శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - May 24, 2020 , 00:32:50

మిస్టర్‌కెప్టెన్‌

మిస్టర్‌కెప్టెన్‌

దర్శకుడి మస్తిష్కంలోనే తొలుత ‘సినిమా’కు బీజం పడుతుంది. ఒక ఆలోచన అనేక భావాల అల్లికగా రూపుదిద్దుకొని వెండితెరపై   అద్భుత దృశ్యంగా ఆవిష్కారం అవుతుంది. తన కలల కన్యకు ఇరవై నాలుగు విభాగాల కళాకారులతో అందమైన అలంకరణలు చేయించి అపురూపమైన ఆకృతినిచ్చేవాడే దర్శకుడు. నిర్దేశకుడి స్వప్నానికి సాకార రూపమే సినిమా. అందుకే దర్శకుడిని కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌గా అభివర్ణిస్తారు. ‘దర్శకులు కావాలనుకునే వారు తమ సృజనాత్మక శక్తులకు పదునుపెడుతూ ఉండాలి. కొత్త ఆలోచనలు చేయడంలో ఇతరుల కంటే ముందుండాలి. అప్పుడే ఈ విభాగంలో రాణిస్తారు’ అని అంటున్నారు ప్రముఖ దర్శకుడు సంపత్‌నంది. ‘రచ్చ’ ‘బెంగాల్‌ టైగర్‌', ‘గౌతమ్‌నందా’ వంటి మాస్‌ సినిమాలతో తన ప్రత్యేకతను చాటుకున్నారాయన. సినిమా రూపకల్పనలో దర్శకుడి ప్రాధాన్యాలు, టెక్నిక్స్‌ గురించీ ఆయన ఆలోచనలూ అభిప్రాయాలూ...చిత్రసీమలో దర్శకులకు చాలా వరకు సృజనాత్మక స్వేచ్ఛ ఉంటుంది. కెరీర్‌ తొలినాళ్లలో మొదటి సినిమాకు నిర్దేశక బాధ్యతలు చేపట్టినప్పుడు అనుభవలేమి వల్ల కాస్త ఒత్తిడికి గురైనట్లు ఫీలవుతారు. ఒక్కసారి విజయం వరిస్తే ఆ దర్శకులు తమ అభిరుచుల మేరకు పూర్తి స్వేచ్ఛగా పనిచేసుకుంటారు. కథానాయకుల్ని స్టోరీ డిస్కషన్స్‌ సందర్భంలో మెప్పించగలిగితే ఆ తర్వాత షూటింగ్‌ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కథలో అవసరమైన మార్పుల గురించి నరేషన్‌ సందర్భంలోనే హీరోలు సూచనలు చేస్తారు. ఆ మార్పులు దర్శకుడికి ఆమోదయోగ్యంగా ఉంటే సినిమా సెట్స్‌ మీదకు వచ్చినప్పుడు ఎలాంటి సమస్యలూ రావు. ఒక్కసారి హీరోలు కథను ఓకే చేశాక క్రియేటివిటీ పరంగా దర్శకుడికి ఎలాంటి ఇబ్బందులు తతెత్తవు.

బాలీవుడ్‌ వారూ ప్రశంసించారు

‘గౌతమ్‌నందా’ సినిమా మేకింగ్‌ చూసి బాలీవుడ్‌ వారు సైతం ప్రశంసించారు. ఆ సినిమాలో గోపీచంద్‌ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. సాధారణంగా డ్యుయల్‌రోల్‌కు మోషన్‌ కంట్రోల్‌ టెక్నిక్‌ ఉపయోగిస్తారు. అది వాడకుండానే గోపీచంద్‌ను రెండు పాత్రల్లో చూపించాం. ఇలాంటి సాంకేతిక అంశాల మీద దర్శకులకు అవగాహన ఉండటం వల్ల సినిమా మేకింగ్‌లో వారికి ఎవరూ అడ్డుచెప్పరు.

