శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - May 31, 2020 , 00:18:11

పదానికి వెయ్యి

పదానికి వెయ్యి

సంపాదకుడి పేరు వారెన్‌. పొడుగాటి వేళ్ళు, చిన్న నోరు గల ఆయన సన్నగా ఉంటాడు. ఆయన నల్లటి జుట్టు నుదుటికి అటు ఇటు తెల్లబడుతున్నది. ఎప్పటిలా త్రీ పీస్‌ సూట్‌ని ధరించాడు. తన ముందు కూర్చున్న జిమ్‌ని చూసి వారెన్‌ చెప్పాడు.

“లేదు. ఇబ్బంది లేదు. మీ రాక నాకు ఎప్పుడూ సంతోషమే. ఇంత త్వరగా ఇంకో కథని రాసి తెచ్చారా? మీరు కథలని ఎలా సృష్టిస్తారా ఆని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. మీకీ ఐడియాలు ఎక్కడ నించి వస్తాయి? బహుశ ఈ ప్రశ్న వినీ వినీ మీకు విసుగు వచ్చి ఉండొచ్చు.”

జిమ్‌ బాగా విసిగిపోయాడు. ఒక్క ఆ విషయంలోనే కాదు.

“లేదు వారెన్‌. నేను కథని తీసుకురాలేదు. నేను పంపిన కథ గురించి మాట్లాడాలని వచ్చాను.”

“అది బావుంది, తీసుకుంటున్నానని ఫోన్‌లో చెప్పాగా?”

“డబ్బు.”

“రేపు మధ్యాహ్నం ఓచర్‌ పెడతాను. వచ్చే వారాంతంలోగా మీకు చెక్‌ వస్తుంది. కార్పొరేట్‌ యంత్రాంగం అంతకంటే వేగంగా పని చేయదు.”

“ఎంత చెల్లిస్తున్నారు?”

“ఎప్పట్లానే. ఎన్ని పదాలు?”

“మూడు వేల ఐదు వందలు.”

“పదానికి నికెల్‌ (ఐదు సెంట్లు) చొప్పున మూడు వేల ఐదువందలకి నూట డబ్భై ఐదు డాలర్లు. అంతకి చెక్‌ తయారవగానే ఫోన్‌ చేయమంటే చేస్తాను. పోస్ట్‌లో మూడు రోజుల ఆలస్యం తగ్గుతుంది. డబ్బుకి ఇబ్బందిగా ఉందా?”

“ఇంకాస్త ఎక్కువ కావాలి వారెన్‌. పదానికి నికెల్‌ చాలా తక్కువ” జిమ్‌ కొద్దిగా ఇబ్బందిగా చెప్పాడు.

“మేం చెల్లించేది అంతే జిమ్‌.”

“మీ పత్రికకి నేను ఎంత కాలం నించి రాస్తున్నానో మీకు తెలుసా?”

“కొన్ని సంవత్సరాలుగా.”

“ఇరవై ఏళ్ళుగా. నా మొదటి కథని మీరు ఇరవై ఏళ్ళ క్రితం ప్రచురించారు. రెండు వేల రెండు వందల పదాల ఆ కథకి మీరు నూటపది డాలర్లు చెల్లించారు. ఇరవై ఏళ్ళుగా నేను మీకు కథలు రాస్తున్నా, అప్పుడు ఎంత ఇచ్చే వారో ఇప్పుడూ అంతే ఇస్తున్నారు. అన్ని ధరలూ పెరిగాయి. నా ఆదాయం తప్ప... నా మొదటి కథకి మీరిచ్చిన పారితోషికంలోని ఓ పదానికి ఇచ్చిన నికెల్‌తో నేనో చాక్లెట్‌ బార్‌ని కొన్నాను. ఈ మధ్య మీరు చాక్లెట్‌ బార్‌ని కొన్నారా వారెన్‌?”

“వాటిని కొంటే నా బట్టలు పట్టవు” వారెన్‌ నవ్వుతూ చెప్పాడు.

“ఇప్పుడు ఒకో చాక్లెట్‌ బార్‌ నలభై సెంట్లు. కాని నాకింకా పదానికో నికెలే వస్తున్నది. ఇరవై ఏళ్ళ క్రితం మీ పత్రికని ఎంతకి అమ్మేవారు?”

“ముప్పయి ఐదు సెంట్లు.”

