సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - May 31, 2020 , 00:56:45

రైతురాజ్యం నడుస్తాంది!

రైతురాజ్యం నడుస్తాంది!

ఆరేండ్లలో వ్యవసాయం ఏం మారింది? వంద ముచ్చట్లు వద్దు. ఒకసారి వరంగల్‌లోని ఐనవోలు వెళ్లి అక్కడి ఒంటిమామిడిపల్లి రైతు పొన్నాల రాజును కలిస్తే తెలుస్తుంది. ఆఫీసర్‌ కొలువుకన్నా.. బిజినెస్‌మాన్‌ కన్నా గొప్పగా రైతు జీవితం ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఆరేండ్ల క్రితం ఎట్లుండె? నెర్రెలువారిన పొలాలు.. సుక్క నీళ్లులేని బోర్లు.. తుమ్మలు మొలిచిన చెరువులు. ఇప్పుడెట్లయింది? సొంతరాష్ట్రంలో వ్యవసాయమేం మారిందో.. పొన్నాల రాజు లైఫ్‌ జర్నీతో తెలుసుకుందాం. 

మాబాపు నన్ను పదో తరగతి వరకు ప్రైవేట్‌ స్కూళ్ల చదివిచ్చిండు. ఇంటర్‌ వరంగల్‌ ఏవీవీ కాలేజీలో చదివిన. ఇంటర్‌ ఫేల్‌ కాంగనే ఇగ సదువు మనకు అచ్చిరాదని అనుకున్న. పెద్దగా ఇంట్రస్ట్‌ కూడా లేకుండే. మా తాత పొన్నాల కొమురయ్య ఊళ్లె మోతుబరిరైతు. బాపుకూడా ఎవుసమే చేసేది. చదువుకున్నప్పుడు నేను అప్పుడో ఇప్పుడో పొలం కాడికి వెళ్లేది. మాకు ఏడెనిమిది ఎకరాల భూమున్నది. బాగ చదువుకుంటే సిటీల ఉంటే ఏ కంపిన్లనో, ప్రైవేటు దుకాండ్ల గుమాస్తనో అయితరు అనుకునేటోళ్లం. ఇంకా బాగా సదివితే ఇంక  పెద్ద కంపిన్ల నౌకరి చేస్తం అనుకునేది. 

‘ఇంత భూమి ఉన్నది. ఎవుసం చేసుకొని బతుకొచ్చు. ఉట్టిగుంటే ఇల్లెల్లుతదా’ అని మా బాపు అన్నడు. అది 1998 కాలం.  ఎవుసం తప్ప  వేరే ఆప్షన్‌లేదు. వర్షాల్లేవు. వరుస కరువు. అసుంటి టైంల వాన కోసం మొగులు చూసేది. ఎండాకాలం వస్తే అరిగోస. చెర్ల భూమి నెర్రలు బారి భూమితేలేది. బాయిల నీళ్ల సుక్క ఉండకపోయేది. బాయిలేసిన బోర్లు ఎండిపోయేది. నాలుగెడ్లు, రొండు బండ్లు. భూమున్నా నీళ్లకోసం అసుంటి ఇసుంటి తిప్పలు కాదు. చెంద్రబాబు జమాన కాలం అప్పుడు. ఎవుసం అరిగోస.  కరెంటు కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దొంగరాత్రి కరెంటు. ఎప్పుడత్తదో రాదో తెల్వది. రాత్రిపూట  రైతులు ఇండ్లండ్ల పండకపోయేది. కరెంటు బిల్లులు కట్టకుంటే మోటర్లు పీక్కపోయేది. భూమిల నీళ్లు కిందికే పోయేది. ఎన్ని బోర్లు ఏసినమో. మా భూమిలనే ముఫ్పై ఐదు, ముప్ఫై ఎనిమిది బోర్లు ఏసినం. మా చెలకలో మూలమూలకూ బోరు ఏసినం సుక్కనీళ్లు పడలేదు. ఎవుసం లేక. కరువుతోని కడుపు మాడుసుకున్న రోజులు యాదికొస్తే ఇగ బతుకుడు ఉంటదా అనుకున్నం. ఊళ్లె అందరు సిటీలకు పనుల కోసం పొద్దుగాల్నే సద్దులు కట్టుకొని అడ్డమీదికి పోయేది. మా బాపుకూడా పార పనికి పోంగా.. నేనే ఎవుసం చూసుకునేటోన్ని. 

