ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - May 31, 2020 , 00:38:05

పాట కచేరి!

పాట కచేరి!

సంగీతం విశ్వమానవ భాష. శబ్దం రూపుకట్టిన ఓ మార్మికోద్విగ్నత. మూగబోయిన మాటకు, అవ్యక్తమైన భావానికి సప్తస్వరాలతో ఊపిరులూదే ఓ సృష్టిరహస్యం. సమస్త ప్రాణికోటిని స్పందింపజేసే గుణమున్న ఓ అంతర్వాహిని. సినిమా యవనికపై సంగీతం ఓ అందమైన వర్ణచిత్రం. ‘సాధనతో సంగీతంలో పరిపూర్ణత సాధించవచ్చు. అయితే వైయక్తిక అనుభవాలు, భావోద్వేగాలపై స్పందించే గుణమే ఉత్తమ సంగీతానికి ఉపకరిస్తుంది’ అంటున్నారు యువ స్వరకర్త శేఖర్‌చంద్ర. ‘నచ్చావులే’, ‘మనసారా’ ‘నువ్విలా’, ‘కార్తికేయ’, ‘సినిమా చూపిస్తా మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ సినిమాలతో ప్రతిభావంతుడైన సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. 

-కళాధర్‌ రావు

కాలేజీ రోజుల్లో ఏ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలు సంగీత నేను దర్శకుడిగా మారడానికి ప్రేరణనిచ్చాయి. మైఖేల్‌జాక్సన్‌ ఆల్బమ్స్‌ కూడా ఎంతగానో ప్రభావితం చేశాయి. మెలోడీ కలబోసిన పాటల్ని వింటున్నప్పుడు మరో ప్రపంచంలో తేలియాడుతున్న అనుభూతి కలిగేది. అలా సంగీతం పట్ల నాలో తెలియని మక్కువ ఏర్పడింది. చదువుకంటే మ్యూజిక్‌ వైపే మనసులాగడంతో స్వరకర్తగా మారాలని నిర్ణయించుకున్నా. పియానో గ్రేడ్స్‌ చేసి లండన్‌ యూనివర్సిటీ నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణుడనయ్యాను. కర్ణాటక సంగీతంలో వోకల్స్‌ నేర్చుకున్నా. ‘జ్ఞాపకం’ సినిమాతో సంగీత దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాను. ‘నచ్చావులే’ తొలిబ్రేక్‌ నిచ్చింది.

దర్శకుడి ఆలోచనలకు అనుగుణంగా..

పాటను స్వరపరిచే విషయంలో దర్శకుడు, సంగీత దర్శకుడు.. ఇద్దరి అభిరుచులు కలిస్తే ఆ గీతం అద్భుతంగా రూపుదిద్దుకుంటుంది. శ్రోతల్ని కూడా అలరిస్తుంది. దర్శకుడి ఆలోచనల్ని, విజువల్‌సెన్స్‌ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ సరిగ్గా అంచనా వేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. దర్శకుడు, స్వరకర్త ఆలోచనలు దగ్గరగా ఉంటే మ్యూజిక్‌ కంపోజింగ్‌ సులభంగా అనిపిస్తుంది. అందుకే చాలామంది దర్శకులు ఎంపిక చేసుకున్న ఒకరిద్దరు సంగీత దర్శకులతోనే పనిచేయాలని అనుకుంటారు. కొంతమంది దర్శకులు విజువల్‌గా తన సీన్స్‌ బలమైన భావోద్వేగాల్ని ప్రతిబింబిస్తాయి కాబట్టి, ట్యూన్‌ మామూలుగా ఉంటే సరిపోతుందని చెబుతారు. మరికొందరేమో సీన్స్‌ కంటే ట్యూన్‌ ఎక్కువగా ఉద్వేగాల్ని రగిలించాలని కోరతారు. కథ, దర్శకుడి అభిరుచులు పాట రూపకల్పనలో స్వరకర్తను ఎంతగానో ప్రభావితం చేస్తాయి.

పాట ప్రయాణంలో ప్రయాస

దర్శకుడు పాట తాలూకు పన్నివేశాన్ని చెప్పిన క్షణం నుంచే సంగీత దర్శకుడి మదిలో పాటకు శ్రీకారం దిద్దుకుంటుంది. ఆ సన్నివేశంలోని ఉద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందేలా ఎలాంటి ట్యూన్‌ను కంపోజ్‌ చేయాలా అని ఆలోచిస్తారు. అదే సందర్భానికి తాను గతంలో స్వరపరచిన గీతాల్ని ఒక్కసారి మననం చేసుకోవడం జరుగుతుంది. వాటి దగ్గరగా ఏదైనా కొత్త స్వరాన్ని కంపోజ్‌ చేసే వీలు ఉంటుందేమోనని మొదట పరిశీలిస్తారు. అలా కుదరకపోతే పూర్తిగా కొత్త ట్యూన్‌కు సిద్ధమయిపోతారు. తొలుత ఒక హుక్‌లైన్‌ అనుకుంటారు. దానిని గిటార్‌మీద, కీబోర్డ్‌మీద ప్లే చేస్తూ ట్యూన్‌ సందర్భానికి సింక్‌ అవుతుందో లేదో చెక్‌ చేసుకుంటారు. అంతా బాగుందనిపిస్తే ఆ స్వరానికి మరింత మెరుగులు దిద్దుతారు. ఇప్పుడున్న ట్రెండ్‌లో క్యాచీ హుక్‌లైన్‌ అనుకోవడం...అందులో సాహిత్యం చక్కగా ఇమిడిపోవడం వంటి అంశాలకు సంగీత దర్శకులు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. టిక్‌టాక్‌ వంటి యాప్స్‌లో కూడా హుక్‌లైన్స్‌ మీదనే పాటల వీడియోలు చేస్తున్నారు.కమర్షియల్‌ సినిమాలు ఓ ఛాలెంజ్‌

