శనివారం 04 జూలై 2020
Sunday - May 31, 2020 , 00:09:12

కోతి మామిడి...

కోతి మామిడి...

ఎండకాలం తాతిల్లు షురూ అయితేమున్నది మల్ల ఊరుతోవ పట్టుడే. బాయిదిక్కు పొయ్యే పనేముండది.  పొద్దుగాల మలెంద బాయిలకు ఈతకు పొవ్వాలే, రెండు మూడు గంటలు దుంకులాడాలె రావాలె. గంతే. ఇగ దినాం పొద్దున్నే, తెల్లారంగనే బాపమ్మ నా చేతికి ఒక గుల్ల ఇచ్చి బాయికాడికి తోలిస్తుండేటిది. ఆడ మామిడి తోటల నాతిరి పూట గాలికి రాలిన పండ్లేమన్న చెట్లకింద ఉన్నయేమో లెంకి గుల్లలేసుకోని ఒస్తుంటి. దినాం నాకదే పని. తోటల లెంకినంక, సోర బాయికాడున్న ఇంకో పెద్ద మామిడి చెట్టు కింద కూడ లెంకుతుంటి. ఈడ రెండో మూడో కాయలు దొరుకుతుండే.

గీ మామిడి కాయల పేరు జెప్పనీకెనే సిగ్గయితది. ఈ కాయ తొడిమ కాడ మొత్తం ఎర్రగ ఉంటదని దీన్ని కోతి గు... నేను చెప్ప, మీకర్తమయ్యిందని నాకు ఎరికే.

ఇగ ఈ కోతి గు... మామిడి కాయ గిట్ల కోస్కోని తింటే, అబ్బ పుల్ల బుడ్డు. నోట్ల పెట్టనీకె రాకుండే. అదే కాయని ఇంటికి కొండవొయ్యి ఒడ్ల గుమ్మిల మాగవెట్టినంక తింటె, మస్తు తియ్యగుంటది. గా రుశి మల్ల కన్లవడలే. గసోంటి ఒక్క పండు తిని సచ్చిపోయినా ఏం ఫికర్‌ లేదు, అసోంటి రుశి గల్ల పండు. 

ఆ కోతి గు...పండుది ఇంకో ఖాసియతున్నది. ఆ పండు ఒక్కటంటే ఒక్కటి, యాడ్నో అర్రల మాగవెడితే, అది మాగేట్యాల్లకు ఊరంత వాసన లేస్తుండే. ఎవడన్న దొంగతనంగ మాగవెట్టుకుంటే జర్ర సేపట్ల దొంగ దొర్కుతడు. కమ్మటి వాసన. తియ్యటి వాసన. ఊరోల్ల కండ్లన్ని గా పండ్లమీదనే.

అంత పేరు వొయ్యింది మా కోతి గు...మామిడి. అసోంటి పండ్లు గాసే శెట్టు మా సుట్టుపక్కల ఊర్లల్ల ఇంకేడ లేకుండే.

ఇగ నిత్తె ఒవడో ఒకడు ఇంటికి రావాలె మా బాపమ్మను బతిలాడాలె. ఒక్క పండియ్యమని కాళ్ళు జేతులు వట్టుకొని బతిమిలాడేటోళ్ళు. ఇయ్యనంటే ఇయ్యకపొయ్యేది బాపమ్మ. ‘మాకు పిల్లల్లేరానే’ అంటాని జగుడానికోతుండేటిది. 

మాకోసం దాపెట్టి, మంచిగ మాగినంక కడిగి దగ్గెర కూసోని కొసిరి కొసిరి తినిపిస్తుండేటిది. అవ్వి మేము తింటే ఆమె కడుపు నిండిపొయ్యేది.

కోతి గు...మామిడి పండ్లకు, ఆమనగంటోళ్ళు ఒస్తుండే, లంకాలోళ్ళు ఒస్తుండే, వంగోళ్ళు ఒస్తుండే, గోసులోళ్ళు ఒస్తుండే ఒక్కటంటే ఒక్క పండియ్యమని. ఊరందరి తొవ్వ కొట్టమోళ్ళింటికేనాయె. లేదంటే లేదంటుండే బాపమ్మ.