కానీ.. ఎవుసం చేత్తే ఏమున్నది అనిపించేది. సెంద్రబాబు కాలాన్ని చూసినం. రాజశేఖరరెడ్డి కాలం చూసినం. ఏ మాటకు ఆ మాటే రాజశేఖరరెడ్డి కాలం నుంచి కొద్దిగా ఎవుసం మారడం మొదలైంది.  కానీ మన రాష్ట్రం మనకు వచ్చినంకనే రైతురాత మారింది. అప్పుడు వ్యవసాయం అనేది దండుగ. ఇప్పుడు పండుగ చేస్తున్నడు కేసీఆర్‌.  రాష్ట్రం వచ్చినంక ఒక్కసారి తలకిందులైంది. కిందపడ్డ రైతుమీదికి వచ్చిండు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వాన్నే వ్యవసాయం వైపు మళ్లించిండు. అంతకు ముందు పత్తిగింజల కోసం, మందుబత్తాల కోసం  మా ఊరోళ్లం, పక్కూరోళ్లం నలుగురైదుగురం  జమై మహారాష్ట్ర పోయేది. 

ఇక్కడిచ్చే మందుబస్తాల కోసం  లైన్లన్ల నిలబడి నిలబడి ఊపిరిపోయేది. కూపన్లు ఉన్నోళ్లకు కూడా మందుబస్తాలు దొరకకపోయేది. ఎండాకాలం వస్తే ఊర్ల బోరు మిషన్‌ సప్పుడే ఇనిపిచ్చేది. చెర్ల మట్టి తీసుకునే ముచ్చటే ఉండకపోయేది. మిషన్‌ కాకతీయతో మా ఊరి చెరువులో 33వేల ట్రాక్టర్‌ ట్రిప్పులు కొట్టుకున్నం రైతులందరం. ఇప్పుడు నడి ఎండాకాలంలో కూడా చెరువులో చూద్దాం అన్న మట్టి కనిపిస్తలేదు. వానాకాలంల నీళ్లున్నట్టే చెరువుల నీళ్లు. దేవాదుల, కాళేశ్వరం ప్రాజెక్టులతో ఎస్సారెస్పీ కాలువలల్ల నీళ్లు. గీ ఎండా కాలంల ఉండుండేది అనుకునే పరిస్థితి వచ్చింది. రైతుబందు పైసలతోని పంటపెట్టుబడికి ఆసరా అయింది. ఉన్న ఊళ్లెనే ఎరువులు, ఇత్తనాలు దొరుకుతానయ్‌.  దేనికి ఎదురుచూడకుంట ఎవుసం ఇగురంగా చేసుకుంటున్నం. అసలు 24గంటల ఉచిత విద్యుత్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇజ్జదక్కువ కరెంట్‌ వచ్చినప్పుడు బతుకే ఎందుకు అనుకున్నం. కానీ ఇయ్యాల కావలసినంత కరెంటు. సెంద్రబాబు టైంల ఆ వచ్చిపోయే కరెంట్‌కు పీసులు కొట్టుడు, సరిగ్గ రాని కరెంట్‌కు బిల్లు కట్టమనుడు. కట్టకుంటే మోటర్లు పీక్కపోవుడు ఎన్నని. ఆ కష్టాలు యాదికి చేసుకుంటే గుండెలవిసి గుడ్లల్ల నీరు పారుతయి. ఇప్పుడు  నీళ్లు పుష్కలంగా వస్తున్నవి. అసలు వానాకాలంల మోటర్‌ పెట్టినోడు లేడు. నీళ్లను చూస్తే కడుపు నిండిపోద్ది. నిజం చెప్పాలంటే గీ ఎవుసం ఎవడు చేస్తడు. ఎటన్నాపోయి బత్కచ్చు అనుకున్న. నేను కూడా ఎటన్నా వేరే దేశం పోవాలని అనుకున్న. అసుంటిది ఈ ఆరేండ్లల్ల మళ్లా జీతగాళ్లను పెట్టుకుందామంటే మనుషులు దొరకని పరిస్థితి. 