కమాండ్‌ కాదు కామన్‌సెన్స్‌ ఉండాలి

దర్శకులకు సినీరంగంలోని ఇరవైనాలుగు విభాగాల మీద కమాండ్‌ ఉండాల్సిన అవసరం లేదు. వాటిమీద కాస్త కామన్‌సెన్స్‌ ఉంటే చాలన్నది నా అభిప్రాయం. అన్ని విభాగాల మీద పట్టు ఉంటే దర్శకుడే ఆ బాధ్యతల్ని తీసుకుంటాడు కదా? అది ప్రాక్టికల్‌గా అసాధ్యం. ఎడిటింగ్‌ మొదలుకొని సంగీతం వరకు ఏ డిపార్ట్‌మెంట్‌ను తీసుకున్నా దర్శకుడు తన సెన్సిబిలిటీస్‌కు అనుగుణంగా ఆయా సాంకేతిక నిపుణులకు సూచనలు చేస్తాడు. తన సృజనాత్మక ఆలోచనల్ని ఆవిష్కరించుకోవడానికి 24క్రాఫ్ట్స్‌ను ఓ కాన్వాస్‌లా దర్శకులు వాడుకుంటారు. దర్శకుడికి కెమెరా లెన్స్‌ గురించి అవగాహన లేనప్పుడు సన్నివేశం ఎలా రావాలో వివరిస్తే అందుకు అనుగుణంగా ఛాయాగ్రాహకుడు లెన్స్‌ను ఉపయోగిస్తాడు. కథ రచన సమయంలోనే ఆ సినిమాకు కావాల్సిన రిక్వైర్‌మెంట్స్‌ ఏమిటో దర్శకుడికి తెలిసిపోతుంది. వాటిని మిగతా టెక్నీషియన్స్‌ నుంచి రాబట్టుకోవడంలో దర్శకుల పనితీరు తెలుస్తుంది.

రచయితలే దర్శకులు 

రచయితలే దర్శకులు కావడం వల్ల క్రియేటివ్‌ సైడ్‌ చాలా లాభాలుంటాయి. కథలో ఉండే ఉద్వేగాల్ని తాను అనుకున్న విధంగా దృశ్యమానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ప్రేమకథలో సినిమాకు టర్నింగ్‌పాయింట్‌ లాంటి బ్రేకప్‌ సీన్‌ ఉందనుకుందాం. అందులోని ఆర్థ్రత, భావోద్వేగాలు రచయిత హృదయానికి దగ్గరగా ఉంటాయి. ఆ సన్నివేశాల్లోని ఎమోషన్‌ను యథాతథంగా దర్శకుడు తెరపై తీసుకొచ్చే విషయంలో రచయితకు సందిగత ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రచయితే దర్శకుడైతే తాను కోరుకున్న భావాల్ని తెరపైకి తీసుకురావొచ్చు. రచయిత, దర్శకుడి అభిరుచులు కలిసినప్పుడు..ఇద్దరూ ఒకేస్థాయిలో ఆలోచించగలిగినప్పుడు గొప్ప సినిమాలు వస్తాయి. అలనాటి క్లాసిక్‌ సినిమాల్ని చూసినప్పుడు ఈ విషయం ప్రస్ఫుటమవుతుంది. అద్భుత ప్రతిభ ఉన్న దర్శకుడు రచయిత రాసిన సీన్‌ను మరింత ఉన్నతంగా తెరపైకి తీసుకొస్తారు.

షార్ట్‌ఫిల్మ్స్‌  తీయడమూ  ఓ కళ 

లఘు చిత్రాల్ని చాలామంది ఈజీగా తీసుకుంటారు. ఎవరైనా తీయొచ్చు కదా అనే చులకన భావన ఉంటుంది. నా దృష్టిలో షార్ట్‌ఫిల్మ్‌, యాడ్‌ఫిల్మ్‌ తీయడంలో గొప్ప క్రియేటివిటీ దాగి ఉంటుంది. నిర్దేశిత టైమ్‌లో కథ తాలూకు సారాంశాన్ని మొత్తం ఆవిష్కరించడం మామూలు విషయం కాదు. ఇక యాడ్‌ఫిల్మ్స్‌లో అయితే ఒకటి రెండు నిమిషాల్లోనే వీక్షకుల్ని కన్విన్స్‌ చేయగలగాలి. షార్ట్‌ఫిల్మ్‌లో ప్రతిభ కనబరిస్తే ఫీచర్‌ ఫిల్మ్స్‌లో కూడా వారు సత్తా చాటుతారని నేను విశ్వసిస్తా. నా నిర్మాణంలో తెరకెక్కించిన ‘పేపర్‌బాయ్‌' చిత్రానికి దర్శకున్ని లఘుచిత్రం చూసే ఎంపిక చేసుకున్నా.