ఒగనాడు నాలుగిండ్లవుతల ఉన్న గౌండ్ల పోశయ్య ఒచ్చిండు. మా తాత తాన కూసోని ఒక్క తీర్గ బతిలాడిండు. ‘ఒక్క పండు ఇయ్యమను బావా, నీకు పున్నెముంటది గని’ అని జోరీగ లెక్క ఒకటే గున్శుడు వెట్టిండు. 

‘లోపటికొయ్యి మీ యక్కనడుగు పొవ్వోయ్‌', అని తప్పిచ్చుకున్నడు.

గౌండ్ల పోశయ్య బాపమ్మ కాళ్ళు వట్టుకునుడొక్కటే తక్వ, ‘అక్కా నీ కాల్మొక్త గని ఒక్క కోతి గు...మామిడి పండియ్యి అక్కా, మా ముసల్ది సావ దగ్గరయ్యింది, ఈ పండుదిన్నంక గని జీవిడిశేటట్లు లేదు’ అని ఒక పూటంత కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటే, ఆఖరికి అర్రలకొయ్యి, గుమ్మిల మాగవెట్టిన ఒక్కటి అంటే ఒక్కటే పండు తెచ్చి పోశయ్య చేతిల పెట్టింది.

సల్లగ బతుకుమంటాని దీవెనార్తులిచ్చుకుంట పొయ్యిండు పోశయ్య.

ఆ కోతి గు...మామిడి పండు తిన్న నాతిరే ఆ ముసల్ది జీవిడిసింది. కోర్కె తీరినంకనే పొయ్యింది.

అంత మహత్తు గల్ల పండు, పేరుమోసిన పండు, సక్కదనాల పండు, కమ్మటి వాసనల పండు మల్ల ఇప్పటిదాంక నేను తినలేదంటే తినలేదు.  సూడనీకె ఎంత ముద్దుగుంటుండే. కాయగున్నప్పుడు కిందంతా ఆకుపచ్చగ, మూతికాడ ఎర్రగ, పిడికిలంత పండు. అదే పండు మాగినంక మూతికాడ అదే ఎర్రగ మల్ల కిందంతా పసుపచ్చగ. మల్ల మూతికాడ ఎర్రగుంటె కోతి గు...మామిడి అని ఎందుకంటుండెనో ఇప్పటివరకు అర్తమే కాలే.

దినాం పొద్దున్నే గుల్లదీస్కనే పోతున్న. ఒచ్చేటప్పుడు మూడో నాలుగు కోతి గు...మామిడి కాయలు తెస్తనే ఉన్న, మా బాపమ్మ మాగవెడ్తనే ఉన్నది.

ఇట్లనే ఒగనాడు పొద్దుమీకినంక తాత కందీలు సీస పాత బట్టతోటి తుడిశి ఇంత గాసునూనె వోసి ముట్టిచ్చి శిలకొయ్యకు తలిగిచ్చిండు. మా బాపమ్మ నాకు తాతయ్యకు పీటెలేసి తళ్ళెలు వెట్టింది. మేమిద్దరం కూసోని జొన్నరొట్టెలు కోతి గు...మామిడి పండు రసంల ముంచుకొని తిన్నం. మస్తు కమ్మగున్నయని చెర్రెండు రొట్టెలు దిన్నం. ఇంకా అర్రల కెళ్ళి కమ్మటి మామిడి పండ్ల వాసన ఆకిట్లదాంక ఒస్తనే ఉన్నది.

బాపమ్మ గూడ తిని ఆకిట్లకొచ్చి గన్మల్ల కూసోని రొంటిల జెక్కుకున్న సంచి తీసి ఆకుమీద ఇంత సున్నం, కాసు రాసుకోని, ముత్తెమంత ఆసన జర్ద అండ్లేసుకోని దవుడకు పెట్టుకున్నది. తాత సుట్ట ముట్టిచ్చిండు. అందరం ముద్దుగ జోలి వెట్టుకుంటున్నం.