ఒకప్పుడు ఏం పంట వేయాలి? ఎట్లా వేయాలి? అన్న వాటిమీద ప్రభుత్వానికి అసలు పట్టింపే ఉండకపోయేది. కానీ ఇప్పుడు  రైతుల చుట్టూ అధికారులు తిరుగుతున్నరు. పంట నష్టం వచ్చిందని ఆఫీసుల సుట్టూ తిరిగినా పట్టించుకోకపోయేది. ఇప్పుడైతే గాలి దుమారం వచ్చిన తెల్లారే ఆఫీసర్లు వచ్చి ఊళ్లల్ల వాలిపోతాండ్లు. అసలు ప్రభుత్వమే వ్యవసాయానికి మళ్లింది. భూసార పరీక్షలు అనేది మోతుబరి రైతు చేసుకునేది. లేకపోతే బాగా ఎవుసం గురించి తెలిసినోళ్లో, చదివినోళ్లో ఆ పరీక్షలు చేయించేది. కానీ ఇప్పుడు  పరిస్థితి మారిపోయింది. మేం భూసార పరీక్షలు చేయించుకుంటున్నం. ఏ నేలలో ఏ పంట వేయాల్నో? ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో వ్యవసాయ శాఖ అధికారులు చెప్తాండ్లు. గ్రామంలో ఉన్న రైతుబంధు సమితి సభ్యులు మా దగ్గరికి వచ్చి మా సమస్యలు తెలుసుకొని అధికారులకు చెప్పుడు. వాళ్లు చెప్పిన ముచ్చట తీస్కచ్చి చెప్పుడు  అసలు ఊహించలేదు. అయితే దీంట్ల కొద్దిల రాజకీయం చేసుడు బంద్‌ చేయాలె. అంటే మొత్తం రాజకీయం చేస్తున్నరు అని కాదు. అక్కడక్కడ అప్పుడప్పుడు కొద్దిల చేయాలని అనుకున్నా దాన్ని బంద్‌ పెట్టాలె. మా ఊళ్లే నేను ఎవుసం మొదలుపెట్టినపుడు ఎడ్లతోనే భూములు దున్నేది. కాలం మారిన కొద్దీ పరిస్థితులు మారుకుంటూ వస్తున్నయ్‌. మా ఊళ్లే ఒకప్పుడు (2004లో) ఒకటే ట్రాక్టరు ఉండేది. నేను కొద్దిగ సదువుకున్న కాబట్టి ఎప్పటికీ ఎడ్లతోని ఏం జేస్తమని ఓ ట్రాక్టర్‌కొన్న. కానీ ఇప్పుడు 36 ట్రాక్టర్లు. దీంట్ల కేసీఆర్‌ ఇచ్చిన సబ్సిడీ ట్రాక్టర్లు కూడాఉన్నవి. వరికోత మిషన్లు అప్పుడు ఒకటి ఉంటే గొప్ప. కానీ మా ఊళ్లోనే ఎనిమిది ఉన్నవి. ఇప్పుడు కొత్తగా గడ్డి కట్టలు కట్టే మిషన్‌కూడా రైతులకు అందుబాటులో వచ్చింది. నీళ్లు పుష్కలంగా ఉండటం, 24 గంటల ఉచిత కరెంట్‌ ఉండటం, ఎరువులు విత్తనాలు గ్రామంలోనే అందుబాటులో ఉండటంతో రైతులం సంతోషంగా ఉన్నం. ఒక్కమాట చెప్తా. అసలు గీ కరోనా కాలంలో రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కొనుగోలు చేసుడు అనేది గొప్పవరం. పరిస్థితులు చూస్తాంటే రేపు వ్యవసాయం కూడా అఫీషియల్‌ అయ్యేటట్టున్నది. ఇట్లనే ఉంటే సిటిలో ఉన్నోడు,  యాభై వేల నౌకరిగాడు కూడా మా కింద పనిచేసే రోజులు వస్తయా అన్నంత సంబురంగా ఉన్నది. 

రైతులు కూడా ప్రభుత్వం చెప్పిన పంటలే వేస్తే మంచిది. ఒకే పంటను మూడు నాలుగేండ్లు పండిస్తే భూమిలో సారం ఉండదు. పంటల పద్ధతి మారాలి. ఇయ్యాల భూములన్నీ మందులకు అలవాటు పడ్డయి. ఇసొంటి పరిస్థితి ఇట్లనే కొనసాగితే కష్టం. నల్లరేగడి నేలలు కూడా చౌడు భూములు అయిపోతాయి? వరుసగా మూడేండ్లు పత్తేసిన. ఈసారి ఎట్లన్న మంచిదే అని కంది వేసిన. కంది పెరిగింది. కానీ పూతలేదు. అట్లనే కాతలేదు. ఏందని చూపిస్తే భూమిల సారం పోయింది అన్నరు. చిన్న రైతు పరిస్థితి ఏమిటీ? మా ఊళ్లో ఒకతను వేరుశనగ వేసిండు. అది వేర్లు భూమిలకు పోయి కింద పెరగాలి. కానీ పైన విపరీతంగా పెరిగింది.  ఒకటే పంట ఏండ్ల తరబడి ఏస్తే భూమిల సారం పోయి ఎటు కాకుంట పోద్ది. ప్రభుత్వం వ్యవసాయం చేసే పద్ధతిని మార్చాలని మంచి నిర్ణయం తీసుకున్నది. దీనితో భూమిని మల్ల యథాస్థానానికి తేవాలె. ముందు కొద్దిగ తిప్పలు అయినా సరే ఇప్పుడే అసలు టైం. మెల్లమెల్లగా పంటల తీరులో.. రైతుల ఆలోచనా పద్ధతిలో మార్పు రావాలె. 

- నూర శ్రీనివాస్‌


logo