“తప్పు. పాతిక సెంట్లు. ఆర్నెల్ల తర్వాత దాని ఖరీదు ముప్పయి ఐదు సెంట్లు. ఆ తర్వాత యాభై, అరవై, డబ్భు ఐదుకి పెరిగింది. ఇప్పుడు?”

“డాలర్‌.”

“కాని మీరు రచయితలకి ఇంకా నికెలే చెల్లిస్తున్నారు. అది పిసినారితనం కన్నా ఎక్కువ కదా వారెన్‌?”

వారెన్‌ గట్టిగా నిట్టూర్చి చెప్పాడు.

“జిమ్‌! మీరు కొన్నిటిని మర్చిపోయారు. పత్రిక ఇరవై ఏళ్ళ క్రితం కన్నా ఇప్పుడు ఎక్కువ లాభసాటిగా లేదు. కాగితం ధర ఎలా పెరిగిందో మీకేమైనా ఐడియా ఉందా? దానిమీద నేను గంటసేపు మాట్లాడగలను. దాంతో పోలిస్తే చాక్లెట్‌ బార్‌ ధర చాలా తక్కువ పెరిగింది. ప్రెస్‌ బిల్‌, పత్రిక సరఫరా, ఇంకా ఇతర ఖర్చులు కూడా బాగా పెరిగాయి. మీరో కాపీ ధర డాలర్‌ అని చూస్తున్నారు తప్ప అన్ని ధరలూ పెరిగిపోయాయి.”

“ఒక్కటి తప్ప.”

“ఏమిటది?”

“ముడిసరుకు ధర. మీ నించి మీ పాఠకులు కొనేది అదే అని మీకు తెలుసు. కథలు, ప్లాట్స్‌, కేరక్టర్స్‌, సంభాషణలు... పదాలు. వాటికి ఇరవై ఏళ్ళ క్రితం ఎంత ఇస్తున్నారో ఇప్పుడూ అంతే ఇస్తున్నారు. ఒక్క ఆ ధరే ఇంకా కొనసాగుతున్నది. అవునా?”

తర్వాత జిమ్‌ పెరిగిన తన ఖర్చుల గురించి చెప్పాడు. బట్టలు, ఇంటద్దె, భోజనం, రేజర్‌ బ్లేడ్స్‌, సబ్బులు లాంటి చిల్లర ఖర్చుల గురించి చెప్పాడు.

“సప్లయి అండ్‌ డిమాండ్‌ జిమ్‌.”

“అంటే?”

“సప్లయి అండ్‌ డిమాండ్‌.”

తన బల్ల మీది కథల దొంతరని చూపించి వారెన్‌ చెప్పాడు. 

“పదానికో నికెల్‌ చెల్లించినా రాసే రచయితలు ఉన్నారు జిమ్‌. వాటిలో, పదిలో తొమ్మిది కొత్త రచయితల నించి వచ్చినవి. మిగిలిన పది శాతం మంది తమ కథ తిరిగి వచ్చే కన్నా చెక్‌ రావడానికే ఇష్టపడతారు. కొత్త రచయితలు పారితోషికం కూడా ఆశించరు. తమది అచ్చయితే చాలు అనుకుంటారు. మీరు రాసినవన్నీ నేను ప్రచురిస్తున్నాను. ఓ కారణం అవి నచ్చడం. మరో కారణం మీరు ఇరవై ఏళ్ళుగా మాకు రాస్తున్నారు. మేం పాత మిత్రులని మర్చిపోం. మీరు మీకిచ్చే ధరని పెంచమని అడుగుతున్నారు కాని అది నాకు సాధ్యం కాదు. మాకు అంత బడ్జెట్‌ లేదు. ఎవరికీ మేం అంతకు మించి చెల్లించడం లేదు. చివరగా అంతకు మించి చెల్లించాల్సిన అవసరం మాకు లేదు. మీకు అది కుదరదంటే మీ కథని మీకు తిరిగి ఇచ్చేస్తాను. అంతకు మించి నాకు వేరే మార్గం లేదు. అంతకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తే మేం పత్రికని మూసేయాల్సి ఉంటుంది.” 

జిమ్‌ మరి కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాడు. ఉదాహరణకి వారెన్‌ జీతం ఈ ఇరవై ఏళ్ళల్లో పెరిగిందా? లేదా? కాని అందువల్ల ఉపయోగం లేదని అతనికి తెలుసు. పదానికి నికెల్‌ చొప్పున రాస్తే రాయాలి. లేదా మానుకోవాలి. మూడో మార్గం లేదు. 

