్రి) నుంచి తెలంగాణలో వ్యవసాయానికి.. 24 గంటలపాటు ఉచిత విద్యుత్‌ను అందించడం ప్రారంభించింది. తెలంగాణలో రైతులను రాజులను చేయాలని తలచిన సీఎం కేసీఆర్‌.. అకుంఠిత దీక్షతో.. ప్రణాళికాబద్ధంగా విద్యుత్‌ రంగాన్ని ముందుకు నడిపించి.. రైతులకు మాత్రం 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించాల్సిందేనంటూ పట్టుపట్టి సాధించి ప్రపంచానికి చూపారు. ప్రస్తుతం రాష్ట్రంలో (యాసంగి, వానకాలం పంటల సమయంలో) ప్రతిరోజూ నమోదయ్యే గరిష్ఠ డిమాండ్‌లో వ్యవసాయం వాటా.. 39-40 శాతం వరకు ఉంటుంది. రోజూ వినియోగించే విద్యుత్‌లో 38 శాతం వరకు ఉంటుందని నిపుణుల అంచనా.

సొంత కాళ్లపై నిలబడేలా విద్యుత్‌ ఉత్పత్తి:

థర్మల్‌ విద్యుత్‌, సౌర విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి సారించి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచారు. ఇందులో భాగంగానే.. 2018 సెప్టెంబర్‌ 8న.. తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో పులిచింతలలోని 30 మెగావాట్ల ఆరో యూనిట్‌ను ప్రారంభించారు. అలాగే కొత్తగూడెం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని ఏడవ యూనిట్‌ 800 మెగావాట్ల సూపర్‌ పవర్‌ స్టేషన్‌ను రికార్డు స్థాయిలో కేవలం 48 నెలల్లోనే పూర్తిచేసి డిసెంబరు 26, 2018 నాడు ఉత్పత్తిని ప్రారంభించారు. అలాగే 1080 మెగావాట్లతో భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం, 4000 మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. ప్రస్తుతానికి భద్రాద్రి థర్మల్‌లోని ఒకటవ యూనిట్‌ 270 మెగావాట్లను 2019 సెప్టెంబర్‌ 19న సింక్రనైజ్‌ చేశారు. దీనికి తోడు అదే సామర్థ్యం ఉన్న 2వ, 3వ యూనిట్ల బాయిలర్లనుకూడా డిసెంబరు 2019 చివరి నాటికి లైటప్‌ చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల సామర్థ్యానికిగాను 800 మెగావాట్ల చొప్పున రెండు యూనిట్ల నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇవన్నీ గడువులోపు పూర్తిచేసి.. మిగులు విద్యుత్‌ను ఇతర రాష్ర్టాలకు సరఫరా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి కేవలం 7778 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో ఉన్న విద్యుత్‌ ఉత్పత్తి.. ఆరేండ్లలో.. (1.5.2020 నాటికి) 15980 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో పురోగమిస్తున్నది. 

సౌరశక్తిలో మున్ముందుకు..

వాస్తవానికి రాష్ట్రం ఏర్పడేనాటికి సౌర విద్యుత్‌ ఉత్పత్తి నామమాత్రంగానే ఉండేది. రాష్ట్ర ఆవిర్భావం రోజున కేవలం 74 మెగావాట్ల సౌర విద్యుత్‌ మాత్రమే అందుబాటులో ఉండేది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి.. ఐదు సంవత్సరాలు గడిచేసరికి గుజరాత్‌, రాజస్థాన్‌లతో ధీటుగా సౌర విద్యుత్‌ ఉత్పత్తిలో నిలబడింది. ఆరేండ్లకు మన రాష్ట్రంలో 3681 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కల్గి ఉండటం గర్వకారణం. పునరుత్పాదక ఇంధన వనరులన్నీ కలిపి.. 4061 మెగావాట్లతో మరింత ముందుకు వెళుతున్నది.