అంతట్ల బలిజె శరణప్ప ఒచ్చిండు తాతని పల్కరిచ్చుకుంట, ఇగ కూసోని అదీ ఇదీ ముచ్చట్లు వెట్టుకుంటున్నరు. జరంత సేపయినంక శరణప్ప మెల్లెగ ఎల్లదీసిండు.

‘బావా, ఎట్లజెప్పాల్నో అర్తమైతలేదు గని, ఇగ నీకు గాకుంటే ఇంకెవల్కి జెప్పుకుంట తియ్యి’ అని గున్సుడు షురూ జేసిండు.

‘ఏ గున్సకుండ ఏందో చెప్పరాదోయ్‌, నెగీ సుద్ద పూస ఏషాలు ఎయ్యకు’ అన్నడు తాత.

  ‘నీకు తెల్సు గద బావ, నా పెద్ద కోడలు నీళ్ళాడిందని, గామె పానమంత ఆ కోతి గు...మామిడి మీదనే ఉన్నది, మా వోన్ని పొమ్మంటే, మొఖం చెల్లక నన్ను తోలిచ్చిండు’ అసలు ముచ్చట ముంగలేసిండు.

‘పట్నం కెల్లి మా పోరలొచ్చిండ్రు, ఇంగ పండ్లేడున్నయి, అప్పుడే అన్ని అయిపోయినయ్‌' అని పుల్లిరిసిండు తాత  బాపమ్మ దిక్కు సూస్కుంట.

కోతి గు...పండ్ల వాసన ఆకిట్లదాంక ఒస్తనే ఉన్నది.

  ‘రెండిప్పియ్యి బావ సచ్చి నీ కడుపుల పుడ్తగని’ అని ఒక్క తీర్గ అడిగిండు.

తాత లేవని గెదిరిచ్చిండు. శరణప్ప, ఎట్ల జేతురా దేవుడా అంటాని బాపమ్మ దిక్కు సూశిండు.

‘పండ్లు లేవు ఏం లేవ్‌' అని ఇంట్లకు నడిసింది తాత దిక్కు మల్ల మల్ల సూసుకుంట.ఇగ దేవుడా అంటాని లేశి కాళ్ళీడ్సుకుంట ఎల్లిపోయిండు శరణప్ప.  నాకు ఇచ్చిత్రం అనిపించింది బాపమ్మను, తాతను సూశి.

మల్ల తెల్లారి గుల్లదీస్కోని బాయికోతుంటే తాత బిలిసి బాపమ్మ సూడకుండ రెండు కోతి గు...మామిడి పండ్లు నా కీసలేసి, ‘శరణప్ప పెద్ద కోడలికి ఇచ్చుకుంట వో’ అని మెల్లెగ గుసగుస జెప్పిండు తాత.

అంత దూరం పొయ్యినంక బాపమ్మ పిలిసి, అర్రలకు తోల్కవొయ్యి రెండు కోతి గు...మామిడి పండ్లు గుల్లలేసి, ‘ఎవ్వల్కి ఎర్కలేకుండ పొయ్యి సప్పుడు గాకుండ శరణప్ప కోడలికియ్యి’ అని సెవుల సెప్పింది.

అవ్వి కొంచవొయ్యి, ఆమె చేతిలవెట్టి, ‘ఇవ్వి బాపమ్మయి, ఇవ్వి తాతవి’ అనిచ్చిన. బలిజె శరణప్ప అది సూశి నగుకుంట, ‘కొట్టమోళ్ళ మాటలు కత్తులు, చేతలు తియ్యటి తీగెలు’ అనుకుంట నా చేతిల పుట్నాల లడ్డూలు వెట్టి చెంపలు విండిండు.

-కొట్టం రామకృష్ణారెడ్డి

([email protected])


logo