భారీ వాణిజ్య సినిమాలకు స్వరాల్ని సమకూర్చడం సంగీత దర్శకులకు అతిపెద్ద సవాలుగా నిలుస్తుంది. పోటీతత్వంతో ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాల్సి ఉంటుంది. హీరో బాడీలాంగ్వేజ్‌కు తగిన సౌండింగ్‌, అతని ఇమేజ్‌ను, శక్తియుక్తుల్ని  ఎలివేట్‌ చేసేలా ట్యూన్‌ అవసరమవుతాయి. ముఖ్యంగా అభిమానులు మెచ్చేలా సంగీతాన్ని సమకూర్చాలి. అదే కాన్సెప్ట్‌ ప్రధాన సినిమాల విషయంలో, సాహిత్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఇతివృత్తానికి అనుగుణమైన సౌండింగ్‌, కథా నేటివిటీని ప్రతిఫలించే స్వరాల అవశ్యకత కనిపిస్తాయి. చిన్న సినిమాలు, కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాల విషయంలో హీరోల ఇమేజ్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.

అన్నీ కలిసి రావాలి

హిట్‌ ట్యూన్‌ కంపోజ్‌ చేయాలంటే అన్ని అంశాలూ కలిసి రావాలి. అది మెలోడీ అయినా, మాస్‌బీట్‌ అయినా ఒకే రకంగా పరిశ్రమించాల్సి ఉంటుంది. ఇటీవల నేను స్వరాలందించిన ‘సవారీ’ సినిమాలో రాహుల్‌ సింప్లిగంజ్‌ ఆలపించిన ‘నీ కన్నులు నా దిల్లులోనా’ అనే మాస్‌ పాటకు చక్కటి ఆదరణ లభించింది. అదే సినిమాలో ‘ఉండిపోవా నా గుండెలోనా’ అనే మెలోడీ గీతం కూడా ఆకట్టుకుంది. ఈ రెండు పాటల స్వరకల్పన విషయంలో నేను ఒకే రకమైన ఎఫర్ట్స్‌ పెట్టాను. ముఖ్యంగా మెలోడీ పాట అంతలా శ్రోతల్ని రీచ్‌ అవుతుందని అస్సలు ఊహించలేదు. ఓ పాట ప్రజాదరణ పొందడం వెనుక చాలా అంశాలు ఉంటాయి.

శాస్త్రీయ సంగీత ప్రావీణ్యం ఉంటే..

సంగీత దర్శకులుగా మారాలనుకునే వారికి తప్పనిసరిగా శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉండాలన్న నియమమేమీ లేదు. శాస్త్రీయ సంగీతంతో ఏ మాత్రం పరిచయం లేని వారు కూడా ప్రతిభావంతులైన స్వరకర్తలుగా రాణించవచ్చు. అయితే శాస్త్రీయ సంగీతజ్ఞానం ఉండటం వల్ల ట్యూన్‌ కంపోజింగ్‌ సరళంగా అనిపిస్తుంది. ఏ కొత్త రాగంలో పాటను ట్యూన్‌ చేయాలన్న అవగాహన ఉంటుంది. ఇలాంటివేమీ లేకుండా దర్శకుడి ఆలోచనను,  సీన్‌లోని ఆత్మను ఒడిసిపట్టుకొని భావావేశాలకు అనుగుణంగా కూడా గొప్ప స్వరాన్ని సృష్టించవచ్చు. ఔత్సాహిక సంగీత దర్శకులు చక్కటి శిక్షణ పొంది సినీరంగంలోకి వస్తున్నారు. స్థానికి మ్యూజిక్‌ స్కూల్స్‌ మొదలు, అంతర్జాతీయ స్థాయి సంగీత పాఠశాలల్లో ట్రెయినింగ్‌ తీసుకుంటున్నారు. నా దృష్టిలో ఎక్కడ నేర్చుకున్నామన్నది ముఖ్యం కాదు. సంగీతాన్ని ఆవాహన చేసుకొని...అదే ప్రపంచంగా జీవించడమన్నది చాలా ముఖ్యం. ఒకే దగ్గర శిక్షణ తీసుకున్న వారందరూ అదే నాణ్యతతో సంగీతాన్ని అందిస్తారన్న గ్యారెంటీ లేదు. వ్యక్తి ఎదిగే క్రమంలో విన్న పాటలు, జీవితంలో ఎదురైన అనుభవాలు, విషాదాలు, వైయక్తిక అభిరుచులు అతని స్వరాల్లో ప్రతిఫలిస్తాయి. శిక్షణ అన్నది కేవలం సంగీతం తాలూకు ముఖ్య అంశాల్ని తెలియజేస్తుంది.బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓ సవాలు

ప్రేమ కథాంశాల విషయంలో పాటల్లోనే సినిమా తాలూకు భావాల్ని వ్యక్తం చేయొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌కు ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. దానిపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అదే థ్రిల్లర్‌, హారర్‌ జోనర్‌ సినిమాలకు నేపథ్య సంగీతం ఆయుపుపట్టులా నిలుస్తుంది. వాటికోసం బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ థీమ్స్‌ను ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. సీన్‌ ఇంటెన్సిటినీ తెలియజెప్పేలా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఉండాలి. సీన్‌లోని విజువల్‌ అప్పియరెన్స్‌, ఎమోషన్‌ అంశాల్ని బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కంపోజింగ్‌లో ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటాం.

కాపీ కొట్టడం ఇష్టం లేదు

కొందరు సంగీత దర్శకులు వెస్ట్రన్‌, పాప్‌ మ్యూజిక్‌ నుంచి ట్యూన్స్‌ తీసుకొని పాటల్ని కంపోజ్‌ చేస్తారనే ఆరోపణ ఉంది. నేను మాత్రం ఇప్పటి వరకు  ఏ పాటనూ కాపీ కొట్టలేదు. సొంతంగా ట్యూన్‌ను సిద్ధం చేసుకోవడంలోనే నాకు ఎక్కువ సంతృప్తి దొరుకుతుంది. ‘తప్పకుండా ఫలానా ట్యూన్‌ కావాలి’ అని సంగీత దర్శకులు ఎప్పుడూ నన్ను డిమాండ్‌ చేయలేదు. కొన్ని సాంగ్స్‌ విన్నప్పుడు వాటి ప్రేమలో పడిపోతాం. అలాంటి పాటే ఇవ్వాలనే తపన ఎక్కువవుతుంది. ఆ సందర్భాల్లో ఆ గీతానికి దగ్గరగా ఉండే ట్యూన్‌ను తయారుచేసుకోవడంలో తప్పులేదు. అంతేకానీ అదే బాణీని, శబ్దాన్ని యథాతథంగా వాడుకోవడం నాకు ఇష్టం ఉండదు.

ఆ అసంతృప్తి మిగిలిపోయింది..

మెలోడీ ప్రధానంగా మంచి మ్యూజిక్‌ ఇస్తానని నాకు పేరుంది. అయితే పెద్ద కమర్షియల్‌ సినిమాకు సంగీతాన్ని అందించలేదనే అసంతృప్తి మాత్రం ఉంది. నా దగ్గరకు వచ్చిన సినిమాల కోసం అంకితభావంతో పనిచేస్తూ ది బెస్ట్‌ అవుట్‌పుట్‌ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా. అలా నా పనితనం మెచ్చి మంచి సినిమాలే వస్తున్నాయి. కానీ కమర్షియల్‌గా పెద్ద సినిమాలు చేయాలని ఎప్పుడూ ప్రయత్నాలు చేయలేదు. భవిష్యత్తులో ఆ దిశగా ఎఫర్ట్స్‌ పెడదామనుకుంటున్నా.

ఎవరి అవకాశాలు వారివే..

పరిశ్రమలో పోటీ ఉన్నప్పటికీ  అవకాశాల్ని ఎవరికి వారు సంపాదించుకుంటున్నారు. వారి కంపోజింగ్‌ శైలికి అనుగుణంగా సినిమాలు వరిస్తున్నాయి. మ్యూజిక్‌ కంపోజింగ్‌లో ఒక్కొక్కరికి విభిన్నమైన ైస్టెల్‌ ఉంటుంది. కొందరు కమర్షియల్‌ సినిమాలకు మంచి మ్యూజిక్‌ ఇస్తారు. మరికొందరు కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ స్టోరీలకు, సెన్సిబుల్‌ ప్రేమకథలకు బాగా పనిచేస్తారు. ఇక ఆర్థికపరంగా సంగీత దర్శకులు సంతృప్తిగానే ఉన్నారు. సినిమా స్థాయి,  అది సాధించే విజయం మీద ఆ అంశం ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి చిన్న సినిమాలు అనుకున్నవి సంగీతపరంగా పెద్ద విజయం సాధిస్తాయి. అది  డబ్బుకంటే ఎక్కువ సంతృప్తినిస్తుంది.  సంగీత దర్శకులు కావాలనుకునే వారు క్రమం తప్పకుండా సాధన చేయడం అలవర్చుకోవాలి. ముఖ్యంగా పాటల్ని వినడం  ఓ అలవాటుగా చేసుకోవాలి.logo