“మీ కథకి ఓచర్‌ రాయాలా? వద్దా?” వారెన్‌ ప్రశ్నించాడు.

“ఇంకేం చేయను? పదానికి నికెలే తీసుకుంటాను.”

“మీ రచయితలు చాలాకాలం క్రితమే యూనియన్‌ని స్థాపించి ఉండాల్సింది. అది మీకు కొంత బలాన్ని ఇచ్చేది. లేదా మీరు ఇంకెక్కడైనా రాయండి. ఇతర రంగాల పత్రికలు ఎక్కువ చెల్లిస్తాయి.”

“నేను ఇరవై ఏళ్ళుగా క్రైమే రాస్తున్నాను. ఈ రంగంలో నాకు పేరుంది. కొత్త రంగంలోవి రాయలేను” జిమ్‌ నిస్పృహగా చెప్పాడు.

“అందుకే మీ కథల్ని వేసుకుంటున్నాను. నేను ఎడిటర్‌గా ఉన్నంత కాలం, మీరు రాస్తున్నంత కాలం నేను మీ కథల్ని తీసుకుంటూనే ఉంటాను.”

“పదానికి నికెల్‌ చొప్పున.”

“ఔను. పదానికి నికెల్‌ చొప్పున మీరు అంగీకరించినంత కాలం.”

“ఇందులో వ్యక్తిగతమైంది ఏం లేదు వారెన్‌. నా బాధని మీ ముందు ఉంచానంతే.”

“నేను అలా అనుకోవడం లేదు. మీరు మనసులో దాచుకోలేక చెప్పి మీ బరువు తగ్గించుకున్నారు అనుకుంటున్నాను. మనం ఓ అవగాహనకి వచ్చాం. ఇంటికెళ్ళి మరో గొప్ప కథని రాసి పంపండి. అది మీ స్థాయికి చెందిన కథయితే ఇంకో చెక్‌ కూడా మీకు అందుతుంది. ఆదాయం రెట్టింపు చేసుకోడానికి అదో మార్గం. అందుకు కథల్ని రెట్టింపు రాయాలి.”

“మంచి ఆలోచన” జిమ్‌ చెప్పాడు.

“ఇంకో రకం పత్రికలకి కూడా రాయడం గురించి ఆలోచించండి జిమ్‌. అందుకు ఇంకా ఆలస్యం కాలేదు. మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు కాని మీకు ఎక్కువ ఆదాయం వస్తే నాకు సంతోషమే.”

జిమ్‌ లేచి, వారెన్‌తో కరచాలనం చేసి బయటకి నడిచాడు.

పదానికి ఐదు సెంట్లు!

జిమ్‌ తన టైప్‌ రైటర్‌లోని తెల్లటి కాగితం వంక చూస్తూ కూర్చుని ఉన్నాడు. గత సంవత్సరంలో ఆ పేపర్‌ ధర రీమ్‌కి డాలర్‌ పెరిగింది. టైప్‌ రైటర్‌ రిబ్బన్‌ ధర పది సెంట్లు పెరిగింది. తను రాసే పదాలకి తప్ప మిగిలిన అన్నిటి ధరలూ పెరిగాయని అనుకున్నాడు. 

ఇంకో రకం పత్రికలకి రాయమని వారెన్‌ ఇచ్చిన సలహా ప్రకారం ఓ లేడీస్‌ పత్రికకి రొమాంటిక్‌ కథని టైప్‌ చేయాలని చాలా సేపటి నించి టైప్‌ రైటర్‌ ముందు కూర్చున్నా, కీ బోర్డ్‌ మీద జిమ్‌ వేళ్ళు కదల్లేదు. 

అతను చిన్న కథా రచయిత. గతంలో అతను రెండు నవలలు రాస్తే అవి తిరస్కరించబడ్డాయి. కాని బీదరికంలో జీవించడంతో అతను విసిగిపోయాడు. పదానికో నికెల్‌తో జీవితం గడపడంతో విసిగిపోయాడు.

ఓ పదానికి ఎంత ఇస్తే న్యాయంగా ఉంటుంది?