హీరోలు వంద కథలు వింటారు

మనం రాసుకున్న కథ మనకు గొప్పగా అనిపించడంలో విశేషం ఏమీలేదు. అది హీరోను మెప్పించాలి. ఎందుకంటే వాళ్లు ఎన్నో కథల్ని వింటుంటారు. చక్కటి జడ్జిమెంట్‌తో అందులో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసుకుంటారు. అందుకే మన దగ్గర ఉన్నదే బెస్ట్‌ కథ అనుకోవద్దు. మనం ఆలోచనల్ని గౌరవించుకుంటూనే కథానాయకుల అభిరుచుల మేరకు కథల్ని సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా వాణిజ్య చిత్రాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తుంది.

బాలీవుడ్‌లోనే రెమ్యునరేషన్‌ తక్కువ

సాధారణంగా బాలీవుడ్‌లో దర్శకులకు పారితోషికాలు ఎక్కువగా ఉంటాయన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఇక్కడికంటే అక్కడ ఓ రూపాయి తక్కువే ఇస్తారు. ‘బెంగాల్‌ టైగర్‌' సినిమాను బాలీవుడ్‌లో రీమేక్‌ చేసే అవకాశం వచ్చింది. నేను ముంబయి వెళితే ఆ సినిమా చేసేవాణ్ణి. అయితే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం స్ట్రెయిట్‌ ఫిల్మ్‌ చేసినంత ఎక్సైట్‌మెంట్‌ రీమేక్‌ చేయడంలో దొరకదు. అయితే రీమేక్‌ చేసేవారిని నేను తప్పు పట్టను. అలా చేసి సక్సెస్‌ అవడం కూడా గొప్ప విషయమే.

మన ఐడియా ముందుండాలి

ఇండస్ట్రీలో మనం ముందుండాలి అంటే, మన ఐడియా  ముందుండాలి. ఒక్క సినిమానే కాదు ప్రతి రంగంలో ఔత్సాహికులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. ఇండస్ట్రీలో  కొన్ని వందల మంది స్క్రిప్ట్‌లు పట్టుకొని ప్రయత్నాలు చేస్తుంటారు. అందరికంటే భిన్నంగా ఉండాలంటే కొత్తగా ఆలోచించాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను గమనిస్తూ మన సృజనాత్మక శక్తులకు పదును పెట్టుకోవాలి. అలాంటి వారే పరిశ్రమలో రాణిస్తారు.

హీరోల్ని ఇంప్రెస్‌ చేయడమే కష్టం..

భారీ కమర్షియల్‌ సినిమాల విషయంలో దర్శకులకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా ఒక హీరో ఇమేజ్‌కు అనుగుణంగా కథ రాసి ఒప్పించడం అన్నింటికంటే పెద్ద చాలెంజ్‌. ప్రస్తుతం పరిశ్రమలో కథల కొరత ఎక్కువగా ఉంది. ‘మంచి కథతీసుకొస్తే దర్శకులుగా ఎవరికైనా అవకాశమిస్తాం’ అనే ధోరణిలో ప్రస్తుతం హీరోలు ఉన్నారు. నేను ‘ఏమైంది ఈవేళ’ తర్వాత ‘రచ్చ’ వంటి భారీ కమర్షియల్‌ సినిమా చేశాను. అందులో హీరోయిజం ఎలివేషన్‌ మొదలుకొని సినిమాను జనరంజకంగా మలిచే విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్స్‌ను ఎలా డీల్‌ చేయాలో నాకు బాగా తెలుసు. అయితే మనం కోరుకున్న హీరోకు కథను చెప్పి ఒప్పించడంలోనే దర్శకులకు అసలైన సవాళ్లు ఉంటాయి.


logo