వాళ్ళు నలభై సెంట్లిస్తే అది చాక్లెట్‌ బార్‌ ధరకి దగ్గరగా ఉంటుంది. కాని ఇరవై ఏళ్ళ తర్వాత పదానికి డాలర్‌ ఇవ్వడం సబబు. అంత తీసుకునే రచయితలు ఉన్నారని విన్నాడు. బెస్ట్‌ సెల్లర్స్‌ జాబితాలోకి ఎక్కి దాని కన్నా ఎక్కువ సంపాదించే రచయితలు వందలమంది ఉన్నారు. స్క్రీన్‌ప్లేలు రాసేవారికి ఆరంకెల పారితోషికం లభిస్తుంది.

పదానికి వెయ్యి డాలర్లు?

ఆ ఆలోచన అతని మనసులో మెదిలింది. దాన్ని తన ముందున్న టైప్‌ రైటర్లో టైప్‌ చేసాడు. దాని కింద మళ్ళీ టైప్‌ చేసాడు.

పదానికి వెయ్యి డాలర్లు.

అతను ఆ పదాన్నే చదువుతూ సాధ్యాసాధ్యాలని ఆలోచించసాగాడు. కొత్త మార్గంలోకి మళ్ళితే తను పదానికి అంత ఎందుకు సంపాదించలేడు?

టైప్‌ రైటర్లోంచి ఆ కాగితాన్ని తీసి, నలిపి ఉండలా చేసి చెత్త డబ్బాలో పడేసాడు. జిమ్‌ మళ్ళీ కొత్త కాగితాన్ని రోలర్‌ లోకి ఎక్కించి కొద్దిసేపు దాని వంక చూస్తుండిపోయాడు. చివరికి నిర్ణయం తీసుకున్నట్లుగా దాని మీద ఆ కొత్త మార్గం కోసం టైప్‌ చేయడం ఆరంభించాడు. 

జిమ్‌ అరుదుగా తన కథలని తిరగరాస్తాడు. పదానికి నికెల్‌కి అది సాధ్యం కాదు. మొదటి డ్రాఫ్ట్‌కే కథని అంగీకరించేంత నైపుణ్యాన్ని అతను సాధించాడు. కాని ఈసారి మాత్రం అతను టైప్‌ చేసాక, నచ్చక కాగితం తీసి నాలుగైదు సార్లు టైప్‌ చేసాక కాని తృప్తి పడలేదు. దాన్ని బయటకి తీసి చదివాడు. అది సరిగ్గా, సూటిగా విషయాన్ని వివరించేదిగా ఉంది. రిసీవర్‌ అందుకుని వారెన్‌ నంబర్‌ డయల్‌ చేసాడు. 

“వారెన్‌. జిమ్‌ని. మీ సలహా పాటించదలచుకున్నాను.”

“ఇంకో కథ రాసారా? సంతోషం. వెంటనే పంపండి.”

“అది కాదు. మీరిచ్చిన మరో సలహా. నేను కొత్త మార్గంలోకి వెళ్తున్నాను.”

“కంగ్రాట్స్‌. నవలా?”

“లేదు. కథ కన్నా చిన్నది.”

“ఐనా ఎక్కువ వస్తుందా? వ్యాపార ప్రకటనలా?”

“కాదు. కాని చాలా డబ్బు వచ్చే రంగం. పదానికి వెయ్యి డాలర్లు వస్తుంది.”

వెంటనే వారెన్‌ పెద్దగా నవ్వాడు.

“వెయ్యి? మీరు దేంట్లోకి వెళ్తున్నారో నాకు తెలీదు కాని మీకు శుభాకాంక్షలు జిమ్‌. ఒకటి మాత్రం నిజం. మీ కథల్లోని సెన్సిబుల్‌ హ్యూమర్ని మొదటిసారి మీ మాటల్లో వింటున్నాను.”

“లేదు. ఇది జోక్‌ కాదు. నిజం.”

జిమ్‌ రిసీవర్‌ పెట్టేసి తను టైప్‌ చేసిన పదాలకి ఎంతొస్తుందా అని లెక్క పెట్టాడు.

‘నా దగ్గర తుపాకీ ఉంది. ఈ కాగితపు సంచీలో ముప్పయి వేల డాలర్లు నింపి ఇవ్వండి. మీ కాలి కింద ఉన్న అలారం బటన్‌ నొక్కకండి. పాత పదులు, ఇరవైలు, యాభైలు మాత్రమే. లేదా మీ బుర్రలేని తలకాయని  పేల్చేయాల్సి ఉంటుంది’

(లారెన్స్‌ బ్లాక్‌ కథకి స్వేచ్ఛానువాదం) , మల్లాది వెంకట కృష్ణమూర్తి